బిందు సేద్యంతో వ్యవసాయం

బిందు సేద్యంతో వ్యవసాయం

బిందు సేద్యం ద్వారా పంటలు పండించడం చాలా సులభం. ఈ విధానంలో పంటలు పండిస్తే నీటి కొరత సమస్య కూడా ఉండదు. దాంతో తక్కువ నీటితో ఎక్కువ మొత్తంలో పంట సాగుచేసుకొని అధిక లాభాలు పొందొచ్చు. ప్రస్తుతం బిందు సేద్యం పద్ధతిని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ఇందుకోసం కొన్ని రాష్ట్రాలు ప్రత్యేక రాయితీలు కూడా ఇస్తున్నాయి.

బిందు సేద్యంలో పంటల్ని అనుసరించి ఐదు పద్ధతులున్నాయి :

1. ఆన్‌లైన్‌ డ్రిప్‌ సిస్టమ్‌: ఈ పద్ధతిలో నీరు బొట్టు బొట్టుగా పడుతూ మొక్క వేళ్లకు చేరుతుంది. మొక్కల మధ్య దూరం ఎక్కువగా ఉండే పంటలైన మామిడి, బత్తాయి, నిమ్మ, ద్రాక్ష, కొబ్బరి, అరటి తోటలకు ఈ పద్ధతిని ఎక్కువగా వినియోగిస్తారు.

2. ఇన్‌లైన్‌ డ్రిప్‌ సిస్టమ్‌: ఇందులో డ్రిప్పర్లు, ఎమిటర్లను లేటరల్‌ లైన్లలో యంత్రం పైనే సమాన దూరంలో అమర్చుతారు. మొక్కల మధ్య దూరాన్ని బట్టి ఎమిటర్లు అమర్చిన లేటరల్‌ లైన్‌ను ఎంపిక చేసుకుంటారు.

ఈ లేటరల్‌ లైన్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ముఖ్యంగా చెరకు, పత్తి, కూరగాయలు, పూల తోటలకు ఈ విధానం ఎంతగానో పయోగపడుతుంది.

3. మైక్రోజెట్‌ ఇగిగేషన్‌ విధానం: ఈ పద్ధతిలో నీటిని స్ప్రే రూపంలో భూమి నుండి 50 సెం.మీ. ఎత్తు మించకుండా వృత్తాకారంగా అమర్చిన జెట్స్‌ ద్వారా మొక్కలకు అందిస్తారు. ఈ పద్ధతిని ఎక్కువగా ఇసుక నేలల్లో, నీరు ఇంకిపోయే భూములల్లో, మామిడి, కొబ్బరి, నిమ్మ, పామాయిల్‌ తోటలకు, నర్సరీల్లో పెంచే మొక్కలకు ఉపయోగిస్తారు.

4. మిని మైక్రో స్ప్రింక్లర్‌ ఇరిగేషన్‌ సిస్టమ్‌: ఈ పద్దతి కూడా మైక్రోజెట్‌ ఇరిగేషన్‌ పద్ధతిలాగానే ఉంటుంది. కాని ఇందులో లేటరల్స్‌ పైన అమర్చిన మైక్రో స్ప్రింక్లర్‌కు ఇరువైపులా పరికరాలను అమర్చుతారు.

5. మిస్ట్‌ ఇరిగేషన్‌ విధానం: ఇందులో లెటరల్‌ పైన మిస్ట్‌ (పొగ రూపంలో వెదజల్లే ) ఓ పరికరాన్ని అమర్చుతారు. తేమను పెంచేందుకు ఈ పద్ధతి ఎంతగానో సహకరిస్తుంది.

బిందు సేద్యం విధానంలో ముఖ్యంగా పంటకు ఎంత నీరు అవసరం ? ఎంత శాతం నీటిని బిందు పద్ధతి ద్వారా పంపిస్తున్నాం ? ఇటువంటి విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి.

పంటకు కావలసిన నీటి పరిమాణం ముఖ్యంగా ఈ క్రింది అంశాలపై ఆధారపడి ఉంటుంది :

1. పంట రకం 2. మొక్కల భాష్పోత్సేకం 3. పొలం విస్తీర్ణం 4. నీరు పెట్టే విధానం

బిందు సేద్యంలో ఎరువులు వాడకం

నీటితో పాటు రసాయనిక ఎరువుల్ని నిర్ణీత మోతాదులో కలిపి డ్రిప్‌ ద్వారా మొక్కలకు అందించ వచ్చు. ఉద్యాన పంటలైన పండ్లు, కూరగాయలు, పూలు, వాణిజ్య పంటలైన పత్తి, చెరకు, మిరప, ఔషధ మొక్కలను తక్కువ నీటితో ఈ పద్దతిలో లాభసాటిగా పండించవచ్చు.

ద్రవ రూపంలో ఎరువుల ద్వారా నత్రజని, భాస్వరం, పొటాష్‌లే కాకుండా సూక్ష్మ పోషక పదార్ధాలను కూడా అందించవచ్చు. ఈ పద్ధతిలో ఉపయోగించే ఎరువులు నీటిలో పూర్తిగా కరిగే స్వభావాన్ని కలిగి ఉండాలి. లేపోతే ఎరువుల అవక్షేపాలు డ్రిప్‌ రంధ్రాలకు అడ్డుపడి మూసివేస్తాయి.

ఫర్టిగేషన్‌ పద్దతిలో పొడి రూపంలో లేదా ద్రవరూపంలో ఉన్న ఎరువులను వాడుకోవచ్చు. అయితే వాటికి నీటితో కలిస్తే తక్షణం కరిగి పోయే స్వభావం ఉండాలి. మంచి నాణ్యత, దిగుబడులను సాధించటానికి క్లోరైడ్‌లు లేని ఎరువులను ఎంపిక చేసుకోవాలి.

ఫర్టిగేషన్‌ పద్ధతి యాజమాన్యంలో కీలకమైన అంశాలు

ఫర్టిగేషన్‌ ద్వారా పంటల యాజమాన్యంలో వివిధ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. వాటికి అనుగుణంగా పోషకాలను ఏ దశలో, ఎంత మోతాదులో విడుదల చేయాలి ? అనే అంశాలను నిర్ణయిస్తారు.

ఫర్టిగేషన్‌ను ప్రభావితం చేసే కొన్ని ముఖ్యమైన అంశాలు

1. ఫర్టిగేషన్‌ ద్వారా పంట (రకం, పంట ఎదుగుదల దశ ) నిర్ణీత విస్తీర్ణంలో మొక్కల సాంద్రత, పంట పోషకాలను తీసుకొనే విధానం, లక్ష్యంగా పెట్టుకున్న దిగుబడులు.

2. భూ భౌతిక, రసాయనిక లక్షణాలు (నేల స్వభావం, లవణ పరిమాణ సూచిక (సి.ఇ.సి), బంకశాతం, సేంద్రియ కర్భనం, భూసారం)

3. వాతావరణ పరిస్థితులు

4. సాగునీటి నాణ్యత

పైన సూచించిన విధంగా ఫర్టిగేషన్‌ యాజమాన్యం వివిధ అంశాల ద్వారా ప్రభావితం అవుతుంది. కాబట్టి ఫర్టిగేషన్‌ ద్వారా పంటలకు పోషకాలను అందించే ప్రణాళికలను తయారు చేసేటప్పుడు క్రింద సూచించిన సాంకేతిక అంశాలను పరిగణలోకి తీసుకోవాలి.

1. లోతైన రేగడి భూముల్లో ఫర్టిలైజర్‌ ట్యాంకు పరికరాన్ని వాడుకోవాలి. అలాగే తేలికపాటి భూముల్లో ఫర్టిలైజర్‌ ఇంజెక్టరు వాడుకోవాలి.

2. ప్రతి రోజు ఫర్టిగేషన్‌ ద్వారా పోషకాలను అందించటం అత్యంత శ్రేయస్కరం.. ఒకవేళ ఇలా కుదరకపోతే వారానికి రెండు సార్లు అయినా ఫర్టిగేషన్‌ చేసుకోవాలి.

3. పంట ఎదుగుదల దృష్ట్యా సరైన ఎరువులను ఎంపిక చేసుకోవాలి. ఎంపిక చేసుకొనే ఎరువు పోషకాలను అందించటమే కాకుండా అవసరమైతే నీటి ఉదజని సూచికను కూడా సవరించేదిగా ఉండాలి.

4. ఎంపిక చేసే రసాయనిక ఎరువు సాగునీటి నాణ్యతకు అనువుగా ఉండాలి. (లేకుంటే అవక్షేపాలు ఏర్పడి డ్రిప్పర్లు మూసుకుపోతాయి.)

5. సాగునీటిలో ఎక్కువ మోతాదు కాల్షియం, మెగ్నీషియం, సల్ఫేట్లు, ఇనుము లేదా మాంగనీసు గనుక ఉంటే అవి ఎరువులతో చర్య జరిపి ఎరువుల సామర్ధ్యాన్ని తగ్గిస్తాయని రైతులు గుర్తురచుకోవాలి.

6. యూరియా, తెల్లరకం మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌, నీటిలో కరిగే కాంప్లెక్స్‌ ఎరువులతో కలపడం వల్ల పంట నత్రజని, భాస్వరం, పొటాష్‌ల అవసరాలను తీర్చుకోవచ్చు.

7. ఒకే ట్యాంకులో కలిపిన వివిధ రసాయనిక ఎరువులు ఒక దానితో మరొకటి తేలికగా కలిసిపోయే స్వభావాన్ని కలిగి ఉండాలి. ఫాస్పేట్‌ లేదా ఇనుము ధాతువును భాస్వరం ఎరువుతో, భాస్వరం ఎరువులను ఇనుము, మెగ్నీషియంతో, సూక్ష్మపోషకాలను పూర్తి పంటకాలంలో అందించే విధంగా రోజూవారి మోతాదును లెక్కగట్టుకోవాలి.

8. పంటకు సిఫార్సు చేసిన మొత్తం పోషకాలను పూర్తి పంట కాలంలో అందించే విధంగా రోజువారీ మోతాదును లెక్కగట్టుకోవాలి.

9. ద్రవ లేదా పొడి రూపంలో ఉండే రసాయనిక ఎరువులను ట్యాంకులో కలిపేటప్పుడు ట్యాంకులో 50-75 శాతం నీళ్ళు ఉండేట్లు చూసుకోవాలి.

10. ఫర్టిగేషన్‌ ప్రక్రియ ప్రారంభించే ముందు కొద్దిసేపు డ్రిప్‌ వ్యవస్థను నడిపించాలి. దీని వల్ల పొలం అంతటా సమానమైన ఒత్తిడితో నీరు విడుదల అవుతుంది.

11. డ్రిప్‌ సిస్టమ్‌ను కొద్దిసేపు నడిపి నీటి ఒత్తిడి స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే ఫర్టిగేషన్‌ను ప్రారంభించాలి. దీనివల్ల సిస్టంలో దూరంగా ఉన్న డ్రిప్పర్లు కూడా నీటిని, పోషకాలను మొక్కలకు అందించగలుగుతాయి.

12. ఫర్టిగేషన్‌ తరువాత నీర్ణీత వ్యవధిలో డ్రిప్‌ వ్యవస్థను కొద్ది సేపు నడిపించాలి. దీని వల్ల పైపులలో, డ్రిప్పర్లలో మిగిలిపోయిన పోషకాల అవశేషాలు తొలగిపోతాయి. నిర్ణీత వ్యవధి కన్నా ఎక్కువ సేపు గనుక నీటిని పంపితే మొక్కల వేర్ల దగ్గర ఉండే పోషకాలు దెబ్బతింటాయి.

ద్రవరూపంలో ఉన్న ఎరువులను బిందు సేద్యం ద్వారా కలిపే పద్ధతి

ఈ పద్ధతిలో డ్రిప్పర్ల ద్వారా నీటితో పాటు ఎరువులు కూడా మొక్కల వేరు భాగంలో పడి మొక్కలకు అందుబాటులో ఉంటాయి. వీటిని డ్రిప్‌ నీటిలో కలిపేందుకు మూడు రకాల పరికరాలు ఉన్నాయి. 1. వెంచురీ 2. ఫెర్టిలైజర్‌ పంపు 3. ఫెర్టిలైజర్‌ ట్యాంక్‌.

1. వెంచురీ

దీన్ని శుభ్రపరిచేందుకే కాకుండా డ్రిప్‌తో పారే నీటిలో కలిపేందుకు కూడా

ఉపయోదించవచ్చు.

2. ఫర్టిలైజర్‌ పంపు

ఒక ట్యాంకులో అవసరమైన ఎరువులను వేసి ట్యాంకుకు ఒక బూస్టరు పంపు బిగించి, పంపు అవుట్‌లెట్‌ను సిస్కాటేటర్‌కు ముందుగాని, శాండ్‌ ఫిల్టరుకు ముందుగాని అమర్చాలి. ఈ పద్ధతిలో కూడా ద్రవ ఎరువులు ఒకే విధంగా, సమానంగా మొక్కలకు లభ్యమవుతాయి.

3. ఫర్టిలైజర్‌ ట్యాంక్‌

ద్రవ ఎరువును ఒక ట్యాంకులో వేసి ట్యాంకు ఇన్‌లెట్‌ను మెయిన్‌ లైను అవుట్‌లెట్‌కు కలపాలి. మెయిన్‌ లైను ఇన్‌లెట్‌, అవుట్‌లెట్‌కు మధ్య కంట్రోల్‌ వాల్వును వెంచురీలో అమర్చినట్టు అమర్చాలి. వాల్వును కంట్రోల్‌ చేయడం వల్ల మెయిన్‌ ఇన్‌లెట్‌ నుండి నీరు ద్రవ ఎరువులో కలిసి ట్యాంకు అవుట్‌లెట్‌ ద్వారా డ్రిప్‌ సిస్టంలోకి ప్రవేశించి డ్రిప్పర్ల ద్వారా మొక్కల వేళ్ళకు అందుబాటులోనికి వస్తుంది.

బిందు సేద్యం ద్వారా అధిక లాభాలు

భారత ప్రధాన ఆహార పంట వరి. అందుకే దేశవ్యాప్తంగా అనేక మంది రైతులు వరి పంటని అధికంగా పండిస్తారు. అయితే ఈ పంటకు నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. చాలినంత నీరు అందకపోతే పంట ఎండిపోతుంది.

వ్యవసాయం భారత్‌కు వెన్నెముక వంటిది. ఒకప్పుడు మనదేశ ఆర్థిక అభివృద్ధిలో వ్యవసాయం కీలక పాత్ర పోషించేది. కాని ప్రస్తుతం మనదేశంలో వ్యవసాయాన్ని కేవలం పిడికెడు సంస్థలు మాత్రమే శాసిస్తున్నాయంటే ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు.

కొన్ని విదేశీ సంస్థలు కృత్రిమ మేధస్సుతో తయారు చేసే విత్తనాల వల్ల భూగర్భ జలాలు, భూసారం దెబ్బతింటున్నాయి. దాంతో దేశానికి అన్నం పెట్టే రైతు అడుగడుగునా నష్టపోతున్నాడు.

సకాలంలో వర్షాలు పడక ఒకవైపు… అకాల వర్షాలతో మరోవైపు రైతు దిక్కు తోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు.

అయితే ఇటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొనడానికి కొంతమంది భారత వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యవసాయంలో వినూత్న పద్ధతులు ప్రవేశపెడుతున్నారు.

నీటి కొరత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయానికి బిందు సేద్యం విధానం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా మంది రైతులు బిందు సేద్యం ద్వారా లాభాలు గడిస్తున్నారు. నీటి వనరులను సద్వినియోగం చేసుకోవడమే కాకుండా నీటి వథాను కూడా అరికడుతున్నారు.

అయితే బిందు సేద్యం పద్ధతిలో వరి పండించడమంటే సవాలుతో కూడుకున్న పనే… కాని తమిళనాడుకు చెందిన పలువురు రైతులు ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిస్తున్నారు.

తమిళనాడు రాష్ట్రం తిరుపూరు జిల్లా గోవిందరపురం గ్రామానికి చెందిన పార్థసారథి ‘వినూత్న రైతు అవార్డు-2015’ను దక్కించుకున్నారు. బిందు సేద్యం ద్వారా వరిని పండించినందుకు గానూ ఆయనకు ఈ అవార్డు దక్కింది.

ఈ ప్రయోగంలో తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం పార్థసారథికి పూర్తి సహాయ సహకారాలను అందజేసింది. దీంతో మరో 23 మందితో కలిసి పార్థసారథి బిందు సేద్యం ద్వారా వరిని పండించడంలో సఫలీకృతమయ్యారు. అంతేకాకుండా మొక్కజొన్న, ఉల్లిగడ్డ పంటలను కూడా విజయవంతంగా పండించగలిగారు. గతంలో కంటే ఎక్కువగా పంట దిగుబడి పొందారు. అంతేకాకుండా నీటి వనరులను సంరక్షించుకో గలిగారు. ఇది విజయవంతం కావడంతో జిల్లాలోని గ్రామాలతోపాటు.. ఇతర జిల్లాలకు కూడా ఈ విధానం విస్తరిస్తోంది. పంట దిగుబడి పెరగడంతో పాటు నాణ్యమైన పంట ఉత్పత్తులు చేతికి వస్తుండడంతో బిందు సేద్యానికి రైతులలో ఆదరణ పెరుగుతోందని తమిళనాడు వ్యవసాయ విశ్వ విద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు.

తెలంగాణ ప్రభుత్వం కూడా బిందు సేద్యం విధానాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ విధానంతో రైతులు తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు సాధిస్తున్నారు. మైక్రో ఇరిగేషన్‌, ఉద్యాన శాఖలు బిందు సేద్యం, తుంపరల సాగును ప్రోత్సహిస్తూ రైతులకు అండగా నిలుస్తున్నాయి.

రాష్ట్రంలోని ఒక్క వికారాబాద్‌ జిల్లాలోనే వేల ఎకరాల్లో పంటలను డ్రిప్‌ ఇరిగేషన్‌ విధానంలో పండిస్తున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇందుకు ప్రభుత్వ ప్రోత్సాహంతో పాటు రైతుల ఆసక్తి కూడా విజయాలు సాధించేందుకు దోహదం చేస్తోందనే చెప్పుకోవాలి.

గతంలో సకాలంలో వర్షాలు కురవక పంట చేతికి అందడమే గగనంగా ఉండేదని వికారాబాద్‌ రైతులు చెబుతున్నారు. బిందు సేద్యం విధానంలో టమాట పంటకు 30 వేల రూపాయల వ్యయం అయితే 80 వేలకు పైగానే ఆదాయాన్ని సంపాదిస్తున్నట్లు చెబుతున్నారు.

ఈ విధానంలో వికారాబాద్‌కు చెందిన కొందరు రైతులు మామిడి, ద్రాక్ష, దానిమ్మ, కొబ్బరి, అరటి, జామ, సీతాఫలం.. వాణిజ్య పంటలైన పొగాకు, మల్బరీ, మిరప, పత్తి, చెరకు పంటలను కూడా పండిస్తూ లాభాలు పొందుతున్నారు.

రాష్ట్ర ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతులకు బిందు, తుంపర సేద్యానికి కావలసిన పరికరాలను సైతం ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. రైతు సంఘాలకు పరికరాలపై సబ్సిడీని కూడా ప్రభుత్వం అందిస్తోంది.

మరోవైపు… ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో సామూహిక ఎత్తిపోతలు, బిందు సేద్యానికి సంబంధించిన నిర్మాణాలను చేపట్టింది. హంద్రీ-నీవా ద్వారా జిల్లాకు వచ్చే కృష్ణా జలాలను సద్విని యోగం చేసుకోవడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.

సామూహిక ఎత్తిపోతలు, బిందు సేద్యం ద్వారా మొత్తం 50 వేల ఎకరాలకు నీటిని అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏపి ప్రభుత్వం రూపొందించింది. కర్ణాటకలోని రామ్తాల్‌ పరిధిలో విజయవంతమైన ఈ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉరవకొండలో ప్రయోగాత్మకంగా నిర్వహిస్తోంది.

– విజేత

– ది బెటర్‌ ఇరడియా సౌజన్యరతో

మరిన్ని వివరాల కొరకు సంప్రదించవలసిన చిరునామా

ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి, పరిశోధనా స్థానం, రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌, ఫోన్‌ నెం. 040-24018447

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *