నేల… ఆ ఐదు అంశాలు

నేల… ఆ ఐదు అంశాలు

(భూ సంరక్షణ – 2వ భాగం)

మొక్కల పెరుగుదలకీ; జంతువులకీ, మనుషులకీ అవసరమైన ఆహార పదార్థాలను, ముడి పదార్థాలను అందించడానికీ, ఆఖరికి వాతావరణ పరిరక్షణకు కూడా సజీవంగా, సారవంతంగా ఉండే నేల (పుడమి) అత్యవసరం. కానీ పుడమి కొన్ని దశాబ్దాలుగా తన పటుత్వాన్నీ జీవాన్నీ క్రమేణా కోల్పోతున్నదన్న మాట నిజం. అలాంటి పుడమిని సజీవంగా ఉంచేందుకు, పునరుద్ధరించు కోవడానికి అయిదు ప్రధానాంశాల మీద దృష్టి సారించి, అమలుచేయాలి.

పచ్చదనంతో కప్పి ఉంచడం ముఖ్యం

వాతావరణం (గాలిలో)లో ఉన్న కోట్ల టన్నుల కర్బనాన్ని కిరణ జన్య ప్రక్రియ ద్వారా వినియోగించటం, తద్వారా జీవ రసాయనిక శక్తిని ఉత్పత్తి చేయటం సహజంగా జరుగుతుంది. పచ్చదనంతో ఉన్న మొక్కలు సూర్యరశ్మితో కర్బనపు పంపులను పనిచేయిస్తాయి. ఆ పంపులే కిరణజన్య ప్రక్రియతో భూమికి తగినంత కర్బనం చేకూరుస్తాయి. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగేందుకే ఏడాది పొడవునా నేలను పచ్చదనంతో కప్పి ఉంచాలి. రకరకాల పంటలు, పచ్చికబయళ్ళ ద్వారా ఏర్పడే పచ్చదనంతో కిరణజన్య సంయోగ క్రియ జరిగి వాతావరణంలోని కర్బనం భూమికీ, తద్వారా పంటల ఉత్పత్తులలోనికీ చేరుతుంది. అలా ఆశించిన స్థాయిలో నేలకు కర్బనం చేకూరి పంటల ఉత్పాదకతను పెంచడానికి దోహదపడుతుంది. ఈ క్రమంలో జీవ రసాయనిక శక్తి బాగా చేకూరి అది మానవ మనుగడకు సహకరిస్తుంది.

సూక్ష్మజీవుల ఉనికిని కాపాడాలి

ఆరోగ్యకరమైన వ్యవసాయ పద్ధతులే జీవప్రక్రియలకు తోడ్పడతాయి. ఇందులో నేలలోని సూక్ష్మజీవుల పాత్ర కీలకమైనది. అవి మొక్కలతో అనుసంధానం కలిగి, నేలలోని జీవప్రక్రియలకు సహరిస్తూ భూమిని పునరుద్ధరించేందుకు తోడ్పడుతాయి. మైకోరైజా సూక్ష్మజీవులు నీటిని అందుబాటులోకి తేవడానికి, చీడపీడలను నియంత్రించడంలోను, పోషకాలను రవాణా చేయడంలో, కర్బన ద్రవాన్ని పరస్పరం మార్చడంలోను కీలకపాత్ర పోషిస్తాయి. జీవ సంబంధమైన నత్రజనిని సేంద్రియ సంబంధిత పదార్థాలుగా మార్చడంలోను ఈ సూక్ష్మజీవులు కీలకంగా వ్యవహరిస్తాయి. అలానే మైకోరైజా సూక్ష్మజీవులు ఆకులలో ఉండే 20-60 శాతం కర్బనాన్ని వాటి ప్రక్రియలను నిర్వహించడానికి కూడా తోడ్పడతాయి. నేలలోని ఈ సూక్ష్మజీవులు తమ చర్యలతో భూసారం పెంపొందించడానికి, భూభౌతిక స్థితిని పెంచడానికి ఉపకరిస్తాయి. గాలి చొరబడే విధంగా నేలను గుల్లబారేటట్టు చేయటం, కేటయాన్ల పరస్పర మార్పుకు, మొక్క ఎదుగుదలకు అవి తోడ్పడతాయి. నేలలో మట్టి రేణువులు చిక్కుడు గింజల పరిమాణంలో చిన్న చిన్న ముద్దలుగా ఏర్పడతాయి. వీటకి నీటిని పీల్చుకొనే స్వభావం ఉంటుంది. నీరు ఆవిరి రూపంలో పోకుండా, ఎక్కువ కాలంలో మొక్కలకు అందుబాటులో ఉంచి, ఉత్పాదకత పెంచేందుకు కూడా ఆ సూక్ష్మజీవులు దోహదం చేస్తాయి. నేల రక్షణకి, దాని లక్షణాన్ని కాపాడేందుకు అవసరమైన సూక్ష్మజీవులు పలుచోట్ల అంతరించి పోవటం బాధాకరం. సరైన భూ సంరక్షణతో, చక్కటి వ్యవసాయ పద్ధతులను ఆచరించినట్టయితే మళ్ళీ భూమిని పునరుద్ధరించ డానికి వీలవుతుంది. సేంద్రియ ఎరువులు ఎక్కువగా వేయటం, జీవన ఎరువుల వాడకాన్ని పెంచటం, నత్రజనిని స్థిరీకరించే సూక్ష్మజీవుల వినియోగాన్ని పెంచటం, చిక్కుడు జాతి పప్పుధాన్యాల సాగును ప్రోత్సహించటం వంటి చర్యలను కూడా చేపట్టాలి.

వైవిధ్యమైన పంటల సాగు తప్పనిసరి

ప్రతి మొక్క వేళ్ళ ద్వారా పలు విధాలైన కర్బన పదార్థాలను (ఉ||చక్కెరలు, ఎంజైములు, నూక్లిక్‌ యాసిడ్స్‌, ఆక్జిన్స్‌) గురించి భూమిలోని సూక్ష్మజీవులకు సంకేతాలను పంపి, జీవప్రక్రియలకు తోడ్పడతాయి. మొక్కల్లో ఎక్కువ వైవిధ్యం, సూక్ష్మజీవుల్లో హెచ్చు వైవిధ్యం నేలను సారవంతంగా ఉంచేందుకు దోహదపడతాయి. ఒకే రకమైన పంటను సంవత్సరాల తరబడి సాగు చేస్తుంటే భూమి సత్తువ తగ్గుతూ వస్తుంది. వైవిధ్యభరితమైన (70 రకాల మొక్కలు / పంటలు) సాగు చేపడితే భూమిని పునరుజ్జీవింపచేయడానికి బాగా దోహదపడుతుంది. చీడపీడల ఉధృతి కూడా తగ్గుతుంది. పంటలు, పశువులతో కూడిన వ్యవసాయంతో భూసంరక్షణకు, పునరుద్ధరణకు, అధికోత్పత్తికి వీలవుతుంది. వైవిధ్యభరితమైన పంటల సాగు, పంటల పద్ధతులు, పంటల సరళి, ఇతర పద్ధతులు (పాడి, కోళ్ళ పెంపకం, తేనెటీగల పెంపకం, చేపల పెంపకం, గొర్రెల పెంపకం….) పాటించి భూ పునరుద్ధరణకు దోహదపడాలి.

రసాయనిక ఎరువుల వినియోగం అపాయకరం

సజీవమైన నేల దీర్ఘకాలంలో ఖనిజ లవణాలను వృద్ధి చేస్తుంది. పంటల సరళి, సేంద్రియ ఎరువులు సజీవమైన నేలకు దోహదకారిగా ఉంటూ ఎక్కువ కాలం భూసారాన్ని కాపాడతాయి. కృత్రిమ రసాయనాలు దీర్ఘకాలం వాడితే నేల నిస్సారమై పంటల దిగుబడి తగ్గుతుంది. సజీవమైన నేల ఉంటేనే రసాయనిక ఎరువులు కూడా బాగా పనిచేస్తాయి. పూర్తిగా కృత్రిమ రసాయనిక ఎరువులపై ఆధారపడితే నేల స్వభావం దెబ్బతిని, పంటల దిగుబడి తగ్గుతుంది. విచక్షణా రహితమైన రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించాలి. వాటిని విచ్చలవిడిగా వాడినందువల్ల జరుగుతున్న అనర్థాలను ఇప్పటికే గమనించాం కూడా. సేంద్రియ ఎరువుల వినియోగాన్ని విరివిగా పెంపొందించి, రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గిస్తే ఆ చర్య భూ స్వభావ పునరుద్ధరణకు తోడ్పడవచ్చు.

ఎక్కువగా దున్నటం తగ్గించాలి

నేలను కొంతమేరకు దున్నటంవల్ల లోతుగా వేళ్లూనుకునే పంటలకు దోహదపడవచ్చేమో కాని, దీర్ఘకాలంలో దుక్కి లోతుగా చేయడం వల్ల పోషకాలు తగ్గిపోయే ప్రమాదముంది. అలాగే మేలుచేసే సూక్ష్మజీవులు తగ్గిపోయే ప్రమాదమూ ఉంది. సేంద్రీయ పదార్థాలు ‘ఆక్సిడేషన్‌’ ప్రక్రియకు లోనై, తక్కువ కిరణజన్య ప్రక్రియతోపాటు, కర్బనాన్ని వాతావరణంలోకి విడుదలవుతుంది. అందువల్ల భూమిని అతిగా దున్నటం సరికాదు.

మానవ మనుగడకు కావలసిన ఆహారం, వస్త్రాలు, కంప మొదలైన జీవనావసరాలన్నింటిని అందించేది సజీవమైన నేల. సజీవమైన నేలలో వాతావరణంలో ఉండే కర్బనాన్ని ఇతోధికంగా చేకూర్చి, మేలైన సూక్ష్మజీవులు, కిరణజన్య ప్రక్రియల ద్వారా పంటలు తదితర ముడిపదార్థాల ఉత్పత్తులను గణనీయంగా పెంపొందించుకొని ఆరోగ్యకర జీవితాన్ని గడపవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని, ఇతర అవసరాలకు కావలసిన పదార్థాల రూపాలలోనికి జీవరసాయనిక శక్తిని మార్చగలిగే శక్తిని కిరణజన్య ప్రక్రియ ద్వారా ప్రకృతి మనకు ప్రసాదించటం పెద్ద వరమే. ఎక్కువ పరిమాణంలో కర్బనాన్ని చేర్చి, మేలైన వ్యవసాయద్ధతుల ద్వారా, పౌష్టికాహారాన్ని, పరిశుభ్రమైన నీటిని సొంతం చేసుకొని, లాభసాటి వ్యవసాయం ద్వారా మానవాళి సంతోషదాయకమైన జీవితాన్ని గడపాలని ఆశిద్దాం.

– ప్రొ.పి.రాఘవరెడ్డి, 9989625230

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *