తెలుగు వీరుడు గుజ్జుబొమ్ము

తెలుగు వీరుడు గుజ్జుబొమ్ము

తెలుగు నుడి గురించి, తెలుగు కుదురు గురించి మాట్లాడటమంటే దేశం గురించి మాట్లాడటమే. ఎందుకంటే తెలుగువాళ్ళు ఎప్పుడూ దేశపు ఒక్కట్టుకు (ఐకమత్యానికి) ఎదురు నిలిచిన ఆనవాళ్ళు లేవు. పైపెచ్చు మన దేశంపైన పెరవారల (ఇతరుల) పెత్తనాన్ని ఎదిరించి నిలిచిన వారిలో ముందున్నారు. దేశపు బానిస సంకెళ్ళను తెంచడానికి తమ ఊపిరులను గడ్డిపోచల్లాగా వదిలిన తెలుగువీరులు ఎందరో. అటువంటివారిలో ఒకరు గుజ్జుబొమ్ము ఎద్దులప్ప నాయుడు.

‘గుజ్జుబొమ్ము’ అనేది ఎద్దులప్ప ఇంటిపేరు. వీరిది ఇప్పటి తమిళనాడులోని తిరుపూరు జిల్లా ఉడుమలపేట తాలూకాలోని జల్లిపల్లి అనే ఊరు. ఈ పల్లెలో నూటికి నూరుమంది తెలుగువారే. ఇప్పుడు ‘తాలూకా’ అని పిలుచుకొనే తావును, ఎద్దులప్ప కాలాన ‘మంద’ అనేవారు. ఇప్పటి ఉడుమలపేట, మటంగుంట తాలూకాలు మొత్తమూ; పొళ్ళాచి, దారాపురం తాలూకాలలో కొంత కొంత కలిసి అప్పటి ‘ముమ్మూర్తి మంద’గా ఉండేట. ఇటువంటి మందలు అప్పుడు 72 ఉండేవి. ఇప్పటి తమిళనాడులోని 60 పాళ్ళ నేల ఈ 72 మందల కింద ఉండేది. వీటిని పాళయపట్టులు అని కూడా అనేవాళ్ళు. 72 మందలలో 67 మందలు తెలుగు దొరల ఏలుబడిలో ఉండేవి. ముమ్మూర్తి మందలో దాదాపు 300 పల్లెలు ఉండేవి.

జల్లిపల్లికి 5 మైళ్ళ దవ్వులో (దూరంలో) ‘ముమ్మూర్తిమల’ అనే కొండ ఉంది. ఆ కొండ గుహలో ముగ్గురు జినమూర్తుల రాతిబొమ్మలు ఉంటాయి. అందుకే ఆ కొండకు ఆ పేరు. జల్లిపల్లికీ ముమ్మూర్తిమలకూ నడుమ ‘తల్లి’ అనే చోట గుజ్జుబొమ్ము నగరి ఉండేది. అక్కడి నుండి గుజ్జుబొమ్ము ఏలుబడి జరుగుతుండేది.

గుజ్జుబొమ్ము దొరలు జనాలను పీల్చి పిప్పిచేసేవారు కారు. మందిలో వారికి మంచి పలుకుబడి ఉండేది. మంది మేలుకోసం వాళ్ళ మందలో, వాళ్లు ఎన్నో మంచి పనులు చేశారు. వాటిలో ఒకదానిని గురించి ఇప్పటితరంవారు తెలుసుకొని తీరాలి.

ముమ్మూర్తి మల అనేది పడమటి కనుమలలో ఉంటుంది. ఈ కనుమలలో ఒకచోట దాదాపు 5వేల అడుగుల ఎత్తులో ‘ఆలేరు’ అనే చిన్న ఏరు పుడుతుంది. అది కొండల మీదనే పారి, పడమటి వైపుకు దూకి కేరళ మీదుగా సింధు కడలిలో కలిసేది.

గుజ్జుబొమ్ము ఎద్దులప్ప నాయుడి తాతపేరు కూడా అదే. ఆయన కాలాన ఆ కొండల మీద చిన్న అడ్డుకట్ట కట్టి, ఆలేరు పారకాన్ని తూర్పుకు మరల్చాడు. ఆ ఏరు కొండలు దిగి పారుతున్నప్పుడు, ఆ పారకానికి అడ్డుగా ఏడు పెద్ద గొలుసుకట్టు చెరువులను కట్టించాడు. చెరువులు నిండిన తర్వాత మిగిలిన పారకాన్ని అమరావతి నదిలోకి కలిపాడు. ఉడుమల పేట వాన నీడ తావు. అంటే వానలు చాలా చాలా తక్కువ. ఏడాది మొత్తంమీద 300 మి.మీ. వాన కురిస్తే ఎక్కువ. అంత కరువు తావు ఈ ఏడు చెరువుల వలన పచ్చని బయలుగా మారిపోయింది. ఏడు చెరువుల కింద ఇప్పుడు దాదాపు ఇరవై ముప్పయి వేల ఎకరాలు సాగవుతున్నాయి.

రెండవ ఎద్దులప్ప ఏలుబడి నడుస్తున్నప్పుడు, పచ్చని ముమ్మూర్తి మందమీద తెల్లవాడి కన్ను పడింది. అప్పటికే 65 తెలుగు మందల దొరలు తెల్లవాళ్ళ పెత్తనం మీద కారాలు నూరుతున్నారు. మదురకు తెక్కణం (దక్షిణం) గా పాంచాలకుర్తిలో గట్టిబొమ్ము వీరపాండ్య నాయుడు తిరుగుబాటు కొడిని (జండాను) ఎగరేసి ఉన్నాడు. (గట్టిబొమ్ము అనేది ఇంటిపేరు. దీనిని తమిళులు కట్టబొమ్మన్‌గా మారిస్తే, తెలియని తెలుగువారు కట్టబ్రహ్మన అన్నారు. రెండు తప్పే). గుజ్జుబొమ్ము, గట్టిబొమ్ముకు అండగా నిలిచాడు. పాలమ, మల్లపాలమ, కొడయాని బొమ్ము, కురిపాలమ, కోలకప్పిలి, ఇర్రి, కోన, దాసరి బొమ్ము, ఎరగామ, నలగామ, చిల్ల, జల్లి వంశాల తెలుగు దొరలను ఒకటి చేయడానికి గుజ్జుబొమ్ము నడుం కట్టాడు. తెలుగుదొరలు అందరూ కలిసికట్టుగా తెల్లవారికి కప్పం కట్టకూడదని గుజ్జుబొమ్ము పిలుపునిచ్చాడు. తెల్లవాళ్ళకు కంటగింపయింది, కడుపు మండింది. గుజ్జుబొమ్మును అణచివేయాలని అనుకొన్నారు. అయితే అదను దొరకలేదు. తెల్లదండు గట్టిబొమ్ముతో పోరాటంలో ఉంది. అందుకని ఆండ్రూస్‌ అనే చనవరి (అధికారి) ని రాయబారిగా ‘తల్లి’ కోటకు పంపారు.

చిన్నదండుతో రాయబారానికి బయలుదేరిన ఆండ్రూస్‌, ముమ్మూర్తి మల మందలో అలజడి రేపాడు. దారిలోని పల్లెజనులను పీడించాడు. పంటలను తొక్కించాడు. ఇది విన్న గుజ్జుబొమ్ముకు కనలు (ఆగ్రహం) రేగింది. నగరికి వచ్చిన ఆండ్రూస్‌ను విచారించాడు. ఆండ్రూస్‌ రాయబారిగా కాకుండా చనవరిగా పొగరుగా మాట్లాడాడు. కోపించిన గుజ్జుబొమ్ము ఆండ్రూస్‌ను చెరలో వేయించి, మరునాడు కొలువు కూటంలో విచారించి అతనికి ఉరిదండన వేయించాడు.

భారతదేశ చరిత్రలోనే ఒక తెల్లవాడిని బోనులో నిలబెట్టి దండనవేసి, ఉరి తీయించిన ఒకే ఒక వీరుడు గుజ్జుబొమ్ము. ఇది జరిగేటప్పటికి ఎద్దులప్పనాయుడికి 70 ఏండ్లకు పైబడిన ఈడు. మందల తెలిసిన తెల్లవాళ్ళు బగ్గుమన్నారు. అప్పటికే గట్టిబొమ్ముతో పోరు ముగిసింది. గట్టిబొమ్మును ఉరితీసారు. దాంతో తెల్లదండు తల్లికోటవైపు తిరిగింది. పెద్దదండుతో వచ్చిన తెల్లవాళ్ళు ముమ్మూర్తి మందను చిందర వందర చేశారు. ‘తల్లి’లోని నగరి ఆనవాళ్ళు లేకుండా నేలమట్టం చేశారు. ఎద్దులప్పనాయుడు తప్పించుకొని కొండలపైకి వెళ్ళిపోయాడు. అక్కడ ‘తలమంచి’ అనే తావునున్న ‘పొళయ’ అనే ఆదివాసులను చేరదీశాడు. అక్కడొక కోటను కట్టాడు. పొళయవారికి పోరును నేర్పాడు. అక్కడ నుండే తెల్లవాళ్ళపై దాడికి దిగాడు. మెరుపులాగా దాడిచేసి పెద్ద నష్టం కలిగించి, కొండలలోకి మాయమయ్యేది గుజ్జుబొమ్ము దండు. పొళయవారిని వీరులుగా తీర్చిదిద్దడంలో ఎద్దులప్ప నాయుడి కూతురైన కొండమ్మది పెద్ద చేయి.

తెల్లవాళ్ళు ఎన్నెన్నో మాయలూ కుట్రలూ చేసి 3 నెలలు తరువాత ఎద్దులప్ప నాయుడిని పట్టుకొని ఉరితీసి చంపారు. ఆ వీరుడు కనుమూసిన వెంటనే పోరాటం ఆగిపోలేదు. కొండమ్మ పోరాటాన్ని కొనసాగించింది. తెల్లదండును ముమ్మూర్తి కొండల మీదకు రానీయకుండా నిలువరించింది. తెల్లదండు తల్లి, జల్లిపల్లి ఊర్లలో విడిది చేసి విడతలు విడతలుగా పోరాడారు. మరొక 3 నెలల పోరాటం తరువాత తలమంచి కోటను పట్టుకొన్నారు. తెల్లవారికి దొరకకుండా కొండమ్మ కత్తితో పొడుచుకొని చనిపోయింది. ఆ తల్లి ఇప్పుడు పొళయర్లకు ఇలవేలుపు అయింది. ఎద్దులప్ప నాయుడి త్యాగం చరిత్రపుటలలో మరుగున పడి ఉంది.

– స.వెం.రమేశ్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *