కన్నుమూసిన ‘గోల్కొండ సింహం’

కన్నుమూసిన ‘గోల్కొండ సింహం’

ముస్లిం ఇలాకా పాతబస్తీలో గర్జించిన హిందూ సింహం తన యాత్రను ముగించింది. హిందూజాతి కోసం.. హిందువుల మనుగడ కోసం తన తరంలో చేసిన యుద్ధం ఇక చాలంటూ శాశ్వతంగా విశ్రాంతి తీసుకుంది. ‘కార్వాన్‌ టైగర్‌’, ‘గోల్కొండ సింహం’.. అభిమానులు, అనుచరులు ఎలా పిలుచుకున్నా నేనున్నానంటూ అండగా నిలిచిన ఓ భరోసా కానరాని తీరాలకు పయనమైంది. హైదరాబాద్‌లో బీజేపీకి, హిందూ సమాజానికి అండగా నిలిచిన బద్ధం బాల్‌రెడ్డి అనారోగ్యంతో అస్తమించారు.

కార్వాన్‌ నుంచి మూడుసార్లు శాసనసభ్యుడిగా ప్రాతినిథ్యం వహించారు బాల్‌రెడ్డి. ఎంఐఎం ప్రాబల్యం ఎక్కువగా ఉండే పాతబస్తీలో హిందువుల పక్షాన నిలిచి.. బీజేపీ ప్రాబల్యాన్ని పెంచారు. ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం నుంచి గెలుపొందిన బీజేపీ అభ్యర్థిగా ఆయన రికార్డు సష్టించారు.

73 ఏళ్ల వయసులో ఫిబ్రవరి 23వ తేదీన కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాల్‌రెడ్డి తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన పేగు సంబంధిత క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఇటీవల ఆరోగ్యం విషమించడంతో కుటుంబ సభ్యులు ఫిబ్రవరి 10వ తేదీన బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రిలో చేర్పించారు. 13 రోజుల పాటు చికిత్స పొందిన ఆయన 23వ తేదీ సాయంత్రం ఆరున్నర గంటలకు కన్నుమూశారు.

పాతబస్తీ రాజకీయాల్లో తనదైన ముద్ర

బీజేపీలో అతి సాధారణ స్థాయి నుంచి ప్రముఖ రాజకీయ నేతగా బాల్‌రెడ్డి ఎదిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1985 నుంచి 1994 మధ్యలో మూడుసార్లు కార్వాన్‌ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పాతబస్తీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన బాల్‌రెడ్డిని అభిమానులు గోల్కొండ టైగర్‌గా పిలుచుకొనేవారు. పాతబస్తీ అలియాబాద్‌ జంగమ్మెట్‌ ప్రాంతానికి చెందిన ఆయన ఓల్డ్‌సిటీలో బీజేపీ బలోపేతానికి విశేషమైన కషి చేశారు. ఎంఐఎం వ్యవస్థాపకుడు సలావుద్దీన్‌ ఓవైసీకి అప్పట్లో పాతబస్తీలో గట్టిపోటీ ఇచ్చారు. ముస్లింల ప్రభావం ఎక్కువగా ఉన్న ఏరియాలో కూడా కాషాయజెండా ఎగరేయగలిగారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కషి చేసిన నాయకులలో బాల్‌రెడ్డి ప్రముఖులు. ఆయన పేరును పలుమార్లు గవర్నర్‌ పదవికి సైతం బీజేపీ అధిష్టానం పరిశీలించింది.

బాల్‌రెడ్డి విద్యార్థి దశనుంచే ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1962లో జనసంఘ్‌లో చేరారు. 1977లో జనసంఘ్‌ నేతలతో పాటు ఆయన కూడా జనతాపార్టీలో చేరారు. 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావంతో రాష్ట్రస్థాయి నాయకుడిగా ఎదిగారు.

దాడులకు వెన్నుచూపలేదు

పాతబస్తీలో ఎంఐఎంకు కంట్లో నలుసులా మారిన బాల్‌రెడ్డిపై ఆ ప్రాంతంలో చాలామంది కక్ష పెంచుకున్నారు. 1979లో ఓ సభలో పాల్గొని ఇంటికి వెళుతున్న సమయంలో శాలిబండ వద్ద ఆయనపై హత్యా ప్రయత్నం జరిగింది. కొందరు దుండగులు కత్తులు, రాళ్లతో దాడిచేసి చనిపోయాడని భావించి వదిలివెళ్లిపోయారు. స్థానికులు గుర్తించి ఆయనను రక్షించారు. ఆ తర్వాత 2004లోనూ మరోసారి ఆయన మీద హత్యాయత్నం జరిగింది. తటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ కేసులో నిందితుడు జకీర్‌ రహీమ్‌ను 2017లో పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రధాన నిందితుడు ఫర్హతుల్లా పరారీలో ఉన్నాడు.

బులిటెన్‌ విడుదలైన కాసేపటికే..

కేర్‌ ఆస్పత్రి వైద్యులు హెల్త్‌ బులిటిన్‌ విడుదల చేసిన కాసేపటికే బాల్‌రెడ్డి మతిచెందారు. 23వ తేదీ మధ్యాహ్నం నుంచే ఆయన చనిపోయారన్న వార్త సోషల్‌ మీడియాలో షికార్లు చేసింది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తదితరులు అదే సమయంలో ఆయన్ను పరామర్శించారు. బాల్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని రాజాసింగ్‌ మీడియా ముందు ప్రకటించారు. ఆయన కాలేయ సమస్యతో బాధపడు తున్నారని, పరిస్థితి విషమంగా ఉందని.. అయితే, ఆయన చనిపోయినట్లు జరుగుతున్న ప్రచారం నిజం కాదని చెప్పారు. ఆ వెంటనే కేర్‌ ఆస్పత్రి వైద్యులు హెల్త్‌ బులిటెన్‌ కూడా రిలీజ్‌ చేశారు. బులిటెన్‌ రిలీజ్‌ చేసిన కాసేపటికే బాల్‌రెడ్డి తుదిశ్వాస విడిచారు.

బాల్‌రెడ్డి మతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత బండారు దత్తాత్రేయ, మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మణ్‌, కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్‌ తదితరులు బాల్‌రెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ బాల్‌రెడ్డి మతికి సంతాపం తెలిపారు.

తెలంగాణ అసెంబ్లీ సంతాపం

బద్ధం బాల్‌రెడ్డి మతి పట్ల తెలంగాణ అసెంబ్లీ సంతాపం వ్యక్తం చేసింది. ఈ మేరకు సంతాప తీర్మానాన్ని స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి చదివి వినిపించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. బాల్‌రెడ్డి జనసంఘ్‌లో క్రియాశీల రాజకీయాలకు శ్రీకారం చుట్టారని స్పీకర్‌ పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పని చేశారని తెలిపారు. 1985 నుంచి మూడు పర్యాయాలు ఆయన కార్వాన్‌ నియోజవర్గ అభివృద్ధికి కృషి చేశారని వెల్లడించారు. అణగారిన వర్గాలకు నిస్వార్థ సేవలు అందించారన్నారు. ఎస్సీ, ఎస్టీల పురోగతికి ఎంతో కషి చేశారన్నారు. ఆయన పలు సామాజిక సంస్థలకు, కార్మిక సంఘాలకు సైతం సలహాదారుగా సేవలందించారని పోచారం గుర్తు చేశారు.

– హంసిని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *