మహిళాశక్తికి జేజేలు

మహిళాశక్తికి జేజేలు

మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం

‘ఆధునిక మహిళ చరిత్రను తిరగరాస్తుంది’ అన్నారు గురజాడ. రాజకీయ రంగంలో, పరిపాలనా రంగంలో, వాణిజ్యరంగంలో, సాహిత్య విద్యారంగాలలో, కళలో మహిళ కూడా తన స్థానం తను పొందగలిగితే ఈ చరిత్ర కొత్త మలుపు తిరుగడం ఇక ఒక లాంఛనమే మరి! భారత దేశంలోనే కాదు, ప్రపంచ జనాభాలోను మహిళల సంఖ్య దాదాపు పురుషులతో సమం. వారి సామర్థ్యం కూడా పురుషులతో సమానమేనని విశ్వం మొత్తం అంగీకరిస్తున్నది. కానీ చాలా ఆదర్శాలు ఆచరణలో అదృశ్యమైపోతున్నాయి. శుష్కప్రియాలుగా, శూన్యహస్తాలుగా మిగులుతున్నాయి. అయినా కాలచక్రం మహిళను మౌనంగా ఉండనివ్వడం లేదు. నల్లజాతి కవయిత్రి ఆద్రి లోర్డే మహిళలను ఉద్దేశించి చెప్పినట్టు ‘నీ మౌనం నిన్ను రక్షించదు’ అన్న భావనలోనే ఆధునిక మహిళ ఉన్నది. ఈ మాట ఆధునిక మహిళను నడిపిస్తున్నది కూడా. అందుకే నూట పదేళ్లుగా ప్రతి ఏటా తమ హక్కుల గురించి మహిళలు గొంతెత్తి ఈ సంగతి గుర్తు చేస్తున్నారు. మార్చి 8వ తేదీన జరుపుకునే ప్రపంచ మహిళా దినోత్సవం అలాంటి గొప్ప సందర్భమే.

రాజకీయ నాయకుల నోటి నుంచి విన్నట్టు అనిపించినా ఇది నిజం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక చారిత్రక సందర్భాన్ని, ఒక గొప్ప మార్పు వేచి ఉన్న వాస్తవాన్ని, ఆ మార్పు అవసరాన్ని ఈ లోకానికి వెల్లడిస్తోంది. ఇది నూట పది సంవత్స రాల నుంచి జరుగుతున్న ఒక సున్నిత పోరాటం. స్త్రీ పురుష సమానత్వం ఒక సహజ విషయంగా గుర్తించడానికి ప్రపంచం ఇప్పటికీ సిద్ధంగా లేదు. ఇంత పోరాటం జరిగినా, 1975 నుంచి ఐక్య రాజ్యసమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రోత్సహిస్తున్నా, ఏ దేశమూ కూడా ఈనాటికీ మా సమాజంలో స్త్రీపురుషుల మధ్య అసమానతలు లేవు అని నిర్ద్వంద్వంగా చెప్పుకునే స్థితికి రాలేదు. అభివృద్ధికీ, స్వేచ్ఛా చింతనకీ నిలయంగా చెప్పే అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఇంతవరకు ఒక మహిళకు అధ్యక్ష స్థానం ఇచ్చి గౌరవించలేక పోయాయి. ఏడు దశాబ్దాలుగా చైనాను పాలిస్తున్న కమ్యూనిస్టు ప్రభుత్వం కూడా ఇందుకు భిన్నంగా లేదు. పతనమైన సోవియెట్‌ రష్యా కూడా మహిళకు సమున్నత స్థానం ఇవ్వలేదు. ప్రపంచంలో స్త్రీ పట్ల వివక్ష ఒక వాస్తవం. భారతదేశం మహిళకు ఇచ్చిన స్థానం వేరు. మన పురాణాలు, కావ్యాలు, ధార్మిక చింతన ఆమెను ఒక దేవత స్థానంలో నిలిపాయి. అయినా చాలా విషయాలలో భారతీయ మహిళ తాను పురుషులతో సమాన ¬దా దక్కించుకున్నానని చెప్పుకునే రోజు ఇంకా రాలేదు. చట్టసభలలో 33శాతం రిజర్వేషన్‌ అంశం ఇందుకు మంచి నిదర్శనం.

మన యోగాను ప్రపంచం ఆహ్వానించింది. అలాగే ప్రపంచం సామూహికంగా కంటున్న కలల విషయంలో మనం భాగస్వాములం కావడం కూడా అవసరమే. అందుకే మార్చి 8న ప్రపంచంతో పాటు భారత్‌ కూడా మహిళా దినోత్సవాన్ని నిర్వహించు కుంటోంది. ఒక గొప్ప ఆశయంతో ప్రపంచం మొత్తం జరుపు కుంటున్న ఈ ఉత్సవం నేపథ్యం గురించి పూర్తి వివరాలు లేవు. ఇది భూగోళమంతా ఎప్పుడు విస్తరించిందో చెప్పడం సాధ్యం కాదు. 1908 సంవత్సరంలో న్యూయార్క్‌లో 15,000 మంది మహిళలు పెద్ద ఊరేగింపు నిర్వహించారు. ఓటు హక్కు, మెరుగైన వేతనాలు, పరిమిత పని గంటలు అనే కోర్కెలను ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లడం ఆ ప్రదర్శన లక్ష్యం. ఇదే ప్రపంచ మహిళా దినోత్సవం అనే ఒక ఆశయానికి ఆకృతిని ఇచ్చింది. ఆ మరుసటి సంవత్సరం అమెరికాలోనే మొదటిసారిగా జాతీయ మహిళా దినోత్సవం జరిపారు. అమెరికా సోషలిస్టు పార్టీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం జరిగింది. 1910లో జర్మనీ సోషల్‌ డెమాక్రటిక్‌ పార్టీ మహిళా నాయకురాలు క్లారా జెట్కిన్‌ ప్రపంచమంతటా మహిళా దినోత్సవం నిర్వహించాలని ఒక ప్రతిపాదన తీసుకువచ్చారు. మహిళల న్యాయబద్ధమైన కోర్కెల సాధనకు ఇదొక మార్గమవుతుందని ఆమె భావించారు. ఈ ప్రతిపాదన వచ్చిన సమావేశంలో 17 దేశాలకు చెందిన వందమంది మహిళా ప్రతినిధులు ఉన్నారు. వారంతా క్లారా ఆలోచనను స్వాగతించారు. ఆ విధంగా 1911లో తొలిసారి ఆస్ట్రియా, డెన్మార్క్‌, జర్మనీ, స్విట్జర్లాండ్‌లలో మహిళా దినోత్సవం నిర్వహించారు. కానీ ఇది కూడా మార్చి ఎనిమిదో తేదీన జరగలేదు. మార్చి 19న నిర్వహించారు. చివరికి 1913లో కుదిరిన ఏకాభి ప్రాయం మేరకు ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహంచాలని నిర్ణయించారు. పైన పేర్కొన్నట్టు 1975లో ఐక్య రాజ్య సమితి దీనిని గుర్తించింది. ఇక అమెరికా సంయుక్త రాష్ట్రాల మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా మరో అడుగు ముందుకు వేసి మార్చి మాసాన్ని మహిళా చరిత్ర మాసంగా ప్రకటించారు.


‘ఆమె’ కేంద్ర బిందువు

‘ఒక జాతి విలువను వాస్తవంగా గణించాలంటే ఆ దేశ స్త్రీత్వ లక్షణం ఆధారంగానే అది జరగాలి’ అంటారు అమెరికా నల్లజాతి రాజకీయ నాయకురాలు, యునిసెఫ్‌ కార్యకర్త మేరీ మెక్లాయిడ్‌ బెథూన్‌ (1875- 1955). అదే కొలబద్ధతో దేశం లేదా జాతి ఔన్నత్యాన్ని కొలవాలీ అంటే అందుకు భారతదేశాన్ని మించిన దేశం మరొకటి ఉండదు. వివిధ చారిత్రక కారణాలతో ఆధునిక భారతదేశ చరిత్రలో మహిళకు కొంత ప్రాధాన్యం తగ్గినట్టు కనిపించవచ్చు. కానీ మొత్తం మన చరిత్రను పరిశీలిస్తే ఆమె ద్వితీయ శ్రేణికి పరిమితమై ఉండి పోలేదన్న వాస్తవం గమనిస్తాం. ఎక్కడ స్త్రీ పూజలు అందుకుంటుందో అక్కడ దేవతలు సంచరిస్తారని, అంటే శుభ వాతావరణం ఉంటుందని, మెరుగైన స్థితి ఉంటుందని మనం నమ్ముతాం. భారత రాష్ట్రపతి, ప్రధాని, లోక్‌సభ స్పీకర్‌ వంటి సమున్నత పదవులలో మహిళను మనం ప్రతిష్టించుకున్న మాట వాస్తవం. న్యాయ రంగంలో, క్రీడా రంగంలో, శాస్త్రసాంకేతిక రంగంలో, సాహిత్య రంగంలో ఎక్కడైనా స్త్రీకి భారత జాతి గౌరవ ప్రదమైన స్థానమే ఇచ్చి గౌరవించింది. ఇందుకు కొన్ని మినహా యింపులు ఉన్నాయని అంగీకరిస్తూనే, ఈ దేశంలో మహిళ చాలా దేశాలలో కంటె మెరుగైన స్థితిలోనే ఉందని అంగీకరించాలి. అంతర్జా తీయ మహిళా దినోత్సవానికి జాతి చరిత్రలో మహిళ స్థానం, ప్రస్తుత సమాజంలో వారి విజయాలను సమీక్షించు కోవడం కూడా భాగమే.

ఈ దేశాన్ని రక్షించిన మహావీరులు, ఈ దేశానికి జ్ఞానాన్ని అందించిన మేధావులు అంతా తల్లి ఒడే తమ తొలి బడి అని అంగీకరించారు. మురాదేవి, కణ్ణగి, ఉభయభారతి, రాణీ సంయుక్త, రుద్రమదేవి, రాణీ చెన్నమ్మ, ఝాన్సీ లక్ష్మీబాయి, శారదామాత, అనిబీసెంట్‌, సిస్టర్‌ నివేదిత, అరుణా అసఫాలీ, కస్తూర్బా గాంధీ, ఐలమ్మ, దుర్గాబాయి దేశ్‌ముఖ్‌, సుచేత కృపలానీ వంటివారే కాదు, కాదంబినీ గంగూలి ఈ దేశం నుంచి విదేశాలకు వెళ్లి వైద్య విద్యను అభ్యసించారు. ఇది 19వ శతాబ్దంలో జరగడం విశేషం. అమృతా ప్రీతమ్‌, మహాశ్వేతాదేవి, అమృతా షేర్గిల్‌ వంటివారు కళారంగంలో అంతర్జాతీయ ఖ్యాతినార్జించారు. దేశ విభజన నాటి అనుభవాలతో అమృతా ప్రీతమ్‌ చేసిన రచనలు మరపురానివి. ఎంఎస్‌ సుబ్బులక్ష్మి, డీకే పట్టమ్మాళ్‌, గంగూబాయి హంగూలీ భారతీ సంగీత సంపదను ప్రపంచానికి చాటారు. కిరణ్‌ బేడీ పోలీసు వ్యవస్థలో మహిళల ఘనతను చాటారు. మేరీ కోమ్‌, పీవీ సింధు, సైనా నెహ్వాల్‌వంటి వారు క్రీడారంగంలో మన జెండాను ఎగురువేశారు.


అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆవిర్భ విస్తున్న క్రమంలో ఆ ఉద్యమం మీద అనేక చారిత్రక, సామాజిక తాత్వికతలు ప్రభావం చూపాయి. ఇప్పుడు దాదాపు అన్ని ప్రపంచ దేశాలలోను అధికారికంగా జరుగుతున్న మహిళా దినోత్సవం అనేక ప్రపంచ పరిణామాలకు ప్రభావితమవుతూ వచ్చింది. అవన్నీ మహిళా దినోత్సవం ఆశయానికి పదును పెట్టాయి. మార్చి 19, 1911న ఆస్ట్రేలియా, జర్మనీ, డెన్మార్క్‌, స్విట్జర్లాండ్‌లలో ఈ ఉత్సవం ప్రణాళికా బద్ధంగా జరిగింది. అదే సమయంలో ఆస్ట్రియాలో 300 ప్రదర్శనలు జరిగాయి. నిజానికి అప్పుడు అక్కడ ఉన్నది రాచరికమే. 1913లో రష్యా వంటి సంప్రదాయ సమాజంలో తొలిసారి మహిళా దినోత్సవం జరిగింది. తరువాత 1914 నుంచి 1918 వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. అప్పుడు కూడా అంతర్జాతీయ ఉద్యమం స్ఫూర్తి చెరిగిపోలేదు. చిత్రం ఏమిటంటే ఆ కాలంలో ఒలింపిక్‌ క్రీడోత్సవాలు మాత్రం రద్దయ్యాయి. 1914 మార్చి 8న రష్యా మహిళలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఒకవైపు శాంతి కావాలని కోరుతూనే, మరొక వైపు యుద్ధం కోసం వెళ్లిన రష్యా సైనికులకు సంఘీభావం తెలపడం విశేషం. 1917లో అంటే యుద్ధం చివరి దశకు వచ్చిన సందర్భంలో అనుకోకుండా రష్యా మహిళలు ఉరేగింపు నిర్వహించారు. రొట్టె-శాంతి అన్న నినాదంతో వారు ప్రదర్శన నిర్వహించారు. అనుకోకుండా ఆ రోజు మార్చి ఎనిమిదో తేదీ కావడం విశేషం. ఇది జరిగిన నాలుగు రోజులకే జార్‌ నికోలస్‌ పదవీ త్యాగం చేశారు. మహిళలకు కొన్ని హక్కులతో పాటు ఓటు హక్కు కూడా కొత్త ప్రభుత్వం మంజూరు చేసింది.

మార్చి 8, ప్రపంచ మహిళా దినోత్సవం అసలు ఉద్దేశం ఏమిటి? మా దేశంలో మేం పురుషులతో సమ ¬దాను అనుభవిస్తున్నామని ఈ భూప్రపంచంమీద ఏ మహిళ ఏ దేశంలోను ప్రకటించే అవకాశం ఇప్పుడులేదు. కానీ ప్రపంచ జనాభాలో దాదాపు సగం మహిళలే. కానీ ప్రపంచం మొత్తం మీద చూస్తే చట్టసభలలో వారి వాటా కేవలం 23 శాతం కంటె తక్కువ. పేదరికం కారణంగా చదువుకూ, వైద్యానికీ దూరమవుతున్నవారు ప్రధానంగా మహిళలే. ప్రపంచ జనాభాలో 1.3 బిలియన్ల మహిళలు నిరుపేదలు. పురుషులతో పోల్చి చూసుకున్నప్పుడు ఎక్కడైనా 30 నుంచి 40 శాతం తక్కువ వేతనం పొందుతున్నారు. ఇది ఏదో చిన్న ప్రైవేటు కంపెనీలో వ్యవహారం కాదు. ఒక పేద దేశంలో జరుగుతున్నది కూడా కాదు. బీబీసీ వంటి ప్రపంచ ప్రఖ్యాత వార్తా వ్యవస్థ నుంచి క్యారీ గ్రేసీ అనే మహిళా జర్నలిస్ట్‌ పదవికి రాజీనామా చేశారు. ఆమె చైనా వార్తా విభాగానికి సంపాదకురాలి ¬దాలో పనిచేశారు. కానీ పురుషుల కంటె తనకు వేతనం తక్కువ ఇస్తున్నందుకు నిరసనగా నిరుడు బహిరంగంగా నిరసన తెలుపుతూ రాజీనామా ఇచ్చారు. కొన్ని ప్రముఖ బ్రిటన్‌ కంపెనీలలో ఈరోజుకీ ఇవే అసమానతలు నెలకొని ఉన్నాయి. పురుషులు, స్త్రీలు చేసేది ఒకే పని. కానీ వేతనం దగ్గర అసమానతలు ఉంటున్నాయి. పురుషుల మీద కంటే స్త్రీల మీద హింస ఎక్కువగా జరుగుతోంది. కొన్ని ప్రదర్శనలు, ఉపన్యాసాలు, ఆందోళనలతో ఈ సమస్య సమసిపోదు. ఇది తెలియని విషయం కాదు. కానీ ఎక్కడో అక్కడ ఏదో ఒక రూపంలో మార్పు కోసం ప్రయత్నం మొదలు కావాలి. ప్రపంచ ఆర్థిక వేదిక 2017లో ఇచ్చిన నివేదిక ప్రకారం స్త్రీపురుషుల మధ్య అసమానతలు సంపూర్ణంగా సమసి పోవడానికి మరో వందేళ్లు సమయం పడుతుంది. ఈ వాస్తవాన్ని అంగీకరిస్తూనే, ఈ అసమానతల గురించి గొంతు ఎత్తవలసిందే.

ప్రపంచ మహిళా దినోత్సవం సంద ర్భంగా ఏం చేస్తారు? మొదట చెప్పుకున్నట్టు ప్రపంచ జనాభాలో సగమై ఉన్న మహిళ పట్ల ఉన్న వివక్షను గుర్తు చేయడం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం. అందుకే ఏటా ఐక్య రాజ్యసమితి మహిళా దినోత్సవం కోసం ఒక నినాదం ఇస్తుంది. 2019 మహిళా దినోత్సవం కోసం ఇచ్చిన నినాదం- మెరుగైన సమాజం కోసం సమతౌల్యం. అంటే స్త్రీపురుష జనాభా మధ్య సమతౌల్యం కొనసాగేటట్టు చేయడం. 2018లో అభివృద్ధి కోసం పత్రికా రచన అన్న నినాదం ఇచ్చింది. ఐక్య రాజ్యసమితి ఇచ్చిన నినాదాలలో, మహిళా దినోత్సవం కోసం రూపొందిస్తున్న కార్యక్రమాలలో కొన్ని వాస్తవికమైనవి, ప్రయోజనకరమైనవి కచ్చితంగా ఉన్నాయి. అవి యుద్ధం గురించిన శాంతి చర్చల మాదిరిగా మొక్కుబడిగా సాగడం లేదు. ఆ నినాదాల ఆశయాన్ని కొద్ది శాతం సాధించినా ఆ ఫలితం ఏ దేశానికైనా ఉపయుక్తమే. గ్రామీణ మహిళను ఆర్థికంగా పరిపుష్టం చేసే అవకాశాలు కల్పించడం వంటివి కూడా అందులో ఉన్నాయి. ఈ మొత్తం సందేశం మారుమూల ప్రాంతానికి కూడా చేరేందుకు ఊరేగింపులు నిర్వ హిస్తారు. సభలు, ఉపన్యాసాలు ఏర్పాటు చేస్తారు. పత్రికలలో వ్యాసాలు రాస్తారు. కళా ప్రదర్శనలు, గోష్ఠులు నిర్వహిస్తారు. మార్చి 8వ తేదీన సెలవు ప్రకటిస్తున్న దేశాలు కూడా ఉన్నాయి. అఫ్ఘానిస్తాన్‌, అజర్‌బైజాన్‌, ఆర్మేనియా, బేలారస్‌, బుర్కినా ఫాసో, కంబోడియా, క్యూబా, జార్జియా, గుయానా- బిసువా, మాల్డోవా, మంగోలియా, మాంటెనిగ్రో, ఉగాండా, ఉక్రెయిన్‌, ఉజ్బెకిస్తాన్‌, వియత్నాం, జాంబియా దేశమంతటికి అధికారికంగా సెలవు ప్రకటిస్తున్నాయి. చైనా, మెడగాస్కర్‌, నేపాల్‌ స్త్రీలకు మాత్రమే సెలవు ప్రకటిస్తున్నాయి.

కానీ ప్రపంచంలోని చాలా దేశాలలో ముఖ్యంగా అరేబియన్‌ దేశాలలో ఈ ఉత్సవాలకు అవకాశం లేదు. అలాగే కెన్యా, ఇరాన్‌, ఇరాక్‌ వంటి ఉగ్రవాద పీడిత దేశాలలో కూడా ఇలాంటి చైతన్యం తేవడానికి అవకాశం లేదు. చర్చ్‌ పూజారులు, బిషప్పులు క్రైస్తవ సన్యాసినులను లైంగికంగా ఉపయోగించు కుంటున్నారని సాక్షాత్తు కేథలిక్‌ చర్చ్‌ పోప్‌ ఫ్రాన్సిస్‌ ఈ ఫిబ్రవరిలోనే ప్రకటించారు. అక్కడ జరుగుతున్న అకృత్యాలు అక్కడే అణగారిపోతున్నాయి. బోకో హరాం వంటి ముస్లిం మతోన్మాద ఉగ్రవాద సంస్థ ఒకే పాఠశాల నుంచి రెండువందల మంది వరకు బాలికలను అపహరించుకుపోయింది. ఇలాంటి చోట్ల మహిళలకు రక్షణ ఊహకు కూడా అందదు. ఇక హక్కుల గురించి ఎవరు గొంతు ఎత్తగలరు? పాకిస్తాన్‌లో పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. మలాలా యూసుఫ్‌ జాయి, తస్లిమా నస్రీన్‌ వంటి వారంతా మతోన్మాదం కారణంగా స్వేచ్ఛను కోల్పోయినవారే! ఇస్లామిక్‌ ఉగ్రవాద సంస్థలు ఇతర మతాలకు చెందిన స్త్రీల పట్ల వ్యవహరిస్తున్న తీరు కూడా దారుణం.

అభివృద్ధి చెందిన దేశాలలోని మహిళలు హక్కుల కోసం పోరాడే స్థాయికి చేరుకున్నారు. అలా అని ఆ దేశాలలో అంతా సజావుగానే ఉందని చెప్పడం లేదు. ఆ దేశాలలో కూడా మహిళలు లైంగిక వేధింపుల నుంచి బయటపడలేదు. ఉద్యోగినులను వేధించడం కూడా ఎక్కువే. కానీ వారికి రక్షణ కల్పించే విషయంలో కనీసం పటిష్ట చట్టాలైనా ఆ దేశాలలో ఉన్నాయి. కానీ మత ఛాందసంలో కూరుకుపోయిన చాలా దేశాలలో మహిళల పరిస్థితి ఘోరం. అక్కడ మహిళలను బానిసలుగానే చూస్తున్నాయి. కొన్నిచోట్ల ఇప్పుడిప్పుడే కార్లు నడపేందుకు మహిళలు లైసెన్సులు తీసుకోగలుగుతున్నారు. పక్కన రక్త సంబంధీకుడైన బంధువు లేదా భర్త ఉంటే తప్ప స్త్రీ గడప దాటరాదన్న ఆంక్షను ఇప్పటికీ తుచ తప్పకుండా పాటిస్తున్న దేశాలు కూడా ఉన్నాయి. ఓటు హక్కు కూడా పరిమితమే. కానీ ప్రపంచమంతా ఇదే విధంగా ఉందనుకుంటే పొరపాటు. రాజకీయాలు, వాణిజ్య రంగం, కళా సాహిత్య రంగాలు, విద్య వంటి వ్యవస్థలలో పురుషులతో పోటీ పడడానికి మహిళలకు అవకాశం ఇస్తున్న దేశాల సంఖ్య పెరుగుతోంది. మహిళలకు రక్షణ రంగంలో కూడా అవకాశాలు ఇస్తున్న సమాజాలు ఉన్నాయి. ప్రపంచం ముందడుగు వేస్తోందని చెప్పడానికి ఇదే గొప్ప సంకేతం. ఇది వేగవంతం కావాలని అంతా కోరుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *