సంచలనాల ‘స్మృతి’

సంచలనాల ‘స్మృతి’

కాంగ్రెస్‌ కంచుకోట అమేథీలో బీజేపీ గెలవడమంటే చిన్న విషయం కాదు. అందులోనూ ఏకంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడినే ఓడించారామె. దీంతో దేశవ్యాప్తంగా ‘జెయింట్‌ కిల్లర్‌’గా పేరు తెచ్చుకున్నారు. భాజపాలో మరో కీలక నేతగా పేరు తెచ్చుకున్నారు. ఇంతకీ ఆమె ఎవరు అని అనుకుంటున్నారా?! మోదీ క్యాబినెట్‌లో రెండోసారి కూడా చోటు దక్కించుకున్న భారతీయుల కోడలు,

ఆ పార్టీ ఫైర్‌ బ్రాండ్‌ స్మృతి ఇరానీ.

ఏళ్ల తరబడి అమేథిలో పాతుకుపోయిన కాంగ్రెస్‌ కుటుంబ వారసత్వ రాజకీయాలను పెకిలించే ప్రయత్నంలో స్మృతి పూర్తి విజయం సాధించారు. ఇందుకు బిజెపి శ్రేణుల అండదండలు, నరేంద్ర మోదీ నాయకత్వంలో జరిగిన అభివృద్ధి తోడ్పడ్డాయని ఆమె చెబుతున్నారు.

స్మృతి జుబీన్‌ ఇరానీ తండ్రి అజయ్‌ కుమార్‌ మల్హోత్ర, పంజాబీ. తల్లి శివానీ బాగ్చి, బెంగాలీ. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. వారిలో పెద్దమ్మాయే స్మృతి. ఆమె తాత రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌లో సభ్యులుగా ఉండేవారు. దీంతో స్మృ కూడా ఆర్‌ఎస్‌ఎస్‌లో భాగమయ్యారు. స్మృతి తల్లి జనసంఘ్‌ నేత. అలా చిన్నప్పటి నుంచి రాజకీయాలపై ఆమెకు కొంత అవగాహన ఉండేది. ఢిల్లీలోని హోలి చైల్డ్‌ ఆక్సిలియం పాఠశాలలో స్మృతి పన్నెండో తరగతిని పూర్తిచేశారు.

1998 సంవత్సరంలో జరిగిన మిస్‌ ఇండియా పోటీల్లో స్మృతి పాల్గొన్నారు. టాప్‌-9లో నిలిచారు. ఆ తరువాత కొన్ని వాణిజ్య ప్రకటనల్లో నటించారు. 2000లో ఆతిశ్‌- హం హై కల్‌ ఆజ్‌ ఔర్‌ కల్‌ అనే సీరియల్‌ ద్వారా బుల్లితెరకు పరిచయమయ్యారు. డీడీ మెట్రో ఛానల్లో కవిత అనే సీరియల్లో కూడా నటించారు. స్టార్‌ ప్లస్‌లో ఎంతో ప్రాముఖ్యం పొందిన క్యూ కీ సాస్‌ బీ కబీ బహూ తీ సీరియల్లో నటించి భారత టీవీ సీరియల్‌ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఐదుసార్లు ఉత్తమ నటిగా ఇండియన్‌ టెలివిజన్‌ అకాడమీ అవార్డును అందుకున్నారు. అంతేకాకుండా జీ టీవీలో తీసిన రామాయణ్‌ సీరియల్లో సీతగా కూడా నటించారు. ఆ తరువాత సోనీ టీవీ, 9ఎక్స్‌ వంటి ఛానళ్లలో నటించారు. 9ఎక్స్‌లో ఏ హై జల్వా వంటి రియాల్టీ డ్యాన్స్‌ కార్యక్రమానికి ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అమ్రిత అనే బెంగాలీ సినిమాలో నటించారు. ఇలా మోడలింగ్‌, సీరియళ్ల ద్వారానే కాకుండా నిర్మాతగా కూడా ఆమె చిత్ర పరిశ్రమలో ఎంతో మందికి సుపరిచితం.

2003లో స్మృతి ఇరానీ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2004లో మహారాష్ట్ర బిజెపి యువజన విభాగం ఉపాధ్యక్షులయ్యారు. 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలోని చాందినీ చౌక్‌ నుంచి కాంగ్రెస్‌ నాయకుడు కపిల్‌ సిబాల్‌పై తొలిసారి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం బిజెపి కేంద్ర కమిటీ సభ్యురాలిగా సేవలందించారు. మే, 2009లో బిజెపి నేత విజయ్‌ గోయల్‌కు మద్ధతుగా ఆమె ప్రచారం చేశారు. మహిళా భద్రత గురించి తన గొంతును వినిపించారు. అత్యాచారాలకు పాల్పడే వారికి ఉరిశిక్ష విధించాలని నినదించారు. 2010లో ఈమె బిజెపి జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు. భారతీయ జనతా పార్టీ మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. అగస్టు, 2011లో గుజరాత్‌ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు.

2014లో అమేథీ నుంచి సోనియా గాంధీ కుమారుడు రాహుల్‌ గాంధీపై ఆమె పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆ ఎన్నికల్లో బిజెపి భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం స్మృతికి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిగా కేబినేట్‌లో చోటు కల్పించారు. ఆమె తన బాధ్యతల్ని సమర్థమంతంగా నిర్వహించారు. ఆ తర్వాత జరిగిన కేబినేట్‌ విస్తరణలో టెక్స్‌టైల్స్‌ మంత్రిత్వ శాఖకు మార్చారు. అంతేకాకుండా కేంద్ర సమాచార, ప్రసార శాఖల అదనపు బాధ్యతల్ని కూడా మోదీ ఆమెకు అప్పగించారు.

స్మృతి ఇరానీ రాజకీయ జీవితంలో అసలైన మలుపు 2019లో వచ్చిందని చెప్పుకోవాలి. అప్పటికే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ కూటమి కడుతున్నాయి. ఫ్రంట్‌ల పేరుతో రాజకీయాలు చేస్తున్నాయి. కుల, మత సమీకరణాలతో పోటిలోకి దిగాయి. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత రాజకీయ వైరం ఉన్న పార్టీలు కూడా, సోదరభావం నటిస్తూ ఎన్నికల్లో గెలవాలని యత్నించాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌ వాది పార్టీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీలు కాంగ్రెస్‌తో రహస్య ఒప్పందం మీద ఒక్కటయ్యాయి. అలాంటి సందర్భంలో కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్‌ గాంధీపై అమేథీ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ స్మృతి ఇరానీని రెండోసారి బరిలో నిలిపింది. ఆమె గట్టి పోటీని ఇస్తారన్న సమాచారంతో రాహుల్‌ కేరళలోని వయనాడ్‌ నుంచి కూడా పోటీ చేశారు. అలా హోరాహోరీగా జరిగిన ఆ పోటీలో స్మృతి.. రాహుల్‌ గాంధీపై భారీ మెజార్టీతో గెలుపొంది దేశవ్యాప్త సంచలనం సృష్టించారు. మే 23న విడుదలైన ఫలితాలలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 2.0 సర్కార్‌లో కేంద్ర మంత్రి మండలిలో మళ్లీ చోటు దక్కించుకున్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇలా ఎన్నో ఒడిదుడుకుల మధ్య స్మృతి ఇరానీ తన రాజకీయ జీవితాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు.

నటనలోనూ, రాజకీయంలోనూ తన సామర్థ్యం నిరూపించుకున్న స్మృతి వాక్చాతుర్యంలోనూ దిట్టే. 16వ లోక్‌సభలో సమాచార ప్రసార శాఖమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి పార్లమెంట్‌లో ఆమె కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఆ పార్టీ ప్రచార విభాగం సభ్యుడు, అడ్వొకేట్‌ అయిన కపిల్‌ సిబాల్‌పై తనదైన శైలిలో విమర్శల వర్షం కురిపించారు. ఒక్కసారిగా దేశవ్యాప్తంగా అన్ని పత్రికలలోనూ పతాక శీర్షికలలో నిలిచారు. అంతేగాక అమేథీలో తన తరపున తానే ప్రచారం నిర్వహించుకున్నారు. అనర్గళ వాక్చాతు ర్యంతో ఓటర్లను తనవైపు ఆకర్షించడంలో విజయం సాధించారు. కాంగ్రెస్‌ ప్రయోగించిన అస్త్రం ప్రియాంకగాంధీ సైతం స్మృతి ముందు తేలి పోయారు. ముఖంలో ఎప్పటికీ చెరగని చిరునవ్వు స్మృతికి మరో అలంకారం. రాహుల్‌పై విజయంతో స్మృతి అమేథీ ప్రజలతోపాటు మొత్తం భారత ప్రజల హృదయాలలో ప్రత్యేక స్థానం సంపాదించారు.

– సంతోషలక్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *