ఆర్థిక స్వాతంత్య్రమే సాధికారతకు తొలి అడుగు

ఆర్థిక స్వాతంత్య్రమే సాధికారతకు తొలి అడుగు

మహిళకు ఆర్థిక స్వాతంత్య్రం వస్తేనే సాధికారత సాధ్యమవుతుందని అంటున్నారు పల్లవి ఆకురాతి (ఐఎఎస్‌). మహిళలకు చదువుకునే అవకాశం వచ్చింది. కానీ నేడున్న సామాజిక వాతావరణం ఆ అవకాశం దక్కకుండా అడ్డుపడుతోందని పల్లవి భావన. యాభయ్‌ శాతం రిజర్వేషన్లు మహిళల అన్ని సామాజిక, వ్యక్తిగత సమస్యలకు పరిష్కారమని పల్లవి అంటున్నారు. పల్లవి పదహారణాలా తెలుగు మహిళ. తెలుగు మీడియంలో చదివి ఐఎఎస్‌ అయ్యారు. కర్ణాటక కేడర్‌కు చెందిన పల్లవి ప్రజల అధికారిగా పేరు పొందారు. ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన పల్లవి కర్తవ్య నిర్వహణలో కరుకుగా ఉంటారు. బాధితుల పట్ల కరుణతో వ్యవహరిస్తారని ఖ్యాతి ఉంది. ఆమె ప్రాపంచిక దృక్పథం విశాలమైనది. 2009 బ్యాచ్‌కు చెందిన పల్లవి వ్యవస్థలోని చెడు మీద నిర్భయంగా పోరాడుతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా పల్లవితో జాగృతి ముఖాముఖీ.

భారతీయ సమాజంలో స్త్రీలు, పురుషులు అనే అంశం వచ్చే సరికి రెండు వైరుధ్యాలు కనిపిస్తాయి. మన సమాజం తాత్వికంగా మహిళను సమున్నత స్థానంలో నిలబెట్టుకున్నదన్న విషయం కాదనలేం. అలాగే మనది పురుషాధిక్య సమాజం కాదని కూడా చెప్పలేం. ఈ నేపథ్యంలో గొప్ప మార్పునకు కారణమయ్యే మహిళా సాధికారత అనే ఒక అంశాన్ని ఇక్కడ ఎలా ప్రవేశపెట్టగలం?

ఒక్క భారతీయ సమాజమే కాదు, ప్రపంచం మొత్తం పురుషాధిక్యతే కనిపిస్తుంది. ఇదొక వాస్తవం. కానీ మహిళా సాధికారత సాధనలో ఒక అనివార్యత ఉంది. దీనిని క్రమంగానే కావచ్చు, వ్యవస్థ గుర్తిస్తున్నది. ఒక మహిళ సాధికారికం కావాలంటే మొదట జరగవలసింది ఆమె గురించిన నిర్ణయాలు ఆమె తీసుకోవాలి. తన పిల్లలు, తన కుటుంబం విషయంలో తన ఇచ్ఛ ఏమిటో వెల్లడించగలగాలి. అందుకు అన్ని అవకాశాలు ఆమెకు కల్పించాలి. విద్యావకాశాలు ఇచ్చి ఆమె ప్రతిభకు గుర్తింపు ఇవ్వాలి. ఇది ఆర్థికంగా స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఉన్నప్పుడే సాధ్యం. సాధికారతకు ఇదే తొలిమెట్టు. మొత్తంగా మహిళ సామర్థ్యాన్ని గౌరవించాలి. సాధికారత అన్న మన భావన ఆచరణలో కనిపించా లంటే ఆమె తన కాళ్ల మీద తను నిలబడాలి. ఇదే కదా, మహిళా సాధికారత లక్ష్యం! ఏ దేశంలో అయినా సగం మహిళా జనాభా ఉంటుంది. కానీ అవకాశాలలో సమానావకాశాలు ఉండవు. వారి శ్రమకు గుర్తింపు ఉండదు. వారి కష్టం ద్వారా కుటుంబానికి దక్కుతున్న లబ్ధిని ఆర్థిక కోణం నుంచి అంచనా వేసే పద్ధతి లేదు. దేశానికి సంబంధించిన కీలక నిర్ణయాలలో వారి ప్రమేయమే లేదాయె! జనాభాలో సగం ఉన్న మహిళల ప్రతిభ కూడా వెలుగులోకి రావడాన్ని స్వాగతించాలి. సామాజిక న్యాయానికీ, ప్రజాస్వామ్యానికీ అప్పుడే కదా పరమార్థం!

మహిళా సాధికారత అనే అంశాన్ని భారతీయ సమాజం ఎప్పటి నుంచి గట్టిగా పట్టించుకుంటోంది?

నా అభిప్రాయమైతే 1980 దశకం. ఫెమినిస్ట్‌ దక్పథంతో, అంటే స్త్రీవాదంతో ఆ సమయంలో విశేషంగా సాహిత్యం వెలువడింది. కవిత్వం, కథలు, నవలలు వెలువడినాయి. పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇది మహిళా సాధికారత ఆవశ్యకతను గుర్తించే అవసరాన్ని వేగవంతం చేసింది. కానీ స్త్రీవాద దక్పథానికీ, ఈ సాధికారతకీ చాలా వైరుధ్యం ఉంది. నాటి స్త్రీవాదం కుటుంబ వ్యవస్థకు దాదాపు వ్యతిరేకం. స్త్రీ వ్యక్తిగత స్వేచ్ఛను అది ప్రధానంగా స్వీకరించింది. స్త్రీల హక్కులు గురించి ఎవరు నోరు విప్పినా వెంటనే స్త్రీవాది లేదా ఫెమినిస్ట్‌ అని ముద్ర వేసేసేవారు కూడా. అంత కుదుపు తెచ్చింది. కానీ సాధికారతలో వ్యక్తినీ, కుటుంబాన్నీ వేర్వేరుగా చూడలేం. వ్యక్తి అభివద్ధితో పాటు కుటుంబ పురోగతి కూడా అందులో ఇమిడి ఉంది. ఈ రెండింటి మధ్య బంధాన్ని సాధికారత విస్మరించడం లేదు. ఇలాంటి స్పష్టత 1990 దశకంలో గాని రాలేదు. ఫెమినిజం వ్యక్తి ఆధారితం. సాధికారత పూర్తిగా సామాజికం.

భారత్‌ అనేది వైవిధ్యంతో కూడిన వ్యవస్థ. అనేక జీవన విధానాలు, సంస్క తులు ఉన్నాయి. ఒక్కొక్క జీవన విధానం మహిళను ఒక్కొక్క రీతిలో చూస్తుంది. దాని నేపథ్యాన్ని బట్టి ఇంటా బయటా స్త్రీల స్థానం ఎక్కడో నిర్ణయమవుతుంది. కాబట్టి మహిళా సాధికారతకీ, ఈ జీవన వైవిధ్యానికీ ఘర్షణ తలెత్తుతుందా?

దానిని నేను ఘర్షణ అనుకోను. భారతదేశంలోనే చూడండి ! మత పరంగానే కాదు, కొన్ని ప్రాంతా లలో, కొన్ని సమాజాలలోను కూడా మహిళ వేర్వేరు స్థానాలలో కనిపిస్తుంది. కేరళ, మేఘాలయలలో మాత స్వామిక వ్యవస్థ ఉంది. ఇంటిపేరు తల్లి నుంచి వస్తుందక్కడ. భార్య ఇంటిపేరు భర్తకీ, పిల్లలకీ వస్తుంది. వారసత్వం తల్లి వైపు నుంచి వస్తుంది. ఇది నా అనుభవం మేరకు చెబుతున్నాను. అక్కడ మహిళకు సామాజికంగా ఉన్నత స్థానమే దక్కు తోంది. కొన్ని తెగల వనవాసులలోను మాతస్వామిక వ్యవస్థ ఉంది. మతపరంగా కొన్ని సమాజాలు మహిళకు సమున్నత స్థానమే కల్పించాయి. ఉదాహరణకి హిందూమతం. మహిళను దేవత స్థానంలో నిలబెట్టుకుంది. కానీ వాస్తవికంగా చూస్తే అక్కడ మహిళలు ఇంటా బయటా కూడా ద్వితీయ శ్రేణితోనే సరిపెట్టుకుని ఉంటున్నారు. ఆమెకు పురుషులతో సమ స్థానం కల్పించాలి. ఈ మార్పు ఆర్థిక స్వాతంత్య్రంతో సాధ్యం కాగలదని నా విశ్వాసం. నిజానికి ఎక్కువ మతాలు మహిళను గౌరవించమనే చెబుతున్నాయి. కానీ వాస్తవం వేరు. ఆచరణ వేరు. చాలామంది గుళ్లోకి వెళతారు. ఇంటికొచ్చి ఇల్లాళ్ల మీదనో, లేదా తన మీద ఆధారపడిన ఇతర మహిళల మీదనో దాష్టీకం చేయడానికి వెనుకాడరు. మహిళలు ఇలాంటి నిస్సహా స్థితిలో పడిపోవడానికి కారణం వారికి కొన్ని అంశాలలో నిర్ణయాలు చేసే అధికారం లేదు. స్వయంగా నిర్ణయాలు తీసుకోవాలన్నా మళ్లీ ఆర్థిక స్వాతంత్య్రమే శరణ్యం. అందుకే నేను ఆర్థిక స్వాతంత్య్రాన్ని ఇంత గాఢంగా నమ్ముతున్నాను. మరొక వాస్తవం గమనిద్దాం! చదువు ఉంటుంది. దానితో వచ్చిన మంచి ఉద్యోగం ఉంటుంది. ఆ ఉద్యోగంతో ఆర్థిక స్వావలంబన కూడా వస్తుంది. ఆమె సంపాదనతోనే కుటుంబం గడుస్తూ ఉంటుంది. కానీ ఇంట్లో మొగుడి చేత తన్నులు తినే మహిళలు ఉన్నారు. ఇక్కడ సమస్య, రక్షణ లేకపోవడం కూడా.

మహిళా సాధికారత అనేది మహిళ స్థాయిని బట్టి ఉంటుందా?! చదువు, ఉద్యోగం కలిగిన మహిళకీ, వాటికి ఇప్పటికీ దూరంగా ఉండిపోయిన మహిళకీ …స్పష్టంగా చెప్పాలంటే గ్రామీణ మహిళకి మహిళా సాధికారత అనే అంశం ఒకే విధంగా ఎలా వర్తింప చేయగలం? ఎలా వర్తిస్తుంది ?

ఇది చాలామందికి వస్తున్న ప్రశ్న. నేను ఎప్పుడూ ఆలోచించే అంశం ఇదే. అలాగే సాధికారత అనే అంశం మీద చాలామందికి ఇప్పటికీ స్పష్టత లేదేమోనని అనిపించే విషయం కూడా ఈ ప్రశ్నలోనే ఉంది. ఈ గజిబిజి నా సాటి ఐఏఎస్‌లలో కూడా చూశాను. సాధికారత గురించి నేను ఎక్కడ మాట్లాడినా ఒక ప్రశ్న, ముఖ్యంగా పురుషుల నుంచి- ఎదురయ్యేది. పట్టణ మహిళలు లేదా చదువుకున్న మహిళలకి రిజర్వేషన్లు ఎందుకు? మీరు ఇంత పురోభివద్ధి సాధించారు కదా! కానీ, సాధికారత అనేది ఆచరణలో కనిపించాలంటే రిజర్వేషన్లతోనే సాధ్యమవుతుంది. అదెలాగో చెబుతాను. రిజర్వేషన్లకి ప్రాతిపదిక వివక్ష, డిజడ్వాంటేజ్‌. లా కమిషన్‌ చర్చించి రిజర్వేషన్‌కు ప్రాతిపదికగా నిర్ధారించిన అంశాలు ఇవి. చదువుకున్న మహిళలు అన్ని రంగాలలోను ముందు ఉంటే ఆడ శిశువులను పిండదశలోనే వదిలించుకోవాలన్న ఆలోచన ఎందుకు వస్తోంది ! ఇన్ని భ్రూణహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? అంటే ఆడశిశువుల పట్ల వివక్ష వాస్తవమే కదా! ఇక డిజడ్వాంటేజ్‌. ఒక బాలికను తీసుకోండి. ఒక అబ్బాయిని తీసుకోండి. చదువులోనే ఈ ఇద్దరి పట్ల వేర్వేరు దక్పథాలు ఉంటాయి. బాలిక రాత్రి ఏడు దాటాక కూడా ఇంటికి రాకుంటే తల్లిదండ్రులలో హైరానా మొదలవుతుంది. అందుకే ఏడు గంటలకు ముందే చదువు, ఆటలు, ఇష్టాలు అన్నీ పూర్తి చేసుకుని ఇంటికి చేరాలి. ఇది సాధ్యం కాకపోతే అసలు చదువుకే స్వస్తి చెప్పవలసిన పరిస్థితి. అదే మగ పిల్లవాడికి అలాంటి ఆంక్షలు ఉండవు. ఎంత రాత్రయినా చదువు కోసం బయట ఉండవచ్చు. స్థానికంగా ఉన్న సౌకర్యం మేరకు చదువు పూర్తయిన తరువాత ఉద్యోగానికో, పై చదువుకో హైదరాబాద్‌, బెంగళూరు వంటి పట్టణాలకు వచ్చే అవకాశం అందరు యువతులకు ఉందా? ప్రతిభను బట్టి వస్తున్న ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకునే వెసులుబాటు ఉందా?

ఈ పరిస్థితిని అధిగమించడం ఎలా?

ఈ పరిస్థితిని అధిగమించాలంటే మహిళలకు యాభయ్‌ శాతం రిజర్వేషన్‌ కల్పించాలి. పంచాయతీలలో ఈ రిజర్వేషన్‌ ఇప్పటికే ఉంది. ఇది మార్పు తేగలదు. దేశంలోని మహిళలందరూ అటు పట్టణ నగర, ఇటు పల్లె ప్రాంత మహిళలు ఒకే తీరున సాధికారతకు చేరువ కావాలంటే రిజర్వేషన్లు తప్పదు.

మహిళలు ఉన్నత స్థానాలకు ఎంపికైనప్పటికీ వాస్తవికంగా రాజ్యం చేస్తున్నవారు ఇతరులన్న ఆరోపణల మాటేమిటి?

శతాబ్దాలుగా వంటింటికి పరిమితమైన మహిళకు ఒక్కసారిగా అవకాశం ఇస్తే కొన్ని బాలా రిష్టాలు తప్పవు. వీటినే చూసి ఏదో దురభిప్రాయానికి వచ్చేయ కూడదు. ఈ సంధికాలం ప్రాతిపదికగా రిజర్వేషన్లు వ్యర్థం అన్న నిర్ధారణకు రావడం సరికాదు. ప్రయత్నం ఎక్కడో ఒకచోట ఆరంభం కావాలి. పంచాయతీలలో యాభయ్‌ శాతం రిజర్వేషన్‌ కల్పించిన తరువాత, కొంత ఆలస్యం అయినప్పటికీ ఇప్పుడు పరిస్థితి మారింది. 70 శాతం నిర్ణయాలు ఇప్పుడు ప్రతినిధులుగా ఎన్నికైన మహిళలే తీసుకుంటున్నారు. బాగా చదువుకున్న మహిళలు సర్పంచులుగా ఎన్నికైతే వారు సొంతంగా ఆలోచిస్తు న్నారు. కాబట్టి గ్రామీణ మహిళకు రిజర్వేషన్‌ ఒక వరం. అక్కడ మహిళా సాధికారతకి రిజర్వేషన్లే మార్గం. శక్తిమంతమైన ఆయుధం. పల్లె కుటుంబా లలో ఇంకొక విషయం గుర్తించవచ్చు. అక్కడి కుటుంబం నుంచి ఒక బాలిక పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ స్థాయికి చేరితే ఆమె కుటుంబంలో, అసలు ఆ గ్రామంలో ఆమె విలువ వేరుగా ఉంటుంది. తన కుటుంబాన్ని మార్చుకోవడంతో పాటు, గ్రామం మొత్తం మీద మార్పును తీసుకురాగలగుతుంది. ఎందుకంటే చదువుకున్న మహిళగా ఆమెను కుటుంబ సభ్యులే కాకుండా, బయటివారు కూడా గౌరవిస్తారు. అందుకే విద్యారంగంలో, రాజకీయ రంగంలో వారికి యాభయ్‌ శాతం రిజర్వేషన్‌ అనివార్యం.

మహిళా సాధికారత సాధించే పనిని మన ప్రభుత్వాలు ఎలా అమలు చేస్తున్నాయి? చట్టసభలలో 33 శాతం రిజర్వేషన్‌ కథ ఎప్పుడు కొలిక్కి వస్తుంది?

మహిళా సాధికారత అమలు, పథకాల ప్రారంభం, ఆచరణ అనేవి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా మొదలయ్యాయి.. ఇక 33 శాతం మహిళా రిజర్వేషన్‌ గురించి ఏం జరుగుతోందో మీకు తెలుసు. ఆ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. ఇంకా కొన్ని ఆటంకాలను కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఎలా ఉన్నా అలాంటి బిల్లు మాత్రం ఈ దేశానికి గొప్ప అవసరమనే నా ప్రగాఢ విశ్వాసం.

పని ఒకటే అయినా వేతనం విషయంలో కొన్ని సంస్థలలో స్త్రీపురుష ఉద్యోగుల మధ్య వివక్ష గురించిన ఆరోపణలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. మన దేశంలో ఎలా ఉంది?

ప్రైవేటు సంస్థలలో అలాంటి వివక్షకు అవకాశం ఉండవచ్చు. కానీ మన దేశంలో ప్రభుత్వోద్యోగాలలో ఇలాంటి వివక్షకు తావే లేదు. ఎందుకంటే ఆర్టికల్‌ 14 అలాంటి వివక్షను నేరంగా పరిగణిస్తుంది.

మహిళా సాధికారత సాధనలో మనం సాధించిన ఫలితాలు ఎలా ఉన్నాయి?

ఆశించిన మేరకు లేవనే చెప్పాలి. అంటే దీనర్థం పరిస్థితి మరీ అధ్వానంగా ఉన్నదని కాదు. పరిస్థితులు మెరుగుపడుతున్నాయనే చెబుతాను. కానీ మహిళా సాధికారత సాధన ప్రయత్నం జరగవలసినంత వేగంగా జరగడం లేదు.

ఎన్ని వ్యవస్థలు ఎన్ని ఆటంకాలు కలిగించినా మార్పు తప్పదు. అలాంటి మార్పే మన దేశంలోను కనిపిస్తోంది. ఇంతవరకు అసాధ్యం అనుకున్న నైపుణ్యాలకు కూడా మహిళలు చేరువవుతున్నారు. కానీ అదే సమయంలో అత్యాచారాలు పెరగడం, భ్రూణహత్యలు చోటు చేసుకోవడం… ఈ వైరుధ్యం ఏమిటి? ఎందుకు?

అదే సాధికారత పక్కన కనిపిస్తున్న పెద్ద విషాదం. సాధికారతను సాధ్యం చేసుకుంటున్నాం. సమాంతరంగా మహిళల మీద నేరాలు పెరుగు తున్నాయి. అది కూడా పిండదశ నుంచే. గర్భంలో ఉన్నది ఆడ శిశువైతే ఆలోచన మారుతోంది. ఒకప్పుడు పెళ్లి చేయలేక బాధ. ఇప్పుడు సామాజిక వ్యవస్థలోని విపరీత, విష సంస్కతితో భయం. ఇంతగా అభివద్ధి చెందాం. కానీ దేశంలో చైల్డ్‌ సెక్స్‌ రేషియోలో ఎంతో వైరుధ్యం వచ్చింది. ఇది అవాంఛ నీయం. 2001-2011 మధ్య ఈ తేడా మరీ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సగటున దేశంలో ప్రతి వేయి మంది మగశశువులతో పోల్చి చూస్తే ఆడ శిశువులు 2001లో 927 మంది ఉంటే, 2011లో ఇది 919కి పడిపోయింది. సాధికారత సాధన ముందడుగు వేస్తోంది. కానీ అది వేరే కోణాలని కూడా ఆవిష్కరించుకుంటూ వెళుతోంది. పైగా అదో ప్రమాదకర కోణమని అర్థం చేసుకోవాలి. ఆర్థికంగా ఎంతో ముందంజలో ఉన్న రాష్ట్రాలలో ఆ రేషియో పడిపోవడం అలాంటి ప్రమాదకర కోణమే! అంటే సాధికారిత సామాజికంగా ప్రతిబింబించినంతగా, ఆర్థిక కోణంలో ప్రతిబింబించడం లేదు. దీనికి కారణం భద్రత లేకపోవడం. ఈ పరిణామం సమాజం మీద దారుణమైన రీతిలో ప్రతిబింబిస్తోంది. అసలు ఆడపిల్లలు వద్దు అనే విధమైన ఆలోచనకు వచ్చేటట్టు చేస్తోంది. ఆడదానిగా ఈ వ్యవస్థతో నేను పాట్లు పడ్డాను. మళ్లీ నేనొక కూతుర్ని కని, ఆమెకు కూడా ఇలాంటి పాట్లు వారసత్వంగా ఇవ్వాలా అన్న విషాదకర నిర్ణయానికి ఆడదే వచ్చేటట్టు చేస్తోంది ఇవాళ ఉన్న వాతావరణం. గడపదాటి బయటకు వచ్చే అవకాశాలు వచ్చాయి, నిజమే. కానీ గడప దాటిన ఆడపిల్ల ఇంటికి వచ్చేదాకా బెంగే. దీనిని అరికట్టాలి. ఇలాంటి నేరాలకు పాల్పడేవారికి త్వరితగతిన శిక్షలు పడాలి. అవి తీవ్రంగా ఉండాలి. దీనితో పాటు ప్రభుత్వం రిజర్వేషన్లను పటిష్టంగా అమలు చేయడంతో పాటు, భద్రత విషయంలో కఠినంగా వ్యవహరించాలి.

చరిత్రాత్మక మార్పునకు నాంది అని చెప్పదగిన మహిళా సాధికారత విషయాన్ని మీడియా ఏ విధంగా చూస్తోంది?

కొన్ని యుగాలుగా మహిళ అణగారిపోయి ఉంది. ఇప్పుడు పురోభివద్ధి సాధించుకునే అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు మహిళలు. మహిళా సాధికారతను సామాజిక వ్యవస్థలు అర్థం చేసుకుంటున్నాయి. ఈ దశలో మీడియా మాత్రం ఉండవలసినంత బాధ్యతగా ఉండడం లేదనే నా అభిప్రాయం. కొన్ని చానళ్ల ధోరణి చూస్తే బాధ కలుగు తోంది. మహిళల పట్ల మరింత నీచంగా వ్యవహ రించమని చెప్పినట్టు ఉంటున్నది వాటి ప్రసారాల శైలి. మహిళ మీద అత్యాచారం జరిగితే ఆ విషయాన్ని వర్ణించడానికి ఎంతో సమయం కేటాయిస్తారు. కానీ అత్యాచారం దోషులకు శిక్షలు పడితే వాటి ఊసే మీడియాకు పట్టడం లేదు. ఈ శిక్షల గురించి కూడా విస్తారంగా ప్రచారం చేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *