నానమ్మ చెప్పిన కథ

నానమ్మ చెప్పిన కథ

ప్రదీప్‌ స్కూల్‌కు వెళ్ళనని పేచీ పెట్టసాగాడు. ఆ విషయాన్ని గమనించిన అతని నానమ్మ మనవడిని స్కూల్లో దిగపెట్టడానికి సిద్ధపడింది. అయినా, ప్రదీప్‌ పేచీ తగ్గలేదు. అప్పుడు నాన్నమ్మ ప్రదీప్‌తో ఇలా చెప్పింది. ‘నేను స్కూల్‌కు ఎలా వెళ్ళేదాన్నో చెప్తే, నువ్విలా స్కూలుకు వెళ్ళనని అస్సలు పేచీ పెట్టవు’.

‘నువ్వూ చిన్నప్పుడు నా లాగే స్కూలుకు వెళ్ళేదానివా నానమ్మా’ అని అడిగాడు ప్రదీప్‌.

‘అందులో ఆశ్చర్యమేముంది రానాన్నా? చిన్నప్పుడు ప్రతివాళ్ళు బడికి వెళ్ళాల్సిందేగా… ఈ స్కూలు లాగా మా పాఠశాల దగ్గర ఉండేది కాదు. ఒక్కదాన్నే నడిచి వెళ్ళేదాన్ని. నువ్వు స్కూలుకు పద, నేను బడికి వెళ్తూ విషయాలన్ని నీకు చెప్తాను, విందువు గానీ..’ అన్నది ప్రదీప్‌ నానమ్మ.

నానమ్మ చెప్పేది వినాలన్న ఉత్సాహంతో పాఠశాలకు బయల్దేరాడు ప్రదీప్‌. వాళ్ళిద్దరూ రెండడుగులు వేయగానే ‘చెప్పు నానమ్మా, నువ్వు స్కూలుకు ఎలా వెళ్ళేదానివో…’ ఆసక్తిగా అడిగాడు.

‘నేను నీ వయసులో ఉన్నప్పుడు నాకు బడికి చేరటానికి రెండు గంటల సమయం పట్టేది తెలుసా?’ అన్నది నానమ్మ.

‘అంత దూరమా మీ స్కూలు?’

‘చెప్పేది సాంతం విను మరి’ అంటూ మనమడిని ముందుకు నడిపిస్తూ మాట్లాడసాగింది నానమ్మ.

‘బడికి వెళ్ళాలంటే ఈత డ్రెస్సు, ఒక టార్చిలైటు, ఒక కర్రతో పాటు చదువుకునే పుస్తకాలతో బయల్దేరాలి’

‘ఇన్ని వస్తువులా? ఇవన్నీ ఎందుకు నానమ్మా?’ ఆశ్చర్యంగా అడిగాడు ప్రదీప్‌.

‘అన్ని వస్తువులు ఎందుకు కావాలో చెప్తున్నా నుగా…’ అంటూ ‘బడికి వెళ్ళాలంటే ముందుగా నేనొక పొలంలోంచి వెళ్ళాల్సి వచ్చేది. ఆ పొలంలో ఒక బలిసిన ఎద్దు ఉండేది. అది నన్ను చూసి పొడవటానికి వచ్చేది. దాన్ని కర్రతో అదిరిస్తూ అతివేగంగా పరుగులు తీస్తూ, ఆయాసం వస్తున్నా ఆగిపోకుండా, తిరిగి ఒక చిన్న కొండ మీదకు ఎక్కి, అవతల వైపుకు దిగాల్సి వచ్చేది. అవస్థ పడుతూ అవతల వైపుకు చేరుకుని కొంతదూరం నడిచిన తర్వాత, గుబురుగా ఉన్న పొదలు, పెద్దపెద్ద వృక్షాల మధ్య నుంచి నడవాల్సి వచ్చేది. ఆ ప్రదేశం చీకటిగా ఉండటం వల్ల, టార్చిలైటు వెలుగులో నడిచేదాన్ని’

‘నానమ్మా, మీ చిన్నప్పుడు స్కూలుకు వెళ్ళడానికి ఇంత కష్టపడేవారా? మరి అలాంటప్పుడు స్కూలు మానెయ్యాలని ఎప్పుడూ అనుకోలేదా? వెళ్ళనని పేచీ పెట్టేవారు కాదా? పేచీ పెట్టినా మీ అమ్మా, నాన్న బలవంతంగా స్కూలుకు పంపించేవారా నానామ్మా?’ జాలిగా అడిగాడు ప్రదీప్‌.

‘అంత కష్టపడి బడికి ఎందుకు వెళ్ళేదాన్నంటే, చదువంటే అంత ఇష్టం నాకు. బడికి వెళ్తే చక్కగా చదువుకోవచ్చు. ఆటలు ఆడుకోవచ్చు, స్నేహితు రాళ్ళతో కబుర్లు చెప్పుకోవచ్చు’ అన్నది ప్రదీప్‌ నానమ్మ.

‘చదువు పట్ల ఇష్టాన్ని పెంచుకుని, నానమ్మ ఎంతో అవస్థలు పదుతూ, స్కూలుకు వెళ్ళడం అంత అవసరమా అనిపించింది’ ప్రదీప్‌కు తనయితే, ఏ కష్టం లేకుండా ప్రతిరోజూ ఆటోలో స్కూలుకు వెళ్తున్నాడు. అయినా కూడా ఏదో ఒక నెపంతో స్కూలుకు వెళ్ళకుండా మారాం చేస్తున్నాడు. ఈ రోజు ఆటో రాలేదు, ఆ వంకతో స్కూలు ఎగ్గొడుదామను కున్నాడు. ఎంతో పెద్దదయిన నానమ్మ, తనకు ఎన్నెన్నో కబుర్లు చెప్తూ, తనకు తోడొచ్చి స్కూల్లోదింపుతానంది.

‘తన నానమ్మకు చదువుకోవాలంటే ఇన్ని కష్టాలా?’ ప్రదీప్‌ ఆలోచిస్తూ నడుస్తూంటే, నానమ్మ మాటలు తిరిగి వినిపించాయి.

‘ప్రదీప్‌, ఆ చెట్ల గుబుర్ల మధ్య’ ఓ మంత్రకత్తె ఉండేది. ఎంతో జాగ్రత్తగా ఆమె కంటపడకుండా తప్పించుకోవలసి వచ్చేది. ఆమె చెప్పినట్లు వినక పోయినా, ఆమెకు కోపం తెప్పించినా, వాళ్ళను కస్పగానో, పిల్లిగానో, కుక్కగానో మార్చేసేది”

‘అమ్మ బాబోయ్‌’ గుండె మీద చేయి పెట్టుకుని భయం భయంగా అనుకున్నాడు ప్రదీప్‌.

‘వృక్షాలన్ని దాటుకుని ముందుకు వెళ్తే ఒక పెద్ద చెరువు ఉండేది. చెరువుకు అవతల వైపున మా పాఠశాల ఉండేది. ఒక్కొక్కసారి చెరువులో ఆవతల ఒడ్డుకు చేర్చే నావలు ఉండేవి కావు. అప్పుడు ఈత డ్రస్టు వేసుకుని, చెరువులో ఈదుకుంటూ వెళ్ళవలసి వచ్చేది. ఒకరోజు అలాగే వెళ్తూంటే, ఒక మొసలి ముందుకు రావటం కనిపించింది. వడివడిగా ఈదుకుంటూ అవతల ఒడ్డుకు చేరుకున్నాను’ అని చెప్పిందావిడ.

‘అదేమిటి నానమ్మా, మొసలి సముద్రంలో ఉంటుంది. చెరువులో నీకు కనిపించటమేమిటి?’ నానమ్మ మాటలు నమ్మలేనట్లుగా అడిగాడు ప్రదీప్‌.

‘మా చిన్నతనంలో చెరువులో చేపలతో పాటు, చిన్న ఆకారంలో మొసళ్ళూ ఉండేవి. అవి ఎప్పుడో తప్ప కనిపించేవి కావు’ నమ్మకంగా చెప్పింది ప్రదీప్‌ నానమ్మ.

వారిద్దరూ ప్రదీప్‌ స్కూలు వద్దకు వచ్చేసారు. స్కూలు గంట గణగణ మ్రోగింది. స్కూల్లోకి వెళుతున్న ప్రదీప్‌తో వెనకనుంచి చెప్పింది నానమ్మ.

‘ప్రదీప్‌, సాయంత్రం బడి వదిలే సమయానికి మేమెవరమయినా వస్తాం. నువ్వు ఒంటరిగా రావద్దు’ అంది.

వెనక్కు తిరిగి చూసి సరేనన్నట్లుగా తలూపి పరుగులు తీసాడు. నానమ్మ చెప్పిన ఆవిడ స్కూలు కబుర్లన్నీ, తన ఫ్రెండ్స్‌కు చెప్పాలని, ఉషారుగా తన తరగతి వైపు పరుగులు తీసాడు. అంతేకాదు, తన నానమ్మ అంత కష్టపడుతూ కూడా స్కూలుకు వెళ్ళేది, చదువుకోసం. ఇంకెప్పుడూ తను స్కూలు మాననని కూడా శపథం చేసుకున్నాడు ప్రదీప్‌.

– కె.నిర్మల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *