భావ విహంగాలు, అక్షర తరంగాలు

భావ విహంగాలు, అక్షర తరంగాలు

‘మానవుడు తన జాతిని తానే నాశనం చేసుకొని ప్రపంచానికి శాంతిని ఇచ్చి వెళ్లాడు…’ మనిషి జాతి మొత్తం అంతరించిపోయిందన్న వార్త తెలిసిన తరువాత సృష్టిలోని మిగిలిన జీవకోటి అనుకున్న మాట ఇది. నిజానికి ఇదొక ఊహ. మనిషి తన అంతం గురించి ఇలాంటి ఊహకు పోలేడు కాబట్టి జంతువుల చేత రచయిత ఈ మాట పలికించడం ఔచిత్యమనిపిస్తుంది. భూగోళం మీద మిగిలిన ప్రాణికోటి పట్ల మనిషి ప్రవర్తన క్రూరమైనదే. ఆ విషయం మనిషికి తెలియాలి. జంతువులు చెప్పలేవు. అందుకే రచయిత ఆ పనికి పూనుకున్నాడు. శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం పుస్తకం ‘ఊహా విహంగాలు-సాహితీ తరంగాలు’లో ‘ఆఖరికి…’ అనే కథలోని వాక్యాలు పై రెండు (నీల్‌గ్రాంట్‌ అనే రచయిత రాసిన ఆంగ్ల నాటిక ‘ది లాస్ట్‌ వార్‌’ను కథగా మలిచానని రచయిత నిజాయితీగా ఒప్పుకున్నారు. కానీ ఆంగ్ల నాటకమైనా చక్కని తెలుగు నుడికారంతో మనకు అందించారు రచయిత). ఇందులో ‘భీమారావు-బ్రతుకు తెరువు’ కథ ముగింపు చదివి ఆనందించవలసిందే. అన్ని వృత్తులలోను, పనులలోను విఫలమైనవాడికి మిత్రడు చూపించిన బ్రతుకు తెరువు అది- లాస్ట్‌ రిసార్ట్‌. దొంగతనాలు, అక్రమ రవాణా వంటి పనులలో విఫలమైన వాడు కూడా ఆ వృత్తికి పనికి వస్తాడట.

ఈ పుస్తకం కథలూ, వ్యాసాల కల్హారం. పదహారు కథలు ఉన్నాయి. పద్దెనిమిది వ్యాసాలు ఉన్నాయి. వ్యాసాలలో సాహిత్య అంశాలతో ఉన్నవి, ఆధ్యాత్మిక, సామాజిక అంశాలతో ఉన్నవి కూడా పొందు పరిచారు.

సాధారణ సమస్యని కూడా నిర్లక్ష్యం చేసి, ప్రజలు పెద్ద ఉద్యమం గురించి ఆలోచించి, అటు వైపుగా అడుగులు వేసే వరకు మన ప్రభుత్వాలు కదలవు. దీనిని చక్కని వ్యంగంతో చెప్పారు రచయిత. ప్రజలకి అనునిత్యం అందుబాటులో ఉండవలసిన చెత్తకుండీ కేంద్ర బిందువుగా ఈ కథ సాగుతుంది. అలాగే తమకి పుస్తకాలతో ఉన్న పరిచయాన్ని ప్రదర్శించే దుర్గుణం గురించి ‘మేం మనుషులం’ కథలో కూడా బాగా చెప్పారు.

సాహిత్య వ్యాసాలు రాయడంలో పార్వతీశంగారి అభినివేశం ఈ పుస్తకంలో కనిపించింది. ‘కవిత్వంలో అనిర్వచనీయత’, ‘రమ్యత గురించి జాన్‌ కీట్సు- కాళిదాసు’; ‘బలిజేపల్లి కరుణ: చమత్కారాల కల్పవల్లి’ వంటి వ్యాసాలు చదివిన తరువాత చక్కని అనుభూతి మిగులుతుంది. ఇందులో ‘ముద్దు ముద్దు ‘మాతల’ బాలరాముడు’ అనే వ్యాసం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. శ్రీరాముడు భారతదేశంలో పుట్టిన మహోన్నత పురాణ పాత్ర. కొందరికి ఆయన సాక్షాత్తు భగవంతుడు. ఇంకొందరి దృష్టిలో మానవ లక్షణాలతో భువిలో జన్మించిన దేవుడు. దేవుడైన శ్రీరాముడిలోని సామాన్య మానవుడి లక్షణాన్ని అద్భుతంగా చిత్రించిన వారు విశ్వనాథవారు. ఆయన ‘రామాయణ కల్పవృక్షం’లో బాలరాముడు ముద్దు ముద్దుగా మాట్లాడతాడు. విశ్వనాథ వారి పాత్రచిత్రణలోని ఔచిత్యం ఎంత అద్భుతమో ఈ వ్యాసంలో వర్ణించారు పార్వతీశంగారు. దేవుడికైనా బాల్యం ఉంటుందని విశ్వనాథ ఈ మాటలతో చెప్పారు. తన పేరు ‘లాములు’ (రాముడు), నాన్న పేరు దాచాత మాలాలు (దశరథ మహారాజు), తల్లి పేరు అడిగితే ‘అమ్మగాలు’ అని చెప్పడం కవిసమ్రాట్‌ వాస్తవిక దృష్టికి నిదర్శనం. కాకతీయుల యుగం నాటి దేవాలయాల గురించి కూడా ఒక మంచి వ్యాసం అందించారు.

కథలలో పార్వతీశం ఉపయోగించినది తేటతెనుగు. ఆంగ్ల పదాలను పరిహరిస్తూ ఎంతో జాగ్రత్తగా రాశారు. కథలలో తెలుగుదనం ఉంది. మొత్తంగా చూస్తే ఇదొక చక్కని మేళవింపు.

ఊహా విహంగాలు – సాహితీ తరంగాలు (కథలు-వ్యాసాలు)

రచన : శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం

పుటలు : 208,

వెల : రూ.150/-

ప్రతులకు : హైదరాబాద్‌లోని అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *