రమణులవారు… రామయోగి…

రమణులవారు… రామయోగి…

భారతభూమికి ఆధ్యాత్మిక గుబాళింపు యోగుల పుణ్యమే. స్వాములు, పీఠాధిపతులు, మఠాధిపతులు, ఇంకా ఎందరో మహానుభావులు ఉన్నా యోగుల ఆధ్యాత్మిక సేవ ప్రాతఃస్మరణీయమైనది. ఆచరణతో ఆధ్యాత్మిక చింతనను అందరికీ పంచినవారు వారే. నిరాడంబరత, అందరికీ ఆచరణ సాధ్యమనిపించే ధార్మిక పంథా, అన్నింటికీ మించి, సాధనతో వచ్చిన అసాధారణ అనుభవాల గురించి చాటుకోకపోవడం, ప్రదర్శించకపోవడం వంటి లక్షణాలు వీరిలో అద్భుతమనిపిస్తాయి. డంబాచారాలను దూరంగా ఉంచగలుగుతాయి. మహోదాత్తమైన దైవభావన మీద సాధారణ వ్యక్తులలో భ్రమలు పెంచకుండా నిరోధించగలుగేవి ఇలాంటి లక్షణాలే. అలాంటి మహనీయులలో యోగి రామయ్య ఒకరు. వారినే రామయోగి అని పిలవడం కూడా కద్దు. నెల్లూరు జిల్లా మోపూరులో పుట్టి అన్నారెడ్డిపాళెంలో పెరిగిన చేపూరి రామిరెడ్డి, రామయోగిగా అవతరించడానికి సాగిన ఆధ్యాత్మిక ప్రయాణం అద్భుతమైనది. దాని గురించి వివరించిన పుస్తకమిది. పేరు – ‘భగవాన్‌ సన్నిధిలో రామయోగి’. బాపట్లకు చెందిన బ్రహ్మానంద తీర్థతో మంత్రోపదేశం పొందినప్పటికీ భగవాన్‌ రమణుల వారే రామయోగి (జూలై 29, 1898- ఫిబ్రవరి 12, 1962) ఆధ్యాత్మిక మార్గాన్ని తేజోవంతం చేశారు. రమణ మహర్షికీ, రామయోగికీ మధ్య జరిగిన సంభాషణలు ఇందులో చదవడం ఒక అనుభూతి. అలాగే పొణకా కనకమ్మ, ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మ వంటి భక్తులు ఆయనను దర్శించిన క్షణంలో పొందిన అనుభూతి, చూసిన వెలుగు గురించి కూడా ఎవరికి వారు చదివి అనుభూతి చెందాలి.

బ్రిటిష్‌ పత్రికా రచయిత పాల్‌ బ్రంటన్‌ రాసిన ‘గుప్త భారతదేశ అన్వేషణ’ పుస్తకంలో రామయోగి దర్శనంతో ఆయన పొందిన అనుభూతిని కూడా చదువుకోవచ్చు. ఈ సమాచారంతోనే రమణ మహర్షితో పాటు, రామయోగి కూడా ఎందరికో తెలిశారు. తరువాత రామయోగి అన్నారెడ్డిపాళెం ఆశ్రమంలో ఆధ్యాతిక యాత్ర కొనసాగించారు. రామయోగి కలుసుకున్న మహనీయులు, ఉత్తర భారత యాత్ర సందర్భంగా గాంధీజీతో సమావేశం కావడం వంటి అంశాలను ఇందులో పొందు పరిచారు. ఏ విధంగా ఇలాంటి పుస్తకాలు మానసాన్ని సాంత్వన పరుస్తాయో ‘భగవాన్‌ సన్నిధిలో రామ యోగి’ ద్వారా అలాంటి సాంత్వన పొందవచ్చు.

భగవాన్‌ సన్నిధిలో రామయోగి

రచన : తూమాటి వీరనారాయణరెడ్డి

పుటలు : 120, వెల : అమూల్యం

ప్రతులకు : తూమాటి వీరనారాయణరెడ్డి,

బట్టేపాడు గ్రామం, ఆత్మకూరు మండలం,

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.

సెల్‌: 9494618322.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *