చాలా విషయాలు తెలుసుకున్నాను..

చాలా విషయాలు తెలుసుకున్నాను..

1980లలో అని గుర్తు! వీరేశలింగం పంతులు వర్ధంత్యుత్సవ సభ జరిగింది. వీరేశలింగం రచనలు, సామాజిక చైతన్యోద్బోధ, సంఘ సంస్కరణ మహితాశయాల కార్యాచరణకు, సాహిత్యాన్ని ప్రబల సాధనం చేసుకోవటం, అనంతర కాలంలో తెలుగు సాహిత్యం, ఆధునిక భావాలపై ఆయన ప్రభావం గూర్చి నేను చాలా వివరాలు సేకరించి పిహెచ్‌.డి. సిద్ధాంత గ్రంథం రూపొందించాను.

కావున రాజమండ్రిలో వీరేశలింగం పంతులు నెలకొల్పి సేవచేసిన సంస్థలు, ఆయన జయంతి, వర్ధంత్యుత్సవ నిర్వాహకులు, ముఖ్యంగా హితకారిణీ సమాజం వారి కార్యక్రమాలకు నేను చాలాసార్లు హాజరై ప్రసంగించేవాణ్ణి. నన్ను వాళ్లు చాలా ఆదరంగా చూసేవారు.

ఒకసారి రాజమండ్రి పురమందిరంలో (టేన్‌ హాల్‌ – దీనిని రాజమండ్రికి బహూకరించిన వారు వీరేశలింగం పంతులే. దీని గురించి ఆయన స్వీయచరిత్రలో చదవొచ్చు).

వీరేశలింగం వర్ధంతి సభ జరిగినప్పుడు ఓసారి దానికి నన్ను ఆహ్వానించారు. ఈ సభకు అధ్యక్షత వహించినవారు దామెర్ల వేంకటరావు. ప్రధాన ప్రసంగం కంభంపాటి రామశాస్త్రిది. వీరిని ‘తారకం’ అని వ్యవహరించేవారు. రామశాస్త్రి పేరు ఎవరికైనా గుర్తుందో! లేదో! – వీరు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి బ్రహ్మ సమాజాదర్శాలను పత్రికల ద్వారా, ప్రచురణల ద్వారా, ప్రసంగాల ద్వారా వ్యాప్తికి తెచ్చారు.

అన్నిటికన్నా చాలా గొప్ప విషయం ఏమంటే తారకం శుద్ధ సంప్రదాయ వైదిక బ్రాహ్మణుడైనా బ్రహ్మర్షి రఘుపతి వేంకటరత్నం ఆదర్శ, ఆశయ, ప్రబోధ ప్రేరితుడై అట్టడుగు వర్గానికి చెందిన యువతిని సహధర్మచారిణిగా స్వీకరించిన త్యాగ జీవన పరాయణుడు. వీరి ఇల్లాలు కూడా ఉన్నత విద్యావంతురాలై జిల్లా విద్యాశాఖాధికార పదవీ బాధ్యత స్వీకరించారు. ఉద్యోగ విరమణానంతరం వీరు కాకినాడలో స్థిరపడ్డారు.

బ్రహ్మ సమాజం వారి ధర్మసాధని పత్రికకి కూడా వీరు కొంతకాలం సంపాదకత్వం వహించారని అనుకుంటాను. ఈ ధర్మ సాధని పత్రికలూ, బ్రహ్మర్షి రఘుపతి వేంకటరత్నం నాయుడు గ్రంథాలుంటే వాటినీ చూడాలని నేను ఒకసారి, నా పిహెచ్‌.డి. కృషి ప్రారంభించిన తొలి సంవత్సరాలలో వెళ్లాను వీరి వద్దకు. అప్పుడే ధర్మసాధని పత్రికల నుంచి కొంత నోట్సు రాసుకున్నాను.

రఘుపతి వేంకటరత్నం నాయుడు – ఉపదేశాలు, సందేశాలు, ఆధ్యాత్మిక సంవేదనలు అనే 8 సంపుటాలు కొనుక్కున్నాను. ఆ 8 సంపుటాలు 12 రూపాయలే. వేంకటరత్నం నాయుడు స్వీయ చరిత్ర కూడా ఈ సంపుటాలలో కొంత ప్రసక్తమైంది. మళ్లీ ఈ మహనీయుణ్ణి (తారకం) రాజమండ్రి వీరేశలింగం వర్ధంతి సభలో సహవేదికపై సందర్శించ గలిగాను గదా! అని సంతోషించాను. ఈ సభా వృత్తాంతం మర్రోజు హిందూ పత్రికలో సవివరంగా వచ్చింది. హిందూ విలేకరి ఆర్‌.బి.పెండ్యాల నా ప్రసంగం చాలా వివరంగా రాశారు.

దామెర్ల వేంకటరావు సంయుక్త మద్రాసు ప్రభుత్వ చరిత్రోపన్యాసకులుగా మంచి పేరు తెచ్చుకున్నవారు. సభ జరిగిన మర్రోజు ఉదయం మర్యాద వినమ్రత చూపటానికీ, వీరేశలింగానికి వీరి కుటుంబం చాలా సన్నిహితంగా ఉండేది కాబట్టి ఆ విషయాలు తెలుసుకోవడానికి వేంకటరావుని దర్శించాను.

వీరి తండ్రి దామెర్ల వేంకట రమణరావు వీరేశలింగానికి అత్యంత సన్నిహిత ప్రేమపాత్రులు. వీరేశలింగం ఇల్లాలు రాజ్యలక్ష్మమ్మ దామెర్ల వారి ఇంటి ఆడబిడ్డలాగా ఉండేవారు.

అన్నిటికన్నా ముఖ్యమైన విషయం తెలుగు వారికి అంతర్జాతీయ ప్రశస్తి తెచ్చిన దామెర్ల రామరావు వేంకటరమణరావు తమ్ముడే. అప్పట్లో రాజమండ్రి ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాలైన జె.ఎ.కూల్డ్రే రామారావును ఎంతగా అభిమానించిందీ, ఆయనను బొంబాయి చిత్రకళాశాలకు పంపటానికి కారకు డైనదీ, బ్రిటీషు కామన్వెల్త్‌ దేశాలు ఎనిమిది నిర్వహించిన చిత్రకళా ప్రదర్శన వెంబ్లీ నగరంలో జరిగినప్పుడు ఈ ప్రదర్శన కోసం దామెర్ల రామారావు పంపిన చిత్ర కళాఖండాలు పురస్కారంగా ఎంపిక కావటం, ఆయన చిత్రం కృష్ణలీలలు ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం అలంకరించుకోవటం గురించి.. సుమారు రెండు గంటల సేపు ఆ అపూర్వ గాథలన్నీ చెప్పారు వేంకటరావు నాకు.

దామెర్ల వేంకటరమణరావుకీ, వీరేశలింగంకి స్పర్థలూ, కోర్టు అభియోగాలు నడిచాయి. ఈ వివరాలున్నీ చెప్పారు. అన్ని సంగతులూ నేను నోట్సు రాసుకున్నాను.

– డా|| అక్కిరాజు రమాపతిరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *