భావ విహంగాలు పలికిన అక్షరాలు

భావ విహంగాలు పలికిన అక్షరాలు

‘కావివి కేవల శిల్పాల్‌, /కావివి పాషాణ ములును; కావివి బొమ్మల్‌/కావా ఇవి ముమ్మాటికి/చావని చరితపు వెలుగులు, శాంతి జ్యోతుల్‌?’ ఇది ‘హంపీ దిద్దిన అక్షరాలు’ (కవితా సంకలనం)లో కనిపించే ఒక పద్యం. హంపీ విజయనగరాన్ని చూసిన వారెవరికైనా అపారమైన దుఃఖం కలుగుతుంది. ఈ కవి కూడా అలాగే దుఃఖించారు. ఫలితమే ఆ పద్య మాలిక. శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం గారి ‘హంపీ దిద్దిన అక్షరాలు’ నిజానికి ఛందోబద్ధ పద్యాలతో కూర్చిన కావ్యం మాత్రమే కాదు. ఇదొక కదంబం. పేరడీలు, వచన కవితలు, ఏక పద కవితలు, ఆంగ్ల కవితలు కూడా ఉన్నాయి. తెలుగు సాహిత్యంలో సుప్రసిద్ధమైన పద్యాలకు పార్వతీశం పేరడీలు రాశారు. ‘నవ్వు నరుడు’ అన్న పద్యం చక్కగా ఉంది. అందులో ఇలా అన్నారు కవి, ‘నవ్వనివాడధముండగు/నవ్వనివాడు అసుర జన్మనందినవాడే/ నవ్వెడివాడే ధన్యుడు/ నవ్వించెడువాడె గొప్ప నవ్వనివానిన్‌’. ఇది చాలామంది చదవవలసిన పద్యం. ఇక ఏక పద కవితలలో రెండు గుర్తుండి పోతాయి. అవి- సమ్మె: మర్యాదస్తుల మొండితనం, గడ్డి: జీతం కంటె తీపి.

ఇందులో పేరడీలు చదువుకుంటే ఆ పూర్వికుల పద్యాలు కూడా ఒక్కసారి చదువుకుని స్మరించుకునే వెసులుబాటు ఉంటుంది. కరుణశ్రీ ప్రఖ్యాత కథా కవిత ‘పుష్ప విలాపం’ కోసం పేరడీ చేశారు పార్వతీశం. ‘నేనొక గ్యాసు స్టవ్వు కడ నిల్చి హుషారుగ కాఫీ చేయగా..’ అంటూ మొదలవుతుంది. విశ్వనాథ, తిరుపతి వేంకటకవులు, శతక కవుల, పూర్వ కవుల పద్యాలకు కూడా ఇందులో పేరడీలు కనిపిస్తాయి. అలాగే సమస్యా పూరణ ప్రక్రియతో కొన్ని పద్యాలు రాశారు. ‘అందులో ‘అక్క మగని బిలిచె యన్న యనుచు’, ‘ఖర్వాటుడు దువ్వుకొనెను గబగబ శిరమున్‌’, ‘కాంతకు మీసముల్‌ మొలవ కాంతుడు దువ్వెన తోడ దువ్వెడిన్‌’ వంటి పూరణాలు ఎంతో చమత్కారంగా ఉన్నాయి. తల్లినీ, గురువులనూ, శివాజీ వంటి ధన్యజీవినీ స్తుతిస్తూ రాసిన పద్యాలు కూడా ఇందులో ఉన్నాయి. పార్వతీశం గద్యమే కాదు, పద్య రచనలోను చేయి తిరిగినవారే!

హంపీ దిద్దిన అక్షరాలు

(కవితా సంకలనం)

రచన : శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం

పుటలు : 284,

వెల : రూ.150/-

ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో

– శ్రీరామ్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *