వేదాల్లో దేవతలు

వేదాల్లో దేవతలు

రుద్రుడు

వైదిక రుద్రుని పరిణామమే పౌరాణిక శివుడు. ఈ శివుడు ద్రావిడ మతంలో నుంచి తీసికొనబడినవాడు కాడు. వేదములందే పౌరాణిక శివుని చాయలు కనబడుతున్నవి. కొన్ని సూక్తాల్లో కనబడే భయంకరుడు, తామసవిశిష్టుడు ఐన రుద్రుడు పురాణాల్లో ప్రళయకాలంలోని నటరాజుగా మారినాడు. కేశినులు, నగ్నులు, వాతరశనులునైన మునులు ఆధ్యాత్మిక సామర్థ్యాలను రుద్రునితోపాటు విషం త్రాగటంచేత సంపాదించినారని ఋగ్వేదంలో కలదు. (కేశీ విషస్యపాత్రేణ యద్రుద్రేణా పిబత్యహ 10.136).

ఇతరులతో కలిపి తను స్తోత్రం చేయటం రుద్రుని కిష్టం లేదు. ఇతనికి వ్యక్తిత్వం పూర్తిగా ఉంది. అశ్వినీ దేవతల్లాగా రుద్రుడు కూడా వైద్యుడే ఐనా, కవులుమాత్ర మితన్నిభిషక్తయు అన్నారు. ఈ శుభత్వం శివుణ్ణి ప్రేమాస్పదుడిగా జేసింది. మరుత్తులకు తండ్రియైన ఇతడుకూడా యౌవనుడుగాను, శివంకరుడు గాను ఋగ్వేద కవులకు కనపడినాడు. ఎండలో కొంతకాలం నడచిన తర్వాత విశ్రాంతికి చెట్టునీడ ఎలా అవసరమో, అలాగే, రుద్రుని ఆశ్రయం కూడ అవసరం. రుద్రుని భార్య పృశ్ని అని అనుమేయం. పృశ్ని అంటే రకరకాల నక్షత్రాల తోను, ఇతర రూపాలతోను నిండియున్న ఆకాశమని చాలామంది వ్యాఖ్య చేశారు. ఆ తర్వాతి రోజుల్లో పర్వత రాజ పుత్రిక ఇతన భార్య ఐంది. ఏలాగైనా ప్రకృతి విశేషాన్నే ఇతనికి పత్నిగా జేశారు.

ఋగ్వేదంలోకూడా రుద్రుడు త్య్రంబకుడని ఒక్కచోటే చెప్పబడ్డాడు. కాని అది పదపాఠంలో కనబడటం లేదు. ఏమైనా సంప్రదాయ ప్రకారం ఇతని త్య్రంబకత్వం చాలా ప్రాచీనమైనది.

వేదకాలంలో నితని వెంటే ప్రమథగణా లున్నట్లుగానే వైదిక కాలంలో మరుద్గణాలున్నవి. ఈ మరుద్గణాలు ఇంద్రుని కత్యంత మిష్టులు. ఇంద్రునికి, బృహస్పతికి చాలా సహాయం చేసి వృతపలాది పథలకు బాగా తోడ్పడినారు. ప్రకృతిలో దృశ్యాలను వైదిక దేవతలు ప్రదర్శిస్తవనే వాదానికి చాలా ప్రతిబంధకాలు కలిగించేవానిలో మరుత్తు లొకటి. వీనిని నిజంగా గాలులని అంటే ప్రమాదం కల్గుతుంది. ఇవేవో భౌతికాతీత విషయాలో, లేకపోతే కొన్ని విశిష్ట గుణాలకు ప్రతినిధీకృతాలైనవో సరిగా చెప్పటం కష్టం. కాని అందరు దేవతలతోను వీరికి మంచి పరిచయం. అన్ని ముఖ్య కార్యాలలోను వీరి సాహాయం కలవు. ప్రమథ గణాల కింత స్థానం లేదేమో!

ఋగ్వేదంలో రుద్ర విష్ణువులకు ప్రధాన తమమైన స్థానం లేదు. కాని వీరే క్రమంగా తర్వాతీరోజుల్లో పౌరాణిక దేవతల్లోకి పరిణమించినారు. ఋగ్వేదంలో ఏ దేవుడూ భయంకరుడు కాడు. శత్రువుకు మాత్రం భీకరంగా ఉండవచ్చు. కాని భక్తునికి అత్యంత దయార్ద్ర హృదయుడు. రుద్రుడు చాలా యౌవనుడని కొన్నిచోట్ల ఋగ్వేద ఋషులు వచించారు. ఆ యౌవన వర్ణన చాలా వాంఛనీయం. ఇంకా ఇలాగే చాలా శుభగుణాలు రుద్రునిలో ఉండటం చేతనే శివుడు, శంకరుడు, శంభుడు అనే అన్వర్థ నామాలు పొందినాడు.

అదితి

అదితి అంటే విమోచన అని అర్థము. అన వచ్ఛిన్న స్వారాజ్యకారిణి. అనాగాస్త్వమే అదితిత్వమని ఋగ్వేదం 7.51.1లో ఉన్నది. మాతృదేవతయైన ఈమె ఆ రోజుల్లో శాక్తేయుల ఉపాస్య దైవతము. పాపరాహిత్యమున బంధ విముక్తిని ఋషులీమెనుంచి కోరేవారు. బుద్ధుడైన దొంగను విడిపించురీతిగా (8.67.14) స్తోత నీమె వదలించాలి. ఈమె పుత్రులైన ఆదిత్యులలోగూడా ఇదే ముఖ్య లక్షణము. తేజోరూపిణిగూతడా నీమె. ఉషస్సు లీమె సేనలు, జ్యోతినవ్వమి ఋషులు ప్రార్థించారు (4.25.3) ఈ తేజస్సు అపరిచ్ఛిన్నము. అమర్త్యము, దేశ కాలాద్యవచ్ఛిన్న రాహిత్యతత. అత్య్తుమ నైతిక పాలన, పురుషాతీత జ్యోతిర్విశిష్టత లీమె ముఖ్య గుణములను వెల్లడించుచున్నవి. సర్వవ్యాపిణియైన ఈమెయే సర్వమున్నూ-

”ఆదితిర్ద్యౌరదితి రంతరిక్షం

ఆదితిర్మాతా సపితా సపుద్రుః

విశ్వేదవా అదితి ః

పంచజనా అదితిర్జానత మదితిర్జనిత్వం”

(1.89.10)

ఈమెకు భౌతిక స్వరూపమే లేకపోవుటచే ఋషులా యుదంతమును స్మరించలేదు. ప్రకాశార్థము కలిగిన ‘దేవీ’ శబ్దముతో నీమెను తరచుగా ఉద్దేశించినారు.

”ఉరువ్యచా అదితిః” (5.46.6) అనీ, ”ఉరువ్రజ, ఉరూచీ” (8.56.12) అనీ ఈమె సర్వవ్యాపకత్వాన్ని ప్రస్తుతించారు. ఈ ఆదితి, ”మాతా రుద్రాణాం, దుహితా వసూనాం, స్వసాదిత్యానాం” (8.90.15) అని కొనియాడబడినది. ఆదిత్యుల తలియైన ఈమె, వారి సోదరికూడ. కేవల భావనా ఫలితము లేక మాతా పిత్రాది సంబంధ వ్యవస్థల కతీతమైనదే దైవతము. పౌరాణిక కాలంలో ఈమె దక్షుని పుత్రిక. దేవతల తల్లి. విష్ణుభార్యయని వాజసనేయ సంహిత (29.60) కాని

”ఆదితేర్దక్షో ఆజాయతదక్షా ద్వదితిఃప

ఆదితిర్హ్యజనిష్ట దక్ష యాదుహితాతప

తం దేవా ఆన్వజాయంతభద్రా అమృత బంధవః”

అను ఋగ్వేద (10.72.45) పంక్తులను పరిశీలించగా ఈమె దక్షుని తల్లి, పుత్రికయని తేలగలదు. ఇచ్చట చెప్పబడినది కేవల మానవనిష్ఠ బాంధ్యవము కాదు. కేవల తత్త్వార్థమే యుక్తము.

కేవల నిర్గుణోపాసనకు వరుణుడెలాంటివాడో, అలాంటి స్థానమే అదితికి కూడా ఉన్నది. ఈమెకు భౌతిక రూపమే లేదు. మిత్ర, వరుణ, ఆర్యమణులకు, రాజులకు, వీరులకు, ఈమె తల్లి. వసువుల కూతురు, ఆదిత్యులు సోదరి (8.90.15) ఐన ఈమె మరుత్తులకు కూడా తల్లి. ఋతాన్ని పోషిస్తుంది. సర్వము నావరించిన చైతన్యమైన వరుణుడెలా పాశవిమోచనం చేస్తాడో, అలాగే అతని తల్లి అదితి కూడాను. అదితి అనే శబ్ద వ్యుత్పత్తిలోనే ఆ అర్థమున్నది. ప్రకాశమిమ్మని ఈమెను కూడా ఋషులు ప్రార్థించారు.

గోశబ్దానికి ఋగ్వేదంలో కొన్నిచోట్ల సూర్యరశ్మి అనే అర్థం ఉన్నది. గోవు ప్రకాశమనే జ్ఞానానికి ప్రతినిధి ఆ స్థలాల్లో కొన్ని చోట్ల అదితిని ఈ గోవు అనే అర్థంలో వ్రాసినారు. ”మాగామ నాగామదితం పథేష్ట”. (8.90.15) అని ఒకచోట ఉన్నది. వరుణుడు పురుష దైవతమని వ్యవహరించబడినాడు. కాని అతడు కేవలం అద్వైతుల నిర్గుణబ్రహ్మకు వైదిక యుగంలో ఉన్న ప్రతినిధి. శాక్తేయుల పరాశక్తికి ఆకాలపు ప్రతినిధి అదితి. ఆమె సంతతి ఆదిత్యులు. ఆదిత్యులంటే చైతన్యోత్పాద కులు. జ్ఞానప్రచోదకులునైన దేవతలందరూనని చెప్పుకోవాలి. వీరే అజ్ఞానం నుంచి ముక్తినిచ్చేవారు.

”ఆదితి ద్ద్యౌరదితి రంతరిక్షం”

అనే ఋక్కులో అదితి యొక్క రూపాతీతత్వము నువ్వక్తము.

వరుణుడు

వరుణుడు చరిత్ర చాలా ఆశ్చర్యకరమైనది. ప్రాచీన కాలపు ఆర్యభాషలలో ”అసుర” శబ్దానికి ఉత్తమ దేవుడని అర్ఖముండేది. వరుణుని ముఖ్యంగా అసురుడని అన్నారు. రాను రాను అసుర శబ్దానికి అర్థము వచ్చింది. పారశీకులకు ”అహుధీమజ్దా” ఉత్తముడగు దేవుడు. అలాగే ఋగ్వేదం సప్తమ మండలంలో ఉన్న ”అసురస్య వెధసః” అనే పంక్తిని ఒక విమర్శకుడు ”అసురస్య మేధసః” అని చదివితే ఎలా ఉంటుందన్నాడు. ఏమైనా ”అసురో మేధాః” అనివైదికంలో ఈ పారశీకుల దేవునిపేరై ఉంటుంది.

వరుణన్ని రాజుగా వైదిక కవులుచ్చరించినారు. ఇతడు ప్రధాన దేవుడు కావటం చేతనే మన పూర్వులు సంధ్యావందనంలో సాయంకాలోప స్థానానికి ”ఇమంమే వరుణ” అని వరుణ ఋక్కులనే జపించమన్నారు. ఇతని దగ్గర పాశాలుంటవి. వీటితో కొందరిని కట్టివేస్తూ ఉంటాడు. కొందరి బద్ధులను వదలుస్తూ ఉంటాడు. పాశవిమోచనార్థియైన శునఃశేశుడు ”ఇమం మే వరుణ” ఋక్కులతో స్తోత్రం చేశాడు. పాశమంటే తత్త్వార్థం తీసుకోవాలి. కర్మబంధమనో, సంసార బంధమనో చెప్పుకోవాలి. నిజంగా వారుణ సూక్తాలలో వేదాంతార్థం చాలా గోచరిస్తుంది. ఈ పాశాలు తర్వాతి రోజుల్లో ఉదకరాజుగు వరుణుని దగ్గర చేరినవి.

వైదిక వరుణుని వద్ద అనేకమంది సేవకులు ఉన్నారు. వీరు సర్వత్ర తిరిగి ఎవరు ఎప్పుడు ఏమి చేసింది కనుక్కోనివచ్చి తమ ప్రభువుకు నివేదిస్తారు. ఋతమును పోషించే వరుణుడు తగు చర్య తీసికొంటాడు. ఋతమంటే ప్రపంచమందలి నైతిక సూత్రమని అభిప్రాయము. సమస్త ప్రాణిజాతానికి జీవనాధారమైనది. దీనినే కొన్నిచోట్ల సత్యశబ్దంతో వ్యవహరించారు. ఋతు వృధుడు, ఋతపాల కుడునైన వరుణుడు నీటిమధ్య గుండా వెళ్లేనా డొకప్పుడు, ”ఋత” శబ్దానికి ”నీరనే” అర్థమున్నది. ”సత్యం త్వా ఋతేన పరిషించామి” అనే మామూలు ప్రయోగం ఉదాహరణకు చాలును. కావుననే రానురాను ఉపనిషత్తులలో బ్రహ్మకున్న స్థానమును ఋగ్వేదంలో పొందిన వరుణుడు, నీటికి అధిష్ఠాన దేవతగా మారిపోయినాడు. అప్పటినుంచి ఒక దిక్పాలకుడుగానైనాడు. మన పూర్వ బంధువులకు పారశీకులు మాత్రము ఉత్తమ దేవునిగానే ఉంచినారు.

ఈ వరుణుడు మామూలుగా మిత్రునితో కలిసి ఆహ్వానింపబడేవాడు. పగటికభిమాని దేవత మిత్రుడనీ, రాత్రికభిమాని దేవత వరుణుడనీ సాయణులు వ్యాఖ్య చేశారు. వీరిద్దరికీ చాలా సామ్యం ఉండడమే కాకుండా, కేవల మాధ్యాత్మిక దైవతమైన వరుణునికి కనబడీ, కనబడని ప్రతినిధి మిత్రుడు. వీరిద్దరికి చక్షుస్సు సూర్యుడు. ”త్వోతో నైమం¬ అశ్నోత్యంతితో నదూ రాత్‌” అని మిత్రదైవతాన్ని ”అచిత్తీయత్తవ ధర్మాయుయోపిమమ, స్తస్మాదేనసోదేవరీరిషః” అని వరుణుని మనము స్తోత్రం చేస్తున్నాము. ఈ రెంటి సారాంశ మొకటే.

సర్వము నావరించిన వరుణుడు ప్రాచీన ఆర్యులకు ప్రధానతము దైవతము. క్రమేణ ఇతర దేవతలు ఎక్కివచ్చి, వరుణుడు జలాధిష్ఠాన దేవత ఐనా, సంప్రదాయవేత్తలైన మన పూర్వులు మాత్రము వరుణుడే ప్రధాన దేవుడని, ఋతమును మనము పోషించవలసినదనీ, నిత్యము జ్ఞాపకం చేసేలాగా కట్టుబాట్లు చేశారు.

సవిత

వైదిక కాలంలో ఇతడొక అత్యంత ప్రధాన దేవత. సూర్యునికి ఒకవిధంగా ప్రతినిధి. సూర్యుని సరియైన మార్గాన ప్రవేశ పెట్టెటటువంటి వాడు. నల్లని మార్గాలనుంచి, దేశాల నుంచి వస్తూ, అమర్త్యులను, మర్తులను నిద్రలోంచి మేల్కొల్పుతూ, హిరణ్యరథం మీద వెళ్తూ ఉంటాడు. తెల్లని పాదాలు కలశ్వా వాశ్వము లితని రథాన్ని లాగుతవి.

ప్రపంచమంతటినీ జాగ్రదవస్థకు తీసుకొని రావడానికి ప్రతిరాత్రీ సవిత వస్త్రంయిస్తూ ఉంటాడని, కవులు ప్రతిరాత్రీ ఇతనిని స్తోత్రంచేస్తూ ఉంటారని వాక్యాలున్నవి. అంతటా వ్యాపించియున్న చీకిని తన జ్యోతిర్వపానంతో అచ్ఛాదనం చేయటానికి ఒక స్త్రీలాగా ఆ వస్త్రం నేస్తున్నట్లు ఉత్ప్రేక్షించారు. ఇట్టి సవితృ దేవుని తల్లి ఉషస్సు.

సవితకు ఉషస్సుకు చాలాదగ్గర సంబంధం ఉన్నది. వీరద్దరికీ గల సామ్యాన్ని, కవులు చాలాచోట్ల నిర్దేశించారు. దుస్స్వపన్నం వల్ల కలగబోయే పాపఫలాలను నశించునట్లు చేయమని ఈ ఇద్దరిని ఋషులు స్తోత్రం చేశారు. ఉషస్సు, సవిత, మిత్రుడు, సూర్యుడు అనే క్రమంలో ఆదిత్యుని రూపాలు ప్రకటింపబడుతవని సంప్రదాయ ప్రతీతి ఉంది. బుద్ధికి ప్రచోదనము కల్పించి సవితకు, ప్రజ్ఞాపకము యజ్ఞకేతువునైన ఉషస్సుకు భేదమే లేదనవచ్చును. ఉషస్సు సవితల కభేదంగా ఉన్న కొన్ని గుణాలనుంచే తర్వాతి కాలపు సరస్వతి ఆవిర్భవించినదని చెప్పవచ్చును.

సవితకు సూర్యునికి గూడా సామ్యం చాలా ఉంది. ఇలాంటి పోలిక లుండటం చేతనే క్రమ క్రమంగా సవిత అనే దేవత మాయమైపోయి ఆస్థానే సూర్యుడు మిగిలిపోయాడు. ఈ సవితే ఉత్తర ధృవప్రాంతాల్లో కనబడే అరోరా అని కొందరు శాస్త్రజ్ఞుల అభిప్రాయపడుతున్నారు. ఏదెలాగున్నా మాధ్యాహ్నిక సూర్యుడు మాత్రము కాదు. ఉషస్సు తర్వాత కనబడే జ్యోతియని కొందరంటారు. ఉషస్సు తోను, చీకటితోను ఇతనికి చాలా సంబంధం ఉన్నది. ఇలాంటి పోలిక లుండటంచేత ఉషస్సు కొంత, సూర్యునితో కొంత కలసిపోయినాడు.

రాను రాను ఋగ్వేదంలోనే సవితను సూర్యుని సూక్ష్మ భేదంతో పలుకుతూ వచ్చినారు. దినము యొక్క మధ్యభాగంలో కూర్చొన్నాడని దశమ మండలంలో ఉంది. సూర్యునికి మార్గం చూపించే ఈ సవిత, సూర్యరశ్మి సంపన్నుడని ఇచట పలికినాడు. దేవుడగు సూర్యునివలె సవితకూడా సత్యధర్ముడే.

ఈ సవిత విద్యుత్తుకు కూడా దగ్గర బంధువే. అరణ్యంలో మేత మేయడానికి వెళ్లిన పశువులు సాయంకాలమయేసరికి గ్రామానికి వచ్చేలాగా, యుద్ధానికి పోయే వీరుడు తన గుర్రాల దగ్గరకు పరుగెత్తిపోయేలాగా, విశేషమైన పాలతోను, వాత్సల్యంతోను కూడుకొన్న ఆవు ప్రేమపూరిత పాలతో తన దూడదగ్గరకు పోయేలాగా, భర్త తన భార్య దగ్గరకు అనురాగంతో పోయే లాగానూ సవితను తమ దగ్గరకు రమ్మని ఋషులు కోరేవారు. ఈ సవితృ దేవుడు జ్ఞాననప్రదాత, బుద్ధికారకుడు, చోదకుడున్నూ.

ఇంద్రుడు

ఇంద్రుని చరిత్ర చాలా విచిత్రమైనది. అవెస్తాలో ఇంద్రుడడనే రాక్షసుడు, వృత్రఘ్నుడనే దేవుడూ ఉన్నారు. ఋగ్వేదంలో ఇంద్రుడే వృత్రఘ్నుడు. ఇతడు ఆ రోజుల్లో ప్రధానమైన వీరుడు. వీరరసానికి ఆయువుపట్టు. ఇతని జీవితంలో శృంగారమనేది ఉన్నదని మనమనుకోటానికి సావకాశమే లేదు. పురాణాల్లో ఇతడు శృంగార పురుషుడై, మెదిలితే రణరంగం నుంచి పారిపోయేవాడుగా తయారైనాడు.

వజ్రాయుధ మింద్రునిదని అనాది కాలం నుంచీ ప్రతీతి ఉంది. వజ్రాయుధంతో వృత్రుని చంపి, నీటిని ప్రవహింపచేశాడుట. వజ్రాయుధమంటే ఇంద్ర ధనుస్సో మరేమో ఐయుంటుంది. వృత్రుడంటే మేఘమేనని నైరుక్తుల నిర్వచనం. అహిని చంపి సప్త సింధువులను వదలినాడే కథ. కృష్ణుని కాళియమర్దన లాగా మారింది. ఇంద్ర బృహస్పతులు చేసిన ముఖ్యకార్యాలు చాలా కృష్ణుని చేష్టలుగా మారినవి పురాణాల్లో. బృహస్పతి గోవుల నపహరించిన ఫణిని గుహలో ఉండగా చంపి, గోవులను వదలిపెట్టినాడనే కథ కృష్ణావతారంలో కూడా వచ్చింది.

పౌరాణిక ఇంద్రుని భార్య శచీదేవి. శచీ అనేది కర్మ నామము. ప్రజ్ఞానామము అని సాయణులు సరిగా అర్థం చెప్పినారు. ఋగ్వేదంలో ఇంద్రుని భార్యకు ఇంద్రాణి అనేగాని, వేరే పేరు లేదు. శచీ శబ్దం బహువచనంలోకూడా కనబడుతుంది. ఈ శచి ఒక్క ఇంద్రునికేగాక, అగ్నికి, అశ్వినీ దేవతలకు, ఋషులకు, కవులకు కూడా ఉన్నదని ఋగ్వేదంలో వాక్యాలున్నవి. ”ఏశచితో నున్నావ”ని, ”శచులతో రమ్మ”ని ఇంకా ఇలాంటివెన్నో వాక్యాలున్నవి. ఎక్కువసార్లు ఇంద్రునితోనే ఈ శచీ శబ్దం కనబడు తుంది. అందుకనే పౌరాణిక కాలానికి శచి అనే కర్మనామము దేవతగా మారిపోయింది. దానితో క్రొత్త దేవత, ఇంద్రుని భార్యపేరు లభించినవి.

దన్యులను నాశనం చేయడం, కాంతిని తేజ స్సును ప్రకటించడం, నీటిని స్వేచ్ఛగ ప్రవహింప చేయడం అనేవి ఇంద్రుని చరిత్రలో ముఖ్యమైన విషయాలు. వీనిలో నేదికూడా పురాణాల్లోకి ప్రవేశించలేదు. కాని ఎక్కడాలేని శృంగారలోలత త్వరగా దాపరించినది. ఈ ఇంద్రుడు శతక్రతుడని, సహస్ర క్రతుడని కలదు. క్రతువంటే యాగమనే అర్థమొక్కటే కాదు, ఏదైనా ఒక వీర పురుషోచితమైన కర్మ. అనేక వీరకృత్యాలు చేశాడితడు.

వైదిక ఇంద్రుని సోమాన్ని గౌరవించిన ప్రభువుగా చెప్పవచ్చును. సోమమంటే ఇతడేపని చేయమంటే ఆ పని చేస్తాడు. నాలుగు పీపాల సోమాన్ని త్రాగినట్లుకూడా కనబడుతుంది. ఈ సోమాన్ని సేవించిన తర్వాతే ఉత్సాహపూరితుడై యుద్ధం చేసి గెలిచేవాడు. ఇదంతా తర్వాతి రోజుల్లో మాయమై పోయింది కాని, సోమపానమనే ”త్రాగుడు”తో సంబంధించిన స్త్రీలలత ఆవిర్భవించి ఆ స్థానాన్ని ఆక్రమించుకుంది.

కాని అసలు భారతీయులకు వైదిక కాలంలో జాతీయ నాయకుడు, యుద్ధానికి ఆధిష్ఠాన దేవత ఇంద్రుడు; తర్వాతి రోజుల్లో అదే స్థానాన్ని కృష్ణుడాక్రమించుకున్నాడు.

– డా. శ్రీ పోతుకూచి సుబ్రహ్మణ్యశాస్త్రి

– ‘ఋగ్వేద కథలు’ నుండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *