ఈ పోరాటం ఆగదు..

ఈ పోరాటం ఆగదు..
  • మహిళల అభ్యున్నతి కోసం అలుపెరుగని కృషి
  • దైర్య, సాహసాలకు ప్రతీక ‘భన్సారీదేవి’

సమాజంలో మహిళల పట్ల రోజురోజుకి పెరిగిపోతున్న వివక్ష, లైంగిక హింస, గృహహింస, బాల్య వివాహాలు, భ్రూణ హత్యలు, వరకట్న వేధింపులు మొదలైన అమానవీయ చర్యలు ఆమెను తీవ్రంగా కలచివేశాయి. వాటిని రూపుమాపేందుకు ఆ యువతి తీవ్రంగా ఉద్యమించింది. ఏళ్ల తరబడి రాజీలేని పోరాటం చేసి చివరకు విజయం సాధించింది. ఆమె ఎవరో కాదు.. రాజస్థాన్‌కు చెందిన భన్వారీదేవి.

1997లో సుప్రీంకోర్టు మహిళల రక్షణ విషయంలో కొన్ని మార్గదర్శకాలను రూపొందిం చింది. దానికి అనుగుణంగా 2013లో పార్లమెంటు చట్టం చేసింది. అయితే ఈ మార్గదర్శక సూత్రాలతో భన్వారీదేవి పేరు ముడిపడి ఉంటుంది.

ప్రస్తుత సమాజంలో లైంగిక అత్యాచారానికి గురైన స్త్రీ తనపై జరిగిన అత్యాచారం గురించి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసే వాతావరణం లేదు. ఒకవేళ ధైర్యంగా వెళ్లినా అక్కడ అధికారులు ఆ ఫిర్యాదును గౌరవంగా స్వీకరిస్తారన్న నమ్మకం లేదు.

మహిళల పట్ల సమాజం, ముఖ్యంగా పురుషులు చూపిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా భన్వారీదేవి పోరాటం సాగింది. రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌కు 55 కి.మీ. దూరంలో గల బటేరీ అనే గ్రామంలో ఈమె జన్మించింది. ఇక్కడ గుజార్‌ వర్గం చాలా బలమైనది. వారికి వ్యతిరేకంగా మిగతా వారెవరూ గొంతు ఎత్తరు.

రాజస్థాన్‌ ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశ పెట్టిన పథకాలు లబ్దిదారులకు అందించడం కోసం ‘సాథిన్‌’ (స్నేహితురాలు) అనే పదవికి మహిళల్ని నియమిస్తుంది. 1985 సంవత్సరంలో భన్వారీ సాథిన్‌గా నియామకం అయ్యింది. ఇది రాజస్థాన్‌ ప్రభుత్వ మహిళా విభాగం ప్రాజెక్టుకు అనుసంధానమై పనిచేస్తుంటుంది.

ఓ వైపు ప్రభుత్వ పథకాల గురించి మహిళలకు తెలియజేస్తూనే మరోవైపు భన్వారీ మహిళలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు పరిష్కరించడానికి నడుం బిగించింది.

అక్కడ బాలికలు పాఠశాలకు వెళ్లి చదువుకునే పరిస్థితి లేదు. దాంతో ఆమె ప్రతి ఇంటికి వెళ్లి తమ కూతుర్ని పాఠశాలలో చేర్పించి, విద్య నేర్పించమని ప్రోత్సహించింది. స్త్రీల రక్షణ, ఆరోగ్యం, కుటుంబ నియంత్రణ, ప్రసవానంతరంవారి ఆరోగ్యం మొదలైన విషయాల్లో వారికి అవగాహన కల్పించింది. స్త్రీలకు మగవారితో సమానంగా వేతనాలు కల్పించాలని పోరాడింది.

ఆ రోజుల్లో రాజస్థాన్‌లో బాల్య వివాహాలు కూడా ఎక్కువే. ఈ విషయంలో ప్రజలకు ఆమె ఎంతగానో అవగాహన కల్పించింది. బాల్య వివాహాలతో చిన్నారుల జీవితాలు నాశనమవుతాయని వారికి వివరించింది.

ఇక్కడి ప్రజలు గర్భస్థ శిశువు అమ్మాయి అని తెలియగానే భ్రూణ హత్యలకు పాల్పడేవారు. అటువంటి వారిలో స్త్రీ, పురుషులిద్దరూ సమానమే అనే భావన కల్పించింది. భ్రూణ హత్యలు నివారించడంలో కీలక పాత్ర పోషించింది.

రాజస్థాన్‌లో ‘అకా తీజ్‌’ పర్వదినం సందర్భంగా అనేక బాల్యవివాహాలు జరుపుతారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో భన్వారీ మరికొంతమంది మహిళలతో కలసి ఈ బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించింది.

భనార్వీది బాల్య వివాహం అయినందున దాని వల్ల కలిగే కష్టనష్టాలు ఆమెకు ప్రత్యక్షంగా తెలుసు. అందుకే ఆమె బాల్య వివాహాలను అంతగా వ్యతిరేకించింది.

అయితే ఆమె చేస్తున్న ప్రయత్నాలు గ్రామ పెద్దలకు నచ్చలేదు. భన్వారీ తమ ఆచారాలకు అడ్డుపడుతుందని, సంస్కృతి దెబ్బతినేలా చేస్తుందని వారు భావించారు. అదే సందర్భంలో ఒక కుటుంబం తమ తొమ్మిది నెలల పసికందుకు గుజార్‌ కులానికి చెందిన వ్యక్తికిచ్చి వివాహం చేయాలని నిశ్చయించారు. భన్వారీ ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అకా తీజ్‌ పండుగ రోజున జరగవలసిన వివాహం పోలీసుల జోక్యం వలన ఆగిపోయింది. ఈ సంఘటన జరిగిన తరువాత గుజార్‌లలో భన్వారీపై ఆగ్రహం పెరిగింది. బలహీన వర్గానికి చెందిన స్త్రీ తమ కుటుంబ విషయాలలో జోక్యం కల్పించుకోవడమేంటని వారు ఆమె మీద కోపం పెంచుకున్నారు. ఆమెకు తగిన శాస్తి చేయాలనకున్నారు.

భన్వారీ కుటుంబాన్ని సమాజం నుండి వెలివేశారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పెట్టారు. అంతేకాకుండా ఆమెపై అఘాయిత్యం కూడా చేశారు. నిమ్నకులాలను ఎంతగానో భయభ్రాంతులకు గురిచేశారు. అయినా ఆమె భయపడలేదు. ఉద్యమ బాట వీడలేదు. తనపై జరిగిన అన్యాయాన్ని ఎదుర్కోవడానికి న్యాయస్థానం తలుపు తట్టింది. ఆమెకు తోడుగా భర్త నిలిచాడు. న్యాయ విచారణలో బలత్కారం గురించి న్యాయస్థానంలో ఆమె గొంతెత్తి చెప్పింది. ఇది ఆమె ధైర్య సాహసాలకు ప్రతీకనే చెప్పాలి.

దురదృష్టవశాత్తు 1993లో న్యాయస్థానం తీర్పు నిందుతులకు అనుకూలంగా వెలువడింది. 5 నిందుతులు నిర్దోషులుగా విడుదలయ్యారు. వారిపై నేరం నిరూపితం కాలేదు. గత 26 సంవత్సరాలుగా ఇంకా ఆ కేసు రాజస్థాన్‌ హైకోర్టులో నలుగుతూనే ఉంది.

‘ఈ పోరాటం ఆగేది కాదు. వారు ఇంతకు మించి నన్నేం చేయగలరు? ఈ పోరాటం నాకోసం కాదు. స్త్రీలందరి కోసం. సమాజంలో మహిళల పట్ల వివక్ష ఎందుకు? కొడుకును గొప్పగా, కూతురిని తక్కువగా ఎందుకు చూస్తారు? ఇది మారాలి. సంతానం ఎవరైనా తల్లిదండ్రులు వారిని సమానంగా చూసుకోవాలి. చదువుకోవడానికి సమాన అవకాశాలు కల్పించాలి’ అంటుంది భన్వారీ.

ఆమె చేస్తున్న పోరాటం వృథా కాలేదు. ‘విశాఖ’ అనే వేదిక ద్వారా సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనాల వాజ్యం నమోదైంది. దానిపై స్పందించిన సుప్రీంకోర్టు స్త్రీలపై జరుగుతున్న లైంగిక హింసలను అడ్డుకునే దిశగా మార్గదర్శకాలను రూపొందించింది.

1997 సంవత్సరంలో అపెక్స్‌ కోర్టు ఈ విషయంలో కొన్ని మార్గదర్శకాలను సైతం ప్రకటిం చింది. ఫలితంగా చాలా కంపెనీలు పురుషులు మహిళా ఉద్యోగులతో ఎలా మసలుకోవాలో తెలియజేస్తున్నాయి.

భన్వారీ న్యాయ పోరాటం చేస్తూనే తన కూతురిని ఉన్నత చదువులు చదివించింది. ఆమె ఉపాధ్యాయు రాలిగా స్థిరపడింది. తల్లి చేస్తున్న ఉద్యమానికి తోడుగా నిలిచింది. మహిళల సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషి చూసి కొన్ని మహిళా సంఘాలు ఆమెకు తోడుగా నిలిచాయి.

భన్వారీ ఉద్యమం నుండి స్ఫూర్తి పొందిన జైసల్మేర్‌ గ్రామస్థులు తమ గ్రామంలో బాల్య వివాహాలు జరపొద్దని నిర్ణయం తీసుకున్నారు. ఇది ఒక గొప్ప విజయం. 2014లో అక్కడ ఆఖరి బాల్య వివాహాం జరిగింది. ఆ తరువాత బాల్య వివాహాలు జరగలేదు. మెల్లమెల్లగా ఈ బాల్య వివాహా నిషేధ ఉద్యమం సుమారు 177 గ్రామాలకు విస్తరించింది.

స్త్రీల అభ్యున్నతికి పాటుపడుతున్న భన్వారీదేవిని ఎన్నో అవార్డులు వరించాయి. దీనిపై ఆమె స్పందిస్తూ ‘ఈ అవార్డులు నాకు ఆనందాన్ని ఇవ్వవు. మహిళలు అన్ని రంగాలలో మగవారితో సమానంగా దూసుకెళ్లడమే నాకు నిజమైన ఆనందం’ అంటోంది.

– కె. అనిల్‌

– ది బెటర్‌ ఇరడియా సౌజన్యరతో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *