సన్యాసికీ, సమాజానికీ ఉన్న బంధం!

సన్యాసికీ, సమాజానికీ ఉన్న బంధం!

ఒక దేశ పాలనా వ్యవహారాలు, సామాజిక కట్టుబాటు ఆ నేల నుంచి వచ్చిన సంప్రదాయం నుంచి, చరిత్ర నుంచి, పరంపర నుంచి ఆవిర్భ వించాలి. ఈ పరిణామం అత్యంత సహజంగా జరగాలి. వీటిని గుర్తు చేసుకోవలసి వచ్చిందంటే, ఎవరో వచ్చి గుర్తు చేయవలసి వచ్చిందంటే ఆ దేశం పరాయి పాలన, పరాయి చింతనలోకి వెళ్లినట్టే. భారతదేశం ఇలాంటి పరిస్థితిని పలుసార్లు ఎదుర్కొన వలసి వచ్చింది. యదా యదాహి ధర్మస్య అన్నట్టు ధర్మానికి గ్లాని ఏర్పడిన ప్రతిసారి ఒక మహాను భావుడు జన్మించడం మన చరిత్రలో గమనిస్తాం. ఆది శంకరులు మొదట అలాంటి కర్తవ్యాన్ని నిర్వర్తించారు. తరువాత విద్యారణ్యస్వామి ఆ మహత్కార్యం పూర్తి చేశారు. ఆ తరువాత చెప్పుకోవలసిన పేరు సమర్థ రామదాసు. ఇక సమీప గతంలోకి చూస్తే రామకృష్ణ పరమహంస శిష్యుడు స్వామి వివేకానందులు కనిపిస్తారు. వీరందరి జీవితంలోను కనిపించే ఏకాత్మత- సన్యాసి అంటే ముక్కు మూసుకుని ధ్యానం చేసేవాడు మాత్రమే కాదు, సన్యాసికీ, సమాజానికీ ఒక బంధం ఎప్పటికీ ఉంటుంది. సర్వ సంఘపరిత్యాగం అనుకుంటూ సమాజం సంక్షుభితమైపోతున్నా, ముక్కు మూసుకుని కూర్చుంటే వచ్చేది మోక్షం కాదు, బానిసత్వం అన్న వాస్తవం తెలుసుకోవడం కూడా.

ఇందులో సమర్థ రామదాసస్వామి మొగలుల పాలనతో దేశం అల్లకల్లోలం అవుతున్న సమయంలో, హిందూ ధర్మానికి ముప్పు ఏర్పడిన సమయంలో శివాజీ మహరాజ్‌ను ఈ సమాజం కోసం తీర్చిదిద్దారు. ఆ ఇద్దరి గురుశిష్య సంబంధం ఒక అద్భుతం. రామదాస స్వాముల చరిత్ర ఇప్పుటికే తగినంతగా వచ్చింది. కానీ చరిత్ర పరిశోధన అనేది ఒకచోట ఆగిపోదు. కొత్త తరాల పరిశోధనలో కొత్త విషయాలు తెలుస్తాయి. కొత్త వెలుగులు కనిపిస్తాయి. ‘ఛత్రపతిని నడిపించిన సమర్ధత’ పుస్తకం అలాంటిదే. శ్రీస్వామినాథ ఆత్రేయ తమిళ మూలగ్రంథానికి కొంపెల్ల లక్ష్మీసమీరజ (జె. సుజాత సహకారంతో) అందించిన తెనుగు సేత ఇది. ఇదొక చరిత్ర గ్రంథం. ఈ గ్రంథం మన చేతులలోకి రావడం వెనుక కూడా కొంత చరిత్ర ఉంది. కానీ ఇది పూర్తిగా చరిత్ర గ్రంథం అనిపించుకోదు. అలాగే నవలా ప్రక్రియను కూడా ఎంచుకోలేదు. కానీ పాఠకుల మదిని ఆకట్టుకునే విధంగా, స్ఫూర్తి కలిగించే విధంగా మాత్రం రచన సాగింది.

రామదాసస్వాములు అసలు పేరు నారాయణుడు. ఈ పుస్తకం ప్రధానంగా ఆయన జీవితం గురించి చెబుతుంది. ఆయన బాల్యం, అందులో కనిపించే వెలుగులు, అద్భుతాలు చక్కగా వివరించారు రచయిత. రామదాసస్వామి సమకాలీన సమాజం సంక్షుభితం. మొగలుల పాలన ఇందుకు కారణం. కడపటి మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబు పాలన భారతదేశానికి పెద్ద శాపం. అంతటి బలవంతుడైన పాదుషా మీద దండెత్తే గుండె ధైర్యం శివాజీకి కల్పించారు రామదాసులవారు. కానీ ఇది రెండు మతాల మధ్య ఘర్షణ కాదు. శివాజీ సేనలో ముస్లింలు ఉన్నారు. ఇలాంటి సంస్కృతీ పరిరక్షకుని రూపొందించడానికి ఆ పరిస్థితులు దోహదం చేశాయి. శివాజీ వంటి శిష్యుని తయారుచేసిన రామదాసుల వారి అంతరంగం ఇంకెంత పరిపక్వ మైనది? అది ఇందులో తెలుస్తుంది. రామదాసుల బాల్యంలోనే అందుకు సంబంధించిన బీజం పడింది. బాలకాండమ్‌, యాత్రాకాండమ్‌, మారుతి కాండమ్‌, శాహ్‌జీ కాండమ్‌, శివాజీ కాండమ్‌, సమర్థుని బ్రహలయం, సమర్థుడు రచించిన గ్రంథాలు, హనుమంతా రామదూతా అనే అధ్యాయాలలో ఈ అంశాన్ని రచయిత పొందుపరిచారు.

శంకర భగవత్పాదుల వలెనే రామదాసస్వామి కూడా భారత యాత్ర చేశారు. అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించారు. నాసిక్‌లోను, కాశీలోను ఆయన ఇచ్చినట్టు చెబుతున్న ప్రసంగాలను పరిశీలిస్తే ఒక విషయం బోధ పడుతుంది. భారతీయత గొప్పది. కానీ విదేశీ దండయాత్రల సమయంలో భారతీయ తతో పాటు, జాతీయతను, దానికి సంబంధించిన స్ఫూర్తిని కూడా తీసుకోవాలి. అలా భారతీయత, జాతీయతను ఏకాంశంగా చూడక భారతీయులు ఇక్కట్లు పడ్డారు. హిందూ ధర్మాన్ని రక్షించుకోవా లంటే, భారతీయుడిని అన్న స్పృహతో పోరాడాలన్న వాస్తవం తెలియాలి. వారందరి జీవితాలు ఇవే చెబుతున్నాయి.

ఈ పుస్తకంలో కనిపించే మరొక అంశం ఆనాటి (పదిహేడో శతాబ్దం) సామాజిక స్థితిగతులు. అలాగే సెంజన్‌గఢ్‌కు తపస్సుకు స్వామి నిష్క్రమించిన ఘట్టం కూడా ఇందులో కీలకం. అప్పటికి పరిస్థితులు మారి పోయాయి. తన ప్రియశిష్యుడు, హిందూ సామ్రా జ్యాన్ని నిర్మించి పెట్టిన శివాజీ మరణించాడు. ఆయన కుమారుడు శంభాజీ చరిత్రహీనుడైనాడు. అది సమర్ధ రామదాసులవారు చూడవలసి వచ్చింది. కానీ శివాజీ అనే ఒక పాలకుని వలన హిందూమతం కొద్దికాలం విదేశీ దుండగీడుతనం నుంచి రక్షణకు నోచుకుంది. ఈ అంశాలనే ఇందులో రమణీయంగా అందిం చారు. ఇలాంటి పుస్తకాలు చదవవలసిన అవసరం ఏ దేశానికయినా ఎప్పటికీ ఉంటుంది.

ఛత్రపతిని నడిపించిన సమర్ధత

రచన : కొంపెల్ల లక్ష్మీసమీరజ

పుటలు : 202,

వెల : రూ.125/-

ప్రతులకు : సాహిత్యనికేతన్‌

కేశవ నిలయం, బర్కత్‌పురా,

హైదరాబాద్‌ – 500 027

ఫోన్‌ : 040-27563236

సాహిత్యనికేతన్‌, ఏలూరు రోడ్‌, గవర్నర్‌పేట, విజయవాడ – 500 020

సెల్‌ : 9440643348

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *