చారిత్రక వాస్తవాలకూ మరణ దండన వేద్దామా!

చారిత్రక వాస్తవాలకూ మరణ దండన వేద్దామా!

దేశం కోసం జీవితాన్ని అర్పించడం, ప్రాణత్యాగం చేయడం ప్రపంచ చరిత్రలో చాలా సందర్భాలలో చదువుతాం. ఒక ఉద్యమం కోసం అనేక మంది జీవితాలను అర్పించడం కూడా చూస్తాం. కానీ వారిలో ప్రపంచం గుర్తుంచుకునేది కొందరినే. చరిత్ర పుటలకు ఎక్కేది కూడా కొందరి జీవితాలే. భగత్‌ సింగ్‌ జీవితం, త్యాగం అలాంటివే. భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో భగత్‌ సింగ్‌ స్థానం సుస్థిరమైనది. ఆయన అద్భుత జీవితం గురించి వచ్చిన అనేక పుస్తకాలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తాయి.

ఎస్బీ చౌదరి రాసిన ‘షహీద్‌ భగత్‌ సింగ్‌’ పుస్తకం కూడా అందులో ఒకటి. భగత్‌ సింగ్‌ నడయాడిన పలు ప్రదేశాలను చూసిన తరువాత చౌదరి ఈ రచనకు ఉపక్రమించారు. అసలు భగత్‌ సింగ్‌ జీవితం, విప్లవం గురించి రచయితకు ఆసక్తి ఎలా ఏర్పడిందో తెలుసుకోవడం ఆసక్తి కలిగించే విషయం.

భగత్‌ సింగ్‌కు ఉరిశిక్ష పడింది. గాంధీజీ-ఇర్విన్‌ చర్చల సందర్భంగా భగత్‌ సింగ్‌ను విడిచి పెట్టే విషయం గురించి ప్రస్తావించాలని ఆనాడు చాలామంది అభిలషించారు. ఆ చర్చలలో భగత్‌ సింగ్‌ ఉరిశిక్ష రద్దును గురించి ఎలాంటి ప్రస్తావన జరిగిందో ఇప్పటికీ తగిన సమాచారం అందడం లేదు. ‘వైస్రాయ్‌తో సంధి షరతులు మాట్లాడుతున్న గాంధీజీ సత్యాగ్రహులందరి విడుదల కోరినా సంపూర్ణ స్వాతంత్య్రం కొరకు పోరాడి ప్రాణాలు అర్పించుటకైనా వెనుకాడని ఈ విప్లవవీరుల గురించి కాని, వారి మరణశిక్ష రద్దు కోసం గాని కచ్ఛితమైన షరతు పెట్టడం గాని, కనీసం వాగ్ధానం పొందడం గానీ చేయలేదు’ అంటారు రచయిత. ‘ఆయన (గాంధీజీ) భారతీయుల ప్రతినిధిగా కూర్చుని విప్లవయోధుల మరణదండన రద్దు చేయించాలి అన్న ప్రజల మనస్సులోని కోర్కెను సరైన సమయంలో విస్మరించాడు’ అంటూ రచయిత ఆక్రోశించడంలోని హేతువును అర్థం చేసుకోవలసిందే. కానీ ఆ చర్చలలో స్వాతంత్య్రం ఇచ్చినట్టే కనిపించింది కాబట్టి గాంధీజీ తప్తి పడ్డారని, ఆ ముగ్గురు వీరుల ఉరిశిక్షను రద్దు చేయించడానికి గాంధీజీ ప్రయత్నించ లేదనడం సరికాదని కొందరు వాదిస్తారు. కానీ దీనితో కూడా రచయిత విభేదించారు. అలాగే భగత్‌ సింగ్‌ మరణశిక్ష రద్దు గురించి గాంధీ చేసిన గట్టి వాదనను బ్రిటీష్‌ ప్రభుత్వం అంగీకరించ లేదంటూ నెహ్రూ స్వీయ చరిత్రలో రాసుకున్న దానిలోనే కొంత వాస్తవం ఉందని అంటారు రచయిత. ఏమైనా భగత్‌ సింగ్‌ ఉరిశిక్ష రద్దు ఆనాటి భారతావని ముక్తకంఠంతో కోరుకున్న విషయం. దానిని సాధించలేని నాటి జాతీయ కాంగ్రెస్‌ నాయకత్వం ఆ నిందను భరించింది. ఇలాంటి పలు అంశాలను ఈ పుస్తకంలో రచయిత పొందు పరిచారు. భగత్‌ సింగ్‌కు పడిన మరణ దండనను రద్దు చేయించ డానికి నాటి కాంగ్రెస్‌ నాయకత్వం నిర్లక్ష్యం చూపింది. కానీ ఆ మహా త్యాగి చరిత్రనైనా మనం బతికించు కోవాలి. రచయిత స్వయంగా పంజాబ్‌లో పర్యటించి రాసిన పుస్తకం కావడం వల్ల మరింత పఠనీయత సంతరించుకుంది. విద్యార్థులు, చరిత్ర అభిమానులు తప్పనిసరిగా చదవలసిన పుస్తకం.

షహీద్‌ భగత్‌ సింగ్‌

రచన : ఎస్బీ చౌదరి

పుటలు : 87, వెల : రూ.100/-

ప్రతులకు :విజయా రెసిడెన్సీ-1, 54-4-1/6, శీలానగర్‌, రాజమహేంద్రవరం. ఆంధ్రప్రదేశ్‌.

-శ్రీరామ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *