ఇదేనా రేపటి చరిత్ర!

ఇదేనా రేపటి చరిత్ర!

‘ఇవాళ్టి రాజకీయాలే రేపటి చరిత్ర’ అంటాడు కాలింగ్‌వుడ్‌. రాజకీయం వ్యవస్థను శాసిస్తుంది. తీర్చిదిద్దే బాధ్యత కూడా దానిదే. కాబట్టి రాజకీయాలు లేని సమాజాన్ని ఊహించలేం. మనందరినీ నడిపించేదీ రాజకీయమే. కాబట్టే రేపటిచరిత్ర అంటే ఇవాళ్టి రాజకీయాలు అంటూ సూత్రీకరించవలసి వచ్చింది. ఇక్కడే ఒక ప్రశ్న- ఈ సూత్రీకరణ ప్రకారం రేపటి భారతీయ చరిత్ర ఎలా ఉండబోతోంది? ఇది తలుచుకుంటే అనంతమైన క్షోభ తప్పదు. కారణం- ఇవాళ్టి భారత రాజకీయాలు, వాటి వికృత రూపం. సరిగ్గా ఆ రాజకీయాల మీద ప్రత్యక్ష వ్యాఖ్యానమే ‘ఫోర్త్‌ ఎస్టేట్‌’. డాక్టర్‌ పి. భాస్కరయోగి ఒక తెలుగు దినపత్రిక కోసం రాసిన వ్యాసాల సంకలనమిది.

డాక్టర్‌ యోగి వ్యాసాలలో అంశం, వాటికి నేపథ్యంగా ఉన్న కాలం చాలా క్లిష్టమైనవి. జాతీయ వాదం గురించి ఎవరు ఎలా మాట్లాడినా, దానికి భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో ఆమోదం లభిస్తున్న కాలం. రాజకీయ పరిణామాలను నమోదు చేసే పత్రికలు అత్యంత హేయమైన పాత్రను నిర్వహిస్తున్న కాలం. అన్నిటికీ మించి ఈ దేశంలో మెజారిటీ మతస్తులను కించ పరచడమే ఆధునిక దృష్టికి గీటురాయి అన్న విధ్వంసకర సంస్కృతిని పెంచి పోషించుకుంటున్న కాలం. ఇందులో చోటు కల్పించిన అరవై వ్యాసాలు కూడా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇవే అంశాలను ప్రశ్నించాయి. ఆలోచనాపరంగా యోగికీ కొన్ని అభిప్రాయాలు ఉండి తీరతాయి. కానీ ఈ వ్యాసాలు చదివిన తరువాత ఆయన ఒక జాతీయవాది, జాతీయవాదమే ఆయన మతం అన్న అభిప్రాయానికి పాఠకులు వెళతారు.

ఈ దేశంలో ఎక్కువ మందికి రామాయణం పారాయణ గ్రంథం. కానీ ఆ గ్రంథం మీద ఐదారేళ్లకొకసారి ఏదో ఒక ‘మేధో’ శిబిరం ఏదో ఒక వివాదం లేవదీస్తూనే ఉంది. ఆ మహా కావ్యాన్ని, అందులో నాయకుడు శ్రీరాముడిని అవమానించడం కనిపిస్తూనే ఉంది. అదే అంశాన్ని తీసుకుని రాసిన వ్యాసం ‘మలర ఇదేల రామాయణంబన్న…’. నిజమే, చాలా చిత్రమైన మేధావులు ఈ దేశంలో కనిపిస్తారు. దేవాలయాల మీద బూతుబొమ్మల గురించి మొత్తం హిందూమతాన్ని తూర్పార పట్టేవాళ్లు, ఎంఎఫ్‌ హుస్సేన్‌ అనే ”కళాకారుడు” తన కారు మీద సరస్వతీ అమ్మవారి బొమ్మను నగ్న రూపంతో చిత్రిస్తే మాత్రం అందులో కళాత్మకతను చూడమంటారు. అతడు జీవిత చరమాంకంలో ఈ దేశం విడిచి వెళ్లి పోవడానికి అయోధ్య రాముడి పార్టీ ‘ఫాసిజమే’ కారణమని చాలాకాలం వాదించారు.

చరిత్రను కాషాయీకరించడానికి బీజేపీ కుట్ర పన్నిందని వామపక్ష మేధావులు, వీరి తైనాతీలు తరుచు నోరు పారేసుకుంటూ ఉంటారు. వారి ఉద్దేశంలో చరిత్రను వక్రీకరించడం కాబోలు. ఆర్‌ఎస్‌ఎస్‌ అనే సంస్థ పేరు చెప్పి రాహుల్‌ మొదలు, కమ్యూనిస్టులు, స్వయం ప్రకటిత మేధావులు అంతా కూడా కాషాయీకరణ జపం చేస్తూనే ఉన్నారు. వీరి ఉద్దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌ను భారతీయ సమాజం బహిష్కరించాలి. ఆ అభిప్రాయం వాళ్లలో ఎంత బలంగా ఉందంటే మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌కుమార్‌ ముఖర్జీ ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమానికి హాజరైనా కూడా పెద్ద రగడ సృష్టించేందుకు నానా తంటాలు పడ్డారు. ప్రణబ్‌ కాంగ్రెస్‌వాది. ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌ శిబిరానికి వచ్చి ఒక కార్యక్రమంలో పాల్గొంటేనే అపవిత్రు డవుతారా? అలా అయితే గాంధీజీ, అంబేడ్కర్‌, లోక్‌నాయక్‌ జెపి వంటివారిని కూడా వారు అంటరాని వారికింద జమ కడుతున్నట్టే. వారంతా కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ శిబిరాన్ని సందర్శించారు. కాబట్టి గమనించవలసినది చరిత్రను వక్రీకరించడంలో ఇక్కడ వామపక్షాలను మించినవారు లేరు. ఈ విషయాన్నే ‘సంఘ్‌ చెంతకు ప్రణబ్‌ వెళితే తప్పేమిటి?’ వ్యాసంలో యోగి ప్రశ్నించారు.

యోగి మరొక ప్రశ్న వేసి ఉంటే బాగుండేది. ప్రణబ్‌ను కాదు, వామపక్షమేధావులకు కాదు, ప్రజలకు ఆ ప్రశ్న వేయాలి. చరిత్రను గుర్తుంచు కోవలసిన అవసరం మీకు లేదా? మనం ఆసక్తి చూపని చరిత్రకే వామపక్ష మేధావులు వేరొక రూపం అతికిస్తున్నారు.

హిందూ జీవన విధానం, హిందువుల ఆరాధ్యదైవాలు, గ్రంథాలు, వారు కొలిచే మహా పురుషులు ఇప్పుడు అపహాస్యానికి అవమానాలకి గురవుతున్నారు. దీని మీద రచయిత ఆవేదన అర్థం చేసుకోవలసినదే. ఈ వికృతి ధోరణికి కేంద్ర బిందువు ప్రధానంగా మీడియా. కాబట్టి ఆయన మీడియా మీద తన ధర్మాగ్రహం వెళ్లగక్కారు. ఇందుకు ఆజ్యం పోస్తున్న నాయకుల మీద కూడా చెణుకులు విసిరారు. ‘విజ్ఞత మరచి.. విద్వేషం దేనికి?’, ‘హిందుత్వంపై అసహనం ఎందుకంటే!’, ‘మార్క్సిస్టులు (ఏ)దేశభక్తులు?’, ‘హిందువులు నిజంగా మతతత్వ వాదులేనా?’, ‘బీసీల గొంతు నొక్కి, మైనారిటీలకు తాయిలాలు’, హైందవం అజరామరం’ వంటి వ్యాసాలు ఆలోచింపచేసేవిగా ఉన్నాయి. ఇలాంటి ధోరణులను ఎదుర్కొనడానికి హిందువు చైతన్యవంతం అవుతున్నాడని కూడా రచయిత నమ్ముతున్నారు. కానీ, ఇవన్నీ చదివిన తరువాత రేపటి చరిత్రను చదివే భావి భారత పౌరుడికి ఎలాంటి అభిప్రాయాన్ని మనం కలిగిస్తాం? ఇది ఆందోళన కలిగిస్తుంది. దానికి మొదలు చేయవలసిన పని హిందువులు ఐక్యంగా ఉండడమే. అది కూడా రచయిత చెప్పారు. ఇది అందరూ చదవదగిన పుస్తకం.

ఫోర్త్‌ ఎస్టేట్‌ (వ్యాస సంకలనం)

రచన : డాక్టర్‌ పి. భాస్కరయోగి

పుటలు :  328

వెల :  రూ.400/-

ప్రతులకు :  అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో

సెల్‌ : 9912070125

– శ్రీరాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *