ఆలయ సంస్కృతిని తెలిపే ఆలయములు-ఆగమములు

ఆలయ సంస్కృతిని తెలిపే ఆలయములు-ఆగమములు

దేవాలయం హిందూ ధర్మానికి హిమాలయ శిఖరం వంటిది. అటువంటి ఆలయాల విశిష్టత, ఆగమశాస్త్ర నిబంధనలను గురించి రచయిత కందుకూరి వేంకట సత్య బ్రహ్మాచార్య ‘ఆలయములు- ఆగమములు’ పేరుతో ఒక గ్రంథం రచించారు. మన దేవాలయాల నిర్మాణానికి సంబంధించిన 250కి పైగా అంశాలు ఈ గ్రంథంలో క్రోడీకరించారు.

కందుకూరి వేంకట సత్య బ్రహ్మాచార్య ఆగమశాస్త్ర పండితులుగా పేరుగాంచారు. అనేకమంది సంప్రదాయ శిల్పులకు ఆగమశాస్త్ర రీతిగా విగ్రహ నిర్వహణ విధానం, ఆగమ సంప్రదాయ విషయంలో బోధన చేశారు. వీరు ఈ గ్రంథాన్ని పరిశోధ నాత్మకంగా రచించారు.

ఆలయములు – ఆగమములు గ్రంథంలో వివిధ ఆలయాలను గురించి, వాటి నిర్మాణం, వివిధ ప్రాశస్త్యములు గల ఆలయాలను గురించి వివరణాత్మకంగా చిత్రాలలో సహా వివరించారు. విగ్రహారాధన ప్రాధాన్యత, ఆవశ్యకత, విగ్రహ తత్వాలను గురించి విశదీకరించారు. ఆగమశాస్త్రం- శిల్పశాస్త్రం, ఆగమ సాంప్రదాయాలను గురించి వివరించారు. ఒక అధ్యాయంలో వివిధ సంప్ర దాయాలు గల మందిరాలను గురించి, వివిధ దేవాలయాల శిల్ప ప్రతిష్టలను గురించిన వివరాలను చిత్రాలతో వివరించారు. ఒక అధ్యాయంలో వివిధ ఆరాధనా పద్ధతులను గురించి సవివరంగా ప్రస్తావించారు. వివిధ దేవాలయల ఉత్సవాలను గురించి వివరించారు. ‘ప్రతి ఒక్కరు దేవాలయాలను దర్శించాలి, దేవాలయాలు దేవునికి నిలయాలు, మానవుని మనుగడకు, చిత్తశుద్ధికి, ప్రశాంత జీవనానికి ఏకైక గమ్యస్థానం’ అంటారు రచయిత. ఆలయాల ఆలంబన లేకుండా హైందవ సంస్కృతి చుక్కాని లేని నావ వలె ఉంటుందంటారు. దేవాల యాలు ధ్వంసమైనపుడు వాటిని జీర్ణోద్ధరణ చేయకుంటే అక్కడ దుర్భిక్షం, ప్రజా పీడన, రాజపీడన జరుగుతుందని, ప్రజలు అనేక ఆపదలకు గురవుతారని ఆగమశాస్త్రం చెబుతున్నదని రచయిత పేర్కొన్నారు. ఆలయాలు జీర్ణోద్ధరణ ఏ విధంగా చేయాలో రచయిత సవిరంగా తెలిపారు. ఆలయాలు, ఆగమాలకు ఉన్న అవినాభవ సంబంధాన్ని ఈ గ్రంథం తెలియ జేసింది. ప్రతి ఆలయంలోనూ, ఆయా ఆగమములు, వాటి విధానాలు, అవి సూచించిన మార్గంలోనే ఆలయ నిర్వహణ జరగాలని రచయిత విన్నవించారు. ఆలయ అభివృద్ధిని ఆగమ క్రియలతో పరిపుష్టం చేయాలని, అందుకోసం ఆలయ సంస్కృతిని, ఆగమ ఆదేశాలను విధిగా పాటించాలని రచయిత పేర్కొన్నారు.

దేవాలయాల విశిష్టతను గురించి తెలుసు కోవాలంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవవలసిన పుస్తకం ‘ఆలయములు – ఆగమములు’.

 

‘ఆలయములు – ఆగమములు’

రచన : కందుకూరి వేంకట సత్య బ్రహ్మాచార్య

వెల : రూ. 250/-

పుటలు : 260

ప్రతులకు : హిందూ దేవాలయ ప్రతిష్ఠాపీఠం

1-2-145/13, శ్రీనివాసనగర్‌ కాలనీ

ముషీరాబాద్‌, హైదరాబాద్‌-500020

 

– డా|| జి.వెంకటేశ్వర్రావ్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *