స్థిరమైన వృద్ధి

స్థిరమైన వృద్ధి

పదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో జరిగిన అవినీతి, నాయకుల బాధ్యతారాహిత్యాన్ని చూసిన భారత ప్రజలు దేశ అభివృద్ధిపై నమ్మకాన్ని కోల్పోయారు. మార్పు కోరుకున్నారు. దేశ అభివృద్ధిని కాంక్షించే జాతీయవాద ప్రభుత్వానికి పట్టం కట్టారు. ప్రధాని మోదీ దేశ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ నేడు దేశాన్ని స్థిరవృద్ధిలో నిలిపారు. దేశ అభివృద్ధి పట్ల ప్రజలలో మళ్లీ నమ్మకాన్ని నింపారు.

అంతర్జాతీయంగా ఉన్న తీవ్ర ప్రతికూల పరిస్థితుల వల్ల ముడి చమురుధరలలో హెచ్చు తగ్గులున్నప్పటికీ 2014 నుండి భారత ఆర్థికరంగం స్థిరమైన వృద్ధిని కొనసాగిస్తోంది. 2018-19లో భారత స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 7.2 శాతంగా నమోదైంది. 2012-13లో 9.9 శాతానికి ఎగబాకిన ద్రవ్యోల్బణం, వినియోగ ధరల సూచి 2017-18 నాటికి 3.6 శాతానికి దిగివచ్చింది. కరెంటు ఖాతాలోటు కూడా 2018-19లో జీడీపీలో 2.7 శాతంగా ఉంది. అంతర్జా తీయంగా ముడిచమురు ధరలు పెరగడంతో దిగుమతుల విలువ పెరిగి కరెంటు ఖాతా లోటు కొద్దిగా పెరిగినప్పటికీ ప్రభుత్వం ఆర్ధికవృద్ధికి తీసుకుంటున్న పలు చర్యలు సత్ఫలితాలను ఇవ్వడంతో సులభతర వాణిజ్య దేశాల జాబితాలో భారత్‌ 23 స్థానాలను మెరుగుపర్చుకొని 77వ స్థానానికి ఎగబాకింది. ఇది ప్రపంచ బ్యాంకు 2018 సంవత్సరానికి గానూ విడుదల చేసిన నివేదిక. అంతేగాక ప్రపంచంలోని అగ్ర ఆర్థిక వ్యవస్థల జాబితాలో భారత్‌ ఆరో స్థానానికి ఎగబాకింది. త్వరలోనే బ్రిటన్‌ను కిందికి నెట్టి ఐదో స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. 2018 డిసెంబరు నాటికి దేశంలో మొత్తం విదేశీ మారక నిల్వలు 393.4 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లుగా ఉన్నాయి. 2014లో నరేంద్రమోదీ ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వం తీసుకున్న పటిష్టమైన చర్యలే దీనికి కారణం.

ఆర్థిక సంస్కరణలు

దేశంలో తొలిదశ ఆర్థిక సంస్కరణలకు 90వ దశకంలో నాటి ప్రధాని పివి నరసింహరావు బీజాలు వేయగా, భాజపా ఆధ్వర్యంలో ప్రధాని వాజపేయి మలి దశ సంస్కరణలను ప్రారంభించారు. రవాణా, సమాచార, సేవా రంగాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. దేశంలోని ఆ చివర నుండి ఈ చివరి వరకు 4 లైన్లు, 6 లైన్ల జాతీయ రహదారులను నిర్మించారు. ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజనతో ప్రతి గ్రామాన్ని అక్కడి చిన్న పట్టణంతో కలిపేలా రహదారులను నిర్మించారు. సాంకేతిక రంగంలో విప్లవానికి బీజం వేశారు. మొబైల్‌ఫోన్లు, వివిధ శాటిలైట్‌ ఛానళ్ల ప్రసారాలు ప్రారంభం కావడంతో ప్రజలకు సమాచారం వేగంగా అందడం ప్రారంభ మైంది. సేవారంగంలో వృద్ధి నమోదు కావడంతో ప్రజలకు వివిధ రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. వాజపేయి తెచ్చిన ఈ మలి దశ సంస్కరణల వల్ల దేశంలో ఆర్థిక వృద్ధిరేటు గణనీయంగా పెరిగి ప్రజల ఆదాయం కూడా అదే రీతిలో పెరిగింది. అయితే ఈ కాలంలో దేశంలో అత్యధికమందికి ఉపాధి అందించే వ్యవసాయ రంగంలో వృద్ధి లేకపోవడం ఒక లోపం. ఆ సమయంలో తగినన్ని రుతుపవనాలు లేకపోవడం, ప్రభుత్వం కూడా దీనిపై సరైన దృష్టి పెట్టకపోవడం కొంత కారణంగా చెప్పవచ్చు.

కాంగ్రెస్‌ హయాం – అంధకారం

వాజపేయి తరువాత 2004లో అధికారంలోకి వచ్చిన సోనియాగాంధీ అధ్యక్షురాలుగా ఉన్న కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ-1 ప్రభుత్వానికి వాజపేయి కాలంలో అమలైన సంస్కరణల సత్ఫలితాలు తెచ్చిన నిధులు నిండుకుండలా దొరికాయి. ఈ నిధులను తమ అసమర్థ విధానాల ద్వారా సోనియా నేతృత్వంలోని యూపీఏ-1, 2 ప్రభుత్వాలు నేలపాలు చేశాయి. పెరిగిన సంపదను అనుత్పాదక రంగాలకు మరలించడంతో పాటు నేల నుంచి నింగి వరకూ అన్ని రంగాల్లో అవినీతికి పాల్పడ్డాయి. 2004 నుంచి 14 మధ్య పదేళ్ల కాలంలో అనేక ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయలను కాంగ్రెస్‌ ప్రభుత్వంలోని పెద్దలు దోపిడీ చేశారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కీలుబొమ్మను చేసి సంపదను దోచుకోడానికే ప్రాధాన్య మిచ్చి దేశ భవిష్యత్తును కాంగ్రెస్‌ అంధకారంలోకి నెట్టింది.

ప్రత్యేక శ్రద్ధతో మోదీ

అటువంటి అంధకార పరిస్థితిలో 2014లో భాజపా తరపున ప్రధాని అయిన నరేంద్రమోదీ వాజపేయి ప్రారంభించిన మలి దశ సంస్కరణలను సుడిగాలి వేగంతో ముందుకు నడిపించారు.

జన్‌ధన్‌తో పటిష్ట బ్యాంకింగ్‌

ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు గుర్తు పటిష్టమైన బ్యాంకింగ్‌. ప్రజలందరూ తమ ఆర్థిక లావాదేవీలను బ్యాంకు ద్వారా జరుపుతున్నప్పుడే బ్యాంకింగ్‌ వ్యవస్థ పటిష్టమవుతుంది. బ్యాంకుతో అనుసంధానమైతే ప్రజలకు కూడా ఎన్నో ప్రయోజనాలు అందుబాటు లోకి వస్తాయి. ఋణ సౌకర్యాలు మెరుగై ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. దీనిని గుర్తించిన మోదీ భారత్‌లో బ్యాంకింగ్‌ వ్యవస్థకు దూరంగా ఉన్న కోట్లాది మంది ప్రజలను జన్‌ ధన్‌ ఖాతాలతో బ్యాంకింగ్‌ వ్యవస్థకు అనుసంధానం చేశారు. బ్యాంకింగ్‌ వ్యవస్థ ద్వారా వివిధ సంక్షేమ పథకాల ఫలాలను నేరుగా లబ్దిదారుల ఖాతాలలో జమ చేయడం ప్రారంభించారు. జన్‌ధన్‌తో పాటు మొబైల్‌ వినియోగం పెంచడం దీనికి ఎంతగానో తోడ్పడింది. వీటికి ఆధార్‌ను అనుసంధానం చేయడంతో నకిలీలకు అడ్డుకట్ట పడింది. కోట్లాది రూపాయల నిధుల దుర్వినియోగం ఆగింది.

నల్ల, నకిలీ ధనానికి అడ్డుకట్ట

మలి దశ ఆర్థిక సంస్కరణల్లో భాగంగా మోదీ తీసుకున్న నోట్ల రద్దు, వస్తువులు సేవల పన్ను వంటి నిర్ణయాలు దీర్ఘకాలంలో ప్రజలకు ఎంతో మేలు చేయనున్నాయి. దేశంలో పెరుగుతున్న నల్లధనంపై చర్చ ఇందిరాగాంధీ హయాం నుండే జరుగుతోంది. కానీ నల్లధనం ఎంత మొత్తంలో ఏ రూపంలో ఉందో ఎవరికీ తెలియదు. నల్లధనాన్ని గుర్తించడానికి, దానిని బ్యాంకులలోకి తేవడానికి, దేశంలోని అసాంఘిక శక్తుల వద్ద ఉన్న నల్లధనాన్ని వెలికి తీయడానికి, నకిలీ ధనాన్ని నిర్మూలించడానికి, పాక్‌ ప్రేరేపిత ఇస్లామిక్‌ తీవ్రవాదుల ద్వారా దేశంలోకి వస్తున్న నకిలీ ధనాన్ని అరికట్టడానికి ప్రధాని మోదీ నోట్లరద్దును ప్రకటించారు. నల్లధనాన్ని వెలికి తేవాలన్నా, నకిలీ ధనాన్ని పనికిరాకుండా చేయాలన్నా ఒకే ఒక్క ఆయుధం నోట్ల రద్దు. ఇది చేయడానికి ఎన్నో ప్రభుత్వాలు ధైర్యం చేయలేకపోయాయి. సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నరేంద్ర మోదీ నోట్ల రద్దుకు సంకల్పించారు. అకస్మాత్తుగా ధైర్యంగా నిర్ణయాన్ని ప్రకటించారు. ఏ రోజుకారోజు అధికార గణంతో సమన్వయ సమావేశాలు నిర్వహించి నోట్ల రద్దు సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తగ్గించారు. ఇంత పెద్ద దేశంలో కేవలం నెలరోజుల్లో అందరికీ కొత్త నోట్లను అందుబాటులోకి తెచ్చారు.

మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం దొంగలకు మెరుపుదాడిని తలపించింది. వారు ఏమీ పాలుపోక మోదీని నిందించడం మొదలు పెట్టారు. నోట్ల రద్దును తిరోగమన చర్యగా విమర్శించారు. నోట్ల రద్దుతో నల్లధనాన్ని కోల్పోయిన వారంతా ఒక్కటై మోదీపై దాడి చేయడానికి అనేక కుయుక్తులు పన్నారు. రోజుకో కొత్త వార్తను సృష్టించి గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారు. అయితే ప్రధాని మోదీ వీటన్నింటికీ భయపడలేదు. తన విధానాలపై నమ్మకంతో ముందుకే వెళ్లారు.

నోట్ల రద్దుతో మోదీ 70 ఏళ్లుగా ఈ దేశంలో వేళ్లూనుకున్న అవినీతిపై ఒక పెద్ద దెబ్బ కొట్టగలిగారు. దేశ అంతర్గత, బాహ్య శత్రువులను గుక్క తిప్పుకోకుండా చేశారు. అవినీతికి తావులేని నగదు రహిత ఆర్థిక లావాదేవీలకు నాంది పలికారు. దీంతో దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడు జరిపే ప్రతి లావాదేవీపై ప్రభుత్వానికి ఆదాయం సమకూరే వ్యవస్థ నిర్మాణమైంది. ఒక దేశ వృద్ధికి నిరంతర ఆదాయం ఒక స్పష్టమైన సూచిక.

పెద్ద సంస్కరణ – ఒకే పన్ను విధానం

తన సంస్కరణల క్రమంలో మోదీ మరో పెద్ద అడుగు వేశారు. దేశంలోని పన్నుల విధానాన్ని సమూలంగా సంస్కరించి ‘ఒకే దేశం – ఒకే పన్ను’ నినాదంతో వస్తువులు సేవల పన్నును తెచ్చారు. జీఎస్టీ రాకతో దేశవ్యాప్తంగా ఒకే రకమైన వస్తువుపై ఒకేసారి ఒకే పన్ను విధానం అమలవుతున్నది. ప్రజలు ప్రభుత్వానికి పన్నులు చెల్లించడాన్ని, చెల్లించిన పన్నులకు రిటర్నులు రావడాన్ని ప్రభుత్వం సరళతరం చేసింది. సరళమైన ఒకేపన్ను విధానం పట్ల సంవత్సరం పాటు ప్రజల్లో అవగాహన కల్పించింది. క్రమంగా ప్రజలు ఈ విధానాన్ని అర్థం చేసుకున్నారు. ఇంతకు ముందు పన్నులను ఎగవేయడానికి ప్రయత్నించిన వారు సైతం సరళమైన పన్నుల విధానంతో పన్నులు చెల్లించడానికి ముందుకు వస్తున్నారు. దాంతో పన్నుల చెల్లించేవారి సంఖ్య పెరిగి, పన్ను వసూళ్లు గణనీయంగా పెరిగాయి. పన్ను వసూళ్లు పెరగడంతో 2019-20 బడ్జెట్లో పన్నుల ద్వారా లభించిన ఆదాయంలో తొలిసారిగా వస్తువులు సేవల పన్ను అగ్రస్థానంలో నిలిచింది. చాలాకాలంగా మొదటి స్థానంలో ఉన్న కార్పొరేట్‌ పన్నును వెనక్కునెట్టి జీఎస్టీ పన్నులు ప్రథమ స్థానంలో నిలిచాయి. భవిష్యత్తులో మన దేశంలో పన్ను 5 శాతానికి మించకుండా ఉండేలా చూడగలమని, ఆ దిశలో చర్యలు నడుస్తున్నాయని ఆర్థిక మంత్రి జైట్లీ ఇటీవల ఒక ఆశాస్పద ప్రకటన చేయడం ప్రజల్లోనూ, వ్యాపారు ల్లోనూ కొత్త ఆశలు రేకెత్తించింది.

ఇవేకాక వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల అభివృద్ధికీ ఎన్నో చర్యలను ప్రభుత్వం తీసుకున్నది. దేశంలోని అన్ని వర్గాల వారికి ఉపాధి, ఉద్యోగాలు కల్పించే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. మోదీ ప్రభుత్వ శ్రమ ఫలితాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల విడుదలైన అంచనాలు భారత్‌లో పేదరికం గణనీయంగా తగ్గిందని తెలుపుతున్నాయి. ఈ అన్ని చర్యలు భవిష్యత్తులో మరిన్ని మంచి ఫలితాలను ఇవ్వగలవని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

దేశాన్ని ఆర్థికంగా మరింత ముందుకు తీసుకువెళ్లాలనే లక్ష్యంతో నీతి ఆయోగ్‌ ఇటీవల నవభారతం పేరుతో ఒక దార్శనిక పత్రాన్ని రూపొందించింది. దీనిలో ఆర్థిక, మౌలికరంగాల సమ్మిళిత సర్వతోముఖ అభివృద్ధికి తోడ్పడే కీలక లక్ష్యాలను గురించి వివరించారు.

ఇంత పెద్ద దేశంలో సమగ్ర అభివృద్ధి జరగాలంటే ఇంకా ఎన్నో చేయాల్సి ఉంది. ప్రజల జీవన ప్రమాణాలు మరింతగా మెరుగుపడాల్సి ఉంది. అందరికి గృహాలు, సరియైన పోషకాహారం, సరియైన విద్య, వైద్యం అందాల్సి ఉంది. ఆ దిశగా అడుగులు వేస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రతిపక్షాలు తీవ్ర అవరోధాలను సృష్టిస్తున్నాయి. ప్రజా సంక్షేమం కాక తమ సంక్షేమం మాత్రమే చూసుకునే నకిలీ ప్రజానాయకులంతా కూటమిగా ఏర్పడి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

– రామచంద్రారెడ్డి ఉప్పుల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *