ఇన్ని విజయాలు ఇంతకుముందు సాధ్యమయ్యాయా ?!

ఇన్ని విజయాలు ఇంతకుముందు సాధ్యమయ్యాయా ?!

గత నాలుగేళ్ళుగా కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్రమోదీ ప్రభుత్వం ఆర్థికరంగంలోను, మరికొన్ని ఇతర రంగాలలోనూ అద్భుతమైన విజయాలను సాధించింది. అంతకుముందు పదేళ్ళపాటు అధికారంలో ఉన్ను కాంగ్రెసు నాయకత్వంలోని మిశ్రమ ప్రభుత్వం బ్యాంకులు ఇచ్చిన అప్పులలో మొండి బాకీలుగా మారిన వాటిని వసూలు చేయబడలేనివిగా తేల్చకుండా, కొత్త అప్పులు మంజూరు చేస్తూ, దానిలో కొంత భాగాన్ని పాత అప్పుకు జమచేస్తూ అప్పులు ఎగ్గొడుతున్నారన్న వాస్తవాన్ని మరుగుపరుస్తూండేవారు. బుద్ధి పూర్వకంగా ఆ ప్రభుత్వం ఇటువంటి వైఖరి అవలంబించింది.

ఈ సమస్యను పరిష్కరించి వ్యవస్థను ప్రక్షాళనం చేయడానికి ఇప్పటి మోదీ ప్రభుత్వం వరుసగా అవసరమైన చర్యలు తీసుకొవడాన్ని మనం అభినందించి తీరాలి. ఖాయిలాపడిన భూషణ్‌ స్టీల్‌ను టాటాస్టీల్‌వారు తీసుకొని 36,400 కోట్ల రూపాయలు చెల్లించడానికి ముందుకు వచ్చేట్లుగా చేయడం చిన్న విషయం కాదు. ఇటువంటి చర్యల ఫలితంగానే ప్రభుత్వరంగ బ్యాంకులు ఈ మే నెలలో కొంతైనా జీవకళ సంతరించుకొని నవ్వు మొహాలతో కనిపిస్తున్నవి. ఈ విధంగా మొండి బాకీలను దారికి తెచ్చుకోవడానికి చేస్తున్న సమరంలో మోదీ ప్రభుత్వం సాధిస్తున్న విజయాలు ప్రస్ఫుటమవుతున్నాయి.

‘చిట్‌ఫండ్‌ యాక్ట్‌ 1982’ని సవరించటం, బినామీ ట్రాన్సాక్షన్స్‌ (ప్రొహిబిషన్‌) ఎమెండ్‌మెంట్‌ యాక్ట్‌ 2016ను ఆమోదింపజేసుకొని అమలు చేయటం, 2017 మేలో జారీ చేయబడిన నిరర్థక ఆస్తులను గురించిన ఆర్డినెన్స్‌ చేయడం, తద్వారా ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బాంక్రప్ట్‌సీ కోడ్‌ (ఐబిసి)ను ఉపయోగించి పాత బకాయిలను వసూలు చేయటంలో రిజర్వ్‌బ్యాంక్‌ కల్పించుకొనేలా చేయటం వంటివి ఈ నాలుగేళ్ళ స్వల్పవ్యవధిలో మోదీ ప్రభుత్వం రంగంలోకి తెచ్చిన శక్తిమంతమైన ఆర్థిక సంస్కరణలు, అవినీతిని మట్టుపెట్టే సాధనాలు.

ఐబిసిని ఉపయోగించటం ప్రారంభించిన తరువాత దేశవ్యాప్తంగా 655 మొండి పద్దులను నేషనల్‌ కంపెనీవాలా ట్రిబ్యునల్‌కి నివేదించి, వాటిని వసూలు చేసే ప్రయత్నం జరుగుతున్నది. బుద్ధి పూర్వకంగా అప్పులను ఎగవేస్తున్నవారి స్వంత ఆస్తులను స్వాధీనపరచుకొని, వాటిని అమ్మటం ద్వారా తమ సొమ్మును రాబట్టడానికి బ్యాంకులకు అధికారమిచ్చే ప్యుగిటివ్‌ ఎకనామిక్‌ అఫెండర్స్‌ బిల్‌ను 2017లో ఆమోదించారు. నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన బలమైన ఆర్థిక సంస్కరణలలో ఇది ప్రధానమైనది. భారతదేశపు న్యాయవ్యవస్థను అపహాస్యం చేయగోరుతున్న మాయగాళ్ళను పట్టుకోవటంలో ఇది సహాయకారి అవుతున్నది.

పెద్ద నోట్ల రద్దు

కాగా అందరి దృష్టికి వచ్చిన బాగా విజయ వంతమైన చర్య పెద్ద నోట్ల రద్దు. సామాన్య ప్రజలకు కూడా కొంత అసౌకర్యం కలిగినందున దీనిని ఎవరూ తేలికగా మరచిపోలేరు. గతంలో యుపిఎ ప్రభుత్వ కాలంలో బోరవిరుచుకు తిరిగిన అవినీతిపరుల మనఃప్రవృత్తిని, వ్యాపార దృక్పథాన్నీ మార్చడానికి ఉద్దేశించిన సాహసోపేతమైన చర్య ఇది. ‘రద్దు అయిన 15.44 లక్షల కోట్ల రూపాయల విలువచేసే నోట్లలో 99 శాతం బ్యాంకులకు వచ్చి చేరాయంటే నల్లధనం అనేది ప్రత్యేకంగా ఏదీ పట్టుబడనే లేదనిగదా’ అని కొందరు అనుకొంటూ ఉండవచ్చు. బ్యాంకులలో జమైన ఆ 99 శాతం నోట్లు మొత్తానికి మొత్తంగా తెల్లధనమే కాదన్నది తేటతెల్లమే. వాటిని బ్యాంకుల్లో వేయటమైతే వేశారు గాని, అవన్నీ సక్రమంగా సంపాదించి కూడబెట్టినవేనని లెక్కచూపటం వారికి అంత తేలికగా సాధ్యమయ్యే పని కాదు. 18 లక్షల బ్యాంకు ఖాతాలలో ఈ తేడా కొట్టవచ్చినట్లుగా కనబడుతున్నది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్‌ (ఇ.డి.) ఈ ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నది. పెద్దనోట్ల రద్దు ద్వారా సాధించింది ఏంటంటూ పెదవి విరుస్తున్న వారికి అనతికాలంలోనే స్పష్టమైన సమాధానం లభించనున్నది.

పెద్దనోట్ల రద్దు సందర్భంలో చాలా పెద్ద మొత్తాలను బ్యాంకుల్లో జమచేసినవారిని రెండు శ్రేణులుగా వర్గీకరించి సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌ (C.B.D.T.), ఫైనాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌లు పన్నులు వసూలు చేసే ప్రయత్నంలో ఉన్నవి. 2 లక్షల నుండి 80 లక్షల రూపాయల వరకు బ్యాంకులో జమచేసిన (ఒకేసారి కాక, దఫదఫాలుగా జమచేసి ఉండవచ్చు) వారు మొదటి శ్రేణిలోకి వస్తున్నారు. వీరు 99.40 లక్షల సార్లు బ్యాంకుకు వచ్చి 5.4 లక్షల కోట్ల రూపాయలను బ్యాంకుల్లో జమచేశారు. 80 లక్షల రూపాయలకు మించి జమచేసినవారు రెండవ శ్రేణి. వారు 1.1 లక్షల సార్లు బ్యాంకుకు వచ్చి తమ నగదును బ్యాంకుల్లో జమచేశారు.

పెద్దనోట్ల రద్దు అనే చర్య సాధించిన ప్రధానమైన విజయం ఏమిటంటే, అంతవరకు బ్యాంకుల పరిధిలోకి రాకుండా ఉండిపోయిన, తక్కువలో తక్కువగా 5.4 లక్షల కోట్ల రూపాయల నగదు బ్యాంకుల్లోకి వచ్చింది. అంటే స్థూల జాతీయ ఉత్పాదన (జిడిపి) లో 3.6 శాతం వరకు బ్యాంకుల స్పర్శకు అందకుండా ఉండిపోయిన నిధులు ఇప్పుడు సాధారణ ద్రవ్యచలామణీ విధానంలో భాగ మయ్యాయి.

పెరిగిన నగదు చలామణి

సాధారణ ప్రజానీకపు దృష్టికి రాని మరో ముఖ్యాంశం ఏమిటంటే పై శ్రేణులకు చెందినవారిలో చాలామంది ఇప్పుడు నగదును నగదుగా ఇనుప పెట్టెల్లో దాచుకొనడానికి బదులుగా-పరిశ్రమలకు, వాణిజ్యానికి పెట్టుబడులుగా ఉపయోగపడగల పొదుపు పథకాలలో దాచుకొంటున్నారు. 2018 ఏప్రియల్‌ నెలలో మ్యూచువల్‌ ఫండ్స్‌లోనికి అదనంగా, కొత్తగా వచ్చిచేరిన మొత్తం 1.4 లక్షల కోట్లరూపాయలు. పెద్ద నోట్లరద్దు జరిగిన తర్వాత 2016-17లో 77 లక్షల కొత్త ఖాతాలు ఈ పథకాలలో తెరువబడినవి. ఇవి ప్రధానంగా ద్వితీయ శ్రేణి మహానగరాల నుండి వచ్చినవి. 2015-16 ఆర్థిక సంవత్సరంలో తెరువబడిన ఖాతాలు 35 లక్షలు మాత్రమే. అంటే ఈ ఖాతాల సంఖ్యలో 120 శాతం వృద్ధి జరిగిందన్నమాట. ఇది ఆహ్వానింప దగిన పరిణామమే గదా !

జిఎస్‌టి – ఆదాయం మెరుగు

నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలలో అత్యంత ప్రధామైనది గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ టాక్స్‌ (జిఎస్‌టి). ఎంతో కాలంగా చర్చలకు మాత్రమే పరిమితమైన ఈ సంస్కరణ 2017 జులై 1 నుండి అమలులోకి వచ్చేసింది. కేల్కర్‌ కమిటీ అందజేసిన సిఫారసుల కనుగుణంగా విధి విధానాలను రూపొందించటంలో, రాష్ట్రాలమధ్య ఏకాభిప్రాయానికై కృషి చేయటంలో చురుకుగా వ్యవహరించలేక యుపిఎ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలాన్ని వృధాగా గడిపివేసింది. నూతన విధానాన్ని ప్రవేశపెట్టే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం తగ్గేటట్లయితే, దానిని భర్తీ చేయడానికి హామీపడే చొరవ చూపించలేకపోవటం దీనికి ప్రధాన కారణం. 2017 జులైలో 36 లక్షల జిఎస్‌టి బిల్లులు సమర్పింపబడగా, 2018 ఏప్రియల్‌లో సమర్పింపబడిన బిల్లుల సంఖ్య 1.05 కోట్లకు పెరిగింది. దీనినిబట్టి పన్నుల వసూళ్ళు ఎంత విస్తృతంగా పెరుగుతున్నవో గ్రహించుకోవచ్చు. 2018 ఏప్రియల్‌లో ప్రభుత్వాలకు చెల్లింపబడిన వస్తుసేవలపన్ను (జిఎస్‌టి) మొత్తం 1.03 లక్షలకోట్ల రూపాయలు. వ్యాపారులను హడలగొట్టే చర్యలు ఏవీ లేకుండా, ప్రశాంతంగా ఇంత పెద్ద మొత్తం వసూలు అవుతూ ఉండటం హర్షణీయం కాదా ?

వస్తుసేవల పన్ను పేదలకు, మధ్యతరగతివారికి ఎంతో ఉపశమనం కలిగించే విధానం. అనుదినమూ ఉపయోగిస్తూ ఉండే అనేక వస్తువులపై పన్నులు చాలా తక్కువగా విధింపబడుతున్నది. పాలు, పెరుగు, గ్రుడ్లు, చేపలు, కోడిమాంసం, రొట్టెల పిండి, పాలపొడి, తేయాకు, కాఫీ, ఔషధాలు, కూరగాయలు (శీతలీకరణ ద్వారా భద్రపరుపబడినవి), వంటకు ఉపయోగించే గ్యాస్‌, కిరోసిన్‌, శానిటరీ నేప్కిన్స్‌, ¬టళ్ళలో ఆరగించే భోజన ఫలహారాలు ఇవన్నీ 0 నుండి 5 శాతం పన్ను పరిధిలోకి తీసికొని రాబడినవి. కేవలం 50 వస్తువులు / సేవలు మాత్రమే (అవి ప్రధానంగా ఆరోగ్యం చెడగొట్టేవో, బాగా విలాసవంతమైనవో అయి ఉంటాయి) 28 శాతం పన్ను పరిధిలోకి వస్తున్నవి.

మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాలలో మధ్యతరగతి వారికి అనుకూలమైన అంశాలలో చెప్పుకోవలసినది ఏంటంటే గృహాల కొనుగోలు సందర్భంగా తీసుకొనే ఋణాల తిరిగి చెల్లింపు వాయిదా బాగా తగ్గటం. 2013లో ఈ ఋణాలపై 11.75 శాతం వడ్డీ కట్టవలసి వస్తుండేది. అది ఇప్పుడు 8.35 శాతానికి తగ్గింది. అంటే ఋణాలపై వడ్డీ భారం 30 శాతం తగ్గుతున్నది. 20 సంవత్సరాల వ్యవధిలో చెల్లించే విధంగా 50 లక్షల ఋణం తీసికొన్నవారు ఇప్పుడు నెలనెలా చెల్లించే మొత్తంలో వేల రూపాయలు ఆదా అవుతున్నవి.

కాగా మోదీ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు గుప్పించబడుతున్న ఆరోపణ ఒకటి ఉంది. అది ఉద్యోగాల కల్పనలో ఈ ప్రభుత్వం విఫలమైనదనే వాదన. ఉత్పాదనా రంగానికి కొత్తగా జవజీవాలు రావటంతో కొత్త ఉద్యోగాలు వస్తున్నవని, యువకులకు అవకాశాలు లభిస్తున్నవని టిహెచ్‌ఎస్‌ మార్కెట్‌కి చెందిన ఆష్ణాదోధీ వివరిస్తున్నారు. 2011 తర్వాత ఈ ఏడేళ్ళలో ఎప్పుడూ లేనంతగా 2018 ఏప్రిల్‌లో ఉద్యోగాల కల్పన జరిగినదని స్పష్టమవు తున్నది. ఘోష్‌ అండ్‌ ఘోష్‌ ఇచ్చిన నివేదికలోనూ పై అభిప్రాయం బలపరచబడింది. 2016-17లో 45.5 లక్షలమంది, 2017-18లో 55.2 లక్షల మంది ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌లో నూతనంగా నమోదు అయ్యారు. దాని ఆధారంగా- ఎంత లేదన్నా 70 లక్షల ఉద్యోగాలు 2017-18లో కల్పింపబడి ఉంటాయని వారు అంచనావేశారు.

గతంలో ఉద్యోగాలలో ఉన్నవారు ఆలస్యంగా జుూఖీూలో నమోదు అయిన కారణాన ఈ సంఖ్యలు ఇంతగా కనిపిస్తున్నవేగాని, కొత్తగా ఉద్యోగాలు సృష్టింపబడినందున కాదు అంటూ వాదిస్తున్న ప్రబుద్ధులు కొందరు లేకపోలేదు. కాగా 2017-18లో సృష్టింపబడిన మొత్తం ఉద్యోగాలు 1.4 కోట్ల వరకు ఉంటాయని మరో అంచనా. వారు చెప్పేదేమంటే, ఒక పరిశ్రమలో 20 మందికిపైగా ఉద్యోగులు ఉన్నపుడే వారు జుూఖీూ పరిధిలోకి వస్తారు. అంతకంటే తక్కువ సంఖ్యలో ఉండే చిన్న పరిశ్రమలలో కల్పింపబడిన ఉద్యోగాలు ఈ లెక్కలోకి రావు. ఈ విషయాన్ని అర్థం చేసుకొని అంగీకరించ డానికి వామపక్ష మేధావులకు మరింత సమయం కావాలేమో !

అభివృద్ధి సాధనలో అట్టడుగున ఉన్నవారికి వారి గుమ్మంలోకి వచ్చి చేయూత నందించడానికి మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఎంతో సృజనాత్మకమైనవి. ముందు చూపుతో కూడినవి. సత్సంకల్పంతో చేస్తున్నవి. అసాధ్యమైనవిగా భావించి, ఇతరులు వదిలివేసిన వాటిని సుసాధ్యంగా నిరూపించజూస్తున్నవి. వీటి ఫలితాలు ముందు ముందు మరింతగా వెలుగులోకి రాగలవు.

ఈ విజయాలు విస్మరింపలేనివి

– సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్స్‌ అండ్‌ బిజినెస్‌ రిసెర్చి రూపొందించిన ప్రపంచ దేశాల ఆర్థిక శక్తిని లెక్కగట్టే పట్టిక ప్రకారం 2.3 ట్రిలియన్‌ డాలర్ల జిడిపితో ఉన్న భారతదేశం ఈ ఆర్థిక సంవత్సరంలో 2.65 ట్రిలియన్‌ డాలర్ల జిడిపి కలిగిన బ్రిటన్‌ని, 2.47 ట్రిలియన్‌ డాలర్ల జిడిపి కలిగిఉన్న ఫ్రాన్స్‌ని దాటుకొని ముందుకు పోతుంది. ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరిస్తున్నది.

– భారతదేశంలో ఉన్న మొత్తం గ్రామాల సంఖ్య 5,97,464. ప్రతి ఒక్క గ్రామానికీ విద్చుచ్ఛక్తి సదుపాయం సమకూర్చాలనే లక్ష్యం ఈ సంవత్సరం సాధించబడింది. స్వాతంత్య్రం లభించి ఏడు దశాబ్దాలు గడిచిన తర్వాత కూడా విద్యుచ్ఛక్తి సదుపాయం లేని దాదాపు 18 వేల గ్రామాలకు యుద్ధ ప్రాతిపదికన నిశ్చిత కాలావధిలో విద్యుచ్ఛక్తి సరఫరా సదుపాయం సమకూర్చబడింది.

– స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగంగా 7 కోట్ల మరుగుదొడ్లు నిర్మాణమయ్యాయి.

– బ్రాడ్‌గేజ్‌ రైల్వేలైన్‌ ద్వారా త్రిపురను దేశంలోని మిగిలిన ప్రాంతాలతో అనుసంధానించారు.

– రష్యా, చైనా, జర్మనీ, స్వీడన్‌లకు గర్వకారణంగా ఉన్న 12 వేల హార్స్‌పవర్‌ ఎలక్ట్రిక్‌ రైలు ఇంజనులు ఇప్పుడు భారతదేశంలోనూ తయారవుతున్నాయి. బిహారులోని మాధేపురాలో ఏప్రిల్‌ 10వ తేదీన మొదటి రైలింజన్‌ పట్టాలమీద పయనించింది. ఫ్రాన్సుకి చెందిన అయిస్టోమ్‌ అనే పారిశ్రామిక సంస్థతో కలసి మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగంగా ఈ కర్మాగారం ఉత్పాదన స్థితికి చేరుకొంది. (మాధేపురాలో రైలింజన్ల తయారీ కేంద్రం ఆలోచన 2007లో ఆరంభమైనా, రాజకీయ నాయకుల అశ్రద్ధ కారణంగా అడుగులు ముందుకు పడలేదు).

– మొబైల్‌ ఫోన్‌ హేండ్‌సెట్‌లను తయారు చేసే కర్మాగారాలు 2014లో రెండు మాత్రమే ఉండేవి. ఆపిల్‌ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం కారణంగా ఈనాడు దేశంలో 120 యూనిట్లలో మొబైల్‌ఫోన్‌ హేండ్‌సెట్లు తయారవుతున్నవి.

– అస్సాంలోని దిబ్రూఘర్‌ని, అరుణాచల ప్రదేశ్‌లోని ఫసీఘాట్‌ని కలుపుతూ నిర్మాణమైన బోగీబీల్‌ రైల్‌-రోడ్‌ వంతెన ఒక అద్భుతం. మన దేశానికి చైనాతో గల సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఈ మార్గం దేశరక్షణకు అత్యంత కీలకమైనది.

– గతంలో బ్యాంకు ఖాతాలు గల్గినవారిలో పురుషులు, స్త్రీలు 60:40 నిష్పత్తిలో ఉండేవారు. గత నాలుగు సంవత్సరాలలో 31 కోట్లకు పైగా కొత్త ఖాతాలు తెరవబడిన దరిమిలా పై నిష్పత్తి 53:47కి మారి స్త్రీ పురుషుల మధ్య అంతరం బాగా తగ్గింది.

– ప్రధానమంత్రి ఉజ్జ్వల యోజన ననుసరించి సహజవాయువు నుపయోగించి వంట చేసేందుకు వీలుగా 3.53 కోట్ల స్త్రీలు గ్యాస్‌ కనెక్షన్లు పొందారు.

– ముద్రా యోజనలో భాగంగా 11 కోట్లమంది బ్యాంకుల నుండి ఋణాలు పొందారు. వీరిలో 74 శాతం మంది మహిళలు తమ వృత్తి, వ్యాపారాలను లాభసాటిగా నడుపుకో గల్గుతున్నారు.

– మరుగుదొడ్డి సౌకర్యం ఉన్న గృహాలు గతంలో (2013 లో) 39 శాతం మాత్రమే ఉండేవి. 2018లో 83 శాతం గృహాలు మరుగుదొడ్డి కలిగి ఉన్నాయి. 16 రాష్ట్రాలలోని 300 జిల్లాలు బహిరంగ మల విసర్జన రహితమైనిగా ప్రకటిత మయ్యాయి.

– సరాసరి రోజుకు 28 కి.మీ. చొప్పున 2016-17 ఆర్థిక సంవత్సరంలో పదివేల కి.మీ. రహదారుల నిర్మాణం జరిగింది. 2017 అక్టోబరులో కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిన ప్రకారం 83,677 కి.మీ. రహదారులు రాబోయే 5 సంవత్సరాలలో నిర్మాణం కానున్నవి. ఇందుకై 6.92 లక్షల కోట్ల రూపాయలు వ్యయం చేయనున్నారు.

– సౌరశక్తి ఉత్పాదనలోనూ భారతదేశం వడిగా అడుగులు వేస్తున్నది. 2022 నాటికి 175 గిగావాట్ల సౌరశక్తి సామర్థ్యం నెలకొనగలదు.

– విద్యుచ్ఛక్తిని పొదుపు కోసం ఎల్‌.ఇ.డి. బల్బుల వినియోగాన్ని ప్రోత్సస్తున్నారు. ఇప్పటికి వినియోగంలో ఉన్న బల్బులు 30 కోట్లు కాగా, రాబోయే రెండేళ్ళలో మరో 77 కోట్ల బల్బులు కొనుగోలు చేయనున్నారు. వీటి ద్వారా ఏటా 100 బిలియన్‌ కిలోవాట్ల విద్యుచ్ఛక్తి ఆదా అవుతుంది. 40,300 కోట్ల రూపాయలు పొదుపు అవుతాయి.

– వ్యాపారానికి అనువుగా ఉన్న దేశాల జాబితాలో మనం చాలా వెనుకగా ఉండేవాళ్ళం. ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 42 స్థానాలు పైకి జరిగాము.

– మూడీస్‌ అనే అంతర్జాతీయ సంస్థ మన దేశంలో వ్యాపారం/పెట్టుబడులకు అనుకూలతను దీaa 3 గా ఉన్నదానిని 14 సంవత్సరాల వ్యవధి తర్వాత ఇటీవల దీaa 2 గా ముందుకు వచ్చినట్లుగా ప్రకటించింది.

– నరేంద్రమోదీ గత 3.5 సంవత్సరాలలో చేసిన ప్రయత్నాల ఫలితంగా విదేశీ మారకద్రవ్య నిల్వలు 424.86 బిలియన్ల డాలర్ల స్థాయికి చేరాయి. (ఏప్రియల్‌ 2018 నాటికి).

– 2012-13 సంవత్సరాల బడ్జెట్‌లో ఆర్థికలోటు 4.5శాతంగా ఉన్నది. కరెంట్‌ అకౌంట్‌ ఖాతా లోటు 4.8 శాతంగా ఉన్నది. ఆర్థికలోటు ఇప్పుడు 3.3 శాతానికి తగ్గింది. కరెంట్‌ అకౌంట్‌ ఖాతా లోటు 0.7 శాతానికి తగ్గిపోయింది. మన ఆర్థిక వ్యవస్థ గతంలోకంటే సుస్థిరంగా ఉందని ఈనాడు గర్వంగా చెప్పగలం.

– 1990-91 ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో విదేశీ మారకద్రవ్య నిల్వలు కేవలం 1.2 బిలియన్‌ డాలర్ల స్థాయికి క్షీణించగా, 600 మిలియన్‌ డాలర్ల అప్పుకోసమై 67 మెట్రిక్‌ టన్నుల బంగారాన్ని అంతర్జాతీయ ద్రవ్యనిధికి తాకట్టు పెట్టవలసి వచ్చింది. అటువంటి భయానక స్థితి నుండి బయటపడ్డ, నేడు నిస్సందేహంగా ఒక సుస్థిర స్థితికి చేరుకొన్నాము.

– ఆధార్‌కార్డ్‌, ప్రత్యక్ష నగదు బదిలీ విధానాలతో 83 వేల కోట్ల రూపాయల దుర్వినియోగానికి అడ్డుకట్ట పడింది. 2.95 కోట్ల రేషన్‌కార్డు అక్రమాలకు, 93 కోట్ల మంది పేర్లతో గ్రామీణ ఉపాధి హామీ పథకాలలో మోసాలకు, 35 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లలో మోసాలకూ అడ్డుకట్ట పడింది.

– ద్రవ్యోల్బణం అనేది పన్నుగా ప్రకటింపబడని పన్ను. ఇది పేద ప్రజలను దారుణంగా కాటు వేస్తుంది. వారి కొనుగోలు శక్తిని హరిస్తుంది. 2013 నవంబరులో మన్‌మోహన్‌సింగ్‌ ప్రధానిగా ఉన్న సమయంలో (9 సంవత్సరాల పాలన ముగిసి 10వ సంవత్సరం పాలన సాగిస్తున్నపుడు) ద్రవ్యోల్బణం 11.2 శాతానికి పెరిగింది. ఆహార వస్తు ద్రవ్యోల్బణం 14 శాతంగా ఉంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 3.3 శాతానికి తగ్గింది. ఆహార వస్తు ద్రవ్యోల్బణం 2.1 నుండి 1.5 శాతాల మధ్య ఉన్నది. ఈ విధంగా ద్రవ్యోల్బణాన్ని అదుపుచేయటం మోదీ ప్రభుత్వం సాధించిన ఘనవిజయం.

– అంతర్జాతీయ విపణిలో ముడిచమురు ధరలు పెరుగుతున్నప్పటికీ (2017 జూన్‌ అక్టోబరుల మధ్య 24 శాతం పెరిగాయి) దేశం లోపల పెట్రోలు, డీసెల్‌ ధరలు 6 శాతం కంటే మించకుండా అదుపు చేయగల్గటం విశేషం.

– 2022 నాటికి ప్రజలందరూ స్వంత యిల్లు కలిగి ఉండాలన్నది మోదీ ప్రభుత్వ లక్ష్యం. 2016-17లో 32.22 లక్షల గృహాలు నిర్మాణమయ్యాయి. 2018-19లో ఇప్పుడు 54 లక్షల గృహాలు నిర్మాణంలో ఉన్నవి. 2017-18లో 38.67 లక్షల గృహాలు నిర్మాణమయ్యాయి. యుపిఎ ప్రభుత్వ కాలంలో ఇందిరా ఆవాస్‌ యోజన అంటూ ఎంతో ఆర్భాటం జరిగింది. కాని 2012-13లో నిర్మాణమైన గృహాలు 10.49 లక్షలు మాత్రమే.

– అన్నింటికంటే ముఖ్యమైన సంస్కరణలు రైతుల గురించి చేస్తున్నవి. 18 లక్షల హెక్టార్ల భూమి ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన కింద సాగులోకి వచ్చింది, సాగునీటి సదుపాయం సమకూర్చబడింది.

– 585 వ్యవసాయ మార్కెట్‌ యార్డులలో వ-చీaఎ ద్వారా అమ్మకాలు- కొనుగోళ్లు సాగుతున్నవి. 93 లక్షలమంది రైతులు 169 లక్షల టన్నుల వ్యవసాయం ఉత్పాదనలను అమ్మి గత రెండు సంవత్సరాలలో 43 వేల కోట్ల రూపాయలు గడించారు.

ఈ విధంగా అనేక రంగాలలో సంస్కరణలు ఆరంభమయ్యాయి. క్రమంగా ఇవి స్థిరరూపానికి వచ్చి పేద, మధ్య తరగతి ప్రజానీకానికి, రైతులకు, శ్రామికులకు వరప్రదాయిని పథకాలుగా మారనున్నవి. ఇటువంటి మరిన్ని సంస్కరణలు అవసరాన్ని బట్టి రూపుదిద్దుకోగలవని మనం నిస్సందేహంగా విశ్వసించవచ్చు.

– సంజూవర్మ,  ముంబైకి చెందిన ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త,

డైలి పయొనీర్‌ నుండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *