శరీరం లోపలా శుద్ధి చేసే ‘క్రియలు’

శరీరం లోపలా శుద్ధి చేసే ‘క్రియలు’

మన శరీర శుభ్రత కోసం ప్రతిరోజూ స్నానం చేస్తాం. స్నానం శరీర బాహ్య శుభ్రతకు మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ స్నానం చేసిన తరువాత శరీరం ఎంతో హాయిగా, ఆనందంగా, గాలిలో తేలిపోతున్నట్లుగా ఉంటుంది. మరి శరీరం లోపలి సంగతేమిటి ? దానిని ఎవరు శుభ్రం చేస్తారు ? ఎలా చేస్తారు ? బాహ్య శరీరం శుభ్రమైతేనే అంతటి హాయి గొలిపితే, మరి లోపలి శరీరం కూడా శుభ్రపడుతుంటే ఇంకెంతటి హాయి గొలుపుతుందో కదా !

శరీరం లోపల కూడా శుభ్రం చేసే ప్రక్రియలను యోగశాస్త్రం మనకు అందించింది. వాటినే యోగ పరిభాషలో ‘క్రియలు’ అంటారు. ఇటువంటి క్రియలు ఆరు రకాలు ఉంటాయి. అందుకే వీటిని ‘షట్‌ క్రియలు’ అంటారు. ‘నేతి, కపాలభాతి, ధౌతి, నౌళి, వస్తి, త్రాటక’ అనేవి షట్‌ క్రియలు. ఇవి శరీరం లోపలి అవయవాలను శుభ్రం చేసి, వాటి పనితీరు మెరుగుపరుస్తాయి.

1. నేతి క్రియ ముక్కు రంధ్రాలను శుద్ధి చేస్తుంది. ఈ క్రియతో ముక్కుతో పాటు కళ్లు, చెవులు, గొంతుకు సంబంధించిన వ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయి.

2. కపాలభాతి క్రియను ప్రాణాయామంలో భాగంగా సాధన చేస్తారు. అయితే హఠయోగ ప్రదీపికలో దీనిని క్రియగా పేర్కొన్నారు. ఈ క్రియ సాధన వలన నాడీ వ్యవస్థలో ముఖ్యమైన మెదడు శుద్ధి జరుగుతుంది. అలాగే శ్వాసనాళం కూడా శుద్ధి జరుగుతుంది. కపాలభాతి క్రియ ప్రాణాయామం చేయటానికి శరీర శ్వాస వ్యవస్థను సిద్ధపరుస్తుంది.

3. ధౌతి క్రియ వలన గొంతు నుండి జీర్ణాశయం వరకు ఉన్న నాళం శుద్ధి అవుతుంది.

4. నౌళి క్రియ పొట్ట కండరాలు, ప్రేగులలోని మలినాలు తొలగి శుభ్రం కావటానికి సహకరిస్తుంది.

5. వస్తి క్రియ పెద్ద ప్రేగులోని చివరి భాగాన్ని శుభ్రం చేస్తుంది. దీనిని యోగిక ఎనిమా అంటారు. అయితే ప్రస్తుత కాలంలో దీనికి బదులుగా జీర్ణ మండలం అంతటిని శుద్ధి చేసే శంఖ ప్రక్షాళణ క్రియకు యోగ గురువులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.

6. త్రాటక క్రియ కళ్లను శుభ్రం చేయటానికి ఉపయోగిస్తారు. ఈ క్రియ సాధన వలన కంటి చూపు క్రమంగా మెరుగవుతుంది.

ఈ శరీర అంతఃశుద్ధి క్రియల ఆచరించటం వలన మనం నిత్యం సాధనచేసే ఆసన, ప్రాణాయామాల ఉపయోగాలు మన శరీరానికి మరింతగా అందుతాయి.

సూచన : ఈ శుద్ధి క్రియలు ఎంతో సున్నితమైనవి. వీటిని అతి జాగ్రత్తగా ఆచరించాలి. పుస్తకాలు చదివి, లేక వీడియోలు చూసి, లేక పూర్తిగా తెలియని వ్యక్తిని చూసి వీటిని సాధన చేయకూడదు. కేవలం యోగగురువు వద్ద మాత్రమే వీటిని మొదట సాధన చేయాలి.

ఒక్కొక్క క్రియ గురించి వివరంగా తెలుసుకుందాం.

నేతి క్రియ

నేతి క్రియలు నాలుగు రకాలు. జలనేతి, సూత్రనేతి, దుగ్ధ నేతి, ఘృత నేతి. ఈ క్రియలు ఆచరించినందువలన ముక్కు రంధ్రాలు శుభ్రమవుతాయి. ముక్కు సున్నితత్వం, అలర్జీ సమస్య, సైనసైటిస్‌ వంటివి తగ్గుతాయి. ఇంకా తలనొప్పి, బ్రాంకైటిస్‌ (ఊపిరితిత్తుల సమస్య) తొలగిపోతాయి. కళ్లకు మంచిది. ఏకాగ్రతను, ఆత్మ విశ్వాసాన్ని, మనోనిగ్రహాన్ని పెంచుతుంది.

హద్దులు : ముక్కులోపల శస్త్ర చికిత్స జరిగిన 6 నెలల వరకు, చెవి ఇన్‌ఫెక్షన్‌ ఉన్నప్పుడు నేతిక్రియలు చేయరాదు. ముక్కు నుండి రక్తం కారుతున్నప్పుడు కొన్ని రోజుల వరకు చేయరాదు.

ఏయే నేతి క్రియ ఎలా చేయాలో వివరంగా తెలుసుకుందాం.

జల నేతి

కావలసినవి : జలనేతి చెంబు (ఇది దుకాణాలలో లభిస్తుంది. ఒక చెంబుకు చెంబులోని నీటిని తగిన క్రమంలో ముక్కులోకి వంపుకోడానికి వీలుగా ఒక పైపు లేక కాడ వంటిది అతికించి ఉంటుంది. దానినే జలనేతి చెంబు అంటారు.), తగినంత ఉప్పు కలిపిన గోరు వెచ్చని నీరు.

చేయు విధానం : మొదట గోరువెచ్చని ఉప్పు నీటిని చెంబునిండా తీసుకోవాలి. తరువాత రెండు కాళ్లను దూరంగా ఉంచి నిలబడి, కొంచెం ముందుకు వంగి తలను కుడి ప్రక్కకు వీలయినంత వంచాలి. ఇప్పుడు జలనేతి చెంబు నీటి పైపును ఎడమ ముక్కు రంధ్రంకి ఆనించాలి (చెంబులోని నీరు ముక్కులోకి వెళ్లే విధంగా). ముక్కు రంధ్రంలోకి నీరు మెల్లగా వెళ్లేట్లుగా చెంబును, తలను వంచాలి. ఈ సమయంలో నోరు బాగా తెరచి నోటితో శ్వాసక్రియ జరపాలి.

ఇప్పుడు చెంబులోని నీరు పైపు ద్వారా ఎడమ ముక్కు ద్వారా లోపలికి వెళ్లి కుడి ముక్కు ద్వారా బయటకు ధారగా వస్తుంది. చెంబులోని నీరు పూర్తి అయ్యేవరకు ఇలా చేయాలి. తరువాత ముందుకు వంగి బాగా చీదాలి. తలలోని నరాలలో ఎక్కడా జలనేతి నీరు నిలవ ఉండిపోకుండా చూసేందుకు ఇది తోడ్పడుతుంది.

ఇప్పుడు మళ్లీ చెంబులోకి ఉప్పు కలిపిన గోరువెచ్చని నీరు నింపుకోవాలి. ఈసారి కుడి ముక్కు ద్వారా నీటిని లోనికి వంపాలి. అవి ఎడమ ముక్కు నుండి బయటికి వస్తాయి. ఇప్పుడు మళ్లీ చీదాలి.

జాగ్రత్తలు : జలం ఎక్కువ వేడిగా కాక గోరువెచ్చగా మాత్రమే ఉండాలి. ఉప్పు మరీ ఎక్కువ కాకుండా చూసుకోవాలి. జలనేతి క్రియ చేసే సమయంలో నోటితో శ్వాసక్రియ జరపాలి. క్రియ పూర్తయ్యాక చీదే ప్రక్రియ బాగా చేయాలి.

దుగ్ధ నేతి, ఘృత నేతి క్రియలు కూడా జలనేతి వలెనే చేయాలి. కాకపోతే దుగ్ధ నేతి క్రియలో జలానికి బదులు గోరువెచ్చని పాలు వాడాలి. ఘృతనేతి క్రియలో జలానికి బదులు నెయ్యి వాడాలి.

సూత్రనేతి

కావలసినవి : ఒక రబ్బరు నాళిక. ఈ నాళిక ఒకవైపు మూసి ఉంటుంది.

చేయు విధానం : నిటారుగా నిల్చోవాలి. రబ్బరు నాళికను మూసి ఉంచిన వైపు పట్టుకొని కుడి ముక్కు రంధ్రం గుండా నెమ్మదిగా లోపలికి చొప్పించాలి. గొంతు లోపల రబ్బరు నాళిక కొన తగిలేవరకు నెమ్మదిగా తోయాలి. గుటక వేస్తున్నప్పుడు గొంతులో తగులుతున్నట్లు తెలుస్తుంటుంది. అప్పుడు కుడిచేతి చూపుడు వ్రేలు, మధ్యవేలును గొంతులోకి పోనిచ్చి రబ్బరు నాళికను పట్టుకోవాలి. ఆ రెండు వేళ్లతో పట్టుకున్న నాళికను మెల్లగా నోటి బయటకు లాగాలి. ఇప్పుడు నాళిక రెండు కొనలను రెండు చేతులతో పట్టుకొని ముందు వెనుకలకు మెల్లగా లాగుతూ సున్నితంగా మర్దన చేయాలి.

ఇప్పుడు కుడి ముక్కు నుండి నాళికను బయటకు తీసేయాలి. పైన చెప్పిన విధంగా ముక్కు ఎడమ వైపు రంధ్రం ద్వారా చేయాలి.

జాగ్రత్తలు : ముక్కు రంధ్రంలోనికి నాళికను నిటారుగా కాకుండా ఒంపుతో చొప్పించాలి. చేతి వేళ్లకు గోళ్లు లేకుండా చూసుకోవాలి. నాళికను ముందుకు వెనుకకు లాగేటప్పుడు నెమ్మదిగా చేయాలి. వేగంగా చేస్తే గొంతులో చీరుకునే ప్రమాదం ఉంది. క్రియ పూర్తయ్యాక నాళికను ముక్కు నుండి మాత్రమే బయటకు తీయాలి, నోటి నుండి బయటకు తియ్యరాదు.

ప్రయోజనాలు : సూత్రనేతి క్రియ చేసినందువలన ముక్కులో పెరిగిన దుర్మాంసము శస్త్ర చికిత్స అవసరం లేకుండానే తొలగిపోతుంది. సైనసైటిస్‌, దుమ్ము వలన కలిగే ఎలర్జీలు సంపూర్ణంగా తొలగుతాయి. రబ్బరు నాళికను ముక్కు లోపలికి చొప్పించడం వలన మనోనిగ్రహం పెరుగుతుంది.

హద్దులు : వెన్నునొప్పి, హైపర్‌ టెన్షన్‌, గుండె సంబంధ వ్యాధులు కలవారు, 7-8 నెలల గర్భిణీ స్త్రీలు సూత్రనేతి చేయరాదు.

ధౌతి క్రియ

ధౌతి క్రియ 3 రకాలు. అవి జల ధౌతి, వస్త్ర ధౌతి, దండ ధౌతి. వీటిలో జలధౌతి ప్రతి ఒక్కరూ చేసుకోదగిన క్రియ.

జలధౌతి క్రియ వలన శరీరం లోపల నోటి నుండి పొట్ట వరకు ఉన్న జీర్ణ వ్యవస్థ నీటితో శుద్ధి జరుగుతుంది. ఆహారం లోపలికి వెళ్లాక, జీర్ణం అయ్యే సమయంలో అనేక రకాల ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి. ఈ ఆమ్లాలు క్రియా రహితం అయి, మురిగినప్పుడు ఎసిడిటి, అల్సర్‌ మొదలైన వ్యాధులు ప్రబలుతాయి. జలధౌతి వలన కడుపు శుద్ధి జరిగి, కడుపులో క్రియలు మెరుగవుతాయి.

కావలసినవి : 3 లీటర్ల గోరువెచ్చని శుభ్రమైన నీరు, తగినంత ఉప్పు. ఒక లీటరుకి ఒక టీ స్పూన్‌ మెత్తటి ఉప్పు కలపాలి.

చేయువిధానం : గొంతుకగా కూర్చొని ఉప్పు నీటిని తాగగలిగినన్ని గ్లాసులు తాగాలి. వాంతి అయ్యే అనుభూతి కలిగే వరకు త్వరగా తాగాలి. తరువాత లేచి బాత్‌రూమ్‌కు వెళ్లి కాళ్లు 2-3 అడుగుల దూరంలో ఉంచి శరీరం యొక్క పై భాగంను 900 కోణంలో ముందుకు వంగి నిలబడాలి. కుడి చేతి మొదటి రెండు వేళ్ళను గొంతులోనికి చొప్పించి వాంతి చేసుకొనే ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నంలో లోపలికి తాగిన నీరు అంతా బయటకు వస్తూ ఉంటుంది. మొత్తం నీరు బయటకు వచ్చేంతవరకు వ్రేళ్ళను లోపల ఉంచి వాంతి చేస్తూనే ఉండాలి. నీరు పూర్తిగా బయటకు వచ్చిన తరువాత బాత్‌రూమ్‌ నుండి బయటకు వచ్చి గదిలో కింద దుప్పటి పరచుకుని 15 నుండి 20 నిముషాల పాటు శవాసనంలో దీర్ఘ విశ్రాంతి పొందాలి. మరో 30 నిముషాల తరువాత కిచిడి (అన్నం, పెసర పప్పు కలిపి మెత్తగా ఉడికించిన పదార్థం) తినాలి.

జాగ్రత్తలు : జలధౌతి క్రియ ఉదయాన్నే ఖాళీ కడుపుతో చేయాలి. చేతి వేళ్లకు గోళ్లు లేకుండా, శుభ్రంగా ఉంచుకోవాలి. క్రియ చేసిన రోజు కారం, మసాలా, పులుపు తీసుకోకూడదు. హై బి.పి., గుండె జబ్బులు, హెర్నియా, ఉన్నవారు ఇది చేయరాదు. క్రియ చేయడానికి ముందు రోజు రాత్రి త్వరగా సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి.

ఉపయోగాలు : జీర్ణ వ్యవస్థ నోటి నుండి పొట్టవరకు శుభ్రం అవుతుంది. హైపర్‌ అసిడిటిని తొలగుతుంది. కడుపుబ్బరం, అజీర్తి, గ్యాస్‌ ట్రబుల్‌తో బాధపడు వారికి చాలా ఉపయోగం. ఎక్కువగా ఉత్పత్తి అయిన పిత్తం బయటకు వెళ్లిపోతుంది. ఊపిరితిత్తులను ఉత్తేజపరిచి, ఆస్త్మా, బ్రాంకైటిస్‌లను నిర్మూలించగలదు. అధిక బరువు తగ్గుతుంది. మూత్ర వ్యాధులు నయమవుతాయి. మలాశయ శుద్ధి జరుగుతుంది.

హద్దులు : కడుపు నొప్పిగా ఉన్నప్పుడు ధౌతిక్రియ చేయరాదు. కడుపు వద్ద శస్త్ర చికిత్స జరిగినప్పుడు 3-6 నెలల తరువాత చేయవచ్చును. టాన్సిలైటిస్‌ ఉన్నవారు, హై బి.పి., గుండె వ్యాధులు కలవారు చేయరాదు. స్త్రీలు ఋతు కాలంలో చేయరాదు. ఆరోగ్యవంతులు నెలకు ఒకసారి చేసుకోవచ్చు. కఫ వ్యాధులు ఉన్నవారు 3 నుండి 5 రోజులు వరుసగా చేసిన తరువాత అవసరాన్ని బట్టి వారంలో ఒకసారి లేక 2 సార్లు చేయవచ్చు. హైపర్‌ ఎసిపిటీ కలవారు 3 రోజులకి ఒకసారి చేయాలి. యోగ గురువు సలహా అనుసరించాలి. బలహీనులు ఎక్కువగా చేయకూడదు.

ధౌతి క్రియలో మిగిలిన వస్త్ర, దండ ధౌతి క్రియలు ఇప్పుడు వివరించటం లేదు.

వస్తి క్రియ

వస్తి అనగా పొట్టలోని పెద్దప్రేగు చివరి భాగాన్ని శుద్ధిచేసే క్రియ. దీన్నే యోగిక్‌ ఎనిమా అంటారు. ప్రస్తుత కాలంలో దీనిని చేయటానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందువలన దీనికి బదులుగా శంఖ ప్రక్షాళన క్రియకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

శంఖ ప్రక్షాళన

పొట్ట నిండుగా గోరు వెచ్చని ఉప్పునీరు తాగి, శంఖ ప్రక్షాళనకు సంబంధించిన ఆసనాలను చేయటం ద్వారా, జీర్ణక్రియను నిర్వర్తించే 9 మీటర్లు పొడవు గల జీర్ణనాళాన్ని మలద్వారం చివరి వరకు శుద్ధి చేయడాన్నే శంక్ష ప్రక్షాళన అంటారు.

కావలసినవి : 2 నుండి 4 లీటర్ల గోరు వెచ్చని ఉప్పునీరు.

చేయు విధానం : గొంతుకగా కూర్చొని 2 లేక 3 గ్లాసుల ఉప్పు నీరు తాగాలి. శంఖ ప్రక్షాళన ఆసనాలను ఒక్కొక్కటి 8 నుండి 10 సార్లు వేయాలి. ఈ సమయంలో మల విసర్జన చేయాలనిపిస్తుంది. వెంటనే వెళ్లాలి. మల విసర్జన పూర్తయ్యాక మళ్లీ 2 గ్లాసుల ఉప్పునీరు తాగాలి. శంఖ ప్రక్షాళన ఆసనాలు ఒక్కొటి 6 నుండి 8 సార్లు సాధన చేయాలి. మళ్లీ మల విసర్జన చేయాలనిపిస్తుంది. చేయాలి. మళ్లీ మరో 2 గ్లాసుల ఉప్పు నీరు తాగాలి. మళ్లీ ఆసన అభ్యాసం చేయాలి. ఇలా మలద్వారం ద్వారా తాగిన నీరు నీరుగా వచ్చేంత వరకూ శంఖ ప్రక్షాళన క్రియ చేస్తూనే ఉండాలి. ఈ స్థితిలో బాగా నీరసం వస్తుంది. వెంటనే దుప్పటి కింద పరచుకుని శవాసనంలో దీర్ఘ విశ్రాంతి తీసుకోవాలి.

శంఖ ప్రక్షాళన ఆసనాలు : ఉప్పు నీరు తాగిన తరువాత మొదట శ్వాస తీసుకుంటూ చేతులు తల మీదుగా పైకెత్తాలి. ఆ సమయంలో కాలి వేళ్లమీద నిలబడాలి. ఇప్పుడు శ్వాస వదులుతూ సాధారణ స్థితికి రావాలి. అలా 8 నుండి 10 సార్లు చేయాలి. తలపైకెత్తి చేతులను చూడలేని వారు ఎదురుగా ఒక బిందువును చూస్తూ కూడా చేయవచ్చును.

పార్శ్వ తాడాసనం : కాళ్ల మధ్య అర్థమీటరు దూరం ఉండునట్లు నిలబడాలి. రెండు చేతులు వేళ్లను లాక్‌ చేసి తలపైకి తీసుకొని ఉండాలి. గాలి వదుల్తూ నడుము నుండి కుడి పక్కకు వంగాలి. మొండెము ముందుకు వెనుకకు వంగరాదు. గాలి తీసుకుంటూ సాధారణ స్థితికి రావాలి. ఇప్పుడు కుడివైపు వంగి, సాధారణ స్థితికి రావాలి. ఇలా 8 నుండి 10 సార్లు చేయాలి.

కటి చక్రాసనం : కాళ్ల మధ్య 40 నుండి 50 సెం.మీ. దూరం ఉంచి చేతులు ప్రక్కనే ఉంచి నిలబడాలి. ఊపిరి పీలుస్తూ చేతులు భుజాల వరకు పైకెత్తాలి. ఊపిరి వదులుతూ మొండెమును ఎడమవైపు మెలి త్రిప్పాలి. మెలి త్రిప్పిన స్థితిలో ఉండి, కుడి చేతిని ఎడమ భుజం మీద, ఎడమ చేతిని వీపువెనుక వెన్నును తాకుతూ ఉంచాలి. సాధ్యమైనంతగా ఎడమ భుజం చూస్తూ ఉండాలి. ఈ స్థితిలో వెన్నెముక నిటారుగా ఉండాలి. శ్వాస తీసుకుంటూ సాధారణ స్థితికి రావాలి. ఇవేవిధంగా కుడివైపు కూడా చేయాలి. ఇలా 8 నుండి 10 సార్లు చేయాలి.

సర్పాసనం : ఇది బోర్లా పడుకొని చేసే ఆసనం. మొదట దుప్పటిపై బోర్లా పడుకొని అరచేతులు ఛాతికి ఇరుప్రక్కలా నేలపై ఉంచాలి. చేతుల సహాయంతో తల, ఛాతి, నడుము, మోకాళ్లను క్రమంగా పైకి లేపాలి. పైకి చూడాలి. ఈ స్థితిలో అరచేతులు, కాలి వేళ్లు మాత్రమే నేలపై ఉంటాయి. ఇప్పుడు శ్వాస వదులుతూ, ఎడమవైపు తిరిగి ఎడమ భుజం మీదుగా కుడి కాలి మడిమను చూడాలి. శ్వాస తీసుకుంటూ సాధారణ స్థితికి రావాలి. ఇప్పుడు శ్వాస వదుల్తూ కుడివైపు తిరిగి కుడిభుజం మీదుగా ఎడమకాలి మడిమను చూడాలి. శ్వాస తీసుకుంటూ సాధారణ స్థితికి రావాలి. ఇలా 8 నుండి 10 సార్లు చేయాలి.

కాకి చాలన (క్రౌ ట్విస్టింగ్‌) : మోకాళ్లమీద కూర్చొని పాదాలను, మోకాళ్లను ఒక అడుగు దూరంలో ఉంచాలి. రెండు అరచేతులను రెండు మోకాళ్లపై ఉంచాలి. ఈ స్థితిలో శ్వాస బాగా తీసుకోవాలి. వెంటనే పూర్తిగా వదలాలి. శ్వాస వదిలే సమయంలో కుడి మోకాలు ఎడమ పాదం పక్కన నేలపై ఆనించి ఎడమవైపు తిరిగి వెనుకకు చూడాలి. ఆ స్థితిలో కుడి భుజం ఎడమ మోకాలుకు తాకుతుంది. శ్వాస పీలుస్తూ మొదటి స్థితికి రావాలి. మళ్లీ శ్వాస వదులుతూ కుడివైపుకు తిరిగి పై విధంగా చేయాలి. ఇలా 8 నుండి 10 సార్లు చేయాలి.

శంఖ ప్రక్షాళన ప్రయోజనాలు : జీర్ణ క్రియను నిర్వర్తించే 9 మీటర్లు పొడవు గల జీర్ణనాళం ఈ క్రియ ద్వారా శుద్ధి అవుతుంది. అనేక రోగాలకు మూలకారణమయ్యే మలబద్ధకం నివారణ జరుగుతుంది. జఠరాగ్ని మెరుగవుతుంది. అజీర్ణం తగ్గుతుంది. రోగ నిరోధక శక్తి పెరిగి ఎలర్జీలు తగ్గుతాయి. శరీరంలో పేరుకున్న మలినాలు, కొవ్వు తొలగిపోవటం వలన బరువు తగ్గటం ప్రారంభమవు తుంది. మూల శంఖ వ్యాధి (పైల్స్‌ లేదా మొలలు) తగ్గుతుంది. మధుమేహం (షుగరు), శ్వాసకోశ వ్యాధులు తగ్గుముఖం పడతాయి. మలవిసర్జన సమ యంలో మంట, ఇతర ఇబ్బందులు తొలగిపోతాయి.

హద్దులు : హై.బి.పి, గుండె జబ్బు కలవారు, శారీరికంగా బలహీనంగా శంఖ ప్రక్షాళన చేయరాదు. మొదటిసారి చేసేవారు యోగా గురువు సమక్షంలోనే చేయాలి. శంఖ ప్రక్షాళన క్రియ చేయటానికి ముందే శంఖ ప్రక్షాళన ఆసనాలను పూర్తిగా నేర్చుకొని సాధన చేసి ఉండాలి. క్రియకు ముందు రోజు రాత్రి 7 గంటల లోపే భోజనం చేయాలి. మరుసటి రోజు ఉదయం 5.30 నిముషాలకు క్రియ ప్రారంభించాలి. హై బి.పి., అల్సర్‌ సమస్య ఉన్నవాళ్లు ఉప్పునీళ్లు వాడరాదు. శంఖ ప్రక్షాళన తరువాత పులగం మాత్రమే తినాలి. శవాసనం తరువాత ఆలస్యం చేయకుండా వెంటనే పులగం తినాలి.

కపాలభాతి

కపాలం అనగా తల, భాతి అనగా ప్రకాశిం చుట. కపాలభాతి అంటే శిరస్సును ప్రకాశింప చేయునది.

చేయు విధానం : పద్మాసనం లేక వజ్రాసనం లేక సుఖాసనంలో కూర్చోవాలి. కళ్లు మూసుకోవాలి. శరీరాన్ని విశ్రాంతిగా ఉంచాలి. శ్వాసను బలవంతంగా వేగంగా బయటికి వదలాలి. అలా వదిలేటప్పుడు పొట్ట లోపలికి పోతుంది. మళ్లీ శ్వాస తీసుకుని బలంగా వదలాలి. ఇలా సెకనుకు ఒకసారి చొప్పున చేయదగినన్నిసార్లు చేయాలి. ఈ స్థితిలో శ్వాస సహజంగా జరుగుతుంది.

ఈ ప్రక్రియ నిమిషానికి 60 సార్లు చేసినవారికి నిమిషం తరువాత ఆపినప్పుడు శ్వాస అప్రయత్నంగా దానంతట అదే ఆగి ఉంటుంది. తరువాత కొన్ని సెకనుల పాటు శ్వాస జరగదు. దీనిని గమనించాలి. ఈ సమయంలో మనసు లోతైన నిశ్వబ్దాన్ని, విశ్రాంతిని అనుభవిస్తుంది. తరువాత మెల్లిగా శ్వాస క్రియ దానంతట ప్రారంభమవుతుంది. తిరిగి 1, 2 మార్లు సాధన చేయాలి

జాగ్రత్తలు : సాధన సమయంలో వెన్నుపూస నిటారుగా ఉండాలి. మొండెం, మెడ, భుజాలు కదలరాదు. ప్రారంభంలో అందరూ నిముషం పాటు చేయలేరు. 20 లేక 30 లేక చేయగలిగినన్ని సార్లు చేసి ఆపవచ్చును. ఇలాగే మరో రెండు సార్లు చేయవచ్చును.

హద్దులు : అధిక రక్తపోటు (హై బి.పి.), గుండె సంబంధ సమస్యలు, తల తిరగటం, మూర్ఛ, హెర్నియా, స్లిప్‌ డిస్క్‌, స్పాండిలోసిస్‌, శారీరిక బలహీనులు ఈ సాధన చేయరాదు. స్త్రీలు ఋతు సమయంలో ఉన్నప్పుడు, గర్భిణీ స్త్రీలు చివరి మాసాలలో ఉన్నప్పుడు చేయరాదు.

ఉపయోగాలు : మెదడు శుద్ధి జరుగుతుంది. ముఖములో కాంతి పెరుగుతుంది. శరీరంలో ఉత్సాహం పెరిగి, బద్ధకం పారిపోతుంది. ఊపిరితిత్తులు శుభ్రం అవుతాయి. శ్వాసకోశ వ్యాధులు ఆస్తమా, బ్రాంకైటిస్‌, టి.బి. తగ్గుతాయి. రక్త ప్రసరణ, జీర్ణవ్యవస్థ మెరుగవుతాయి. ధ్యానానికి ముందు కపాలభాతి చేసినట్లయితే ఆలోచనలను తగ్గించి, ధ్యానంలో ఉన్నత స్థితికి వెళ్లటానికి సహకరిస్తుంది.

త్రాటక

త్రాటక అంటే ‘రెప్ప వేయకుండా చూచుట’ అని అర్థం. త్రాటక ఏదైనా వస్తువును లక్ష్యంగా పెట్టుకుని చేయవచ్చును. ఎక్కువగా కొవ్వు వత్తి జ్యోతి లక్ష్యంగా పెట్టుకుని చేస్తుంటారు. అలాగే గోడపై ఒక చుక్క, లేదా పువ్వు లక్ష్యంగా పెట్టుకుని చేయవచ్చు. మొదట్లో గురు ముఖంగా నేర్చుకోవాలి. ప్రారంభంలో 2, 3 నిముషాలు మాత్రమే చేయాలి.

హద్దులు, జాగ్రత్తలు : తలనొప్పి ఉన్నప్పుడు త్రాటక చేయరాదు. మూర్ఛ కలవారు జ్యోతిని కాకుండా, మరేదైనా వస్తువును చూస్తూ అభ్యాసం చేయవచ్చును. కాల వ్యవధి ఒకేసారి ఎక్కువగా కాక నెమ్మదిగా పెంచుకోవచ్చు. జ్యోతి కదలకుండా ఉండేట్లు చూసుకోవాలి.

చేయు విధానం : ముందుగా కంటి వ్యాయామంతో ప్రారంభించాలి. (కంటి వ్యాయామాల కొరకు కంటి చికిత్స చూడగలరు) వజ్రాసన్‌ లేక పద్మాసన్‌ లేక సుఖాసనంలో దుప్పటిపై కూర్చుని వెన్ను నిటారుగా ఉంచాలి. రెండు అడుగుల దూరంలో క్రొవ్వొత్తి ఉంచాలి. కూర్చొన్న వ్యక్తి కంటి ఎత్తుకి క్రొవ్వొత్తి జ్యోతి సమానంగా ఉండేట్లు చూసుకోవాలి. శరీరం స్థిరంగా ఉండాలి, కదల కూడదు. క్రొవ్వొత్తిని వెలిగించి, నిదానంగా వెలుగును చూడాలి. కళ్లు రెప్ప వేయకుండా ఉండాలి. మనసుని అటు ఇటు వెళ్లనీయకుండా ఏకాగ్రతతో జ్యోతిని 2,3 నిమిషాలు చూడాలి. కళ్లు అలసిపోతే వెంటనే కళ్లు మూసుకొని మనసులో కొవ్వొత్తి చూస్తూ ఉండాలి. దీనినే అంతర్‌ త్రాటక అంటారు. ఈ స్థితిలో 2 నిముషాలు ఉండి కళ్లు తెరచి ఎదురుగా ఉన్న జ్యోతిపై దృష్టి నిలపాలి. ఇలా 2 నిముషాలు త్రాటక, మరో నిముషాలు అంతర్‌ త్రాటక చేయాలి. ఇలా మూడు సార్లు చేయాలి.

ఉపయోగాలు : కళ్లు కాంతివంతంగా, ఆరోగ్యంగా అవుతాయి. నాడీ వ్యవస్థలో వేగం, నరాల వత్తిడి, ఆందోళన తగ్గుతుంది. జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతుంది. కంటి దోషాలు నివారణ అవుతాయి. మనోనిగ్రహం అలవడుతుంది. ధ్యానానికి సహాయపడుతుంది.

హద్దులు : త్రాటక క్రియ ప్రారంభ స్థితిలో 30 సెకన్లతో ప్రారంభించాలి. రోజులు, వారాల వ్యవధిలో 3 నిముషాలు వరకు పెంచుకోవచ్చు.

నౌళి క్రియ

నౌళి అనేది ఉదర సంబంధమైన క్రియ. ఈ క్రియ చేస్తున్నప్పుడు ఉదరకోశ కండరాలు సంకోచిస్తూ, వ్యాకోచిస్తూ, గుండ్రంగా తిరుగుతూ మర్దన అవుతాయి.

ఉడ్డీయాన బంధం, అగ్నిసార క్రియలు నౌళి క్రియ చేయటానికి శరీరాన్ని సంసిద్ధం చేస్తాయి.

ఉడ్డీయాన బంధం : ఉదర కండరాలు తీవ్రంగా సంకోచింపచేస్తూ, శ్వాస పూర్తిగా వదులుతూ పొట్టను వీపుకు అంటుకొనేలా లోనికి గట్టిగా మడవాలి. కొద్ది సమయం వరకు అదే స్థితిలో ఉండాలి. తరువాత మెల్లగా గాలి పీలుస్తూ ఉదర కండరాలు సడలించాలి. ఇప్పుడు కొంత సమయం విశ్రాంతి పొందాలి. మళ్లీ క్రియ ప్రారంభించి పై విధంగా 2-3 సార్లు చేయాలి. ఈ క్రియ కూర్చొని లేక నిలబడి చేయవచ్చును.

అగ్నిసార క్రియ : ఉడ్డీయాన బంధం స్థితిలో వలె మీకు సాధ్యమైనంతగా పొత్తికడుపు గోడలను తీవ్రంగా ముందు వెనుకలకు ఆడించండి. ఈ స్థితిలో శ్వాస పీల్చటం ఉండదు. పొట్ట కదలికలు శ్వాస జరుగుతున్నట్లుగా అనిపిస్తాయి కానీ శ్వాసించరాదు. శ్వాసకు ఇబ్బంది అనిపించినప్పుడు క్రియను నెమ్మదిగా ఆపి, బంధాన్ని సడలించి నెమ్మదిగా శ్వాస పీలుస్తూ విశ్రాంతి తీసుకోవాలి. ఇలా 2 నుండి 3 సార్లు చేయాలి. అగ్నిసార కూడా కూర్చుని లేక నిలబడి చేయవచ్చును.

నౌళి : ఉడ్డీయాన, అగ్నిసార క్రియ అభ్యసించిన తరువాత నౌళి క్రియ చేయాలి. ఈ క్రియలో పొట్ట మధ్యభాగాన్ని కడ్డీలా చేయటం ముఖ్యం.

చేయువిధానం : రెండు పాదాలు 30-40 సెం.మీ. దూరంలో ఉంచి, నిలబడి మోకాళ్ల పై చేతులు ఉంచి వంగి ఉండాలి. ఈ స్థితిలో నౌళి క్రియ అభ్యాసం చేయాలి. నౌళి క్రియ 3 రకాలు. అవి మధ్యమ నౌళి, దక్షిణ నౌళి, వామ నౌళి.

మధ్యమ నౌళి : ఉడ్డీయాన చేసి, మోకాళ్లను ఒత్తిడి చేస్తూ, పొట్ట కండరాలను సంకోచింపచేసి, మధ్యభాగాన్ని ముందుకు లాగాలి. మిగిలిన ఉదర కండరాలు సడలించాలి. ఇదే మధ్యమ నౌళి. శ్వాస అవసరం కలిగినప్పుడు శ్వాస తీసుకొని మళ్లీ చేయాలి.

దక్షిణ నౌళి : కుడి భాగములో ఉన్న ఉదర కండరాలు మాత్రమే సంకోచింప చేసి మిగిలిన కండరములు సడలించాలి.

వామ నౌళి : ఎడమ భాగమున ఉన్న ఉదర కండరాలు మాత్రం సంకోచింపచేసి మిగిలిన కండరాలు సడలించాలి.

నౌళి చాలనం : మధ్యమ నౌళి, దక్షిణ నౌళి, వామ నౌళి ఈ మూడు క్రియలలో ప్రావీణ్యం సంపాదించిన తరువాత ఉదర మధ్య కండరాలను ప్రదక్షిణ దిశలోను, అప్రదక్షిణ దిశలోను గుండ్రంగా తిప్పుతూ అభ్యసించాలి. దీనినే నౌళి చాలనం అంటారు.

ఉపయోగాలు : ఉదర కండరాలను ఉత్తేజితం, ఆరోగ్యవంతం అవుతాయి. ప్రేగులు చురుకుగా పనిచేస్తాయి. మలబద్ధకం, మూలశంక తొలగిపోతాయి. గ్యాసు సమస్య, పొట్ట పెరిగే సమస్య తగ్గుతుంది. రక్తం శుభ్రం అవుతుంది.

హద్దులు : కడుపులో పుండ్లు ఉన్నవారు నౌళి క్రియలు చేయరాదు. కడుపు భాగంలో శస్త్ర చికిత్స జరిగితే, ఒక సంవత్సరం వరకు చేయరాదు. హై బిపి, గుండె జబ్బు, వెన్నునొప్పి, హెర్నియా కలవారు చేయరాదు. ఆరోగ్యంగా ఉన్న వారు నౌళి క్రియలు అభ్యాసం చేసిన అరగంట తరువాత తప్పకుండా పోషకాలు గల సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *