సాధనలో ఇదీ వరుస !

సాధనలో ఇదీ వరుస !

నిత్య యోగసాధనలో ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం ఏవి ముందు చేయాలి ? వాటికి ఎంత సమయం కేటాయించాలి ? అనే సందేహాలు కొందరికి కలుగుతుంటాయి. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

యోగ సాధన అన్ని వయసుల వారూ ఉదయం లేక సాయంత్రం వేళల్లో చేయవచ్చు. అయితే వయస్సును బట్టి, అవసరాన్ని బట్టి సాధన అంశాలలో మార్పు చేయవలసి ఉంటుంది.

వయసును బట్టి అంటే, 6 నుండి 12 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలు, 60 సంవత్సరాలు పైబడిన పెద్దలు యోగా గురువు సలహా తీసుకుని ఏఏ అంశాలు సాధన చేయాలో ఒక పట్టికను తయారు చేసుకొని సాధన ప్రారంభించాలి.

అవసరాన్ని బట్టి అంటే, ఆస్తమా, మధు మేహం, బి.పి, నడుము నొప్పి, మెడనొప్పి, గుండెజబ్బు, మైగ్రేన్‌, మానసిక వ్యాధులు, అధిక బరువు, కంటి వ్యాధులు, గ్యాస్‌, మలబద్ధకం, నిద్ర సమస్యలు, సైనస్‌, మోకాళ్ల నొప్పులు, మడిమ నొప్పి, థైరాయిడ్‌ సమస్య వంటి వ్యాధులు గలవారు; శరీర శక్తిలో బలహీనులు మొదలైనవారు అనుభవం కలిగిన యోగ చికిత్సకుడిని కలిసి ఏమి సాధనలో చేయాలో తగిన సలహాలు తీసుకోవాలి. వారు చెప్పిన క్రమంలో నిత్య యోగసాధన చేయాలి.

పుస్తకాలు, టి.వి., యూట్యూబ్‌లలో చూసి ఏదో ఒకటి చేయటం వలన సరైన ఫలితం రాకపోగా, సమస్య పెరగవచ్చు కూడా! కాబట్టి ఎటువంటి సమస్య ఉన్నవారైనా మొదట అనుభవం కలిగిన యోగ గురువు ఆధ్వర్యంలో నేర్చుకొని, నిత్యసాధన పట్టికను తయారు చేసుకొని సాధన ప్రారంభించాలి. సాధన అలవాటు అయిన తరువాత గురువు లేకుండా వ్యక్తిగతంగానే అభ్యసించవచ్చు.

ఎటువంటి సమస్య లేనివారికి, నిత్య సాధన క్రిందివిధంగా ఉంటే మేలు చేస్తుంది.

క్రమం

ప్రతిరోజూ యోగసాధన ఓంకారంతో ప్రారంభించాలి. ఓంకారం 3 సార్లుతో ప్రారంభించి, తరువాత రోజులు, వారాల వ్యవధిలో 5 సార్లు, 11, 21 సార్లకు పెంచుకోవచ్చు.

ఓంకారం తరువాత ప్రార్థన చేయాలి.

ప్రార్థన :

ఓం సహనా వవతు – సహనౌ భునక్తు

సహవీర్యం కరవావహై – తేజస్వినా వధీత మస్తు మావిద్విషావ హై

ఓం శాంతిః శాంతిః శాంతిః

లేదా

ఓం అసతోమా సద్గమయా – సమతోమా జ్యోతిర్గమయా

మృత్యోర్మా అమృతంగమయా – ఓం శాంతిః శాంతిః శాంతిః

లేదా

గురుః బ్రహ్మ గురుః విష్ణుః – గురుః దేవో మహేశ్వరః

గురుః సాక్షాత్‌ పరబ్రహ్మ – తస్మై శ్రీ గురవేనమః

పై మూడింటిలో ఏదైనా చెప్పవచ్చు. లేదా ఎవరికి ఇష్టమైన ప్రార్థన వారు చేసుకోవచ్చు.

వ్యాయామం

ప్రార్థన తరువాత సూర్యనమస్కారాలు, ఆసనాలు చేయడానికి శరీరాన్ని సిద్ధపరచే వ్యాయామాలు 5 నుండి 10 నిముషాల పాటు చేయాలి.

అనంతరం 3 లేక 5 సూర్య నమస్కారాలు మంత్రాలు చెపుతూ చేయాలి. తరువాత రోజులు, వారాల వ్యవధిలో వీటిని 13 వరకు పెంచుకోవచ్చు.

సూర్యనమస్కారాల తరువాత విశ్రాంతి కోసం 1 నుండి 5 నిముషాల పాటు శవాసనం వేయాలి. కింద దుప్పటి పరచుకుని దుప్పటిపై శవాసనం వేయాలి.

ఇప్పుడు అదే దుప్పటిపై నిలబడి లేక కూర్చుని లేక పడుకుని ఆసనాలు ప్రారంభించాలి. ఇవి 10 నుండి 15 నిముషాలు చేయాలి. ఆసన అభ్యాస సమయం కూడా రోజులు, వారాల వ్యవధిలో 30 నిముషాల వరకు పెంచుకోవచ్చు.

అనంతరం విశ్రాంతి కోసం మళ్లీ 3 నుండి 5 నిముషాలు శవాసనం వేయాలి.

ఇప్పుడు శవాసనం నుండి లేచి కూర్చుని ప్రాణాయామం ప్రారంభించి 5 నుండి 10 నిముషాల వరకు చెయ్యవచ్చు. దీనిని కూడా భవిష్యత్తులో 15 నిముషాల వరకు పెంచుకోవచ్చు.

ప్రాణాయామం తరువాత ధ్యానం 5 నుండి 10 నిముషాల పాటు చేయాలి.

ధ్యానం తరువాత ప్రార్థనతో సాధన ముగుస్తుంది.

ముగింపు ప్రార్ధన

ఓం పూర్ణమదః పూర్ణమిదం

పూర్ణాత్పూర్ణ ముదచ్యతే

పూర్ణస్య పూర్ణమాదాయ

పూర్ణమేవా వశిష్యతే

ఓం శాంతిః శాంతిః శాంతిః

ఈ క్రమంలో నిత్యమూ యోగసాధన చేయటానికి 35 నుండి 65 నిముషాలు మాత్రమే పడుతుంది. పై అంశాలలో ఆసనాలు రోజుకొకసారి మార్చుకుంటూ సాధన చేయవచ్చు. అంటే ఒకరోజు నిలబడి చేసే ఆసనాలు, రెండవ రోజు కూర్చుని చేసే ఆసనాలు, మూడవ రోజు పడుకుని చేసే ఆసనాలు చేయవచ్చు. ఇది ఒక చక్రం అవుతుంది. మళ్లీ నాలుగవ రోజు చక్రాన్ని మళ్లీ ప్రారంభించాలి. అంటే నిలబడి చేసే ఆసనాలు చేయాలి. ఇలా ఒక క్రమపద్ధతిలో అనేక ఆసనాలు సాధన చేయవచ్చు. వారంలో ఒకసారి జలనేతి, సూత్రనేతి చేస్తే ప్రాణాయామ సాధన సులభమవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *