సాధన కోసం సమయాన్ని ఫిక్స్‌ చేయండి

సాధన కోసం సమయాన్ని ఫిక్స్‌ చేయండి

యోగ సాధన చేస్తున్నందువలన అనారోగ్యం తగ్గి, ఆరోగ్యం సిద్ధిస్తుంది అనేది వాస్తవమేనా ? వాస్తవమైతే మీ అనుభవాలు కొన్ని చెప్పండి.

యోగసాధనతో ఆరోగ్యం తప్పకుండా సిద్ధిస్తుంది. అయితే పుట్టుకతో వచ్చే కొన్ని వ్యాధులను (పోలియో, అవయవలోపాలు, మానసిక లోపాలు) పూర్తిగా నయం చేయలేకపోవచ్చు. కానీ ప్రస్తుత ఆధునిక కాలంలో అధికంగా కనిపించే మానసిక ఒత్తిడి వలన జనించే సైకో సొమాటిక్‌ డిసీజెస్‌ (మనస్సు, శరీర వ్యాధులు) అన్నింటిని యోగ సమూలంగా రూపుమాపగలదు. అయితే యోగ సాధన అంటే కేవలం ఒక గంట ఆసనాలు, ప్రాణా యామం, ధ్యానం చేయటం మాత్రమే కాదు. వీటితో పాటు ఆలోచనా విధానం కూడా సానుకూలంగా మార్చుకోవాల్సి ఉంటుంది. యోగ సాధన మన జీవితంలో నిత్య సాధన అయినప్పుడు సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది.

యోగ సాధన వలన వ్యాధుల బారి నుండి బయటపడిన వాళ్లు నా అనుభవంలో అనేకమంది ఉన్నారు. వారిలో మెడనొప్పి, నడుము నొప్పి, సయాటికా, పెరీ ఆర్థ్రరైటిస్‌, భుజం నొప్పి, మోకాళ్ల నొప్పులు, మడమ నొప్పి, సైనసైటిస్‌, ఆయాసం, మధుమేహం, థైరాయిడ్‌, మైగ్రేన్‌, నిద్ర సమస్య, గ్యాసు సమస్య, ఎసిడిటి ఇలా ఎన్నో రోగాలు యోగ చికిత్సతో తగ్గినవాళ్లు ఉన్నారు. అయితే వీటిన్నింటిలో కంటే భిన్నమైనది. ఈ మధ్య కాలంలో ఎదురైన అనుభవం మీకు చెప్తాను.

నేను అతని పేరు చెప్పను. అతని వయస్సు 42 సంవత్సరాలు. అతనికి ఆయాసం, ఛాతీలో తెమడ ఉండటం, జీవితంలో మానసిక ఒత్తిడి వలన (అనారోగ్యం, స్థిరమైన ఉద్యోగం కాకపోవడం) అతని గొంతులో స్వర నాళాలకు (vocal cords) ఇబ్బంది వచ్చింది. గొంతు ఆడవారిలా మారిపోయింది. అతను మొదటిసారి నాకు ఫోన్‌ చేసినప్పుడు చెప్పండి మేడమ్‌ అన్నాను. అతను సమస్య చెప్పారు. వైద్యులు గొంతు ఆపరేషన్‌ చేయాలన్నారని, అవకాశాలు 50 శాతమే అన్నారని చెప్పారు. ఆయనే ఆ ఇంట్లో సంపాదించే మనిషి. దాంతో ఆ ఇంట్లోని అందరూ ఏమవుతుందో అని బాధ, దుఃఖంలో ఉన్నారు.

నేను రిపోర్టులు చూసి వారికి పూర్తి నమ్మకంతో చెప్పాను. దీనికి వెంటనే ఆపరేషన్‌ చేయాల్సిన అవసరం లేదు. యోగాలోని Voice culture Techniques తో మాటని సరిచేయవచ్చు అని చెప్పి వారిలో ధైర్యం, నమ్మకం కలిగించాను. యోగసాధన (Yoga special Tech) ప్రారంభించి, నేర్పించాను. రోజుకి 2-3 సార్లు చేయమని చెప్పాను. అతను ఆ విధంగానే సాధన చేశారు. ఈ సాధన వలన అద్భుతంగా రోజు రోజుకి అతని మాటలో మార్పు వచ్చింది. నెలలోపే గొంతు మగవారిలా మారింది. గొంతు మారటంతోపాటు, ఆయాసం కూడా పూర్తిగా తగ్గిపోయింది. దానితో వారింట్లో ఆనందం. నేను కూడా ఎంతో ఆనందించాను.

పిరమిడ్‌ ధ్యానం అనీ, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనీ, కేవలం ప్రాణాయామం చేయడం వల్లనే ఆరోగ్యం సిద్ధిస్తుందని.. ఇలా రకరకాల యోగ ప్రక్రియలు, గురువులు నేటి సమాజంలో కనిపి స్తున్నారు. ఇవన్నీ యోగసాధనలో భాగమేనా ? అసలు యోగసాధనలో ఎన్ని రకాల సాధనలున్నాయి? వాటి గురించి పరిచయం చేయగలరా?

పిరమిడ్‌ ధ్యానం, ప్రాణాయామం, ఆసనాలు, రకరకాల ప్రక్రియలు ఇవన్ని కూడా యోగసాధనలో భాగమే. నిజానికి పతంజలి మహర్షి అష్టాంగ యోగ మార్గాన్ని అందించారు. మానవ జీవిత పరమార్థమైన మోక్షాన్ని (కైవల్యం) పొందటానికి ఇది అత్యంత సులభ మార్గం. ఇందులో యమ, నియమాలు, ఆసనాలు, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యాన, సమాధి అనే ఎనిమిది అంశాలు పొందు పరచారు.

అయితే తరువాత వచ్చిన గురువులు కొన్నింటిని తగ్గించి కొన్నింటిని చేర్చి, ఇలా రకరకాల మార్పులు చేసుకొంటూ వారి వారి పేర్లు పెట్టుకొని రకరకాల యోగ ప్రక్రియలను ప్రాచుర్యంలోకి తీసుకొస్తున్నారు. వాటిలో హఠయోగం, కుండలినీ యోగం, తంత్ర యోగం, విపత్సన, మంత్ర యోగం, జ్ఞాన యోగం, భక్తి యోగం, కర్మయోగం, లయ యోగం, అయ్యంగార్‌ యోగ, బిక్రమ్‌ యోగ, టిబెటన్‌ యోగా, ఇషా యోగ, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌, రాందేవ్‌బాబా యోగ, సిద్ధ సమాధి యోగ, స్కై యోగ, బిహార్‌ స్కూల్‌ ఆఫ్‌ యోగ, శ్రీ పరివార్‌ యోగ, మాస్టర్‌ సి.వి.వి. యోగ.. ఇలా రకరకాల యోగ పేర్లు కనిపిస్తున్నా, అంతర్లీనంగా అందరూ చేసేది, పాటించేది పతంజలి మహర్షి బోధించిన యోగ సూత్రాలనే. వాటినే కొంచెం అటు ఇటుగా మార్చి బోధిస్తారు. అన్ని యోగాల లక్ష్యం వ్యక్తి ఆరోగ్యం. తరువాత మోక్షం వైపు నడిపించడం.

యోగసాధనకు కేవలం శాఖాహారులే అర్హులా ? లేక మాంసాహారులు కూడా యోగసాధన చేయ వచ్చునా?

యోగ సాధన శాఖాహారులతోపాటు మాంసాహారులు కూడా చేయవచ్చును. ఇంకా చెప్పాలంటే మాంసాహారులు తప్పకుండా చేయాలి. ఎందుకంటే వారికే అనారోగ్య సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి. అనారోగ్యం రాకుండా ముందు జాగ్రత్తగా యోగ సాధన చేయటం ఎంతో మంచిది. నిజం చెప్పాలంటే యోగా అనేది ఎక్కువగా మనసుకి సంబంధించినది. అనగా బయటకు కనిపించే యోగ కంటే కనిపించని అంతరంగ యోగం చాలా ఎక్కువ.

యోగ హిందుస్తాన్‌లో పుట్టింది. కాబట్టి ముస్లింలు యోగ చేయరాదు అనే భావన ఉన్నది. ఇది ఎంతవరకు నిజం ?

యోగ ముస్లింలు చేయరాదు అనేది ఎంత మాత్రం నిజం కాదండీ. యోగ హిందుస్తాన్‌లో పుట్టినప్పటికీ ప్రపంచ మానవళి కోసం, వారి ఆరోగ్యం, ఆనందం కోసం జనించినది. యోగలో ఎక్కడా మత ప్రస్తావన లేదు. ఇవాళ యోగ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని మతాల వారు జరుపుకుంటున్నారు. యోగ సాధన చేస్తున్నారు. ఆరోగ్యం పొందుతున్నారు.

ముస్లింలు మంత్రాలు చెప్పకుండా సూర్యనమస్కా రాలు చేసుకోండి అని థాయిలాండ్‌ ప్రభుత్వం తమ పౌరులకు అనుమతినిచ్చింది. మంత్రంలోనే అసలు ఆరోగ్య రహస్యం ఉన్నది అని యోగశాస్త్రం చెపుతున్నది. మరి మంత్రం లేని సూర్యనమస్కారాల వలన ఆరోగ్యం సిద్ధిస్తుందా ?

థాయిలాండ్‌ ప్రభుత్వం పౌరులకు ఆ మాత్రం అయినా అనుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేయాలి. మంత్రంలేని సూర్యనమస్కారాల వలన శారీరక ఆరోగ్యం సిద్ధిస్తుంది. మానసిక ఆరోగ్యం, ఆధ్యాత్మికత వికాసం చెందదు. వాస్తవానికి మంత్రం చెప్పినందువల్ల గొంతు నుండి పొత్తి కడుపు వరకు ఉన్న నరాలు ఉత్తేజితం అవుతాయి. దానివల్ల ఆ స్థానంలో షట్‌ చక్రాలు మేల్కొంటాయి. ఇది మనిషిలో మానసిక ప్రశాంతతకు మొదటి మెట్టు అవుతుంది. మంత్రం చెప్పకపోవటం కొంత లోపమే. థాయిలాండ్‌ పౌరులు కనీసం శారీరక ఆరోగ్యం కొరకైనా సాధన చేయటం మంచిదేనండీ. వారే నెమ్మదిగా మరిన్ని మెరుగైన ఫలితాల కోసం చూస్తారని ఆశిద్దాం. కొన్ని రోజుల తరువాత మంత్రాలు కూడా చెప్పుకొనే పరిస్థితులు రావాలని కోరుకుందాము.

యోగసాధన గురువు సమక్షంలోనే చేయాలని చెపుతారు. కానీ ఖర్చు, సమయం దృష్ట్యా అందరూ అన్నివేళలా గురువు సన్నిధిలో చేయటం కుదరదు. ఈ విషయంలో మీ సలహా ఏమిటి ?

యోగ సాధనను ముందుగా గురువు సమక్షంలో నేర్చుకొని, కొన్ని రోజులు గురువు సమక్షంలోనే సాధన చేసి నిష్ణాతులు అయిన తరువాత గురువు సలహాతో తన ఇంటిలోనే యోగ సాధన చేసుకో వచ్చును. నేర్చుకొనేవరకు, తప్పకుండా గురువు సమక్షంలోనే సాధన చేయాల్సి ఉంటుంది. ఒకసారి నేర్చుకొన్న తరువాత తనే సాధన చేసుకోవచ్చు. దానివలన సమయం, ధనం ఆదా అవుతాయి.

ప్రతి మనిషి ప్రతినిత్యం యోగసాధన చెయ్యాలని, దానివలన ఆనారోగ్యం దరిచేరదని, ఆరోగ్యం సిద్ధిస్తుందని మీవంటి యోగ గురువులు చెపుతు న్నారు. కానీ నిత్య యోగసాధన అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అటువంటివారికి మీరిచ్చే సలహా, సందేశం ఏమిటి ?

ప్రస్తుత ఆధునిక జీవనంలో నిత్యం ‘యోగ సాధన’కు సమయం కేటాయించటం కష్టమైన విషయమే. అయితే అందరూ తప్పనిసరిగా సమయాన్ని కేటాయించుకొంటేనే, వారు నిండు నూరేళ్ల జీవితాన్ని ఆరోగ్యంగా, ఆనందంగా జీవించటానికి సహాయం చేసుకొన్నవాళ్లు అవుతారు. నిత్య సాధనకు ఒక గంట సమయం కేటాయించటం అన్ని విధాల శ్రేయస్కరం. కనీసం 30 నిముషా లయినా కేటాయించటం ఉత్తమం.

నిత్య జీవితంలో తెలియకుండా ఎన్నో అనవసర విషయాలకు సమయాన్ని కేటాయిస్తున్నాం. ఉదాహర ణకు టివి ఎక్కువగా చూడటం, ఫోన్‌లో అనవసర విషయాలు సాగదీస్తూ చర్చించటం, సోషల్‌ మీడియా, ఫేస్‌బుక్‌, వాట్సప్‌, యూట్యూబ్‌లలో అతిగా సమయాన్ని వృధా చేయటం, స్నేహితులతో వృధా కాలక్షేపాలు చేయటం లాంటి అనేక విషయాలలో సమయాన్ని వృధా చేసుకుంటూ, యోగ సాధనకు సమయం లేదండీ, బిజీ అండీ అని సాధనను వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ పోతున్నారు. ఇది చాలా పెద్ద తప్పు. ‘శరీర మాద్యం ఖలు ధర్మసాధనం’ అన్నారు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటూనే అనేక ధర్మకార్యాలు సాధించుకో గలగాలి.

అనారోగ్యంతో జీవితంలో ఏదైనా జరగరానిది జరిగితే కుటుంబం ఆర్థిక ఇబ్బందులు లేకుండా బాగుండాలని భీమా పాలసీలు చేసుకొంటున్నాము. మంచిదే. అలాగే భవిష్యత్‌లో ఆరోగ్యం ఎలా ఉంటుందో అని ఊహించుకొని, ఇప్పటినుండే ఆరోగ్యం కోసం ‘నిత్య యోగ సాధన’ను ఒక పెట్టుబడిగా పెట్టుకోవాలి. దానివలన జీవితాంతం ఆరోగ్యంగా ఆదర్శంగా జీవించగలుగుతారు. దీనివలన ఇతరుల మీద ఆధారపడకుండా, ఇతరులని ఇబ్బందిపెట్టకుండా, తాను బాధపడ కుండా, అవసరం అయితే ఇతరులకు సహాయం చేస్తూ, సుఖ సంతోషాలు, ఆయు, ఆరోగ్య, ఆనందాలతో జీవించవచ్చు.

చివరిగా, ఒక విషయం చెప్పదలచుకున్నాను. అదేమిటంటే, ప్రతిరోజు రాత్రి వీలయినంత త్వరగా పడుకొని వీలయినంత త్వరగా లేవటం అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజూ యోగ సాధనకి ఉదయం ఒక గంట ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ లాగా కేటాయించండి. (ఉదాహరణకు ఉదయం 5 నుండి 6 లేదా 5.30 నుండి 6.30 లేదా 6.30-7.30) అల్పాహారానికి ముందే యోగ సాధన తప్పనిసరిగా చేస్తాను అని అందరూ సంకల్పం చేసుకోవాలని కోరు కుంటున్నాను.

ప్రతివ్యక్తీ నిత్యం యోగసాధన చేయడం ద్వారా ఆరోగ్య భారతం, సంక్షేమ భారతం వెల్లివిరుస్తుందనే మాటలో వాస్తవం ఉందా ?

ప్రతి వ్యక్తి నిత్య యోగ సాధనలో ఆరోగ్య భారతం, సంక్షేమ భారతంతోపాటు ప్రపంచ శాంతీ వెల్లివిరుస్తుంది. అది ఎలాగంటే చెప్తాను.

నిత్య సాధనతో వ్యక్తి ఆరోగ్యంగా ఉండటం సహజంగా జరుగుతుంది. దానితో అతనికి సంవత్స రానికి కనీసం 30 వేల నుండి 60 వేల రూపాయల వరకు (ఆనారోగ్యం దృష్ట్యా ఖర్చు పెట్టే సొమ్ము) ఆదా అవటంతో పాటు, కుటుంబం కోసం కొంత సమయమూ కేటాయించగలుగుతాడు. పైగా అతని ప్రభావం కుటుంబంపై కూడా పడుతుంది. దీనితో కుటుంబ సభ్యులు కూడా యోగసాధన చేస్తూ ఆరోగ్యవంతులు అవుతారు. కాబట్టి ఆరోగ్యం చక్కగా ఉంటే ఒక కుటుంబానికి సుమారుగా సంవత్సరానికి లక్ష రూపాయల నుండి 2 లక్షల రూపాయల వరకు ఆదా అవుతాయి. ఒక కుటుంబానికే రెండు లక్షలు ఆదా అయితే మనలాంటి పెద్ద దేశంలో ఇంకెన్ని నిధులు ఆదా అవుతాయో ఆలోచించండి. ప్రస్తుతం ప్రభుత్వాలు లక్షల కోట్ల నిధులను ప్రజల ఆరోగ్యం కోసం కేటాయించాల్సి వస్తోంది. ఈ నిధులన్నీ మిగిలినట్లే కదా. ఈ నిధులను ప్రభుత్వం అభివృద్ధి కోసం వెచ్చిస్తుంది కదా.

ప్రపంచంలోని ప్రతి పౌరుడూ యోగసాధన చేస్తే ప్రతి దేశమూ సంపన్న దేశమే అవుతుంది. అన్ని దేశాలలోనూ ఆరోగ్యం, సంక్షేమం, అభివృద్ధి రెండింతలవుతాయి. ఇలా అన్ని దేశాలలో జరిగితే ప్రపంచమే శాంతిమయం అవుతుంది. అందులో ఏ మాత్రం సందేహం లేదు.

మన ఋషులు, మునులు దర్శించినది, కోరుకున్నది ఇదే. అందుకే కృణ్వంతో విశ్వమార్యం (ప్రపంచాన్ని శ్రేష్ఠులుగా చేద్దాం), సర్వేజనా సుఖినోభవంతు (ప్రజలందరూ సుఖంగా ఉండాలి), వసుధైక కుటుంబకం (భూమి మీద ఉన్న వారందరిని కుటుంబంగా భావించటం) అని అన్నారు. ఆ ఉద్దేశ్యంతోనే మన ప్రధాని శ్రీ నరేంద్రమోదీ మనదైన యోగను విశ్వవ్యాప్తం చేయాలని సంకల్పించారు. అంతర్జాతీయ యోగ దినోత్సవంగా గుర్తింపు తెచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *