విహారయాత్రా..అయితే వీటిపై శ్రద్ధ పెట్టాల్సిందే..

విహారయాత్రా..అయితే వీటిపై శ్రద్ధ పెట్టాల్సిందే..

వేసవి కాలం విహార కాలం కూడా.

ఎందుకంటే ప్రతీ ఇంటిలోనూ పిల్లలకు ఎక్కువ శెలవులు లభించేది వేసవిలోనే. అందుకే మిగతా రోజుల్లో కంటే వేసవికాలంలోనే విహార స్థలాలకు యాత్రికుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. చదువుతూ, ఎదుగుతున్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులంతా వేసవిలోనే విహార యాత్రలకూ, తీర్థయాత్రలకు ప్రాధాన్యం ఇస్తారు. ఒకపక్క పిల్లలకు శెలవులూ ఉంటాయి; మరోపక్క ఎటువంటి వర్షాలూ, తుఫానులూ, చలిగాలులూ వంటి వాతావరణ ఇబ్బం దులూ ఉండవు. అందుకే వేసవిని విహారయాత్రలకు అనువైన సమయంగా అనేకమంది భావిస్తారు.

వేసవిలో చేసే విహార లేదా తీర్థయాత్రలకు ఒకే ఒక ఇబ్బంది అధిక ఎండ లేదా వేడి. అధిక ఎండ ముఖ్యంగా పిల్లలు, వృద్ధులకు, ఆ మాటకొస్తే అందరికీ కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వేసవి విహారాన్ని చక్కటి అనుభవాలతో ముగించవచ్చు. ఆ జాగ్రత్త లేమిటో చూద్దాం.

వేసవిలో విహారయాత్ర లేక తీర్థయాత్రలకు వెళ్లేవాళ్లు ముఖ్యంగా ఆహారం, ఆహార్యం, విశ్రాంతి, నిద్ర వంటి అంశాల పట్ల తగిన శ్రద్ధ తీసుకోవాలి.

ఆహారం విషయంలో నీటిశాతం అధికంగా ఉండే ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికెళ్లినా వరి అన్నం, కూరలు, పప్పు, సాంబారు, పెరుగు లేదా మజ్జిగ ఎక్కువగా ఉంటాయి. ఇడ్లీలు ఇక్కడ విరివిగా లభిస్తాయి. ఈ పదార్థాలు నీటిశాతాన్ని అధికంగా కలిగి ఉంటాయి. ఇవి ఏ సమయంలో తిన్నప్పటికీ ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బందీ ఉండదు. తమిళనాడు, కేరళ, కర్నాటకలలో కూడా ఈ పదార్థాలు లభిస్తాయి. వరి అన్నం తమిళనాడు, కేరళల్లో విరివిగా దొరక్క పోవచ్చు. కానీ అక్కడ ఇడ్లీలు, సాంబారు, మజ్జిగ, అలాగే నీరు అధికంగా ఉండే తీపి పదార్థాలు పాయసం, కేసరి వంటివి లభిస్తాయి. వీటిని అధికంగా తినొచ్చు. ఉత్తర భారతంలో చపాతీలు ఎక్కువగా ఉంటాయి. దానిలోకి పచ్చి ఉల్లిపాయ ఇస్తారు. తెలుగువారికి ఉల్లిపాయ పచ్చిగా తినే అలవాటు, అవసరం పెద్దగా ఉండదు. ఒక్క పలావు చేసుకున్నప్పుడు తప్ప. కానీ ఉత్తరభారతంలో చపాతీతో పాటు పచ్చి ఉల్లిపాయ తప్పకుండా తినాలి. లేకపోతే వేడి చేస్తుంది. దానికి తోడు చపాతీలో వేసే కూరలో దుంప, నూనె, మసాలా అధికంగా వాడతారు. ఇది మరింత వేడి. ఉల్లిపాయ ఈ వేడికి విరుగుడుగా పనిచేస్తుంది. కాబట్టి పచ్చి ఉల్లిపాయ తప్పకుండా తినాలి. అలాగే చపాతీలో పెరుగుతో పాటు ఉల్లిపాయలు ఎక్కువగా ఉన్న పెరుగు పచ్చడి అధికంగా తినడం మంచిది. బీహార్‌లో దహి చూడా, మహారాష్ట్రలో శ్రీఖండ్‌ అనే తీపి పదార్థం ఉంటుంది. పేర్లు వేరయినప్పటికీ పదార్థం ఒక్కటే. ఇది పెరుగు, పంచదార లేక బెల్లంతో తయారవుతుంది. ఇది ఆయా ప్రదేశాలలో ఉండే వేడికి విరుగుడుగా పనిచేస్తుంది. కాబట్టి దహి చూడా, శ్రీఖండ్‌ విహారయాత్రలో తినదగిన పదార్థాలు. అలాగే ఎక్కడికి వెళ్లినప్పటికీ కొన్ని నీటిశాతం అధికంగా ఉన్న పదార్థాలు తప్పక లభిస్తాయి. వాటికి అధిక ప్రాధాన్యం ఇస్తే మన శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉంటుంది. ఇది శరీర ఆరోగ్యానికి మొదటి సూచిక.

ప్రస్తుతం విహార స్థలాల్లో యాత్రికులను ఆకర్షించడం కోసం అక్కడి ¬టళ్ల యజమానులు పలావు, వేపుళ్లు, పులిహోర, అప్పడాలు వంటి నోటికి రుచిని కలిగించే నూనె పదార్థాలను ఎక్కువగా తమ మెనూలో చేరుస్తున్నారు. వేసవిలో వీటిని ఎక్కువగా తీసుకోకపోవటం మంచిది.

విహారయాత్రలో ప్రతి ఒక్కరు ప్రతి అరగంటకు తగినంత నీరు తాగడం అవసరం. వేసవిలో, పైగా యాత్రలో ఉన్నప్పుడు మన శరీరం నుండి చెమట రూపంలో అధిక నీరు బయటికి వెళ్లిపోతుంది. ఇది శరీరంలో వేడి పెరగటానికి కారణం అవుతుంది. శరీర ఉష్ణోగ్రతను ఎప్పటికప్పుడు సమం చేసి, శక్తినిచ్చేది నీరు. అందుకే నీరు అధికంగా తాగుతుండాలి. ఈ విషయంలో పిల్లల పట్ల అధిక శ్రద్ధ తీసుకోవాలి. అలాగే నీటి మార్పు కూడా అనారోగ్యానికి కారణం అవుతుంది. అందుకోసం ప్రతి ఒక్కరు తమ వెంట నీటి సీసాను, లేదా వాహనంలో నీటి పెద్ద డబ్బాలను ఉంచుకోవటం ఉత్తమం. సీసా లేదా డబ్బాలో ఉదయం యాత్రకు బయలుదేరేముందు పరిశుభ్రమైన నీరు నింపు కోవాలి. దీనివల్ల ఎక్కడ పడితే అక్కడ ఏ నీరు పడితే ఆ నీరు తాగాల్సిన అగత్యం ఉండదు. ఐస్‌క్రీమ్‌లు, కూల్‌డ్రింకులకు తప్పకుండా దూరం పాటించాలి. వీటిబదులు నిమ్మరసం, కొబ్బరినీరు తాగాలి, ఐస్‌ వేయని పళ్లరసాలు తీసుకోవాలి.

వస్త్రధారణ కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ఈ విషయంలో కూడా తగిన శ్రద్ధ తీసుకోవాలి. వేసవిలో విహారం కాబట్టి ఎండ ధాటికి తట్టుకుని శరీరానికి చల్లదనాన్నిచ్చే కాటన్‌ లేక ఖద్దరు వస్త్రాలను ధరించాలి. కాటన్‌ వస్త్రాలు శరీరానికి చల్లదనాన్నిస్తాయి. మిగతావి వేడిని ఆకర్షించి, శరీరానికి వేడిని కలిగిస్తాయి. అందుకే రాజకీయ నాయకులు, ప్రజాసేవలో గడిపే ఇతరులు ఎక్కువగా ఖద్దరు వస్త్రాలకే ప్రాధాన్యం ఇస్తుంటారు. ఆరోగ్యం పాడవకుండా ఉండటమే దీని ముఖ్య ఉద్దేశ్యం. ముదురు లేక నల్ల రంగు వస్త్రాలు కాక తెలుపు లేక లేత రంగు వస్త్రాలను ధరించాలి. ఇవి ఆరోగ్యానికి సూచిక. ముదురు, నల్ల రంగు వస్త్రాలు ఉష్ణాన్ని ఆకర్షిస్తాయి. దీనివల్ల శరీరానికి వేడి తగులుతుంది. తెలుపు, లేత రంగు వస్త్రాలు వేడిని వికర్షిస్తాయి. దానివల్ల శరీరంలో చల్లదనం నిలిచి ఉంటుంది. అందుకే భారతీయులు మొదటినుంచి తెలుపు లేదా లేతరంగు వస్త్రాలకు, కాటన్‌ వస్త్రాలకు ప్రాధాన్యం ఇచ్చారు. సాంప్రదాయ భారతీయులు తెల్ల చొక్కా, ఖద్దరు పంచె, స్త్రీలయితే లేత రంగు ఖద్దరు చీరలు ధరించేవారు. పట్టు వస్త్రాలు కేవలం ప్రత్యేక సందర్భాలలో మాత్రమే ధరిస్తుంటారు. ప్రస్తుతం అన్ని సందర్భాలలోనూ పాశ్చాత్య పోకడలతో శరీరానికి అధిక వేడిని కలిగించే జీన్స్‌ వాడుతు న్నారు. జీన్స్‌ వల్ల యువతీయువకులలో సంతాన యోగం తగ్గుతున్నదనే అంశం వెలుగులోకి వస్తున్నది. దీనిపై పూర్తి పరిశోధనలు జరగాల్సి ఉంది. కాబట్టి విహారయాత్ర సమయంలో జీన్స్‌ వస్త్రాలు ధరించకపోవడం ఉత్తమం. బిగుతుగా ఉండే టీ షర్ట్‌, ప్యాంట్‌ వంటి వస్త్రాలు కాక గాలి సోకే కుర్తా, పైజామా లేక చొక్కా, పంచె, లుంగీ వంటివి ధరించాలి. మహిళలకు చీర, లేక చుడీదార్‌ హాయినిస్తాయి. వీటివలన శరీరానికి చక్కని గాలి సోకి, శరీర ఉష్ణోగ్రత సమంగా ఉంటుంది. అలసట ఎక్కువగా రాదు. చర్మానికి కూడా ఎటువంటి ఇబ్బందీ ఉండదు.

యాత్ర సమయంలో తల సంరక్షణా ముఖ్యమే. పైన ఎండ మండుతూ ఉంటుంది. ఆ అధిక వేడి పైనుండి మన తలలోకి చేరి, అక్కడి నుండి శరీరంలోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. అందుకే తల సంరక్షణ పట్ల కూడా తగిన శ్రద్ధ అవసరం. సాధారణంగా ఉత్తర భారతంలోని మహిళలు నెత్తిన చీర చెంగు కప్పుకుంటారు. ఇప్పటికీ మన ప్రాంతంలోని గర్భిణులు తలపై ప్రత్యేక నూలు లేక ఉన్ని వస్త్రం కట్టుకుంటారు. ఇది తల సంరక్షణ కోసమే. ఇలా వస్త్రం కప్పటం వలన నెత్తిన ఉండే బ్రహ్మరంధ్రం, మెదడు, చెవులు, కళ్లు వంటివాటికి అధిక ఉష్ణం సోకకుండా రక్షణ లభిస్తుంది. మన నూరేళ్ల జీవనానికి ముఖ్యమైనవి అవే. అందుకే మన ప్రతి సంప్రదాయం ఆరోగ్య సంరక్షణలో భాగమే అయి ఉంటుంది. విహార యాత్రికులు కూడా తల సంరక్షణ కోసం తెలుపు లేక లేత రంగు గొడుగు వెంట ఉంచుకోవటం ఉత్తమం. లేదా వేసవి కాబట్టి కాటన్‌తో తయారైన తెల్లటి వస్త్రం కట్టుకోవాలి.

విహారయాత్రలో మరో ముఖ్యమైన అంశం విశ్రాంతి, నిద్ర. విహారయాత్రలో ఎక్కువగా తిరుగుతాం. అలసట కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకే శరీరానికి తగినంత విశ్రాంతీ, నిద్ర అవసరం. అందుకు అనువైన వాతావరణం, నీడనిచ్చే ప్రదేశం ఉండాలి. మధ్యాహ్నం భోజనం తరువాత గంట లేక రెండు గంటలు తప్పకుండా విశ్రాంతి తీసుకోవాలి. నిద్రపోవాలి. దానివల్ల శరీరం బడలిక తీరి కొత్త ఉత్సాహం పొందుతుంది. పిల్లలు విహార యాత్ర ఉత్సాహంలో ఉండి సరిగా విశ్రాంతి తీసుకోరు. వారి పట్ల పెద్దలు శ్రద్ధ వహించాలి. వృద్ధులకు ఏమాత్రం వేడి చేసినా నిద్ర పట్టదు. వారి కోసం కొబ్బరినీరు లేక మజ్జిగ, కనీసం చల్లని నీరు అందుబాటులో ఉంచుకోవాలి. చల్లని నీరు నిల్వ ఉంచే ఫ్లాస్కులు వెంట తీసుకెళ్లడం ఉత్తమం. వీటిలో నీటి చల్లదనం కోసం ఐస్‌ వాడరాదు.

ఉదయం 7 గంటలకే యాత్రా స్థలానికి చేరుకొని సూర్యాస్తమయం తర్వాత తిరుగు ప్రయాణానికై ఏర్పాట్లు చేసుకుంటే ఎండ బారినపడకుండా ఉండొచ్చు.

ఇలా తిండి, వస్త్రధారణ, ప్రణాళిక, విశ్రాంతి వంటి ముఖ్యాంశాల పట్ల తగిన శ్రద్ధ వహిస్తే మన వేసవి విహారం ఎటువంటి అనారోగ్యం దరిచేరక ఆనందంగా సాగుతుంది. హాయిగా ముగుస్తుంది. తీపి జ్ఞాపకాలను మన వెంట తెస్తుంది.

– సూర్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *