వడదెబ్బ జాగ్రత్తలు

వడదెబ్బ జాగ్రత్తలు

వేసవిలో అత్యంత ప్రమాదకరమైనది వడదెబ్బ. దీనినే ఎండ దెబ్బ లేక సన్‌ స్ట్రోక్‌ అంటారు. వడదెబ్బకు గురైన వ్యక్తి దాని తీవ్రతను బట్టి క్షణాలలో ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. చాలావరకు వడదెబ్బ సంఘటనలు అంత తీవ్రతకు దారితీయవు. వడదెబ్బకు గురయిన వ్యక్తికి సకాలంలో ప్రాథమిక చికిత్స లభించి, ఆ తరువాత తగిన చికిత్స జరిగితే త్వరగా కోలుకుంటారు. అయితే ఆ వ్యక్తి వడదెబ్బకు గురయ్యాడనే విషయాన్ని వెంటనే గుర్తించగలగడమే చికిత్సకు మొదటిమెట్టు అవుతుంది.

వడదెబ్బ – లక్షణాలు

మన శరీర ఉష్ణోగ్రత సాధారణంగా 36 నుండి 40 డిగ్రీల సెంటీగ్రేడ్‌ లేదా 98 నుండి 99 డిగ్రీల ఫారన్‌హీట్‌ మధ్య కొనసాగుతుంది. ఇంతకుమించి ఉష్ణోగ్రత పెరగకుండా చూసుకునే వ్యవస్థ శరీరానికి సహజంగా ఉంటుంది. కాని వేడి మరీ అధికమైన సమయంలో ఈ వ్యవస్థ బలహీనపడుతుంది. ఉష్ణోగ్రతను నియంత్రించే శక్తిని శరీరం కోల్పో తుంది. అప్పుడు శరీర ఉష్ణోగ్రత అదుపు తప్పుతుంది. అంతకంతకూ పెరిగిపోతుంది. ఇటువంటి స్థితి వేసవిలో కలిగితే దానినే వడదెబ్బ అంటారు. దీని వేగం మరీ ఎక్కువగా ఉంటే మనం గుర్తించేలోపే వ్యక్తి ప్రాణాపాయ స్థితికి చేరుకునే ప్రమాదం ఉంటుంది.

వడదెబ్బకు గురయిన వ్యక్తి మొదట కండరాల బలహీనతకు గురవుతాడు. భరించలేని తలనొప్పి వస్తుంది. శరీర ఉష్ణోగ్రత 102 నుండి 106 డిగ్రీల ఫారన్‌హీట్‌ మధ్య ఉంటుంది. చెమట పట్టదు. నోటిలో వికారం అనిపిస్తుంది. వాంతులు, విరేచనాలు కూడా కావచ్చు. ఉష్ణోగ్రత 105 డిగ్రీలు దాటితే మెదడు నరాలు స్తంభించవచ్చు. గుండె వేగంగా కొట్టుకుంటుంది. సతమతమవుతూ వింతగా ప్రవర్తిస్తాడు. అధికంగా ఆయాస పడుతున్నట్లు కనిపిస్తాడు. ఊహించటానికి వీలు లేనంత బలహీనత వ్యక్తి అనుభవంలోకి వస్తుంది. దీంతో కళ్లు తిరిగి లేదా స్పృహ తప్పి పడిపోతాడు. కొందరికి చర్మం ఎర్రగా కందిపోతుంది.

చికిత్స

– వడదెబ్బకు గురైనవారిని ముందుగా నీడ ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లి, సేదతీరేలా చేయాలి.

– బట్టలు వదులు చేసి నీళ్ల (25-30 డిగ్రీల)తో తడిసిన బట్టతో ఆరగా ఆరగా తుడవాలి. దీనివల్ల రక్తనాళాలు కుంచించుకుపోవడం ఆగి, రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఆయాసం తగ్గుతుంది.

– గుడ్డను తడిపి దానిపై వారిని పడుకోబెట్టడం వల్ల కూడా వేడిని నివారించవచ్చు.

– ఒకవేళ శ్వాస అందనట్లైతే ఇతరుల నోటి ద్వారా శ్వాసను అందజేయాలి. గజ్జల్లో, చంకల్లో, మెడ వద్ద ఐస్‌ ప్యాకెట్లు పెట్టాలి.

– వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యుని పర్యవేక్షణలో తగిన చికిత్స అందించాలి.

ఈలోపు శరీరం నుండి కోల్పోయిన నీటిని సమతుల్యం చేయటానికి మజ్జిగ, నిమ్మరసం, పండ్లరసాలు, కొబ్బరి నీళ్లు వీటిలో ఏదో ఒకటి తాగించాలి. ఇది రోగిని చల్లబరుస్తుంది. హాయి నిస్తుంది.

ముందు జాగ్రత్తలు

వేసవిలో కొన్ని ముందుజాగ్రత్తలు పాటించి నట్లయితే వడదెబ్బ గానీ, వేసవికి సంబంధించిన ఇతర రోగాలు కానీ ప్రమాదం తప్పుతుంది. అవేమిటో చూద్దాం.

– ఉదయం పూట కాలకృత్యాలు తీరిన తరువాత ఖాళీ కడుపగా ఉన్న సమయంలోనే 1 లీటరు చల్లని (కుండ) నీరు తాగాలి. లేదా కిందటి రాత్రి ఒక గ్లాసు నీటిలో 1 ఎండు ఖర్జూర లేదా 4 ఎండు ద్రాక్షలు వేసి నానబెట్టి వాటిని తెల్లారి వడగట్టి ఖాళీ కడుపుతో తాగాలి. ఇలా చేస్తే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉండదు.

– ఉదయం 9 లేదా 10 గంటల తరువాత, సాయంత్రం 5 లేదా 6 గంటలకు ముందు స్నానం చేయరాదు.

– ఉదయం 9 గంటల లోపు ఇడ్లీ వంటి నూనె లేని ఆహారం లేదా పూర్తి భోజనం చేయాలి. వేసవిలో భోజనంలో మూడు పూటలా మజ్జిగ ఉండేలా చూసుకోవాలి. నూనెతో వండిన దోశలు, పూరీలు, బజ్జీలు, బోండా, వేపుడు కూరలు, పులి¬ర, పలావు వంటివి అతిగా తినొద్దు. ఉదయం సమయంలో అసలు తినొద్దు.

– రోజుకొక్కసారి ఒక గ్లాసు రాగి జావ లేదా సగ్గుబియ్యం జావ లేదా సబ్జా గింజల జావ తాగితే శరీరం చల్లబడుతుంది. ఇవి శరీరంలోని అధిక వేడిని తగ్గిస్తాయి. లేదా కొబ్బరినీరు, చెరుకురసం, నిమ్మకాయ రసం వంటివి తీసుకోవాలి.

– ముఖ్యంగా నీరు రోజుకు 5 నుండి 8 లీటర్ల నీరు తాగాలి. నీటి శాతం అధికంగా కూరగాయ లను కూరగా చేసుకు తినాలి.

– రాత్రి 10 గంటల లోపే నిద్రకు ఉపక్రమించాలి. ఉదయం 6 గంటలలోపు మేలుకోవాలి. ఎండ పడేదాకా నిద్రిస్తే శరీరంలో వేడి పెరిగి రోగ కారకం అవుతుంది.

ఇటువంటి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వేసవి కూడా హాయిగా గడపొచ్చు. తిండి, విశ్రాంతి, స్నాన పానాదుల విషయంలో ఒక క్రమశిక్షణతో జీవించే వారిని ఏ రోగమూ దరిచేరదు. ఒకవేళ ఏదైనా రోగం వచ్చినా తనంతట అదే తగ్గిపోతుంది. ముఖ్యంగా మితమైన సాత్వికమైన ఆహారం, తగిన విశ్రాంతి, వేళకు నిద్ర వంటివి వ్యక్తిని ఎల్లప్పుడూ ఆరోగ్యంగానే ఉంచుతాయి. అటువంటి వారి విషయంలో అన్ని కాలాలు హాయిగానే గడుస్తాయి.

– సూర్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *