నానమ్మాళ్‌… యోగవిద్యలో అద్భుతం

నానమ్మాళ్‌… యోగవిద్యలో అద్భుతం

యోగ విద్యకు స్త్రీపురుష భేదం లేదు. వయసు కూడా పెద్ద ఆటంకం కాదు. ఈ విషయాన్ని అద్భుతంగా నిరూపించిన అద్భుత మహిళవి. నానమ్మాళ్‌. కోయంబత్తూరు కేంద్రంగా యోగాకు ఆమె అమోఘమైన సేవ అందిస్తున్నారు. యోగ విద్య ఔన్నత్యాన్ని చాటి చెప్పినందుకు 2018లో పద్మశ్రీ పురస్కారంఅందుకున్నారు.

ఒక సమయంలో ఆమె రోజుకు యాభయ్‌ ఆసనాలు వేసేవారు. ఇప్పుడు మాత్రం 10 ఆసనాలు వేస్తున్నారు. ఆమె తన పదకొండవ ఏట యోగాభ్యాసం ఆరంభించారు. అసలు యోగ సాధనకు సమయం అంటూ ఏదీ లేదని ఆమె అంటున్నారు. ఏటీఎం వంటిదే యోగ సాధన కూడానని అన్నారు. ఈ వయసులోను ఆమె నిటారుగా నిలబడగలరు. వంగిపోకుండా నడుస్తారు. దీనికంతకూ కారణం యోగ అనే చెబుతారామె. ఆమె యోగ విద్యకు, ప్రాచుర్యం కావడానికి చేసిన సేవ అమోఘం. ఆమె కుటుంబంలోనే 36 మంది యోగ గురువులు ఉన్నారు. పదివేల మందికి శిక్షణ ఇచ్చారు. ఇదంతా కోయంబత్తూరు (తమిళనాడు) లోని ఓజోన్‌ యోగా ఇన్‌స్టిట్యూట్‌ కేంద్రంగానే ఆమె చేశారు.

నానమ్మాళ్‌, ఆమె సంతానం, మనుమలు, మనుమరాండ్రు ఇంతవరకు వైద్యులను సంప్రతించినది లేదు. ఇప్పటికీ బీపీ, మధుమేహం దరి చేరలేదు. కళ్లకు అద్దాలు కూడా ఆమెకు అవసరం లేదు. కానీ ఆమె పంచదార వినియోగించరు. బెల్లమే ఉపయోగిస్తారు. కాఫీ, తేనీరు కూడా ముట్టుకోరు. వేడినీళ్లులో కొన్ని మూలికలు, తేనె కలిపి తాగుతారు. వారి కుటుంబంలో ఎవరికీ సిజేరియన్‌ చేయించుకునే అవసరం కూడా రాలేదు. కానీ రెండేళ్ల క్రితం నానమ్మాళ్‌ మెట్లు దిగుతూ జారిపడ్డారు. తుంటి ఎముకకు దెబ్బ తగిలింది. అప్పటి నుంచి కొంచెం అభ్యాసం తగ్గించినా యోగ బోధనను మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు.

వేకువనే నాలుగున్నర ఐదుగంటల మధ్య మేల్కొనే నానమ్మాళ్‌ వెంటనే మూడు గ్లాసుల జీలకర్ర నీరు తాగుతారు. పూజకు ముందే ఆమె యోగాసనాలు వేస్తారు. అవన్నీ తమ తాత, నానమ్మల దగ్గరే నేర్చుకున్నానని ఆమె చెప్పారు. వారు వ్యవసాయ కూలీలు. పూజ అయిన తరువాత గంజిలో కూరగాయల ముక్కలు వేసుకుని తీసుకుంటారు. మధ్యాహ్న భోజనంగా పచ్చి కాయగూరల ముక్కలు, చపాతి తింటారు. మన టీటైమ్‌లో ఆమె చెరకురసం లేదా క్యారెట్‌ రసం తాగుతారు. రాత్రి ఆహారం ఒక గ్లాసు పాలల్లో కొద్దిగా పసుపు కలిపి తీసుకుంటారు. ఒక పండు మాత్రం తింటారు. ఎవరైనా ఉంటే బోధించి రాత్రి 7.30 గం.లకు నిద్ర పోతారు.

పద్మశ్రీ పురస్కారం రావడానికి ఒక సంవత్సరం ముందే నానమ్మాళ్‌ను యోగా దినోత్సవం సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం ఆహ్వానించింది. అప్పుడు నిర్వహించిన పోటీలలో ఒక వ్యక్తికి ప్రథమ బహుమతి ప్రకటించారు. అందుకు నానమ్మాళ్‌ అభ్యంతరం చెప్పారు. అతడు సరిగా ఆసనాలు వేయలేదని ఆమె వాదన. దీనితో ఆమె ఆసనాలు వేసి చూపారు. ఆమెలోని పరిపూర్ణ విద్యను చూసి అక్కడికి వచ్చిన వారంతా ఆశ్చర్యపోయారు. తరువాత పలు ప్రాంతాలలో జరిగిన యోగాసనాల పోటీకి ఆమె న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. అందుకు అండమాన్‌ కూడా వెళ్లి వచ్చారు.

ఆమెకు పద్మశ్రీ వచ్చిన తరువాత వార్తా కథనాల కోసం వచ్చిన ఎనిమిది మంది జర్నలిస్టులకు ఆమె మొదట ఇంటర్వ్యూ ఇవ్వలేదు. యోగాసనాలు నేర్పారు. తరువాత మాట్లాడారు. పద్మశ్రీ పురస్కార ప్రదానం తరువాత జరిగిన విందులో ఆమెకు నరేంద్ర మోదీ పక్కనే స్థానం ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *