శరీర తత్వాన్ని సరిచేసే ‘ముద్రలు’

శరీర తత్వాన్ని సరిచేసే ‘ముద్రలు’

యోగసాధనలో ఆసనాలు, ప్రాణాయామం, క్రియలు, ధ్యానంతో పాటు ముద్రలు కూడా ముఖ్యమైనవి.

ఈ బ్రహ్మాండం అంతా పంచతత్వాలతో నిర్మితమైనది. ఈ బ్రహ్మాండంలో సృష్టి జరిగిన ఈ శరీరం కూడా సహజంగానే పంచతత్వాల కలయికతో ఏర్పడినది. పంచతత్వాలు అంటే పృథ్వీ (భూమి), జలం, అగ్ని, వాయువు, ఆకాశం.

శరీరంలో ఎప్పుడైతే ఈ తత్వాల సంతులనం దెబ్బతింటుందో అప్పుడు మనిషి వ్యాధిగ్రస్తు డవుతాడు. అప్పుడు పంచతత్వాలను సంతులనం చేయగలిగితే వ్యాధి నెమ్మదిగా తగ్గి, ఆరోగ్యాన్ని పొందవచ్చు. అందుకోసం ఉపయోగపడేవి ముద్రలు. ఇవి కూడా యోగసాధనలో భాగమే.

ముద్రలు అనేవి చేతులతో చేసే కొన్ని రకాల సంజ్ఞల లాంటివి. చిన్నప్పుడు మనకు తెలియ కుండానే కొన్ని సంజ్ఞలు వాడుతూ ఉండేవాళ్లం. మూత్ర విసర్జనకు చిటికన వేలు చూపించటం, ఆకలి అయితే బొటన వేలు చూపించటం, ఆవలింత వచ్చినప్పుడు చిటిక వేయటం, నమస్కరించేటప్పుడు రెండు అరచేతులు కలపడం. కోపం వస్తే పిడికిలి బిగించటం ఇలా శరీరతత్వం, మనస్తత్వాలను బట్టి చేతుల స్థితులు మారిపోతుంటాయి.

– మన శరీరంలో 72 వేల నాడులు ఉంటాయి. వాటి చివరలన్నీ చేతివేళ్ల కొనల దగ్గర కేంద్రీకృతమై ఉంటాయి. వ్రేళ్ల కొనలు విద్యుత్‌ అయస్కాంత క్షేత్రాలను ప్రభావితం చేయగలవు.

– యోగ ముద్రలు శరీరంపై ‘క్లోజ్‌డ్‌ ఎలక్ట్రిక్‌ సర్క్యూట్‌’ లా పనిచేస్తాయి. ముద్రలు అభ్యాసం చేయడం వలన ప్రవేశించి శరీరం పునరుత్తేజం అవుతుంది.

మన చేతి అయిదు వేళ్లలో పంచతత్వాలు ప్రతిష్టితమై ఉన్నాయి. అవి

బొటన వ్రేలు – అగ్నితత్వం

చూపుడు వ్రేలు – వాయు తత్వం

మధ్యమ వ్రేలు – ఆకాశ తత్వం

ఉంగరం వ్రేలు – పృథ్వీ తత్వం

చిటికెన వ్రేలు – జల తత్వం

అగ్ని తత్వం : అగ్ని అన్ని భూతాలకు అధిపతి. ఇది శరీంలోని అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది. ముఖ్యంగా జీవిలోని జీర్ణవ్యవస్థ మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అగ్ని లేకపోతే జీర్ణవ్యవస్థ బలహీనపడటంతో పాటు జీవి కూడా జీవం కోల్పోతుంది.

వాయు తత్వం : రక్త ప్రసరణ వ్యవస్థకు, విసర్జన వ్యవస్థకు సంబంధించినది వాయుతత్వం. శరీరంలో కడుపు నిండా తినకుండా కొంచెం ఖాళీగా ఉండగానే ఆహారం తీసుకోవడం ఆపడం వాయు ప్రసరణ కోసమే.

ఆకాశ తత్వం : మన శరీంలో ఉండే ఖాళీ ప్రదేశం ఆకాశతత్వానికి ప్రతీక. ఎముకలు, వినికిడి, కీళ్ల మధ్య భాగాలలో వచ్చే సమస్యలు, ఛాతీ (శ్వాస క్రియ), గొంతు సమస్యలు మొదలైనవి ఆకాశ తత్వానికి సంబంధించినవి.

పృథ్వీ తత్వం : జీవి జీవించడం కోసం ఒక పునాదిని ఏర్పరచేది పృథ్వీ తత్వం. అంటే ఉదాహరణకు . జీవికి ఉన్న శరీరం, దానిలో ఉండే మాంసం, ఎముకలు, కండరాలు, వెంట్రుకలు, గోళ్లు వంటి భౌతికమైనవన్నీ పృథ్వీతత్వానికి సంబంధించినవి.

జల తత్వం : మన శరీరంలో 70 శాతం నీటితో నిండి ఉంటుంది. ఇది రక్తం రూపంలో కూడా ఉంటుంది. ఇవి జల తత్వంకి సంబంధించినవి.

ఆరోగ్యవంతుని శరీరంలో ఈ పంచ తత్వాలు సమస్థితిలో ఉంటాయి. వీటిలో అసమతౌల్యం ఏర్పడినప్పుడు అది ఏదో ఒక వ్యాధి రూపంలో బయటపడుతుంది. అప్పుడు ఆ తత్వాన్ని సమస్థితికి తేవడానికి ముద్రలు ఉపయోగపడతాయి.

ఒక్కొక్క అవయవంలో రెండు మూడు తత్వాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు ఎముక పృథ్వీతత్వంకి సంబంధించినది. ఎముక లోపల ఉండే ఖాళీ ప్రదేశంలో వాయువు ఉంటుంది. కనుక అది వాయుతత్వానికి సంబంధించినది. అలాగే మన శరీరంలోని ప్రతి కణంలోనూ ఈ పంచ తత్వాలు కలిసి ఉంటాయి. ఈ పంచతత్వంలో సమస్థితి లోపిస్తే వెంటనే ఆ కణం అనారోగ్యానికి గురవుతుంది. శరీరంపై ముద్రలు, వాటి ప్రభావం అత్యంత అద్భుతం. మనం చెప్పుకున్నంత సులభంగా ముద్రల తత్వం అర్థం కాదు. ముద్రలను అభ్యాసం చేస్తున్న కొద్దీ ముద్రలు, వాటి తత్వాలు మనకు చక్కగా అర్థమవుతాయి.

ముద్రల తీరు, ఉపయోగాలు :

– బొటన వ్రేలు కొనను ఏ వ్రేలు కొనకు ఆనిస్తామో ఆ వ్రేలికి చెందిన తత్వం సమస్థితికి చేరుతుంది.

– బొటన వ్రేలుకు మూలంలో ఏ వ్రేలు కొన అనిస్తామో ఆ వ్రేలి తత్వం తగ్గుతుంది.

ఏ భాగాలలో సమస్యలు ఉన్నాయో ఆ భాగాలకు చెందిన తత్వాలను ముద్రల ద్వారా సరిచేసుకుంటే ఆ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.

ముద్రలు ఆచరించేందుకు నియమాలు

– ముద్రలు రెండు చేతులతో ఒకేసారి సమంగా చేయాలి.

– ముద్రకు ముందు దీర్ఘ శ్వాసలు లేక అనులోమ విలోమ ప్రాణాయామం చేసి ముద్ర సాధన చేస్తే ఫలితం బాగా ఉంటుంది.

– ముద్రలు చేస్తున్న సమయంలో గోళ్లను స్పర్శించకూడదు. అందుకే గోళ్లను ఎప్పటి కప్పుడు కత్తిరిస్తూ ఉండాలి.

– ముద్రలు చేసే సమయంలో పద్మాసనం, వజ్రాసనం, లేదా సుఖాసనంలో ఉంటే ఫలితాలు బాగా వస్తాయి.

– ముద్ర సాధన సమయంలో శరీరం కదలరాదు.

– భోజనం చేయగానే ముద్రలు వేయవద్దు. 30 నిముషాల తరువాత వేయవచ్చు.

– ముద్రలను 10 నిముషాలతో ప్రారంభించి, వారానికి 5 నిముషాల చొప్పున పెంచుకుంటూ 30 నుండి 45 నిముషాల వరకు పెంచవచ్చు. దీనివలన సంపూర్ణ లాభం పొందవచ్చును.

– ముద్రల సాధన పూర్తయిన తరువాత ‘ప్రాణ ముద్ర’ 5 నుండి 10 నిముషాలు చేయాలి. దీనినే మిత్రముద్ర అంటారు.

జ్ఞానముద్ర

జ్ఞాన ముద్రనే ధ్యానముద్ర లేక చిన్‌ముద్ర అని కూడా అంటారు.

బొటన వ్రేలు, చూపుడు వ్రేలు అగ్రభాగాలను లేక కొనలను కలిపి, మిగిలిన మూడు వ్రేళ్లను నిటారుగా ఉంచాలి.

ఉపయోగాలు

జ్ఞాన ముద్ర వలన ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. తలనొప్పి, కోపం, నకరాత్మక ఆలోచనలు తగ్గిపోతాయి. అనిద్ర (నిద్ర రాకపోవడం), అతి నిద్ర (నిద్ర ఎక్కువగా పట్టడం) రెండూ సరి అవుతాయి.

వాయుముద్ర

చూపుడు వ్రేలును వంచి బొటన వ్రేలు మూలంలో తాకించి, బొటన వ్రేలును చూపుడు వ్రేలుపై ఉంచవలెను. మిగిలిన మూడు వేళ్లు నిటారుగా ఉంచాలి.

ఉపయోగాలు

వాత సంబంధ వికారాలు, కీళ్లనొప్పులు, పక్షవాతం, సయాటికా, స్పాండిలైటిస్‌, మోకాళ్ల నొప్పులు, వెన్నుపూసలో నొప్పి, గ్యాసు సమస్య మొదలైనవి తగ్గుతాయి.

ప్రాణముద్ర

చిటికెన వ్రేలు, ఉంగరపు వ్రేలు, బొటన వ్రేలు చివరలను కలపాలి. మిగిలిన రెండు వ్రేళ్లని చక్కగా నిటారుగా ఉంచాలి.

ఉపయోగాలు

ఈ ముద్ర ప్రాణశక్తికి కేంద్రం. ఈ ముద్ర వలన శరీరంలో శక్తి, ఆరోగ్యం వికసిస్తాయి. కంటి దోషాలు కనుమరుగవుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. విటమినుల లోపాలు, అలసట తగ్గుతుంది.

నిద్ర రాకపోతున్న సమయంలో జ్ఞానముద్ర, ప్రాణముద్ర వేయటం వలన మంచి ఫలితం ఉంటుంది.

పృథ్వీ ముద్ర

ఉంగరం వ్రేలు, బొటన వ్రేలు అగ్రభాగాలను కలిపి ఉంచుతూ మిగిలిన మూడు వ్రేళ్లను చక్కగా నిటారుగా ఉంచాలి.

ఉపయోగాలు

పృథ్వీ ముద్ర శరీర బలహీనతను తగ్గిస్తుంది. జీవితంలో శక్తిని పెంపొందించి, సాత్విక గుణాలను వికసింపచేస్తుంది. బరువు తగ్గుట, పెరుగుటనే కాకుండా ఎత్తుకు తగిన బరువును ఉంచుతుంది.

సూర్య ముద్ర

ఉంగరం వ్రేలిని మడచి బొటన వ్రేలి మూలంలో ఉంచి బొటన వ్రేలిని ఉగరం వ్రేలిపై ఉంచాలి

ఉపయోగాలు

శరీర బరువు తగ్గుతుంది. శరీరంలో వేడి పెరిగి జీర్ణక్రియకు సహాయపడుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్‌ తగ్గిపోతుంది. మానసిక ఆందోళనలు తగ్గుతాయి. రక్తం శుద్ధి అవుతుంది. థైరాయిడ్‌ గ్రంథి పనితనం సమస్థితికి చేరుతుంది. దీనివలన శరీర బరువు సమతూకానికి చేరుతుంది.

జాగ్రత్త : శారీరికంగా బలహీనులు, సున్నితమైన వారు సూర్యముద్ర చేయరాదు. అలాగే ఎండ సమయంలో వేసవిలో ఎక్కువసేపు చేయరాదు.

శూన్య ముద్ర

మధ్య వ్రేలు ఆకాశతత్వానికి సంబంధించినది. మధ్య వ్రేలు, బొటన వ్రేలు మూలంలో అనించి, బొటన వ్రేలును మధ్యమ వ్రేలుపై అనించాలి.

ఉపయోగాలు

చెవులలో చీము కారుట, చెవి నొప్పి లేక పోటు, చెవుడు, తక్కువగా వినపడుట మొదలగు సమస్యలు తగ్గుతాయి. ఎముకల బలహీనత తగ్గుతుంది. గొంతు, థైరాయిడ్‌కు సంబంధించిన వ్యాధులు నయమవుతాయి.

ఆకాశ ముద్ర

మధ్యమ వ్రేలు, బొటన వ్రేలు చివరలను కలిపి మిగిలిన వ్రేళ్లను చక్కగా ఉంచాలి.

ఉపయోగాలు

ఆకాశ తత్వం వలన మనసు నిర్మలమవుతుంది. వినికిడి శక్తి పెరుగుతుంది. గురక సమస్య తగ్గుతుంది. కొంతమందికి విమాన ప్రయాణం సమయంలో ఆ ధ్వనికి చెవులు దిబ్బడ పడతాయి. ఆకాశ ముద్ర వలన ఈ సమస్య తగ్గుతుంది. ఆవలిస్తున్నప్పుడు దవడలు పట్టుకోవడం తగ్గుతుంది.

అపాన ముద్ర

బొటన వ్రేలు, మధ్యమ, ఉగరం వ్రేళ్ల కొనలు కలిపి స్పర్శించి మిగిలిన రెండు వ్రేళ్లను నిటారుగా ఉంచాలి.

ఉపయోగాలు

అపాన ముద్ర వలన మధుమేహ (షుగర్‌) వ్యాధి తగ్గుతుంది. మలబద్ధకం, మూత్రరోగం, మూత్ర పిండాల సమస్య, పళ్ల సమస్యలు తొలగిపోతాయి. హృదయ సంబంధ రోగాలకు ఉపయోగం. శరీరంలోని మలినాలను బయటికి పంపటానికి అపాన ముద్ర ఎంతో సహాయపడుతుంది.

అపాన వాయు ముద్ర

వాయు ముద్ర, అపాన ముద్ర కలిపి చేయటం వలన వచ్చినదే అపానవాయు ముద్ర. చూపుడు వ్రేలును మడిచి, బొటన వ్రేలు మూలంలో ఉంచి, అగ్రాన్ని మధ్యమ, ఉంగరం వ్రేళ్ల అగ్రాలను తాకించి, చిటికెన వ్రేలును చక్కగా ఉంచాలి. దీనినే సంజీవినీ ముద్ర అని కూడా అంటారు.

ఉపయోగాలు

హృదయానికి (గుండె) సంబంధించిన సమస్యలను తగ్గిస్తుంది. గుండెనొప్పిని వెంటనే తగ్గించగలదు. తలనొప్పి, ఉబ్బసం, హై బి.పి.లను తగ్గిస్తుంది. గ్యాస్‌ను తగ్గిస్తుంది. వాత రోగాలను తొలగించి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.

వరుణ ముద్ర

చిటికెన వ్రేలు, బొటన వ్రేలు అగ్రాలను కలపాలి. మిగిలిన 3 వ్రేళ్లను నిటారుగా ఉంచాలి.

ఉపయోగాలు

చర్మం కాంతివంతం అవుతుంది. చర్మ రోగాలు, రక్త వికారాలు తుగ్గుతాయి. జలతత్వం లోపం వల్ల వచ్చే వ్యాధులు తగ్గిపోతాయి. ముఖం సుందర మవుతుంది. కళ్లు పొడి బారకుండా ఉంచుతుంది. ఊపిరితిత్తులలో నీరు లేక కఫం చేరిన సమస్యను ఇది నియంత్రిస్తుంది.

లింగ ముద్ర

బొమ్మలో చూపించిన విధంగా చేతుల వ్రేళ్లను పరస్పరం దూర్చి రెండు అరచేతులను బంధించి, ఎడమ బొటన వ్రేలును నిలువుగా ఉంచాలి.

ఉపయోగాలు

శరీరంలో వేడిని వృద్ధి చేస్తుంది. జలుబు, దగ్గులను తగ్గిస్తుంది. సైనసైటిస్‌, కఫంను తొలగి స్తుంది. అలాగే నాభి సమస్యలను తొలగించుటలో ఈ ముద్ర సహాయపడుతుంది. లింగ ముద్ర సాధన తరువాత దాహం బాగా వేస్తుంది. మంచి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి.

జాగ్రత్త : ఎసిడిటి, అల్సర్‌ ఉన్నవారు ఈ ముద్ర సాధన చేయరాదు. అలాగే ఈ ముద్రను ఎక్కువ సమయం సాధన చేయరాదు.

ఇక్కడ చెప్పుకున్న ముద్రలు చాలా తక్కువ మాత్రమే. ఇవి కూడా చేతులతో చేసేవి మాత్రమే. ఇవి నిత్యజీవితంలో సాధారణ సమస్యల నివారణ కోసం ఉపయోగపడేవి. ఇవి కాక ఇంకా అనేక రకాల ముద్రలు ఉన్నాయి. అవి

హస్త ముద్రలు – చేతులతో చేసేవి.

కాయ ముద్రలు – శరీరంతో చేసేవి.

శిర ముద్రలు – తలతో చేసేవి.

బంధ ముద్రలు – బంధములతో చేసేవి.

చక్షు ముద్రలు – కళ్లతో చేసేవి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *