ఖర్చు తక్కువ పోషకాలు ఎక్కువ

ఖర్చు తక్కువ పోషకాలు ఎక్కువ

ఎట్టకేలకు ఎండాకాలం ముగిసింది. ఎదురు చూడగా చూడగా వర్షాలు ప్రారంభమయ్యాయి. ఎండల నుండి, ఉక్కపోత నుండి ఉపశమనం లభించినందుకు, మళ్లీ చల్లదనం తమ అనుభూతి లోకి వచ్చినందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ వర్షాలు తమతోపాటు వ్యాధులను వెంటపెట్టుకు వస్తాయి. వాటిలో అంటువ్యాధులు ప్రమాదకర మైనవి. ఆ అనుభవం కూడా అప్పుడే మనకు ఎదురవుతోంది. వర్షాలతో వచ్చే వ్యాధులు మొదట పిల్లలపై తమ ప్రభావం చూపిస్తాయి. జలుబు, దగ్గు, రకరకాల విష జ్వరాలతో పిల్లలను ఆసుపత్రులకు తీసుకొస్తున్న తల్లిదండ్రుల సంఖ్య ఇప్పటికే పెరుగుతోంది. ఇక ఈ వ్యాధుల పరంపర వర్షాకాలం ముగిసేవరకో, లేక వచ్చే ఫిబ్రవరిలో శీతాకాలం ముగిసి, మళ్లీ వేసవి వచ్చేవరకో కొనసాగుతూనే ఉంటుంది. తినకపోతే నీరసం-తింటే ఆయాసం అన్నట్లుగా వేసవి వేడిని తట్టుకోలేం, వర్షపు వ్యాధులనూ ఎదుర్కోలేం. ఇదీ మన ప్రస్తుత దుస్థితి. దీనికి పరిష్కారం లేదా ? ఎప్పటికీ వ్యాధులతో పోరాటం చేయవలసిందేనా? వెతికితే ప్రతి ప్రశ్నకూ సమాధానం ఉంటుంది. ప్రతి సమస్యకూ పరిష్కారం లభిస్తుంది. ఇది మన భారతదేశ ప్రత్యేకత.

కాలం తీరును బట్టి శరీర ఆరోగ్య స్థితి మారకుండా, స్థిరంగా ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడేది శరీరంలోని రోగనిరోధక శక్తి. రోగనిరోధక శక్తి ఎలా వస్తుంది ? పోషకాహారం తీసుకుంటే వస్తుంది. మనం రోజూ తెల్లటి అన్నం, గోధుమ రొట్టె, అందులో మంచి పప్పు, ఆవకాయ, చారు, మజ్జిగ తీసుకుంటున్నాం కదా ! అవి తింటే ఆకలి తీరుతోంది కదా, శక్తి వస్తోంది కదా ! అవి పోషకాలు కాకపోతే ఆకలి తీరి, శక్తి ఎందుకు వస్తోంది ? పోషకాహారం అనగానే ఇటువంటి అనేక ప్రశ్నలు మనలో ఉత్పన్నం అవుతాయి. నిజమే ! మనం రోజూ అన్నం, పప్పు, చారు, ఆవకాయ, మజ్జిగ తీసు కుంటున్నాం. కానీ ఇవన్నీ శరీరానికి అప్పటికప్పుడు అంటే తాత్కాలికంగా శక్తిని కలిగిస్తాయి తప్ప దీర్ఘకాల శక్తిని ఇవ్వలేవు. అలా దీర్ఘకాలం స్థిరంగా ఉండగల శక్తినిచ్చే వాటినే పోషకాహారం అంటారు. వరి, గోధుమ కాకుండా మన ఆహారంలో పోషకాలనిచ్చేవి ఏమిటి ? వాటిగురించే తెలుసుకుందాం.

పూర్వం అంటే ఒక 25 – 30 ఏళ్ల క్రితం మనం పిల్లలుగా ఉన్నప్పుడు లేక అప్పుడు చిన్నగా ఉన్న మన పిల్లలు ప్రతిరోజూ బడికి వెళుతున్నప్పుడు దారిలో కనిపించే బడ్డీ కొట్లో (చిన్న దుకాణం) పల్లీ ఉండ లేక నువ్వుల ఉండ లేక కొబ్బరి లౌజ్‌ వంటివి కొనుక్కుని తింటూ, చీకుతూ వెళ్లేవాళ్లు. అప్పటి పిల్లలకి ఇప్పటిలా వర్షాకాలం రాగానే జలుబు, శీతా కాలంలో చర్మం పొడిబారటం, వేసవిలో వడదెబ్బ వంటివేమీ ఉండేవి కావు. సంవత్సరానికి ఒక్కసారి జ్వరం వచ్చేది అంతే. ఆ చుట్టుపక్కల ఉన్న ఒక చిన్న గుడి పూజారి గుళ్లో ఉన్న భస్మం తీసి నోట్లో వేసేవాడు. ఆ మాత్రానికే జ్వరం హుష్‌కాకి అంటూ ఎగిరిపోయేది. ఇప్పటిలా అడుగడుగునా డాక్టర్లూ, ఆస్పత్రులూ ఉండేవి కావు అప్పట్లో. చెప్పొచ్చేదేమి టంటే ఆ రోజుల్లో శరీరానికి పోషకాలుగా పని చేసినవి పల్లీలు, నువ్వులూ, కొబ్బరి వంటివి ఇంట్లో దొరికే పదార్థాలే. ఇప్పుడు వాటిని మనం మరిచి పోయాం. బదులుగా బిస్కెట్లు, చాక్లెట్లు, కర్‌కురేలూ, లేస్‌, కూల్‌డ్రింకులూ మన పిల్లలకు అందిస్తున్నాం. అవి తిని వారు ఆకలి లేమితో మందబుద్ధులుగా, బలహీనులుగా మారుతుంటే ఏం చేయాలో తెలియక మళ్లీ మళ్లీ వైద్యులను సంప్రదిస్తున్నాం. వేల రూపాయలు వారికి సమర్పించుకుంటున్నాం.

ఈ పరిస్థితిని మనం మార్చుదాం. మనదైన వస్తువులను, ఆహారాన్ని మన ఇంటిలోకి తెచ్చు కుందాం. అందుకు మనం చేయాల్సిందల్లా మనవైన పోషకాలను ఆశ్రయించడమే. పల్లీలు లేక వేరుశనగలు, నువ్వులు వంటివి శరీరానికి తగిన ఉష్ణోగ్రతను అందించటంతో పాటు తగిన శక్తినీ, విటమిన్లు, మినరల్స్‌ వంటి వాటినీ అందిస్తాయి. మనం చేయాల్సిందల్లా చాక్లెట్లు, బిస్కట్లకు బదులు పల్లీ ఉండలు లేక నువ్వుల ఉండలు లేక కొబ్బరి ఉండలను మన పిల్లల జేబుల్లో నింపడమే.

పల్లీల్లో పోషకాలు

రైలు ప్రయాణంలో ఉన్నప్పుడు మంచి టైంపాస్‌ ఆహారం వేరుశనగలు. వీటివల్ల ఎంతో ఆరోగ్యం చేకూరుతుందనేది మనకు తెలియకపోవచ్చు. కానీ ఇది నిజం. పల్లీలను మనదేశంలో ఎక్కువగా నూనె రూపంలో వాడతారు. ఇది కూడా ప్రస్తుతం తగ్గిందనే చెప్పుకోవచ్చు. మన ఇంటిలో లభించే పల్లీలు లేక వేరుశనగ గుళ్లు లేక పప్పుల్లో అనేక పోషకాలు ఉన్నాయి. వీటిలో ఉండే మాంసకృత్తులు, పీచు పద్దార్థాలు, పిండి పదార్థాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. తిన్న ఆహారం సులువుగా జీర్ణం అవటానికి కావలసిన శక్తిని ఇవి శరీరానికి అందిస్తాయి. అలా వీటివలన అజీర్ణం తగ్గి ఆకలి పెరుగుతుంది. పల్లీలలో ఉండే ఐరన్‌ వల్ల ఇవి తింటే శరీరంలో చిక్కటి, చక్కటి రక్తం తయారవుతుంది. మాంసం, గుడ్లలో కంటే మాంసకృత్తులు పల్లీల్లోనే ఎక్కువ ఉంటాయి. పైగా ఇవి శరీరంలోని చెడు కొవ్వును కరిగిస్తాయి. మంచి కొవ్వును పెంచుతాయి. దీనివల్ల కండరాలు పటిష్టం అవటంతో పాటు గుండె జబ్బులకూ ఆస్కారం ఉండదు. ముఖ్యంగా బద్దకం వదిలిపోతుంది. శరీరంలోని భాగాలన్నీ చక్కని సమన్వయంతో పనిచేయాలంటే శక్తి, ప్రొటీన్‌, ఫాస్ఫరస్‌, థైమీన్‌, నియాసిన్‌ అనే ఐదు పోషకాలూ ఎంతో అవసరం. ఈ ఐదు రకాలూ వేరుసెనగ పప్పుల్లో పుష్కలంగా లభ్యమవుతాయి. విటమిన్‌ ఎ, బి, సి, ఇ లతో కలిపి మొత్తం 13 రకాల విటమిన్లూ, ఐరన్‌, కాల్షియం, జింక్‌, బోరాన్‌ వంటి 26 రకాల కీలక ఖనిజాలూ వీటిల్లో ఉన్నాయి. వీటిలో ఉండే ప్రొటీన్‌ గర్భిణులకూ, పాలిచ్చే తల్లులకూ, పెరిగే పిల్లలకూ ఎంతో మంచి చేస్తుంది. బలాన్ని కలిగిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే ప్రతిరోజూ ఒక్క పల్లీ ఉండ తినటం అలవాటు చేసుకుంటే అనారోగ్యం దరిచేరదు. కాలం మారిన ప్రతిసారీ వైద్యులను సంప్రతించాల్సిన పరిస్థితీ ఎదురు కాదు.

ఎలా తినాలి ?

పల్లీలను నేరుగా తినొచ్చు లేదా బెల్లం కలుపు కుని ఉండలుగానూ, పొడి చేసుకుని లడ్డుగానూ తినొచ్చు. పచ్చి పల్లీలను నేరుగా తినకుండా లేదా తినిపించకుండా ఇనుప పెనం మీద లేక ఇనుప బాండీలో వేయించి తినటం మంచిది. దీనివలన పల్లీలోని గురుగుణం అంటే వేడిచేసే గుణం తగ్గిపోతుంది. పెద్దలు ఉదయాన్నే పరగడుపున తింటే మరీ మంచిది. పిల్లలు ఎప్పుడైనా తినొచ్చు. దీనివల్ల అందరికీ ఆకలి అదుపులో ఉంటుంది. అంటే సమయానికి వేస్తుంది. ఎక్కువగా తినాలనిపించదు. అంటే శక్తి శరీరంలో నిల్వ ఉందన్నమాట. దీనివల్ల అన్నం, పప్పు, చారు వంటివి ఎక్కువ తినాలని పించదు. ఫలితంగా శరీర అధిక బరువు, అధిక చక్కెర అదుపులోకి వస్తుంది. సన్నబడతారు. కానీ శక్తివంతంగా, చురుకుగా ఉంటారు.

పల్లీల ఉండలను పంచదారతో కాక బెల్లంతో చేసుకోవాలి. పంచదార విషం అయితే బెల్లం అమృతం. పంచదారతో చేసిన పల్లీ ఉండల వలన శరీరానికి పైన చెప్పుకున్న ఎటువంటి ఉపయోగాలు లభించవు. బెల్లం కూడా తెల్లటిది కాక నల్లగా లేక కాఫీపొడి రంగులో ఉన్నది మంచిది. బెల్లంతో పల్లీ ఉండ ఎలా చేయాలనేది యూట్యూబ్‌లో చూసి తెలుసుకోవచ్చు. అరిసెల కోసం బెల్లం పాకం పట్టినట్టే పట్టి అందులో వేయించి, పప్పులుగా చేసుకుని ఉంచుకున్న పల్లీలు వేసి చిక్కబడేదాకా కలిపి, దించి, నెయ్యి పూసిన పళ్లెంలో వేసుకుని ఆరబెట్టడమే. కొంచెం గోరువెచ్చగా ఉన్న సమయం లోనే ఉండలుగా లేక పట్టీలుగా తయారుచేసుకుని నిల్వ చేసుకోవచ్చు. రోజుకొక ఉండ లేక పట్టీ చొప్పున (చతురస్రాకారం) తినొచ్చు. పెద్దలు రోజుకు ఒకటి లేక రెండుతో ప్రారంభించవచ్చు. మెల్లగా శక్తిని బట్టి ఎక్కువ పెంచుకోవచ్చు.

నువ్వులు

పల్లీల వంటి మరో అద్భుత పోషకాహారం నువ్వులు. నువ్వులలో కూడా పల్లీలలో ఉండే గురుగుణం, శక్తి, విటమినులు, మినరల్స్‌ ఉన్నాయి. నువ్వులను కూడా పల్లీల వలెనే నేరుగానూ, లేక బెల్లం కలుపుకుని ఉండలు పట్టీలుగా చేసుకుని తినొచ్చు. అయితే నువ్వులలో క్యాన్సర్‌ను అదుపు చేసే ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. ముఖ్యంగా చర్మవ్యాధులను రానీయక, చర్మానికి మెరుపును కలిగిస్తుంది. నువ్వులలోని మెగ్నీషియం క్యాన్సర్‌ కారకాలను అదుపులో ఉంచితే, కాల్షియం, జింక్‌ ఎముకలను దృఢంగా ఉండేట్లు చేస్తాయి. నువ్వులలో ఒమేగా 3, 6, 9 ఆమ్లాలు ఎక్కువగా ఉండి జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి.

మనదేశంలో నువ్వుల నుండి తీసిన నూనెను ఎక్కువగా వాడుతుంటారు. చర్మ వ్యాధులకు ఈ నూనె చాలా మంచిది. నువ్వుల వాడకం వలన మధుమేహం, బిపి వంటివేవీ దరిచేరవు. వీటిని పిల్లలయినా, పెద్దలయినా వారానికి ఒక్క లడ్డు చొప్పున తినొచ్చు. నువ్వుల ఉండ వారానికి ఒకటి తింటే పోషకాహార లోపం వలన వచ్చిన కీళ్లు లేదా మోకాళ్ల నొప్పులు 6 వారాలలో మటుమాయం అవుతాయి. అనేక క్యాన్సర్‌ రోగాలు సైతం నయమవుతాయి అని ప్రముఖ ఆహార శాస్త్రవేత్త, భారతీయుడు డా.ఖాదర్‌ వలీ చెపుతున్నారు. శరీరానికి చక్కని ఔషధం అయిన నువ్వులను ఎక్కువగా తినటం ఒంటికి మంచిది కాదు. నువ్వులతో బెల్లం కలిపి ఉండలుగా చేయటం ఎలా అనేది కూడా యూట్యూబ్‌లో చూసి తెలుసుకోవచ్చు.

ఇలా మనదేశంలో అనాదిగా ఎన్నో పోషకాహార పంటలు ఉన్నాయి. నేడు మనం వాటిని మరచి పోయాం అంతే. వాటిని మళ్లీ గుర్తు చేసుకుని మన ఇంట్లోకి ఆహ్వానిద్దాం. ఈ సంప్రదాయ ఆహారంతో ఖర్చు తక్కువ పోషకాలు ఎక్కువ అని తెలుసుకుందాం, అందరికీ చాటుదాం.

– సూర్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *