చల్లని విషం కూల్‌డ్రింక్‌

చల్లని విషం కూల్‌డ్రింక్‌

మనకు దాహం వేస్తే నీరు తాగుతాం. ఒంట్లో వేడి చేసిందనిపిస్తే మజ్జిగ లేదా కొబ్బరిబొండాం తాగుతాం. ఏ ఘన ఆహారం తిన్నప్పటికీ ద్రవ ఆహారంగా నీరు లేదా మజ్జిగ తాగుతాం. ఇంటికి వచ్చిన అతిథులు మర్యాద చేయటానికి చల్లటి మజ్జిగ లేక పళ్లరసాలు ఇస్తుంటాం. ఇవన్నీ మన సంప్రదాయ పానీయాలు. వీటితో చక్కటి ఆరోగ్యం కూడా లభిస్తుంది. అయితే ఇప్పుడు వీటి స్థానంలో అనారోగ్యం కలిగించే కూల్‌డ్రింకులు చేరాయి. పైన చెప్పుకున్న దాదాపు అన్ని సందర్భాల్లోనూ కూల్‌డ్రింకులనే వాడుతున్నారంటే అతిశయోక్తి కాదేమో. ముఖ్యంగా కొంతమంది యువత దాహం తీర్చుకోడానికీ కూల్‌డ్రింకునే ఉపయోగించడం అత్యంత దారుణస్థితి. ఆరోగ్యం విషయాలలో అవగాహన ఉన్నవాళ్లు తప్ప మిగతావారంతా కూల్‌డ్రింకులను అతిగా ఉపయోగిస్తున్న మాట వాస్తవం.

‘కూల్‌డ్రింక్‌ మన శరీరానికి అనారోగ్యం కలిగిస్తుంది, తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే విషంతో సమానం’ అని ఎన్నో పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

కూల్‌డ్రింక్‌తో అనారోగ్యం

ఒక గ్రామంలో 50-55 మధ్య వయసున్న ఓ మహిళ వేసవికాలంలో వేడి చేసిందనిపించినప్పుడల్లా పక్కనే షాపులో ఉన్న కూల్‌డ్రింక్‌ తాగేది. అతిచల్లని కూల్‌డ్రింక్‌ లోపలికి వెళ్లడంతో శరీరం చల్లబడి వేడి తగ్గినట్లనిపించేది. నిజానికి ఆమెకు వేడి తగ్గలేదు. ఎందుకంటే వేడి తగ్గితే రెండోసారి కూల్‌డ్రింక్‌ తాగాలనిపించదు. వేడి తగ్గుతుందనే భ్రమలో ఆ మహిళ వేసవి మొత్తం కూల్‌డ్రింకులు అధికంగా తాగింది. వేసవి పూర్తయి వాతావరణం చల్లబడిన తరువాత ఒకరోజు ఆమె ఉన్నట్టుండి కళ్లుతిరిగి పడిపోయింది. తీవ్ర జ్వరం, నిస్సత్తువ కూడా వచ్చింది. ఊర్లోని వైద్యుడి మందులకు తగ్గలేదు. నగరంలోని పెద్ద ఆసుపత్రికి తీసుకెళితే అక్కడి వైద్యుడు షుగర్‌ టెస్టు చేసి, షుగర్‌ 300 పైన ఉందని తేల్చాడు. ఓ వారంపాటు అసుపత్రిలోనే ఉంచి వైద్యం అందించాడు. తాత్కాలికంగా ఆమె కోలుకుంది. కాని మధుమేహం ఆమెను శాశ్వతంగా చుట్టుకుంది. మా అమ్మకు ఇంతకుముందు ఎప్పుడూ షుగర్‌ లేదు, మరి ఇప్పుడు ఎలా వచ్చింది ? అని కొడుకు వైద్యుడిని అడిగాడు. దానికి వైద్యుడు ‘మీ అమ్మ ఈ వేసవిలో కూల్‌డ్రింకులు తాగారా?’ అని ప్రశ్నిం చాడు. అవునన్నాడు కొడుకు. వేసవి తరువాత వచ్చే రోగులలో ఎక్కువమంది కూల్‌డ్రింక్‌ తాగుతున్నవారే అని, ఇప్పుడు షుగర్‌ వస్తున్నవారిలో కూడా ఎక్కువమంది వారేనని చెప్పాడు వైద్యుడు. విస్మయం చెందటం కొడుకు వంతు అయింది.

కూల్‌డ్రింకులో ఎక్కువశాతం చక్కెర ఉంటుంది. ఇది మనం సాధారణంగా తీసుకునే తీపి పదార్థాల కన్నా అనేక రెట్లు ఎక్కువ. అర్థమయ్యేలా చెప్పాలంటే 200 మి.లీటర్ల కూల్‌డ్రింక్‌లో ఉండే చక్కెర 10 చెంచాల చక్కెరతో సమానం. ఇంత చక్కెర ఒకేసారి కూల్‌డ్రింక్‌ ద్వారా మన పొట్టలోకి వెళుతుంది. సాధారణ స్థాయిలో పొట్టలోకి వచ్చే చక్కెరను జీర్ణం చేయటానికే మన జీర్ణవ్యవస్థ ఎంతో శ్రమపడాల్సి ఉంటుంది. ఇక తండోపతండాలుగా వచ్చిపడుతున్న చక్కెరను జీర్ణం చేయాలంటే కుదిరేపని కాదు. దాంతో పొట్టలో చక్కెర నిల్వలు అధికమయి, పొట్ట చుట్టూ కొవ్వులా పేరుకుపోతుంది. రక్తంలో కూడా ఈ చక్కెర చేరిపోతుంది. రక్తంలో చక్కెర స్థాయి పెరగడాన్నే షుగర్‌ వ్యాధి లేదా మధుమేహం అంటారు. అందుకేే కూల్‌డ్రింక్‌లు తాగితే చక్కెర వ్యాధిగ్రస్తులయ్యే ప్రమాదం అత్యంత ఎక్కువ.

ఒక తల్లి తన పదేళ్ల లోపు వయసు పిల్లవాడిని బడికి పంపడం కోసం కూల్‌డ్రింక్‌ ఆశ చూపించి, రోజూ ఒక చిన్న గ్లాసు తాగించేది. ఆమె కొడుకుపై ప్రేమతో అలా చేసింది. కాని కూల్‌డ్రింక్‌ కొడుక్కి నష్టం చేస్తుందని ఆమెకేం తెలుసు! ఓ రెండు వారాల తరువాత కొడుక్కి తలనొప్పి, కాళ్లు చేతుల నొప్పులు, జ్వరం, నీరసం వంటివన్నీ చుట్టుముట్టాయి. వైద్యుడు పిల్లవాడి తిండి అలవాట్ల గురించి తల్లిని అడిగాడు. తల్లి చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోయాడు. తల్లి చెప్పిన సమాధానం ఏంటంటే.. పిల్లవాడు రోజూ కూల్‌డ్రింక్‌ తాగందే బడికి వెళ్లడని, మధ్యాహ్నం సాయంత్రం అన్నం తినడానికి ఇష్టపడడు అని. పిల్లవాడికి కాల్షియం బాగా తగ్గిందని, ఎముకలలో బలం తగ్గి, జీర్ణశక్తి మంద గించిందని, అందుకే ఆకలి తగ్గిందని చెప్పి మందులిచ్చాడు వైద్యుడు. కూల్‌డ్రింక్‌ తాగించొద్దు అని గట్టిగా చెప్పాడు.

సాధారణంగా మన ఇంట్లో చేసుకున్న పళ్లరసం ఒకరోజులో పాడయిపోతుంది. ఫ్రిజ్‌లో ఉంచితే మరో రోజు నిల్వ ఉండగలదు. కాని కూల్‌డ్రింక్‌ ఫ్రిజ్‌లో లేనప్పటికీ దాదాపు 3 నెలల నుండి 6 నెలల వరకు పాడవకుండా ఉండగలదు. ఇన్ని రోజులు నిల్వ ఉండటానికి కారణం కూల్‌డ్రింక్‌లలో కలిపే కొన్నిరకాల రసాయనాలు లేదా యాసిడ్స్‌. వీటిని కూల్‌డ్రింకులో కలిపితే పురుగు పట్టకుండా, పాడవకుండా నిల్వ ఉంటుంది. దానిని ఫ్రిజ్‌లో పెడితే మరింతకాలం పాడవకుండా ఉండగలదు. కొన్ని రకాల యాసిడ్స్‌కు మనిషి ఎముకలను సైతం కరిగించగల శక్తి ఉంటుంది. అటువంటి వాటి మోతాదు కూల్‌డ్రింకులలో ఎక్కువగా ఉంటుందని అనేక పరిశోధనలు తెలుపుతున్నాయి. కూల్‌డ్రింకుల లోని యాసిడ్స్‌ పొట్టలో చేరి ఎముకలకు కాల్షియం అందకుండా చేస్తాయి. దాంతో ఎముకలు బలహీనమై, ఆ ప్రభావం జీర్ణశక్తిపై పడుతుంది. ఆకలి మందగిస్తుంది. మరొక విషయం ఏమిటంటే అతిగా చక్కెర తింటుంటే కడుపుకు చెడుచేసే యాసిడ్స్‌ తయారవుతాయి. కూల్‌డ్రింకులో అతిగా ఉండే చక్కెర యాసిడ్స్‌కు కారణం.

ఒక 22 ఏళ్ల యువకుడు పొట్టలో అతిగ్యాస్‌ సమస్యతో వైద్యుణ్ని కలిశాడు. వైద్యుడు తిండి విషయాల గురించి అడిగితే చెప్పాడు. పానీయాల గురించి అడిగిన డాక్టర్‌ యువకుడి సమాధానం విని సంతృప్తిపడ్డాడు. నీ గ్యాస్‌ సమస్య సులభంగానే పరిష్కారం అవుతుందని, కూల్‌డ్రింక్‌ తాగొద్దని చెప్పి మందులిచ్చి పంపేశాడు. ఇంతకీ యువకుడి గ్యాస్‌ సమస్యకు కారణం అతడు అతిగా కూల్‌డ్రింక్‌ సేవించడమే. యుక్త వయసులో ఉన్నాడు కాబట్టి కూల్‌డ్రింక్‌ తాగడం మానేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. ఆ విషయమే వైద్యుడికి సంతృప్తినిచ్చింది.

సాధారణంగా మన పొట్టలో ఆహారం జీర్ణం కాకుండా నిల్వ ఉండిపోయినప్పుడు ఆమ్లాలు తయారవుతాయి. చక్కెరలో ఉండేదంతా ఆమ్లతత్వమే. ఒక చెంచా పంచదార నోటిలో వేసుకుంటేనే ఆమ్లం వెలువడి కడుపు ఉబ్బినట్లుగా ఉంటుంది. ఈ ఆమ్లం మన కడుపులో ఉన్నంతసేపు మన పొట్ట చాలా బిగుతుగా ఉన్నట్లుండి ఏమీ తినాలనిపించదు. కాబట్టి అతిగా చక్కెర ఉండే కూల్‌డ్రింక్‌ తాగితే మన కడుపులో ఆమ్లాల ఉత్పత్తికి మనం మార్గం ఏర్పరచినట్లే.

పైన చెప్పుకున్న సంఘటనలు మచ్చుకు కొన్ని మాత్రమే. కూల్‌డ్రింకుల బారినపడి ఆరోగ్యాలను చెడగొట్టుకున్నవారు ఎందరో. మనదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూల్‌డ్రింకులను అనుమతిస్తున్న అన్ని దేశాలదీ ఇదే పరిస్థితి.

పైగా అతి చల్లటి పదార్థాలతో మన జీర్ణవ్యవస్థ తప్పకుండా బలహీనమవుతుంది. అది మలబద్ద కానికి దారితీస్తుంది. దానికి సంబంధించిన ఎసిడిటి, మధుమేహం, నిస్సత్తువ వంటి రోగాలు శరీరంపై దాడి చేస్తాయి.

గత కొంతకాలంగా యువత, మహిళలు, చిన్న పిల్లలు కూల్‌డ్రింక్‌లంటే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దానికి కారణం లేకపోలేదు. యువతకు అదొక ఫ్యాషన్‌లా అనిపిస్తుంటే, పిల్లలు టివిలో ప్రకటనలు చూసి దానికి ఆకర్షితులవుతున్నారు. మహిళల్లో ఎక్కువమంది ఇంట్లో ఉండి టీవీ సీరియల్స్‌ చూసేవాళ్లు, కూల్‌డ్రింకులు కలిగించే చెడు గురించి తెలియని గ్రామీణులు కూల్‌డ్రింకులకు ప్రాధాన్యమిస్తున్నారని పరిశోధనల్లో తేలింది. పిజ్జా తిని కూల్‌డ్రింక్‌ తాగుతున్న యువకుల సంఖ్య రానురానూ పెరుగుతోంది. ఇలా కూల్‌డ్రింకులు అతిగా తాగుతున్న యువతలో కొందరు అతిగా ప్రవర్తిస్తుంటారు. దానికి వారిలో కఫతత్వం పెరగడమే అని వైద్యులు చెపుతున్నారు. కఫతత్వానికి కారణం కూల్‌డ్రింకులో అతిగా ఉండే చక్కెరే. ఈ చక్కెర మూలంగా శరీరం కళను కోల్పోతుంది, 40-50 ఏళ్లకే వార్థక్య లక్షణాలూ వచ్చేస్తాయి. అతి చల్లగా, అతి చక్కెరతో కూడిన కూల్‌డ్రింకులు సేవించడం వలన మరికొందరిలో క్షయ లక్షణాలూ బయటపడతాయి. ఈ లక్షణాలు మరికొందరిలో సైనసైటిస్‌, బ్రాంకైటిస్‌కూ దారితీస్తాయి. కూల్‌డ్రింకులోని కాల్షియాన్ని అడ్డుకునే గుణం వలన దంతాలు శక్తిని కోల్పోయి చిన్నవయసులోనే ఊడిపోయే ప్రమాదమూ పొంచి ఉంది.

ఇన్ని దుర్లక్షణాలు ఉన్న కూల్‌డ్రింకులను ఉత్తర కొరియా, క్యూబా వంటి దేశాలు ఏనాడో నిషే ధించాయి. మన దేశ పార్లమెంటు క్యాంటిన్‌లో కూల్‌డ్రింకులను ఎప్పుడో నిషేధించారు. కాని దేశవ్యాప్తంగా వీటి అమ్మకాలు కొనసాగడం మన దురదృష్టం. కూల్‌డ్రింకులను నిషేధిస్తే ఎన్నో రకాల రోగాలు భూగోళం నుండి కనుమరుగయ్యే మంచి రోజు త్వరలోనే రాగలదు.

భయంకర నిజాలు

– కూల్‌డ్రింకులలో క్యాన్సర్‌ కారక పురుగుమందుల అవశేషాలు

– బ్యూర్‌ ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బిఐఎస్‌) కు మించి 24 రెట్లు అధికంగా ఉన్నట్లు

పరిశోధనలో వెల్లడి

2003లో ది సెంటర్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ (సిఎస్‌ఇ) ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనలో అప్పటి మార్కెట్లలో లభించిన కూల్‌డ్రింకులలో ప్రాణాంతక పురుగుమందుల అవశేషాలు అధికశాతంలో ఉన్నట్లు తేలింది. మనదేశంలోని 12 రాష్ట్రాల్లో విస్తరించిన కోకా కోలా, పెప్సీ కంపెనీలకు చెందిన 25 ప్లాంట్లలో తయారవుతున్న 11 రకాల కూల్‌డ్రింకుల నుండి సేకరించిన 57 శ్యాంపిళ్లలో ఈ అవశేషాలు బయటపడినట్లు సిఎస్‌ఇ నివేదిక వెల్లడిస్తోంది. మరికొన్నిటిలో ఈ అవశేషాలు 140 రెట్లు అధికంగా ఉన్నట్లు తేలింది.

భారత్‌లో నిషేధానికి గురైన హెప్టాక్లోర్‌ అనే పురుగుమందు కొన్ని కూల్‌డ్రింకు శ్యాంపిళ్లలో 71 శాతం అధికంగా, బిఐఎస్‌కి 4 రెట్లు అధికంగా ఉన్నట్లు తేలింది. హెప్టాక్లోర్‌ని చెదపురుగులను, ఇతర కీటకాలను నిర్మూలించడానికి ఉపయోగించేవారు.

కోల్‌కతాలో సేకరించిన కోకాకోలా శాంపిళ్లలో బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బిఐఎస్‌) కి 140 రెట్లు అధికంగా క్యాన్సర్‌ కారక, ప్రాణాంతక పురుగుమందు లిండేన్‌ అవశేషాలున్నట్లు తేలింది. థానేలో లభించిన కోకాకోలా శాంపిళ్లలో న్యూరో టాక్సిన్‌, క్లోరోఫైరిఫాస్‌ అనే విషాలు 200 రెట్లు అధికంగా ఉన్నట్లు సిఎస్‌ఇకి చెందిన సునీతా నారాయణ్‌ తెలిపారు.

దాదాపు అన్ని శ్యాంపిళ్లలోనూ 3 నుండి 5 రకాల పురుగుమందుల అవశేషాలు ఉన్నట్లు, అవి బిఐఎస్‌కి 24 రెట్లు అధికంగా ఉన్నట్లు ఈ నివేదిక తెలుపుతోంది.

కింద తెలిపిన కూల్‌డ్రింకులలో పురుగు మందులు అధికశాతంలో ఉన్నట్లు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎమ్‌ఎ) కూడా వెల్లడించింది. అవి థమ్సప్‌ – 7.2 శాతం, కోక్‌ – 9.4, సెవెన్‌ అప్‌-12.5, మిరిండా – 20.7, పెప్సీ -10.9, ఫాంటా – 29.1, స్ప్రైట్‌ – 5.3, ఫ్రూటీ- 24.5, మాజా – 19.3 శాతం.

సాధారణంగా పురుగుమందు శాతం 2.1 శాతంకి మించితే అవి తాగిన మనిషి కాలేయ క్యాన్సర్‌కి గురయ్యే ప్రమాదం ఎక్కువ.

సిఎస్‌ఇ నివేదిక వచ్చిన మూడేళ్ల తరువాత కేంద్రం విడుదల చేసిన మరో నివేదిక కూడా కూల్‌డ్రింకులలో బయటపడిన పురుగుమందుల అవశేషాల శాతాల తగ్గుదలలో పెద్దగా మార్పేమీ లేదని తెలిపింది. కూల్‌డ్రింకులు అనారోగ్య హేతువే అని తేల్చింది.

– సూర్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *