యోగమూర్తి జనార్దనస్వామీజీ

యోగమూర్తి జనార్దనస్వామీజీ

భరతఖండంలో జనించిన సనాతన యోగాభ్యాసాన్ని అత్యాధునిక ప్రపంచానికి పరిచయం చేయడమనే చరిత్రాత్మక ఘట్టం ఒక స్వయం సేవక్‌ ప్రధాని పదవిని అధిష్టించిన తరువాత జరిగింది. రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ యోగ విద్యకు చేరువయ్యారు. అలాంటి ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖలను యోగవిద్యతో సుసంపన్నం చేసినవారే పూజ్య జనార్దనస్వామి. ఈ ప్రత్యేక సంచికలో ఆయన గురించి ఒక పరిచయం.

మహారాష్ట్ర, సింధుదుర్గ్‌ జిల్లా కమఠీ గ్రామంలో జనార్దన (1893-1978) గోడ్‌సే కుటుంబంలో జన్మించారు. ఆ నిరుపేద కుటుంబంలో ఆయన విద్యాభ్యాసం కఠిన పరిస్థితుల్లో సాగింది. రత్నగిరి జిల్లా కస్బాసంగమేశ్వర్‌లోను, నాసిక్‌లోను మధూకర వృత్తితో పదిహేనేళ్లు వేదాధ్యయనం చేసి, తిరిగి ఇల్లు చేరారు. ఇంట్లో చాలాసార్లు కేవలం మజ్జిగ అన్నంతోనే సరి. ఒక్కొక్కసారి నాలుగైదు రోజులు పస్తులే. కొన్నిరోజులు వేపాకులే ఆహారం.

వివాహం చేసుకోనని జనార్దన తల్లికి చెప్పారు. ఆయన 35వ ఏట తండ్రి స్వర్గస్థులైనారు. సంవత్సరం తరువాత తండ్రి అస్థికలను నిమజ్జనం చేయడానికి ఇంటి నుండి కాలినడకన హరిద్వార్‌ బయలు దేరారు. గంగలో అస్థికలు కలిపి కుటుంబ బాధ్యతల నుండి విముక్తులైనారు. అక్కడ నుండి హిమాలయాలకు వెళ్లి కఠోర సాధన చేశారు. ఆ తరువాత గ్వాలియర్‌ చేరారు.

గ్వాలియర్‌ తపస్సు

ఆరుబయటనే 18 నెలలు సాధనచేయాలని సంకల్పించుకొని ఒక మందిరం ఎదుట 8I3 అడుగుల బండరాయినే తపోస్థలిగా మార్చుకున్నారు. కేవలం కాలకృత్యాలకే లేచేవారు. ఎండైనా, వానైనా ఏ ఆచ్ఛాదనా లేకుండా గడిపారు. వానకు గొడుగు పట్టినా నిరాకరించారు. ఎవరో భోజనం తెచ్చేవారు. ‘నా శరీరం వేడి, చలిని ఎంతవరకు తట్టుకోగలదో పరీక్షించదలచాను’ అని అనేవారు.

అమ్మ అనుమతి

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన త్రయంబ కేశ్వర్‌లో 1928-29 సంవత్సరంలో జనార్దన తన 38వ ఏట చేరారు. అక్కడి పరుశురామమందిరం లోని వేద పాఠశాలలో వేదం నేర్పేవారు. తాను సన్యాస దీక్ష తీసుకోవాలనే కోరికను అమ్మకు ఉత్తరం ద్వారా తెలియజేశారు. తల్లి అనుమతి లభించింది. వెంటనే కాశీకి వెళ్లి విధివిధానంగా సన్యాసాశ్రమం స్వీకరించారు.

శ్రీక్షేత్రమైన సిద్ధపురం, శివమందిరంలో ఉన్నపుడు రెండురోజులు వేదసంహిత, 3వ రోజు బ్రాహ్మణ సంహిత స్తోత్రంతో మహాదేవునికి అభిషేకం చేసే నియమం ఏర్పరచుకొన్నారు. ఆ మందిరంలో నివసించడానికి వచ్చిన ఒక సన్యాసి జనార్దన కఠోర సాధనకు ప్రభావితుడైనారు. ఈ తేజోసంపన్నుడైన యువకుడే తనకు తగిన శిష్యుడని భావించి ఆ యోగి జనార్దనకు యోగ విద్యను నాలుగు నెలలో నేర్పారు. ఆపై ఆ సన్యాసి జనార్దనకు జీవితాంతం కనబడలేదు. అభ్యాసవేళ గురుశిష్యులిరువురు ఒకరి గురించి మరొకరు తెలుసుకొనే ప్రయత్నం చేయలేదు. ఇదొక అరుదైన, అద్భుతమైన సన్నివేశం.

నర్మద ఒడ్డున యోగ ప్రచారం శుభారంభం

గ్వాలియర్‌లో తపస్సు పూర్తి కాగానే జనార్దన స్వామీజీ నర్మదా పరిక్రమకు బయలుదేరారు. రెండుసార్లు పరిక్రమ పూర్తి చేసారు. ఏ శ్రేష్ఠకార్యం కోసం వారు జన్మించారో అట్టి యోగవిద్య ప్రచారం నర్మదా నదీతీరం నుండి ప్రారంభం కావాలని సంకల్పించారు. స్వామీజీ ¬షంగాబాద్‌లోని దత్తమందిరంలో సుమారు మూడు సంవత్సరాలు ఉండి యోగాసనాలు నేర్పడం మొదలుపెట్టారు.

ఇప్పుడైతే ప్రసార మాద్యమాల ద్వారా యోగ గురించి ప్రచారం జరుగుతున్నది. కాని ఆ కాలంలో స్వామీజీ యోగాసనాలు నేర్పడానికి ఎంత శ్రమపడ్డారో ఊహించడం కష్టమే. యోగ గురించి సమాజంలో అజ్ఞానం, తిరస్కార భావన ఉన్న సమయంలో ధైర్యం, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో పిల్లలు మొదలు పెద్దవారి వరకు యోగ నేర్పించారు.

జనార్దనస్వామి బోధన తీరు సరళంగా ఉండేది, యోగాసనాల వల్ల అనేక జబ్బులు నయమవుతాయనే విశ్వాసం ప్రజలలో కలిగింది. స్వామీజీ ప్రధానంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, బిహార్‌, ప్రాంతాలలో గ్రామగ్రామం, ఇంటింటికి కాలి నడకన వెళ్లి ప్రచారం చేశారు.

యోగ గంగ- నాగపూర్‌ ఆగమనం

20వ శతాబ్దంలో యోగ గంగను అవతరింప జేసిన జనార్దన స్వామి తేజోమయ వ్యక్తిత్వం గలవారు. పవిత్ర పావన నర్మదా తీరాన యోగ గంగ అవతరించింది. ప్రచారం చేస్తూ చేస్తూ యోగ గంగను హరిద్వార్‌ వరకు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆ యోగ గంగ నాగపూర్‌లో విరాట్‌ రూపం ధరించింది.

1948లో స్వామి అమరావతిలో యోగ సమ్మేళనం నిర్వహించారు. అప్పుడే భారతీయ యోగాభ్యాస మండలి నెలకొల్పారు. ఆసనాలు, ప్రాణాయామం గురించి పుస్తకాలు రచించారు. శాస్త్రీయ పరిశోధనలతో యోగాసనాలుగా సూర్యనమస్కారాలను రూపొందించారు. వాటిని చిత్రాల రూపంతో వివరణతో తయారుచేసారు. ఈ సాహిత్యం వెల నామమాత్రం. లక్ష్యం ప్రచారం. ఆ సాహిత్యాన్ని స్వయంగా అమ్మేవారు. రుసుము లేకుండా యోగాసన తరగతులు నిర్వహించేవారు. మకర సంక్రాంతి పర్వదినాన 1951లో స్వామీజీ నాగపూర్‌ వచ్చి అక్కడ రెండవ భారతీయ యోగ సమ్మేళనం ఏర్పాటు చేశారు. అప్పుడే నాగపూర్‌ భాగ్యోదయం కూడా జరిగింది.

నాగపూర్‌ నగరం పరిస్థితిని మార్చగల శుభ లక్షణాలు కనిపించాయి. పల్లెపల్లెకు నడుచుకుంటు తిరిగే స్వామీజీ నడుంపై కాషాయరంగు లుంగీ, పైన అదే రంగు కండువా, భుజానికి అతుకులతో కుట్టిన సంచీ, అందులో యోగకు సంబంధించిన నేతిసూత్ర, ధోతీ, వస్తువులు, కొన్ని పుస్తకాలు, వ్రాసుకొనడానికి కాగితాలు, సామానుకు కట్టిన దారం పోగులు ఉండేవి. యోగాసన ప్రచారంలో సామూహిక యోగాసనాల పట్ల స్వామీజీ సహకారం అధికంగా ఉండేది. ఆ రోజుల్లో యోగాభ్యాసం ఒంటరిగా చేసేవారు దీనితో యోగ అంటే మోక్షప్రాప్తి కోసం తపస్సు అనే భావన ఏర్పడింది. కాని స్వామీజీ సులభ సాంఘిక యోగాసనాల పద్ధతితో ప్రచారం సరళమైంది. వాటిలో కొన్ని ప్రేరణదాయకమైన, స్ఫూర్తిదాయకమైన సందర్భాలను తెలుసుకుందాం.

విద్యాలయాలలో యోగాసనాలు

ఎన్‌.హెచ్‌.మజుందార్‌ మధ్యప్రదేశ్‌లో జిల్లా ప్రధాన న్యాయాధిపతి. ఆ రోజులలో విద్యాసంస్థల ద్వారా యోగాసన క్లాసులు నడపడానికి ప్రేరణ ఎలా లభించింది అనే దాని గురించి మజుందారు చెప్పిన విషయం- ‘1948లో ఖాండ్వాలో ప్రత్యేక ప్రధాన న్యాయాధిపతిగా ఉన్నాను. అదే సమయంలో ఫిబ్రవరి – మార్చి నెలలో పూజ్యశ్రీ జనార్దన స్వామీజీ ఇండోర్‌ నుంచి వచ్చినపుడు కలిశాను. స్వామీజీ యోగ ప్రచారం పట్ల శ్రద్ధ, పట్టుదల ప్రశంసించదగినవి. యోగ కార్యంలో మనం కూడా సహకరించాలని నాకనిపించింది’. ఆ రోజులలో ఖండ్వాలో తోమర్‌ అను వ్యక్తి నార్మల్‌ స్కూలు అధికారిగా ఉన్నారు. అతను మంచి వ్యక్తి. యోగ పట్ల శ్రద్ధ గలవాడు. పాఠశాలలో యోగాసనాలు నేర్పాలనే ఆలోచన ఆయనకు వచ్చింది. స్వామీజీ సూర్య నమస్కార్‌లోని 12 ఆసనాలను స్వయంగా ప్రదర్శించారు. నార్మల్‌ స్కూలు ఉపాధ్యాయులకు కేవలం 10ని||ల డ్రిల్లులో యోగాసనాలు పరిచయం చేశారు. ఆ అల్ప సమయంలోనే శరీరం చేమటతో తడిసిపోయేది. ఈ వ్యాయామంతోపాటు మయూరాసన్‌, సర్వాంగాసన్‌, హలాసన్‌, శీర్షాసన్‌, శవాసన్‌ మొదలగు కొన్ని ప్రముఖ ఆసనాలతో 20-25 నిమిషాల కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. అది చూసి తోమర్‌్‌ చాలా ప్రభావితులయ్యారు. అతని కోరిక మేరకు 15 రోజుల తర్వాత ఒక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుప్తా ఈ కార్యక్రమాన్ని తమ పాఠశాలలో ఏర్పాటు చేశారు. నిర్వహణ అంతా స్వామీజీదే. మేము కేవలం ఆజ్ఞా పాలకులం. అయితే ఖాండ్వాలో యోగ ప్రచారం ప్రతిష్ఠనంతా స్వామీజీ నాకు అంటగట్టారు. ఈ పురస్కారానికి పాత్రుడ నయ్యాను. నా మిత్రుడు డా||ఎమ్‌.ఎస్‌.మోదక్‌ ఆ సమయంలో జిల్లా విద్యాధికారిగా ఉన్నారు. ప్రతి పాఠశాలలో యోగాసనాల కార్యక్రామాన్ని నడిపించాలని వారిని ఉత్తరం ద్వారా కోరినాను. నా కోరిక మేరకు మోదక్‌ అన్ని పాఠశాలలో యోగా క్లాసులు నిర్వహించాలని ఉత్తర్వు ద్వారా తెలియ జేశారు. అంతేకాకుండా వారు స్వయంగా స్వామిజీకి శిష్యులైనారు. చివరి క్షణం వరకు మోదక్‌ క్రమంగా యోగాసనాలు సాధన చేశారు.

మందులకు బదులుగా యోగాసనాలు

స్వామీజీతో మాట్లాడుతున్నప్పుడు వారితో ఒకాయన ‘స్వామీజీ మీరు ఆయుర్వేదాన్ని బాగా అధ్యయనం చేసి కూడా మందులకు బదులుగా యోగాసనాల ద్వారా చికిత్స జరుపవచ్చునని ఎందుకు పట్టుబడుతున్నారు’ అని అన్నారు.

తన గురించి ఎప్పుడూ చెప్పని స్వామీజీ ‘నేను మందులు తయారుచేసేవాడిని. మనం చెమటోడ్చి శ్రమించి మందులు తయారుచేస్తాం. కాని ఏ మాత్రం శ్రమించకుండా ప్రజలు రోగ ముక్తులు కావాలని మందుల మీద మందులు తింటుంటారు. శరీరానికి ఏ మాత్రం శ్రమ కలుగనీయక ఆరోగ్యం పాడవగానే మందులు తీసుకుంటారు. అది మంచిది కాదు. ప్రజలు తమ పని తాము చేసుకోగల శిక్షణనివ్వాలని అనుకున్నాను. దానివల్ల వారి ఆరోగ్యం బాగుంటుందని నా కనిపించింది. అప్పటి నుంచి యోగాసనాల ప్రచారం నేను చేస్తున్నాను’ అని అన్నారు.

స్వామీజీ ఆయుర్వేదాన్ని లోతుగా అధ్యయనం చేశారు. అందుకని రకరకాల వ్యాధులతో బాధపడుతున్న రోగులు స్వామీజీ వద్దకు వచ్చేవారు. క్రమక్రమంగా ఈ మందుల వ్యాపకం పెరిగి పోయింది. తాను ఈ వైద్యంలోనే మునిగి పోకూడదని అనుకున్నారు. ఈ ఆలోచన రాకముందే స్వామీజీ అనేక రకాల చూర్ణాలు తయారు చేయించాడు. తయారు చేసిన మందులు వ్యర్థం కాకూడదని ఒక ఉపాయం ఆలోచించాడు. ఆ చూర్ణాలను ఒక్కటిగా చేసి రోజు ఒక చిటికెడు పొడిని తానే తీసుకోవా లనుకున్నాడు. కొన్ని రోజులకు ఆ చూర్ణం అంతా అయిపోయింది.

స్వామీజీ అమరావతికి వచ్చినప్పుడు ఎవరూ పరిచయం లేదు. అందుచేత కొన్ని రోజులు ఆహారం లేకుండా గడిపారు. పెద్దమ్మ గుడిలో ఉండడానికి అనుమతి అడిగారు. గ్రామపెద్దలు మొదట తిరస్కరించినా తరువాత అనుమతి లభించింది. అక్కడి నుంచే యోగాసనాల ప్రచారం మొదలు పెట్టారు. అంబాపేటలోని డంగన్య క్లబ్‌లో వారు యోగాసన తరగతులు ప్రారంభించారు. కొందరు వైద్యులు విమర్శించారు. ఈ విమర్శలను లెక్కచేయ కుండా తన పని తాను చేసుకున్నారు.

పేదవారిపట్ల విశాలభావం

అమరావతి నుండి నాగపూర్‌ వచ్చాక సీతాబర్దీలోని ఒకేషనల్‌ స్కూలు సువిశాల ప్రాంగణంలో యోగాసనాలు నేర్చడానికి వెళ్ళేవారు. అంతకుముందు అక్కడే చుట్టుప్రక్కల గుడిసెలలో ఉండే పాకీ పనివారి పిల్లలు అల్లరి చేస్తుండేవారు. స్వామీజీ సన్యాసి రూపం చూసి ఆ పిల్లలు భయపడి దూరంగా వెళ్లి ఆడుకునేవారు. ఇది స్వామిజీ దృష్టికి వచ్చింది.

ఒకసారి స్వామీజీ రావడంతో పిల్లలు పారిపోతుంటే వారిని దగ్గరకు రమ్మన్నారు. పిల్లలు కొంచం దూరంగానే నిలబడ్డారు. ఇంకా దగ్గరకు రమ్మని సైగ చేసారు. వారిలో ఒక బాలుడు ‘బాబా! మేము పాకీ పనివారం. ఇక ముందు ఇక్కడికి ఎప్పుడూ రాబోము’ అని భయపడుతూ అన్నాడు.

ఆ మాటలతో స్వామి కళ్లు చెమ్మగిల్లాయి. వారే స్వయంగా పిల్లల దగ్గరకు వెళ్లి, ‘అరే! అలా ఎందుకు పారిపోతారు? నేను ఇక్కడికి వచ్చే వారందరికి ఆసనాలు నేర్పడానికి వస్తాను’ అని అన్నారు. స్వామీజీ! ఆప్యాయతను చూసి పిల్లలు స్వామీజీ వెంట ప్రాంగణంలోనికి వచ్చారు. వారికి కూడా ఆసనాలు నేర్పించారు.

స్వామీజీని ఆహ్వానించిన చెప్పులు కుట్టే వ్యక్తి

ప్రాంగణంలో ఆసనాలు నేర్పుతుండగా ఒక గ్రామీణుడు వచ్చాడు. స్వామీజీకి నమస్కరించి ప్రక్కన నిలబడ్డాడు. స్వామీజీ అతని వద్దకు వెళ్లి మాట్లాడాడు. అతను ‘స్వామీజీ! నేను నాసిక్‌ నుండి మీ దర్శనం కోసం వచ్చాను. నేను కడుపు నొప్పితో బాధపడుతున్నాను. మీరు నా బాధను తొలగిస్తారని నాసిక్‌ ప్రజలు నాకు నమ్మకంగా చెప్పారు. అందుకని నాగపూర్‌ వచ్చాను’ అని అన్నాడు.

స్వామీజీ అతనిని వెంటనే పై వస్త్రాలు తీసివేసి కొన్ని ఆసనాలు వేయమని చెప్పారు. ఆ వ్యక్తి పై బట్టలు తీసి పడుకున్నాడు. కడుపును పరిశీలించే నిమిత్తం స్వామీజీ దగ్గరకు వచ్చి కడుపుమీద చేయి పెట్టబోతే అతను భయంతో ‘స్వామీ నన్ను తాకవద్దు. నేను చెప్పులు కుట్టేవాడిని’ అన్నాడు. స్వామిజీ ‘నేను మనుషులకు యోగాసనాలు నేర్పుతాను. నీవు మనిషివే కదా! నీకు ఆసనాలు నేర్పుతాను. భగవంతుని కృపతో నీ ఈ రోగం నయమవుతుంది’ అన్నారు.

స్వామిజీ అతని పొట్టను పరీక్షించి కొన్ని ఆసనాలు చేయమని చెప్పారు. అతడు క్రమం తప్పకుండా ఆసనాలు వేసాడు. కొద్దిరోజులునే నొప్పి మాయమైంది. తిరిగి వెళ్లేముందు ఆ వ్యక్తి స్వామీజీ పాదాలకు నమస్కరించి మిక్కిలి వ్యాకులతతో ‘స్వామీజీ మీ కృపవల్ల నా బాధ దూరమైంది. మీరు నాసిక్‌ వచ్చినపుడు నా గుడిసెను పావనం చేయగలరు. ఇదే నా ప్రార్థన. కోరిక.’ అన్నాడు.

అతని ఆవేదన భరిత విన్నపాన్ని స్వీకరిస్తూ, ‘విశ్వహిందూపరిషత్‌ ఆహ్వానంపై త్వరలో నాసిక్‌ వస్తున్నాను. అప్పుడు తప్పక మీ ఇంటికి వస్తాను’ అన్నారు. ఆ ప్రకారంగానే ఇంటికెళ్లి కలిసారు.

ఆర్‌.ఎస్‌.ఎస్‌.లో యోగా

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌ శారీరిక్‌ విభాగంలో యోగాసనాలు చేర్చాలనే నిర్ణయం జరిగినపుడు సర్‌ సంఘచాలక్‌ ప.పూ. గురూజీ జనార్దన స్వామీజీని ప్రథమ, ద్వితీయ, తృతీయవర్ష సంఘ శిక్షావర్గలకు విడివిడిగా ఆసనాలను ఎంపిక చేసి, క్రమం నిర్ణయించి పుస్తకాలు వ్రాయుమని చెప్పారు. ఆ ప్రకారంగానే స్వామీజీ శారీరిక్‌ శిక్షణ కొరకు పాఠ్యాంశాన్ని తయారుచేసి ఇచ్చారు. అలాగే నాగపూర్‌లో జరిగే తృతీయ వర్ష సంఘ శిక్షావర్గలో దేశం మొత్తం నుంచి వచ్చిన ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త లకు యోగాసనాలను నేర్పించారు. నేడు (2019) భారతదేశంలో 37011 స్థలాల్లో 59266 శాఖలు జరుగుతున్నాయి. ప్రపంచంలోని 35 దేశాలలో సంఘకార్యం నడుస్తున్నది. ఈ సంఘ శాఖల ద్వారా లక్షలాది స్వయంసేవకులవరకు యోగాసన్‌ ప్రచారం జరుగుతున్నది.

వివేకానంద కేంద్రంలో యోగాసనాలు

కన్యాకుమారిలోని శ్రీపాద శిలపై వివేకానంద శిలాస్మారక నిర్మాణం తర్వాత ఏకనాథజీరానడే ‘వివేకానంద కేంద్రం’ పేరుతో 1972లో స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ఈ సంస్థ కార్యకర్తలకు ప్రశిక్షణలో యోగాసనాలకు ప్రాధాన్యత నివ్వాలని ఏకనాథ్‌జీరానడే అనుకున్నారు. వివేకానంద కేంద్రం లోని పూర్తి సమయం (జీవనవ్రత) కార్యకర్తలకు యోగాసనాలు, ఇంకా ఇతర యోగ ప్రక్రియలు గురించి సరియైన మార్గదర్శనం చేయడానికి కన్యాకుమారి రావాలని కోరడానికి నాగపూర్‌ వచ్చి స్వామీజీని కలిసారు. స్వామీజీ ఈ బాధ్యతను వెంటనే అంగీకరించారు. వివేకానంద కేంద్ర ప్రథమ శిబిర ఉద్ఘాటనలో స్వామీజీ ఉపస్థితులైనారు. తర్వాత ఒక నెలవరకు అక్కడే ఉండి తన పర్యవేక్షణలో పద్ధతి ప్రకారం జీవనవ్రతులకు అన్నిరకాల యోగ ప్రక్రియలు నేర్పారు. ఆ తర్వాత నిరంతరం కొన్ని సంవత్సరాలుగా క్రొత్తగా వస్తున్న జీవనవ్రతులకు కూడా యోగాసనాల విషయంలో స్వామీజీ మార్గదర్శనం లభిస్తుండినది.

వివేకానంద కేంద్రం నిర్వహించే ఈ ప్రశిక్షణ వర్గలో కొంత సమయం కోసం ఇంగ్లాండు నుండి భారతదేశం వచ్చిన యువ ఇంజనీర్‌ కనుగోవిల్‌, ముంబైకి చెందిన కొఠారీ కూడా స్వామీజీకి చేదోడువాదోడుగా ఉన్నారు. ఇపుడు వివేకానంద కేంద్రం వారి అన్ని శాఖలలో స్త్రీ, పురుషులకు యోగాసన ప్రశిక్షణ పెద్ద ఎత్తున జరుగుతున్నది. అందులో సాక్షాత్తు స్వామీజీ మార్గదర్శనంలో తయారైన కార్యకర్తలు కూడా ఉన్నారు.

ముస్లిం మహిళకు దీక్ష

ఎన్‌. హన్మంతరావు, హైదరాబాదుకు చెందిన ఒక ధార్మిక మహమ్మదీయ స్త్రీతో స్వామీజీకి శిష్యురాలుగా మారమని మాట్లాడాడు. ఆ స్త్రీ ఆసక్తి, యోగ్యతను గుర్తించి ఆమెకు స్వామీజీ ‘లలితా పంచదశీ’ దీక్షనిచ్చారు. తర్వాత ఆమె భర్త అబ్దుల్‌ హమీద్‌ ఖాన్‌ కూడా స్వామీజీ నుండి దీక్షగైకొని దేవీ ఉపాసన చేసాడు. ఈ ధార్మిక దంపతులు నిషేధిత పదార్థాలను తినేవారుకాదు. నవరాత్రి ఉత్సవాలలో పాలుపంచుకునేవారు. అబ్దుల్‌ హమీద్‌ బ్యాంక్‌ ఉద్యోగి. సంస్కృత శ్లోకాలను స్వచ్ఛమైన ఉచ్ఛారణతో చదివేవాడు. అబ్దుల్‌ హమీద్‌ ఖాన్‌కు దీక్ష ఇచ్చేటప్పుడు స్వామీజీ ‘ప్రతిరోజు నమాజు చేయడం మీ ధర్మం. దానిని ఎన్నడు విడువవద్దు. స్వధర్మ నియమాలను పాటిస్తూనే దీక్ష విధానాన్ని పాటించాలి’ అని సూచించారు.

పులి దర్శనం

ఒకరోజు రాత్రిపూట స్వామీజీ నాగపూర్‌లోని డా|| వర్నేకర్‌ ఇంటికి అకస్మాత్తుగా వచ్చారు. అందరి ముఖాలలో ఆనందం వెల్లివిరిసింది. ఆ కుటుంబంతో బాగా పరిచయం ఉన్నందున వారు కూడా కబుర్లులో లీనమైపోయారు. స్వామీజీ నర్మదా పరిక్రమ విశేషాలు వినాలని వార్నేకర్‌కి కోరిక కలిగింది. స్వామీజీ చెప్పడం మొదలుపెట్టారు. ‘ఒకసారి పరిక్రమలోనే నదిలో ఉదయం స్నానం చేసి ముందుకు సాగుతున్నాను. కాలిబాట కనిపించింది. ఆ బాట వెంట ప్రజలు వస్తూ పోతుంటారని, ముందర ఊరు ఉండవచ్చని భావించి, చాలాదూరం వెళ్లిపోయాను. ఒక్క మనిషి కూడా కనిపించలేదు. ఇంకా ముందుకు వెళ్లాను. బహుశా ఎవరైనా సాధువు ఆశ్రమం ఈ గుట్టపైన ఉండవచ్చు. లేదంటే ఈ నిర్జన ప్రదేశంలో ఇంతటి పొడవైన కాలిబాట ఎలా సాధ్యం?

ఈ సందిగ్ధావస్థలో ఒక గుట్టను దాటాను. ఎదురుగా చూస్తే ఒక చీకటి గుహ, ముఖద్వారం వద్ద బలిష్టమైన, మసకమసక చారల పులి జంట, వాటి రెండు పిల్లలు కనిపించాయి.’

స్వామీజీ ఈ మాటలు చెప్పుచున్నప్పుడు అంతర్లీనమై మనో నేత్రంతో చూస్తూన్నట్లుగా మౌనంగా ఉండిపోయారు. ఆసక్తితో మేము ‘తర్వాత ఏం జరిగిందని అడిగి వారి మౌనానికి భంగం కలిగించాం.’ స్వామీజీ తన అనుభవాన్ని కొనసాగిస్తూ ‘నేను అక్కడే నిలబడి పులికి దూరం నుంచే నమస్క రించాను. ప్రభూ మీ దర్శనం ఈ రౌద్రరూపంలో కలిగింది. మీ కృప ఉండాలి అని మనసులో ప్రార్థన చేసాను. ఆ పులి కుటుంబం నావైపు చూస్తున్నది. నేను భక్తితో వాటిని చూస్తూనే ఉన్నాను. కొద్దిసేపటికి పులులు గుహలోకి వెళ్లిపోయాయి. ఆ గుహనే భగవంతుని మందిరంగా భావించి నమస్కారం చేసి ముందుకు సాగాను’ అని అన్నారు.

ఈ అమృతానుభవాన్ని విని డా|| వర్నేకర్‌ కుటుంబ సభ్యులు రోమాంచితులైనారు. ‘అహింసా ప్రతి షాయాం తత్సన్నిధౌ వైరత్యాగః’ యోగలో భాగమైన అహింస అనే దానిని మనసు, బుద్ధితో పూర్తిగా ప్రతిష్ఠాపన జరిపినపుడు సహవాసంలో శత్రుభావన అంతమవుతుంది. పతంజలి ఈ యోగ సూత్రం వివరణను స్వానుభవం ద్వారా స్వామీజీ తెలిపారు. వారందరు ఈ ఉదంతం విని జీవితం ధన్యమైనదని భావించారు.

పరిశ్రమించే యోగి

జనార్దన స్వామీజీ ఎప్పుడు ఖాళీగా కూర్చోలేదు. యోగా గురించి ఇంటింటికి ప్రచారం చేసేటప్పుడు ఇంట్లో పిల్లలకు సంస్కృతం నేర్పేవారు. గీతాశ్లోకాలను కంఠస్థం చేయించేవారు. చిరిగిన దుప్పటి, శాలువా కుట్టడం, రామాయణ, మహాభారత నీతికథలు మధురంగా వినిపించడం వంటి పనులు ఖాళీ సమయంలో చేసేవారు. ఈ విధంగా స్వామీజీ గొప్ప పరిశ్రమ చేయగలిగిన స్వభావాన్ని కలిగి ఉండేవారు.

మహిళలకు యోగాసనాలు నేర్పడంలో ప్రత్యేక శ్రద్ధ

ప్రాచీనకాలంలో కొందరు అజ్ఞానులు, అవివేకులు యోగ విషయంలో దుష్ప్రచారం చేసారు. దానివల్ల యోగాసనాలు మహిళలకు నేర్పరాదనే అభిప్రాయం ఏర్పడింది. దీనికి వ్యతిరేకంగా నిశ్శబ్దంగా స్వామీజీ మహిళలకు యోగాసనాలు నేర్పేవారు. స్వామీజీ ఇంటింటికి వెళ్లి మహిళలలో ఆసనాల పట్ల అభిరుచి కలిగించారు. వారికి విడిగా తరగతులు నిర్వహించారు. ఒక మౌన విప్లవం ప్రారంభమైంది. నాగపూర్‌, మహాల్‌ ప్రాంతంలోని శ్రీలక్ష్మీనారాయణ మందిర సభామంటపంలో యోగాభ్యాస మండలి ద్వారా మహిళలకు ప్రత్యేకంగా యోగాసన తరగతులు ప్రారంభించారు.

ఆ సభామంటపంలో యోగాసనాలు చేసే టప్పుడు మహిళలు కొంత ఇబ్బంది పడేవారు. ఈ విషయం స్వామీజీ దృష్టికి రాగానే వారే స్వయంగా పరదాలు తయారుచేసి తరగతులు నిర్వహించారు. ఈ తరగతులలో మహిళలతోపాటు పిల్లలు కూడా నేర్చుకునేవారు. చాలామంది మహిళలకు ఇంటిపని అయిన తర్వాత సమయం దొరుకుతుందని గ్రహించి, మధ్యాహ్నం 11-12 లేదా సాయంత్రం 4-5 గంటల సమయంలో తరగతులు నిర్వహించేవారు. మహిళల అభ్యున్నతిపట్ల వారికి ఉన్న గొప్ప భావన దీని ద్వారా వ్యక్తమవుతుంది.

స్వామీజీ సందేశం

డా|| వర్నేకర్‌ నాగపూర్‌ విశ్వవిద్యాలయంలో సంస్కృత విభాగ అధ్యక్షులు. ఒకరోజు వారు యోగాభ్యాస మండలికి వెళ్లారు. డా|| వర్నేకర్‌ స్వామీజీకి నమస్కరించి వారి పక్కన కూర్చున్నారు. స్వామీజీ ఒక కాగితం ఇచ్చారు. అందులో జీవితంలో ఆరోగ్యం, సుఖశాంతులు పొందడానికి ఒకే ఒక్క ఉపాయం యోగాభ్యాసాలు చేయడం అని వ్రాసి ఉంది. దానిని చదివి డా|| వర్నేకర్‌ స్వామీజీ వైపు ప్రశ్నార్థకంగా చూసారు. ఏమి చూస్తున్నావు? ఈ భావానికి సంస్కృతంలో శ్లోకం ఇప్పుడే రాసి చూపమన్నారు. డా|| వర్నేకర్‌ వెంటనే శ్లోకం రాసారు.

‘సమాధానాయ సౌఖ్యాయ నిరోగత్వాయ జీవనే |

యోగమేవాభ్యాసేత్‌ ప్రాజ్ఞః యథాశక్తి నిరంతరమ్‌||’

యోగాభ్యాసమండలి స్ఫూర్తి వాక్యంగా ఈ శ్లోకం వాడుకలోకి వచ్చింది. యోగాభ్యాస మండలి చిహ్నంపై ఈ సందేశమే అచ్చు వేయించారు. తర్వాత నాగపూర్‌లోని రామనగర్‌ యోగాభ్యాస మండలిలో స్వామీజీ సమాధిపైన కూడా ఈ శ్లోకమే లిఖించారు.

సామూహిక ఆసనాల ప్రాముఖ్యంపై దృష్టి

మిక్కిలి సరళభాషలో ఉండే స్వామీజీ పుస్తకాలు మనకు ఒక అపూర్వ కానుక. అందరు కలసి చేయగలిగే సాంఘిక ఆసనాలపై వారు ఎక్కువ ఆసక్తి చూపేవారు. ఈ ఆసనాలు ఇంట్లో కూర్చొని చేసుకోరాదా? అని ఒకరు అడిగితే, ‘చేసుకోవచ్చు. అయితే సామూహికంగా చేస్తున్నప్పుడు అలసట అనిపించదు. ఇంట్లో చేస్తున్నప్పుడు అనుశాసనం (క్రమశిక్షణ)లో వచ్చే అడ్డంకులు ఇక్కడ రావు’ అని స్వామీజీ చెప్పారు. వారు తమ 85 సంవత్సరాల వయసు వరకు ఇంటింటికి వెళ్లి ఆసనాలు నేర్పారు. ప్రారంభం నుంచే వారు నగరాలలో వేరు వేరు బస్తీలకు వెళ్లి ఆసనాల కోసం తగిన స్థలాన్ని వెతికి దానికి యోగాభ్యాస కేంద్ర రూపాన్ని కల్పించేవారు. వారి యోగ విస్తరణ పద్ధతి ఇలా ఉండేది. సమాజంలో యోగాసనాలు నేర్పేటప్పుడు కులం- మతం, పేద-ధనిక, స్త్రీ-పురుష అనే భేదభావం చూపేవారు కాదు.

ఒకసారి ఒక యోగ తరగతిలో స్వామీజీ స్వయంగా ఆసనాలు వేసి ప్రత్యక్షంగా చూపారు. ఆ తర్వాత ప్రశ్నోత్తర కార్యక్రమం జరిగింది.

ప్రశ్న! ‘స్వామీజీ ఏ వయసు నుండి ఆసనాలు వెయ్యాలి?’ స్వామీజీ ప్రభావవంతంగా (మార్మికంగా) సమాధానమిచ్చారు. ‘మనిషి పుట్టుక ముందు గర్భాసనంలో ఉంటాడు. అంతిమ శ్వాస తర్వాత శవాసనంలో ఉంటాడు. అందువల్ల ఏ వయసు నుంచి ఆసనాలు వేయాలి అనే ప్రశ్న సరియైనది కాదు. ఏ వయసులో ఎలాంటి ఆసనాలు వెయ్యాలి అని అడగాలి’ అన్నారు. ఈ సమాధానంతో యోగ ప్రేమికు లందరికి జ్ఞానోదయమయ్యింది. ఈరకంగా వేరు వేరు వర్గాలవారిని సమాయత్తం చేసేటప్పుడు స్వామీజీ పట్టుదల అందరికి తెలిసేది.

నాగపూర్‌లోని మాధవనగర్‌లో యోగా తరగతి మొదలైంది. స్వామీజీ ప్రతి మంగళవారం వెళ్లేవారు. ఒకరోజు ఎవరూ రాలేదు. స్వామీజీ ఒక్కరే ఆసనాలు వేస్తున్నారు. ఈ సందర్భంగా డా|| వర్నేకర్‌ స్వామీజీతో ‘స్వామీజీ తరగతికి ఎవరూ రాలేదు కదా! మీరు సమయం ఎందుకు వృధా చేస్తారు?’ అని అడిగారు. స్వామీజీ ప్రశాంతంగా ‘ఈ తరగతి ఒక ప్రత్యేక పద్ధతిలో మొదలయ్యింది. అలా అని ప్రత్యేక పద్ధతిలో మూతబడలేదు. అందువల్ల ఎవరూ రాకపోయినా తరగతి నడుపుతాను’ అని అన్నారు. ఈ విధంగా స్వామీజీ మొదటి నుండి యోగ ప్రచారంలో కర్మనిష్ఠ, అనుశాసనం నిలిపిన కారణంగానే యోగాసన శిక్షకులకు ఆదర్శవంతమైన ఉదాహరణగా నిలిచారు.

విశ్వగురువు భారత్‌

ఒకసారి శిష్యుడు స్వామీజీని ‘మీకు విదేశాలకు వెళ్లే అవకాశం ఇంతవరకు రాలేదా?’ అని అడిగారు. స్వామీజీ ‘అవకాశం వచ్చింది. జర్మనీకి వచ్చి అక్కడి వారికి యోగ నేర్పాలని వారి కోరిక’. శిష్యుడు ‘మీరు ఎందుకు తిరస్కరించారు?’ స్వామీజీ, ‘ఆహ్వానాన్ని నేను తిరస్కరించలేదు. మీ దేశంలో ఎవరికైతే యోగ నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నదో వారికి తప్పక నేర్పుతాను కాని, మీరే భారత దేశానికి రావడం బాగుంటుందని సందేశం పంపాను’ అని అన్నారు.

స్వామీజీ నోటి నుండి వచ్చిన ఈ మాటలు వింటుంటే భారతదేశం తిరిగి విశ్వగురువు కాగల గౌరవాన్ని పొందగలదని అనిపిస్తుంది. ముందు ప్రస్తావించిన ఇంగ్లాండ్‌ యువ ఇంజనీర్‌ కనుగోవిల్‌ 1971-72లో యోగాసనాలు నేర్చుకోవడానికి నాగపూర్‌ వచ్చాడు. స్వామి స్థాపించిన యోగాభ్యాస మండలిలో వారి మొదటి రోజు ఎలా గడిచిందనేది ఆ సంస్థ కార్యదర్శి రాంభావు ఖాండవే ఇలా చెప్పారు. ‘కనుగోవిల్‌కు మొదటిరోజు సరిగ్గా ఆసనస్థితిలో కూర్చోవడం కూడా రాలేదు. పాశ్చాత్య దేశాల జీవనశైల కారణంగా అక్కడి ప్రతి ఒకరి దశ ఇలాగే ఉంటుంది’ కాని పూజ్యశ్రీ జనార్ధన్‌ స్వామీజీ కృప, కనుగోవిల్‌ యోగాసనాలు నేర్చుకోవాలనే పట్టుదల కారణంగా చూస్తూ చూస్తుండగానే ఒకటిన్నర సంవత్సరంలో కఠినాతి కఠినమైన ఆసనాలు సులభంగా వేయగల్గుతున్నారు. ప్రతి ఆసనం పూర్ణస్థితి అతనికి సులభంగానే అబ్బింది.

కనుగోవిల్‌ యోగాభ్యాసం పూర్తి చేసుకొని ఇంగ్లాండ్‌ వెళ్లే ముందు స్వామీజీకి నమస్కరించడానికి వచ్చారు. స్వామీజీ ఆశీర్వదిస్తూ ‘మీరు మీ దేశం వెళ్లి ఈ విద్యను వ్యాపారంగా మార్చుకుంటే నష్టమై పోతుంది’ అని హ్చెచరించారు. కనుగోవిల్‌ సమాధానమిస్తూ ‘స్వామీజీ ఇంగ్లాండ్‌లో నేను లోక కల్యాణం కోసమే యోగాసనాలను ప్రచారం చేస్తానని మాట ఇస్తున్నాను’ అని అన్నారు.

ఇప్పటికి కూడా ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి యోగాసనాల అధ్యయనానికి స్త్రీపురుషులు భారత్‌లోని యోగాభ్యాస మండలికి వస్తుంటారు. స్వామీజీ భారతదేశానికి విశ్వగురువుగా ఔన్నత్యాన్నీ తిరిగి తెచ్చారు.

యోగ ప్రాధాన్యం

ప్రస్తుతం యోగ ప్రచారం, యోగాసనాల పట్ల ఉత్సాహభరిత వాతావరణాన్ని చూసి స్వామీజీకి ఎంతో సంతృప్తి, శాంతి, ఆనందం కలిగేవి. యోగ గొప్పదనాన్ని సరళభాషలో వివరిస్తూ ‘యోగ అనేది ప్రతి ఒకరికి ప్రాపంచిక (భౌతిక ప్రగతి), పారమార్థిక (ఆధ్యాత్మిక) ఉన్నతిని కలిగిస్తుంది. ప్రాపంచిక (సాంసారిక) ఉన్నతి సాధించాలంటే శరీరం ఆరోగ్య వంతంగా, సంతోషంగా ఉండాలి. యోగ ద్వారా ఇది సులభంగా సాధ్యమవుతుంది. ప్రాణాయామం ద్వారా మనస్సు నిర్మలమవుతుంది. స్థిరత్వం ఏర్పడు తుంది. వాంఛలు కలుగవు. బాధల కారణంగా చాలామంది రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోరు. ఈ బాధల నుంచి దూరం కావడానికి యోగాను ఆశ్రయించ వచ్చు. మనసును నిర్మలంగా, పవిత్రంగా ఉంచుకోవాలి. అందుకు ఆసనాలు, ప్రాణాయామం, ధ్యాన, ధారణ మొదలగు అష్టాంగ యోగాలను కొద్దికొద్దిగా చేతనైనంతగా సాధన చెయ్యాలి. అది ఒక నెలలో లేదా ఒక సంవత్సరంలో అవుతుంది అని చెప్పలేం. నిరంతరం అభ్యాసం చేస్తుండాలి’ అని స్వామీజీ అన్నారు.

కాని ఈ అభ్యాసంతో ఆధ్యాత్మిక జీవితంలో మార్పు వస్తుంది. ముక్తి లభిస్తుంది. ముక్తి దొరకడానికి ఎన్నో జన్మలు ప్రయత్నం చేయవలసి వచ్చినా నష్టంలేదు. ఇది శాస్త్రవచనం. ‘అనేక జన్మ సంసిద్ధస్తతో యాతి పరాంగతిమ్‌’ అని గీత చెప్తుంది.

ఆహారంలో షడ్రుచులు

మన శరీరం ఆరు రసాలతో (తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు) ఏర్పడింది. సృష్టిలోని అన్ని పదార్థాల నుంచి ఈ ఆరు రసాల అనుభవం కలుగుతుంది. ఈ ఆరు రసాలతో ఏర్పడిన శరీరం రోజు పనిచేస్తుంటుంది. అందుకని ఈ రసాలలో లోటు ఏర్పడుతుంటుంది. ఆ లోటును పూరించడా నికి భోజనంలో ఆరు రసాలుండాలి.

సాధారణంగా ప్రజలు తమ భోజనంలో తీపి, కారం, ఉప్పు, పులుపు రుచులు గల పదార్థాలను ఎక్కువ, తక్కువలుగా తీసుకుంటారు. చేదు, వగరులను సేవించరు. సేవించినా ఆ వస్తువులను ఉడికించి నీటిని పారబోస్తారు. ఫలితంగా ఆ పదార్థాలలోని పోషక విలువలు నశిస్తాయి. పుష్టికరం లేని హీనపదార్థాలు తినడంవల్ల లాభం ఉండదు. ఫలితంగా సంతులనం చెడిపోతుంది.

శరీరంలో చేదు, వగరు రసాల లోపంవల్ల వికృతి ఏర్పడుతుంది. డాక్టర్లు దానికి రకరకాల పేర్లు పెట్టి ఆ వికృతిని దూరం చెయ్యడానికి ఇచ్చే మందులలో అధిక శాతం చేదు, వగరు పదార్థాలుంటాయి. ఈ పదార్థాలు శరీరంలోనికి పోవడంవల్ల శరీరంలోని లోపాలు నయమవుతాయి. శరీరం ఆరోగ్యంగా అనిపిస్తుంది. మందులు వేసుకోవడం వల్లనే ఆరోగ్యం పొందామని అనుకుంటారు కాని అది భ్రమ. దానికి వేలాది రూపాయలు ఖర్చు చేస్తారు.

ప్రతి ఒక్కరు వారానికొకసారి చేదు, వగరు (మెంతి, కాకర, ఊసిరి, గోరు చిక్కుడు, పసుపు మొ||) గల ఆహారాన్ని తీసుకుంటే రోగాల బారిన పడే దుస్థితి రాదు. వీటివల్ల శారీరిక మానసిక ఆరోగ్యం కలుగుతుంది.

యోగ విజ్ఞానం ఆలోచనలతో కూడినది లేదా కల్పితమైనది కాదు. ఇది అనుభవ విజ్ఞానం. యోగాసనాలతో లభించిన శారీరిక, మానసిక ఉన్నతి, బుద్ధి వికాసాన్ని సాధకుడు నిజంగా అనుభూతి చెందుతాడు.

ఆధ్యాత్మిక ఉన్నతికి కావలసిన సాత్వికభావన బుద్ధివికాసం పొందడం ద్వారానే సాధ్యం. దానికి సాత్వికాహారం అవసరం. రజోగుణ, తామసిక గుణ సంబంధమైన ఆహారాన్ని భుజించేవారు కూడా యోగాసనాలతో పురోగతిని సాధించగలరు. కాని అలాంటివారు ప్రగతిని సాధించడంలో కొంతవరకే పరిమితం అవుతారు.

మూడు సరళ ప్రక్రియలు

శరీరాన్ని వంచడం, లేపడం, తిప్పడం – ఈ మూడు సరళ చర్యలపైననే యోగాసనలు ఆధారపడి ఉంటాయి. ఈ చర్యలను అధ్యయనం చేయడంతో బాటు ప్రత్యక్షంగా చేసే ప్రయత్నాన్ని కొంచెం కొంచెంగా క్రమం తప్పకుండా చేస్తుంటే కష్టమైనదేదీ లేదనిపిస్తుంది. అలాగే యోగావల్ల లాభమేమిటో తెలుసుకోవాలి. శ్రద్ధ, పట్టుదలతో అధ్యయనం, సాధన చెయ్యాలి. యోగాభ్యాసం వల్ల మంచి పనులు చేయాలని అనిపిం చడం మరొక ముఖ్య విషయం.

స్వామీజీ అంతిమ దశ

20వ శతాబ్దంలో యోగ గంగను అవతరింప జేసిన మహాయోగి జనార్దన స్వామీజీ 85 సంవత్స రాల వయసు వరకు యోగ ప్రచారాన్ని నిర్విరా మంగా కొనసాగించారు. 2 జూన్‌ 1978 రాత్రి 9.15 ని.లకు చైతన్య శరీరం అనంత చైతన్యంలో విలీనమైంది.

దేశమంతట యోగ ప్రచారానికి నిర్విరామంగా కృషి సలిపిన, అణువణువును జ్వలింపజేసిన, అందరిని సమాన దృష్టితో చూసిన, ఆత్మీయతతో అందరిని పలుకరించిన, అందరి కష్టసుఖాలలో పాలుపంచుకొన్న ఈ కర్మయోగి, ఉన్నత వ్యక్తిత్వం గల స్వామీజీ శాశ్వతంగా వెళ్లిపోయారు. మిగిలినవి వారి జ్ఞాపకాలే. యోగాభ్యాసమండలి అంతర్భాగం లోనే జనార్దన స్వామీజీ సమాధి నిర్మించారు.

స్వామీజీ 1951లో యోగాభ్యాస మండలి రూపంలో నాటిన చిన్న మొక్క నేడు వటవృక్షమైంది. ఈ మండలిలో ప్రతి నెల 4వ తేదీ నుండి నెలాఖరు వరకు ఉదయం 6 గంటల నుంచి 7.30 ని.లు వరకు ఆరోగ్యానికి యోగాసనాలు అనే పేరుతో ఉచితంగా తరగతులు నిర్వహిస్తారు.

‘ఆరోగ్యం కోసం యోగాసనాలు’ అనేది ఒక మాసం అధ్యయనం (కోర్సు). అది పూర్తి అయిన తరువాత ప్రతి నెల ‘అభ్యాసవర్గ’ ఉంటుంది.

ఎండాకాలంలో యోగాసనాల పరీక్షలు నిర్వహించి ప్రమాణ పత్రాలు (సర్టిఫికెట్స్‌) ఇస్తారు. మండలి తరఫున ‘యోగప్రకాశ్‌’ మాసపత్రిక ప్రచురిత మవుతున్నది.

పూజ్యశ్రీ జనార్దన స్వామీజీ నిర్యాణం తరువాత నాగపూర్‌లోని ప్రముఖ హృద్రోగ నిపుణుడు డా|| దిలీప్‌ వేచలేకర్‌, ‘వాల్మీకి శరీరంపై పుట్ట ఏర్పడినా కూడా అందులో నుంచి రామ శబ్దం వినిపించేది. యోగాభ్యాస మండలి అనే పుట్ట స్వామీజీ శరీరంపై నిర్మాణమైంది. అందులో నుండి ‘యోగ-యోగ’ అనే ఒకే మంత్రం నిరంతరం వినబడుతూ ఉంటుంది. యోగాభ్యాస మండలి రూపంలో జనార్దన స్వామీజీ ఇప్పటికి జీవించే ఉన్నారు’ అన్నారు.

పూజ్యశ్రీ జనార్దన స్వామీజీ భారత ఉన్నతికి యోగ ప్రచారకార్యాన్ని ప్రారంభించారు. మనం వారి సేవ నుండి ప్రేరణ పొంది యోగ సాధకులం కావాలి!

–  డా|| రవీంద్రజోషి, అఖిలభారత సహ కుటుంబ ప్రబోధన్‌ ప్రముఖ్‌, నాగపూర్‌.

అను: శ్రీధర్‌ కులకర్ణి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *