నిత్య ధర్మాలు – నిండైన ఆరోగ్యానికి మార్గాలు

నిత్య ధర్మాలు – నిండైన ఆరోగ్యానికి మార్గాలు

మనది ఋషి సంప్రదాయం. మన ఋషులు మానవ జీవితం సార్థకం కావటానికి పురుషార్థాలను లక్ష్యంగా నిర్దేశించారు. ధర్మ, అర్థ, కామ, మోక్షం అనే నాలుగింటినే పురుషార్థాలు అంటారు. ‘అర్థం’ అంటే డబ్బు లేక ఆస్తి లేక ఏదైనా సంపాదించే విషయంలోనూ; ‘కామ’ కోర్కెలు తీర్చుకునే విషయంలోనూ ధర్మంగా వ్యవహరించాలని, అప్పుడే ‘మోక్షం’ సిద్ధిస్తుందని వీటి అర్ధం.

పురుషార్థ సాధకంగా జీవించటానికి మనిషికి ఆరోగ్యం ఎంతో అవసరం. అందుకే ‘ధర్మార్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూలముత్తమమ్‌’ అన్నారు. మన నిత్య జీవితంలో సహజమైన కొన్ని విధులు లేక ధర్మాలను పాటించినట్లయితే ఆరోగ్యంతోనూ, ఆనందంతోనూ జీవించవచ్చు. అవేమిటో చూద్దాం.

మానవ శరీరం పంచభూతాలైన ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి తత్వాల సమ్మేళనము, సమన్వయంతో ఏర్పడినది. ఈ అయిదు తత్వాలలో అసమతుల్యత ఏర్పడినప్పుడు అనారోగ్యం ఏర్పడు తుంది. వీటిమధ్య సమత్వం ఉండ టానికి కొన్ని ధర్మాలు పాటించ వలసి ఉంటుంది.

నీరు (జలతత్వం)

మన శరీరం 70 శాతం నీటితో నిండి ఉంటుంది. ఈ నీరు తగ్గితే నీటి తత్వం మందగించి, రక్తం గడ్డ కట్టి, ప్రసరణ మందగించి, రకరకాల రోగాలు దరిచేరే ప్రమాదం ఉంది. అందుకే నీరు ఎక్కువగా తాగాలి. రోజు మొత్తంలో నీరు తాగే విధానం రకరకాలుగా ఉంటుంది. నీటిని రాత్రి రాగి పాత్రలో ఉంచి, తెల్లవారుఝామున నిద్ర లేవగానే తాగాలి. దీనినే మన పెద్దలు ‘ఉషఃపానం’ అన్నారు. ఇలా చేయటం వలన ఎన్నో రకాల వాత, పిత్త, కఫ రోగాలు దరి చేరవు. ఇలా రోజు మొత్తంమీద మరో 3 నుండి 5 లీటర్ల మంచినీరు వయసు, వృత్తిని బట్టి తీసుకోవాలి.

కడుపు ఖాళీగా ఉన్నప్పుడు మంచినీరు ఎక్కువగా తాగాలి. భోజనానికి 30 నిముషాల ముందు, భోజనం చేశాక గంట తరువాత మంచినీరు తాగాలి. భోజనం తినే సమయంలో అవసరం అయితేనే గుటకగా నీరు తాగాలి. ఈ పద్ధతుల వలన జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు నివారణ అవుతాయి. మంచినీరు ఎప్పుడైనా కొంచెం కొంచెంగా (ఒక్కొక్క గుక్క) తాగాలి.

ఆహారం (ఆకాశ, భూతత్వం)

ఆకలి ఎక్కువ తక్కువలను బట్టి ఆహారం తీసుకోవటం ఉత్తమం. మన ఆరోగ్యాన్ని మనం తీసుకునే ఆహారమే నిర్ణయిస్తుంది. మనం తీసుకునే ఆహారం ఎంత రుచిగా, ఇష్టంగా ఉన్నప్పటికీ మన కడుపులో ఒక ముద్ద పట్టేంత ఖాళీ ఉండగానే ఆహారం తీసుకోవటం ఆపేయాలి. అందుకే ‘ఒక ముద్ద తక్కువ తినరా!’ అంటారు మన పెద్దలు. దీనివలన ఆహారం కుళ్ల కుండా త్వరగా జీర్ణమయి శరీరానికి శక్తినిస్తుంది. దీనివలన 120 సంవత్స రాలు ఆరోగ్యంగా జీవించ వచ్చును అని భారత ఆయుర్వేద పితామహుడైన ‘చరకుడు’ చెప్పాడు. శరీరంలో తగినంత ఖాళీ ఉండటాన్నే ఆకాశ తత్వం అంటారు. ఆహారం తీసుకో వటం వలన శరీరంలో ఎముకలు, మాంసం, రక్తం మొదలైనవి వృద్ధి చెందటాన్నే భూతత్వం అంటారు.

భోజనం తినటానికి ముందు ప్రార్థన చేయటం వలన మానసిక శాంతి లభిస్తుంది. అందువలన జీర్ణరసాలు సక్రమంగా విడుదల అయి జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. అలాగే ఆహారాన్ని నోటిలోనే రుచిని ఆస్వాదిస్తూ బాగా నమలాలి. నములు తుండగా రసంగా మారిన పదార్థాన్ని మింగాలి. దీనివలన ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. రాత్రి భోజనం వీలయినంత త్వరగా ముగించటం వలన త్వరగా జీర్ణం అయి, ఇతర అవయ వాలకి రాత్రి సమయంలో తగినంత శక్తి, విశ్రాంతి లభిస్తుంది. పునఃశక్తిని పొందుతాయి. రాత్రి భోజనం తరువాత 100 అడుగులు నడవటం జీర్ణక్రియకు మేలవుతుంది.

అలాగే భోజనం చేసేటప్పుడు తినే ఆహారంపై మాత్రమే దృష్టి పెట్టి, శ్రద్ధగా నమలాలి. టి.వి. చూస్తూనో, ఫోన్‌ మాట్లాడుతూనో, లేదా ఇతర అంశాలపై దృష్టి పెట్టో భోజనం చేయరాదు. అలా చేస్తే సరిగా నమలకుండానే మింగటం, జీర్ణం ఆలస్యం కావటం జరుగుతుంది. దానివలన అజీర్తి సమస్య వచ్చి, గ్యాస్‌ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. భోజన సమయంలో కోపం, బాధ, దుఃఖం, దిగులు వంటివాటిని దరిచేరనీయవద్దు.

రోజువారీ ఆహారంలో దంపుడు బియ్యం, రాగులు, జొన్నలు, సిరి ధాన్యాలు వంటి పోషకాలు కలిగిన వాటిని వయస్సు, శరీరతత్వం, వృత్తిని బట్టి ఏవి శరీరానికి అనుకూలమైనవో వాటిని తినటం శ్రేయస్కరం.

రోజువారీ ఆహారంలో పైన చెప్పిన ధాన్యాలతో పాటు తాజా కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు, మొలకెత్తిన విత్తనాలు, మందులతో కాకుండా సహజంగా పండే పదార్థాలు ఉండేలా జాగ్రత్త వహించాలి. దీనివలన అన్ని విటమిన్లు, ఖనిజ లవణాలు, మినరల్స్‌ శరీరానికి లభించి సమత్వం సిద్ధిస్తుంది.

ప్రతిరోజూ ఇంటి నుండి బయటకు వెళ్లేముందు, ఇంటికి వచ్చిన తరువాత ఒక గ్లాసు మజ్జిగ తాగటం చాలా మంచిది. ఈ అలవాటు రోగ నిరోధక శక్తిగా ఉపయోగపడుతుంది. మజ్జిగలో ఉండే లాక్టోబెసిల్లస్‌ వాతావరణంలో ఉండే రోగాలను కలిగించే బ్యాక్టీరియా, క్రిముల నుండి శరీరాన్ని కాపాడుతుంది.

వ్యాయామం (అగ్ని, వాయు తత్వం)

నిండైన ఆరోగ్యానికి ఆహార నియమాలతో పాటు ప్రతిరోజు శరీరానికి కావలసిన వేడిని అందించడం, లేదా అధిక వేడిని తగ్గించడం కోసం వ్యాయామం చేయడం ఉత్తమం. వ్యాయామం వలన శరీరంలో అగ్ని ప్రదీప్తమయి, వాయు ప్రసారం సక్రమంగా జరుగుతుంది.

వ్యాయామాలలో నడక సులభమైనది. దీనివలన శరీరానికి తగినంత సూర్యరశ్మి, ఆక్సిజన్‌ అందుతుంది. కాళ్లకు, ఇతర కండరాలకు వ్యాయామం లభిస్తుంది. నడకతోపాటు ఇతర వ్యాయామాలైన ఈత, పరిగెత్తటం, యోగసాధన ఏదో ఒకటి ప్రతిరోజూ చేయాలి.

అయితే వ్యాయామం చేయడానికి సాధారణంగా బద్ధకం అడ్డువస్తుంది. వాయిదా వేయాలనిపిస్తుంది. ఇక్కడ ఒక రహస్యం అందరం గుర్తించాలి. వ్యాయామం బలవంతంగానైనా ప్రారంభించాలి. ప్రారంభించిన 5-10 నిముషాల తరువాత ఇంకా చేయాలనే ఉత్సాహం తప్పక వస్తుంది. అందుకు కారణం శరీరంలో ‘ఎండార్ఫిన్స్‌’ విడుదల కావటమే. కాబట్టి వ్యాయామం వలన శరీరానికి, మనస్సుకు ఉత్సాహాన్నిచ్చే ఎండార్ఫిన్స్‌ అనే హార్మోన్లు శరీరంలో విడుదల అవుతాయి. ఇక రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. శరీరం తేలికగా అనిపిస్తుంది. కాబట్టి ప్రతిరోజూ వ్యాయామం ప్రారంభించడం మన వంతు. మిగతాదంతా వ్యాయామం వంతు.

మరికొన్ని నియమాలు

శరీర ఆరోగ్యానికి పంచ భూతాల సమత్వంతో పాటు మరికొన్ని నియమాలు పాటిస్తే జీవితం ఆనందకరమే అవుతుంది.

వృత్తి : ఈ భూమిపై మనిషి జీవించడానికి ఏదో ఒక వృత్తిని ఎన్నుకుంటాడు. అయితే అది నేరమైనది, ఇతరులకు ఎటువంటి ఇబ్బంది కలిగించనిది అయి ఉండాలి. అటువంటి ఏ వృత్తిలో ఉన్నవారైనా తమ వృత్తిని గౌరవించాలి. త్రికరణ శుద్ధితో పని చేయాలి. పనినే దైవ కార్యంలా భావించి చేయాలి. అది సంతృప్తిని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. తనకి, ఇతరులకి ఉపయోగపడే ప్రతి పనినీ సత్కార్యంగానే భావించాలి. కృషితో నాస్తి దుర్భిక్షం, శ్రమయేవ జయతే, కృషి ఉంటే మనుషులు ఋషు లవుతారు వంటి అన్ని సూక్తులూ కర్మతో దేన్నెనా సాధించవచ్చుననే బోధిస్తున్నాయి. కాబట్టి నిత్యం కర్మ చేస్తూ ధర్మ, అర్ధ, కామ మోక్షాలను సాధిద్దాం.

నిద్ర, విశ్రాంతి : శరీరం బాగా అలసి పోయినప్పుడు విశ్రాంతి కోరుకోవటం సహజ ధర్మం. తగినంత విశ్రాంతి తీసుకోవటం వలన శరీరం పునరుత్తేజితమవుతుంది. ఆరోగ్యాన్ని సంతరించు కుంటుంది. విశ్రాంతి కేవలం శరీరానికే కాక మనసుకి కూడా ఇవ్వాలి. అప్పుడే మనిషికి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. ప్రతి మనిషి వయసుని బట్టి తగినంత నిద్రపోవాలి. సుమారు 6 నుండి 8 గంటల వరకు నిద్ర అవసరమవుతుంది.

యోగ నిద్ర ద్వారా, శవాసనంలో దీర్ఘ విశ్రాంతి ప్రక్రియ (డి.ఆర్‌.టి.) ద్వారా శరీరానికి, మనసుకి కలిపి ఒకేసారి సంపూర్ణ విశ్రాంతి నందించవచ్చు. తద్వారా శరీరంలోని నాడీ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, జీర్ణక్రియ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, గ్రంథుల వ్యవస్థ, ఎముకలు, కండరాల వ్యవస్థలు అన్నీ పూర్తి విశ్రాంతి పొంది పునఃశక్తిని పొందుతాయి. తిరిగి సక్రమంగా సమతుల్యతతో పనిచేస్తాయి.

నిరోధించరాదు : శరీర సక్రమ నిర్వహణలో కొన్ని క్రియలు క్రమంగా జరుగుతాయి. వాటిని మనిషి నిరోధించరాదు. ఆయుర్వేదం ప్రకారం మల-మూత్ర విసర్జన, ఆవులింత, అపాన వాయువు, ఆకలి, దప్పిక, కన్నీరు, తుమ్ములు, దగ్గు, నిద్ర, వాంతులు మొదలైన క్రియలను బలవంతంగా ఆపరాదు. అలా ఆపటం వలన అనేక రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. వాటిలో కడుపు నొప్పి, తలనొప్పి, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం, కంటి వ్యాధులు, ఆకలి తగ్గటం, శరీరంపై దురదలు, మైగ్రేన్‌, బలం తగ్గటం, భయం వేయటం, చెవుడు, మూర్ఛ, భ్రమ, వాత రోగాలు, గుండె జబ్బులు వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి శరీరంలో ఒక క్రమంలో జరిగే సహజ క్రియలను ఆపకూడదు.

దైనందిన క్రియలు

ఉదయం నిద్ర లేవగానే కాలకృత్యాల తరువాత పళ్లు తోముతాం. వాటిని తోమటానికి సహజంగా లభించే వేప, కానుగ, ఉత్తరేణి పుల్లలు లేక వాటి పొడి, లేక గోమయంతో చేసిన పొడి ఉపయో గించడం మంచిది. వీటివలన శరీరంపై ఎటువంటి దుష్ప్రభావం ఉండదు. పైగా శరీరంపై వీటి ఔషధ ప్రభావం పడి, జీర్ణశక్తి పెరుగుతుంది. ఇప్పుడు మార్కెట్లో లభించే టూత్‌పేస్టులలో ఉపయోగించే రసాయనాల వలన థైరాయిడ్‌ సమస్య వస్తున్నది.

ఆరోగ్యం కోరుకునే ప్రతి మనిషి నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో చన్నీటి లేక గోరువెచ్చని నీటితో స్నానం చేయటం మంచిది. దీనివలన చర్మ రంధ్రాలు శుద్ధి అయి, తెరచు కుంటాయి. బయటి ఆక్సిజన్‌ ఈ రంధ్రాల ద్వారా లోపలికి వెళ్లి శరీరం శుద్ధమైన గాలితో నిండుతుంది. దీనివలన శరీరం గాలిలో తేలుతున్నట్లుగా, హాయిగా అనిపిస్తుంది. స్నానం సమయంలో శరీరాన్ని మర్దన చేస్తూ ఉండటం వలన శరీర శుద్ధితో పాటు, అన్ని కీళ్లు, కండరాలకు వ్యాయామం కలుగుతుంది. శారీరక శుభ్రతతో మనస్సు ఆహ్లాదంగా, ప్రశాంతంగా ఉంటుంది. శరీరం, తేలికగా, ఉత్సాహంగా ఉంటుంది. అలాగే నెలలో ఒక్కసారి అయినా నువ్వుల నూనెతో శరీర మర్దన చేసుకోవాలి. దీనివలన చర్మం మరింత శుద్ధి జరిగి, వాయు ప్రసరణ మెరుగవుతుంది.

స్నానం అనంతరం దేవుని గదిలో వారి వారి సంప్రదాయం, సమయాన్ని బట్టి పూజ చేయాలి. పూజ చేస్తూ శ్లోకాలు పఠనం చేయాలి. దీనివలన కంఠ నాళాల శుద్ధి జరిగి కంఠం బాగుపడుతుంది. ఊపిరి తిత్తుల సామర్థ్యం కూడా మెరుగవుతుంది.

ఉపవాసం వలన క్యాన్సర్‌ను జయించే కణాలు ఉత్పన్నం అవుతాయి అని కనుగొన్నందుకు యోష్‌నోరి ఓసుమి అనే జపాన్‌ శాస్త్రవేత్తకు 2016 సం||లో నోబెల్‌ బహుమతి లభించింది. ఉపవాస ప్రక్రియను భారతీయులు ఎప్పటినుంచో ఆచరిస్తు న్నారు. దీనిని అందరూ వారంలో ఒకసారి లేక ఏకాదశి రోజున, లేదా ఎవరికి వీలైన, ఇష్టమైన రోజున ఒకరోజు ఉపవాసం ఆచరించడం మంచిది. దీనివలన కడుపులోని అధిక నిల్వలు కరిగి, జీర్ణవ్యవస్థ శుద్ధి జరుగుతుంది. మెరుగవుతుంది. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్‌ పెడుతుంది.

నిత్య యోగ సాధనతో పాటుగా పై అన్ని రకాల ధర్మాలు పాటించటం వలన వ్యక్తి ఆరోగ్యం, ఆనందానికి తిరుగే ఉండదు.

– యోగాచార్య డి.వెంకట్రావు, 9542708262

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *