చల్లదనాన్నిచ్చే వేడి పానీయాలు

చల్లదనాన్నిచ్చే వేడి పానీయాలు

వేసవిలో వేడి అధికంగా ఉంటుందనేది అందరికీ తెలుసు. అందుకే ఇంటిలో చల్లదనం కోసం కూలరో, ఏసీనో పెట్టించుకుంటారు. కానీ ఆ ఏసీ లేక కూలింగ్‌ వ్యవస్థను మన శరీరంలోనే ఏర్పాటు చేసుకుంటే ఇక ఎటువంటి ఇబ్బందీ ఉండదు. బయట ఎంత ఎండగా ఉన్నప్పటికీ మన శరీరం మాత్రం హాయిగా చల్లగా ఉంటుంది. ఇది సాధ్యమే. ఎలాగో చూద్దాం.

కొన్ని రకాల పానీయ వంటకాలు మన శరీరంలోని అధిక వేడిని చిటికలో తగ్గిస్తాయి. అవి సగ్గుబియ్యం జావ, రాగి జావ, సబ్జా గింజల జావ వంటివి. ప్రాంతాన్ని బట్టి కాలానికి తగిన ఇటువంటి వంటకాలు చేసుకుతినడం భారతదేశ వ్యాప్తంగా ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయం. వీటి తయారీకి అయ్యే ఖర్చు చాలా తక్కువ. ప్రయోజనం చాలా ఎక్కువ.

ఈ పదార్థాలు ఏమిటో, ఎలా తయారుచేయాలో చూద్దాం.

సగ్గుబియ్యం జావ

సగ్గుబియ్యం జావ చేయడం దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ముఖ్యంగా పండుగ రోజుల్లో దీనిని చేస్తుంటారు. గ్రామాల్లో ఈ జావను వేసవిలో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు.

కావలసిన వస్తువులు

సగ్గుబియ్యం ఒక టీ గ్లాసు లేదా 10 టీ చెంచాలు, బెల్లం 50 గ్రాములు, యాలుకలు 4, నాలుగు గ్లాసుల నీరు.

తయారీ విధానం

ముందుగా స్టీలు పాత్రలో నాలుగు గ్లాసుల నీరు పొయ్యాలి. ఒక టీ గ్లాసు లేదా 10 టీ స్పూన్లు సగ్గుబియ్యం వెయ్యాలి. ఈ పాత్ర పొయ్యిమీద పెట్టాలి. మంట సిమ్‌లో పెట్టాలి. సగ్గుబియ్యం ఉడకటానికి 25 లేదా 30 నిమిషాల సమయం పడుతుంది. ఈ లోపు బెల్లం మెత్తగా తరిగి పెట్టుకోవాలి. యాలుకలు పొడి చేసి పెట్టుకోవాలి. 25 లేదా 30 నిముషాల తరువాత పొయ్యిమీద పాత్రలో నాలుగు గ్లాసుల నీరు మరిగి రెండు గ్లాసులు మిగులుతుంది. మిగిలిన ఈ నీరు మందంగా జావలా ఉంటుంది. ఇప్పుడు తరిగిన బెల్లం పొడి వేసి కరిగేవరకు చెంచాతో తిప్పాలి. మరో 2 నిముషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు యాలుకల పొడి వెయ్యాలి. మరోసారి చెంచాతో తిప్పాలి. మరో 30 సెకన్లు పొయ్యిమీద ఉంచి దించెయ్యాలి. సగ్గుబియ్యం జావ రెడీ. దీనిని చల్లారనివ్వాలి. గోరువెచ్చగా ఉండగా గ్లాసులో పోసుకుని తాగాలి. మరో గ్లాసు మరొకరు తాగొచ్చు.

రాగుల జావ

రాగుల పిండితో చేసే వంటకాన్నే రాగి జావ లేదా రాగి మాల్ట్‌ అంటారు. ఇది అధిక వేడిని ఇట్టే తగ్గిస్తుంది. అలాగే జలుబు, గొంతునొప్పి వంటివి కూడా తగ్గుతాయి. రాగుల జావను 10 నిమిషాల లోపే చెయ్యొచ్చు.

కావలసిన పదార్థాలు

రాగుల పిండి – నాలుగు టీ చెంచాలు, ఉప్పు – తగినంత, యాలుకలు – 4, నీరు రెండు గ్లాసులు. ఒక చిన్న గిన్నె, ఒక పెద్ద గిన్నె.

తయారీ విధానం

మొదట పెద్ద గిన్నెలో రెండు గ్లాసుల నీరు పోసి పొయ్యిమీద పెట్టాలి. మంట సిమ్‌లో ఉంచాలి. నీరు రెండు నిముషాలు మరిగితే సరిపోతుంది.

ఈ లోపు చిన్న గిన్నె తీసుకొని అందులో నాలుగు టీ చెంచాల రాగి పిండి వేయాలి. కాస్త నీరు తీసుకొని ఈ పిండిలో వేసి కలపాలి. మరీ నీరు నీరు గానూ లేదా ముద్దగానూ కాక మధ్యస్తంగా కలపాలి. యాలలు కూడా నలగకొట్టి మెత్తగా చేసి పెట్టుకోవాలి.

పొయ్యిమీద మరుగుతున్న నీటిలో చిన్న గిన్నెలో కలిపి ఉంచిన ‘రాగి పిండి – నీరు మిశ్రమా’న్ని పోసి కలిసే వరకూ చెంచాతో తిప్పాలి. లేకపోతే గడ్డ కడుతుంది. తరువాత 5 నిమిషాలు మరగనివ్వాలి. ఆ సమయంలో పిండి ఉడుకుతుంది.

5 నిమిషాలు ఉడికిన తరువాత తగినంత ఉప్పు వేయాలి. 30 సెకన్ల తరువాత యాలకుల పొడిని కలిపి, మరో నిముషం ఉడకనిచ్చి, పొయ్యిమీద నుంచి దించాలి. అంతే. కమ్మటి సువాసనలతో కూడిన రాగి జావ తయారవుతుంది. ఈ రాగి జావ చల్లారి, గోరువెచ్చని స్థితికి వచ్చాక తాగితే ఒంట్లో ఉన్న ఎంతటి వేడి అయినా ఇట్టే చల్లారిపోతుంది.

రాగి జావ సేవించటం వల్ల ఆకలవుతుంది. జలుబు, గొంతునొప్పి కూడా తగ్గుతుంది. రాగి జావ వలన శరీరంలో కాల్షియం అధిక మోతాదులో తయారవుతుంది. ఇది ఒంటికి బలాన్నిస్తుంది.

రాగి జావ తయారీలో ఉప్పు బదులు బెల్లం కూడా వాడొచ్చు. రాగి జావను మజ్జిగ లేదా పాలతో కూడా కలిపి తాగొచ్చు. వేసవిలో మజ్జిగతో తాగడం మంచిది.

– సూర్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *