అణువు నుంచే విశ్వాకారం !

అణువు నుంచే విశ్వాకారం !

పై ప్రకతి సిద్ధాంతం చొప్పున మొదటి వలయంలో రెండు ఎలెక్ట్రాన్లు, రెండవ వలయంలో ఎనిమిది ఎలెక్ట్రాన్లు ఉన్నా మూడవ వలయంలో అంటే అన్నిటి కంటే బయట ఉండే వలయంలో ఏడుమాత్రమే ఉండటం చేత ఆ అణువు ఆస్థిరంగా ఉంది. అన్ని వలయాల్లోనూ ఎలెక్ట్రాన్లు లెక్క ప్రకారం ఉన్నప్పుడు అణువు సుస్థిరంగా ఉంటూ అత్యధిక శీతోష్ణ వాతావరణ పరిస్థితుల్లో చెక్కుచెదర కుండా ఉంటుంది. ఇనుము, పాదరసం మొదలైన మూలపదార్థాల అణువులు సుస్థిరంగా ఉంటాయి. ఇకపోతే పైన వివరించిన క్లోరిన్‌ అణువులాంటివి అస్థిరమయినవి. సామాన్య శీతోష్ణ పరిస్థితుల్లో కూడా యే పదార్థం నుంచో ఒక ఎలెక్ట్రాన్ను తీసుకుని స్థిరత్వం పొందటానికి ప్రయత్నిస్తాయి. అందుచేత అట్లాంటి అణువులు సామాన్య పరిస్థితుల్లో కూడా సులువైన మార్పులకు లోనవుతాయి. సోడియం మామూలు వాతావరణ పరిస్థితుల్లో భగ్గున మండిపోతుంది. సోడియం అణు నిర్మాణం చూస్తే దాని కేంద్రానికి బయట మొదటి వలయంలో రెండూ, రెండో వలయంలో ఎనిమిది ఎలెక్ట్రాన్లు ఉన్నాయి. కానీ దానికి మూడో వలయం కూడా ఉంది. ఆ వలయంలో లెక్క ప్రకారం ఉండవలసినట్లు ఎనిమిది ఎలెక్ట్రాన్లు ఉండక ఒక్క ఎలెక్ట్రానే ఉండటంచేత ఆ అణువుకు అపరితమైన ఆ స్థిరత్వం వచ్చింది.

బయటి వలయంలో ఒక ఎలెక్ట్రాను ఉన్న సోడియం అణువు, బయటి వలయంలో ఏడు ఎలెక్ట్రాన్లుఉన్న క్లోరిన్‌ అణువూ రెండూ సమీపించి నప్పుడు వెంటనే సహజంగా సోడియం యొక్క బయటి వలయంలో ఒంటరిగా ఉన్న ఆ ఒక్క ఎలెక్ట్రానూ క్లోరిన్‌ అణువు యొక్క మూడవ వలయంలో చేరి ఏడును ఎనిమిదిగా చేసి క్లోరిన్‌కు సుస్థిరత్వం చేకూరుస్తుంది. ఆ కార్యక్రమంలో సోడియమూ క్లోరినూ రెండూ సమ్మిళతమయి సోడియం క్లోరైడ్‌ అనే మన సాధారణ ఉప్పు వస్తుంది. ఈ విధంగా రెండు ఎలెక్ట్రాన్లు లోపించిన ప్రాణవాయువు అణువు రెండు ఉదజని అణువుల లోని రెండు ఎలెక్ట్రాన్లను సుస్థిరత్వం కోసం తీసుకోగా నూ2 అనే సూత్రం కలిగిన ఆ రెంటి మిశ్రమం అయిన నీరు ఏర్పడుతూ ఉంది.

ఇప్పటికి అణువు యొక్క స్వరూపంతో పాటు స్వభావం కూడా చాలా మటుకు బోధపడి ఉంటుంది. ధనముఖ విద్యుత్తుకు స్థావరంగా ఉన్న ఒక అగోచర సూక్ష్మ కేంద్రం చూట్టూ ఋణ ముఖ విద్యుత్కణాలు అయిన ఎలెక్ట్రాన్లు వలయ మార్గాల్లో పరిభ్రమిస్తూ ఉంటాయి. ఈ నిర్మాణం సూర్యుడూ దానిచుట్టూ తిరిగే గ్రహాలూ కల నిర్మాణానికి పోలి ఉంది. అంటే అణువు ఎంత అద్భుతమయిందో చూడండి. అణువే పదార్థానికి అంటే విశ్వానికి ఆఖరు ఇటుక రాయి. అణువే శక్తి పదార్థాల అద్వైత భావానికి అధిష్ఠాన పీఠము. అణువు నుంచే విశ్వాకారము అంకు రించింది. అణుగర్భ సూత్రాలీ విశ్వగర్భంలోని సర్వ తారా సంచారానికి ఆధార సూత్రాలు. అణువులో నుంచే అజాండాలుదయించాయని యింతకు ముందే వివరించాను. ఈ తారా సంచారం అచరాచర ఆకారం అఖిల విశ్వ సంరంభం అణుగర్భ ప్రతిబింబం. ఈ చిత్రమంతా మనో నేత్రంలోకి తెచ్చుకుంటే మన శ్రీమద్భాగవతంలోని రాసలీలా దశ్యం అనిపిస్తుంది. విశ్వం: అణువును గురించి తెలుసుకోనిదే అజాండాన్ని అర్థం చేసుకోలేవు. విశ్వ విజ్ఞానానికి అక్షరాభ్యాసం అణువుతోనే ప్రారంభి స్తుంది. సష్టి పరిణామానికి పరాకాష్ఠగాఉన్న మానవ మేధ అప్రయత్నంగా అనుద్దిష్టంగా కొన్ని సత్యాలను, కేవల పరిణతి ఫలితంగా వ్యక్తం చేస్తుంటుంది. అనేక మహాత్ములు శాస్త్రజ్ఞానం కలిగో, కలగకో సష్టిలో స్వరూపాలు మిథ్య అని అల్పం అనల్పం అనే భేదాలు లేవనీ అల్పంనించే అనల్పం వచ్చిందనీ అన్నారంటే (”అణోరణీయాన్‌ మహతో మహీయాన్‌”) అప్పటికే ఉద్భవించిన పదార్థ శాస్త్రజ్ఞాన పరిపక్వత చేతనో లేకపోతే వెనక చెప్పినట్లు సృష్టి పరిణామ ఫలితంగా వచ్చిన మానవ మేధా పరిణతి మూలం గానో అనుదిష్టంగా ఈ అఖండ సత్యావిష్కరణ జరిగి ఉంటుంది.

ఈ నక్షత్రాల అనంత కాంతికి కారణం కనుక్కుందామని బయలుదేరి చాలాదూరం వెళ్ళి అణువును చేరి అణుగర్భాన్ని పరిశోధిస్తేగానీ, ఆ నిగూఢ రహస్యాలు తెలీవని అణు నిర్మాణం పరిశీలనకు పూనుకున్నాము. అణువు దుర్భేద్య మయిన దుర్గమని తెలుసుకున్నాము. అణువు పొలిమేరల్లో అంటే బయటి వలయాల్లో సంచరించే ఎలెక్ట్రాన్లను దాటి కేంద్రం దగ్గరకు వచ్చాము. ఆ కేంద్రం ఏమిటో తెలుసుకోవాలి. మన రహస్యం అందులోనే ఉంది. మామూలు అణువుల కేంద్రాలు ఈ పరిశీలనకు ఉపకరించవు. మనం కాంతి ప్రసార పదార్థాలను తీసుకోవాలి. పదార్థం రూపొందే విశ్వోదయ కాలంలో కొన్ని అణువుల్లో పరిమితమైన శక్తి యిమిడ్చబడితే మరికొన్ని అణువుల్లో అపరిమిత మైన శక్తి యిమడ్చిబడింది. అట్లాంటి అణువులే కాంతి ప్రసార పదార్థ అణువులు రేడియం, పోలోనియం, ఆక్రేనియం, యురేనియం మొదలైన మూలపదార్థాల అణువులు, ఈ పదార్థాలు అంటే ఈ అణువులు తొంభయి రెండు అణువుల్లో మిగతా వాటికంటే చాలా బరువైనవి. అన్నిటిలో కంటే అత్యధికమైన శక్తి ఈ అణువుల్లో ఇమిడి ఉండడమే దీనికి కారణం. హీలియం అణువులో రెండు ఎలెక్ట్రాన్లు లిథియం అణుపులో మూడు ఎలెక్ట్రాన్లు, కాల్షియం అణువులో ఇరవై ఎలెక్ట్రాన్లు ఈ విధంగా ఉంటే కాంతి ప్రసార పదార్థాలయిన ఆర్జినియంలో ఎనభై తొమ్మిది, సోడియంలో తొంభయి, పోలో నియంలో తొంభయొక్కటి, యురేనియంలో తొంభయి రెండు ఎలెక్ట్రాన్లు ఉన్నాయి. ఇంత అధికంగా బంధింపబడి ఉన్న విస్తార శక్తి ఆ గర్భ కుహరంలో ఇమిడి ఉండలేక ఎప్పుడూ కొంచెం కొంచెంగా బయటికి ప్రసరిస్తూ ఉంటుంది. అదే కాంతి ప్రసారము. ఈ కాంతి ప్రసారము అణుగర్భంలో నించే బయలుపడుతూ ఉంటుంది. ఈ కాంతి ప్రసారమే ఆల్ఫాకణ సముదాయము.

అనంత శక్తి గర్భమయిన అణు కేంద్రాన్ని భేదించటానికి చాల కాలం నించీ ప్రయత్నాలు జరిగి, ప్రయత్నాలు ఫలించి అటంబాంబులు హైడ్రోజన్‌ బాంబులు వగైరా అపూర్వ మారణాస్త్ర నిర్మాణానికి, విచిత్ర మానవ విజయాలకు ద్వారాలు తీశాయి. అయితే ఈ అణు కేంద్రాన్ని ఆల్ఫాకణాల తోటీ, ప్రోటాన్లు న్యూట్రాన్ల తోటీ భేదించారన్నామే కాని ఆ భేదనా కార్యక్రమానికి ఏ పరికరాలు ఉపయో గించారు అనే వివరాలు వర్ణించలేదు. ఎందుచేత నంటే అది చాలా విపులమైన శాస్త్రీయ వివరాలతో కూడి ఉంటుంది. అదంతా గుప్పించి విసుగు కలిగించటం కంటే ఫలితం చెప్పి ముగించడం యుక్తంగా ఉంటుంది.

అనేక అణుకేంద్ర భేదనా ప్రయోగాల్లో ఓ హాన్‌, లైసీమీనర్‌ అనే ఇద్దరు శాస్త్రజ్ఞులు 1939లో జరిపిన ప్రయోగం మూలంగా యూరేనియం అణుకేంద్రం మొదటిసారిగా భేదింపబడింది. న్యూట్రాన్లతో ఈ భేదనం సాధింపబడింది. ఈ ప్రయోగంలో తత్పూర్వ ప్రయోగాల్లో ఉత్పన్నమైన శక్తికంటే కొన్ని వందల రెట్లు ఎక్కువ శక్తి ఉత్పన్నమయింది. ఈ విధంగా ఒక లిథియం అణు కేంద్రాన్ని ప్రొటానుతో భేదిస్తే 2-8I10-15 ఎర్గుల శక్తి బహిర్గతమయింది. (ఎర్గులు శక్తిని కొలిచే కొలత) అంటే ఒక గ్రాము లిథియంను ప్రొటాను భేదనానికి గురిచేస్తే 25I10-18 ఎర్గుల శక్తి వెలువడింది. 25I10-18 ఎర్గుల శక్తి విలువ ఆధునిక ఆర్థిక పరిస్థితుల ప్రకారం 7500 డాలర్లట. ఒక గ్రాము లిథియం 7500 డాలర్లయితే ఒక గ్రాము బంగారం ఒక డాలర్‌ విలువ చేస్తుంది. అందుచేత బంగారానికి అణుశక్తికి విలువలో అపారమైన తేడాఉంది. అణుగర్భంలో ఉండే శక్తి ఎంత అపారమైనదో తెలుసుకోవాలంటే ఇంకో ఉదాహరణ చూడండి. సుమారు ఒక కిలోగ్రాము బరువుగల (అంటే 30 రు.లు విలువ చేసే) బొగ్గును అణుశక్తిగా మారిస్తే ఆ బొగ్గు నుంచి 25 కిలోవాట్‌ అవర్ల పరిమాణం గల శక్తి (విద్యుత్తు) బహిర్గతం అవుతుంది. (కిలోవాట్‌ అవర్‌ అంటే విద్యుత్తును కొలిచే కొలత) 25 కిలోవాట్‌ అవర్ల విద్యుచ్ఛక్తి అంటే – యాంత్రిక దేశాల్లో అగ్రగణ్యు మయిన అమెరికాలో ఉండే విద్యుదుత్పత్తి నిలయలన్నీ కలసి ఏకధాటిగా రెండు నెలలు పనిచేస్తే ఎంత విద్యుత్తు ఉత్పన్నమవుతుందో అంత పరిమాణం గల విద్యుచ్ఛక్తి అన్నమాట.

మరొక ఉదా:- ఒకగ్రాము రేడియంలో ఉండే శక్తి అంతా ఒక్కసారి బహిర్గతం అయితే ఆ శక్తితో ఒక ఆటోమోబైల్‌ మోటారును కొన్ని వందల సంవత్స రాలు పనిచేయించవచ్చునట: ఒక గ్రాము రేడియం అంటే ఒక ఉసిరికాయంత కూడా ఉండదేమో:

విశ్వంలోని వాయుగోళాల యొక్క అణుుగర్భాలు విచ్ఛిన్నమై అందులోని అనంతశక్తి ప్రజ్వరిల్లినప్పుడు నక్షత్రాలుగా ప్రకాశిస్తున్నాయి. ఆ మహత్తర వాయుగోళాల్లో ఎన్ని అణువులున్నాయో అందుచేత నక్షత్రాలు ఎంతకాలం ప్రజ్వలిస్తుంటాయో: కొన్ని మిలియన్ల సంవత్సరాలు కావచ్చు. సూర్యుడు బొగ్గే అయిఉంటే 50, 60, శతాబ్దాల్లో మండి మసి అయిపోయి ఉండేవాడు. కానీ సూర్యుడు అణుగర్భాల నించి తీసుకున్న శక్తితో జీవిస్తున్నాడు. కాబట్టి ఇంతకాలం ఉన్నాడు. ఇంకా కొన్ని మిలియన్ల సంవత్సరాలకాలం ఉంటాడటకూడా.

అయితే నక్షత్రాల్లో అణుశక్తి ఏవిధంగా ఉత్పత్తి అవుతూఉంది అనేది తెలుసుకొనటం అవసరం. ఎందుచేతనంటే అది నక్షత్రాలు ఎలా జీవిస్తున్నాయి. అని తెలుసుకోవడమే అవుతుంది. దీనికి మనం సూర్యుడ్ని ఉదాహరణంగా తీసుకుందాము (అన్ని నక్షత్రాల్లోనూ అదేసూత్రం).

6000ళీజ నుంచి 20 మిలియన్ల డిగ్రీలవరకూ విస్తరించిఉన్న సూర్యగోళ ఉష్ణోగ్రతల్లో అనేక అణువులూ, కేవలం ఎలెక్ట్రాన్లు విడిపోయిన అణుకేంద్రాలూ అల్ఫాకణాలూ మొదలైన వాటి మిశ్రమం సుడిగుండాల్లా విపరీతమైన వేగంతో పరిభ్రమిస్తూ ఉండాలి. ఉష్ణోగ్రత అధికమయ్యేకొలదీ అణు నిర్మాణంలో విచ్ఛిన్నం అవుతుంది. పైన చెప్పిన వివిధ మిశ్రమం సంకుల సమరం చేస్తూ ఉంటుంది. ఎలెక్ట్రాన్‌ వలయ సంరక్షణ పోయిన అణుకేంద్రాలను ఆ సంకులసమరంలో ఎన్ని అల్ఫాకణాలు ఢీకొనవు? ఎన్ని న్యూట్రాన్లు, ఎన్ని ప్రోటాన్లు ఢీకొనవు? అందుచేత నక్షత్రంలో అణుగర్భం విచ్చిన్నమై అణుశక్తి ఉత్పన్నం అవటానికి అనేక అవకాశాలు న్నాయి. అయితే నిరంతర నక్షత్రకాంతి ప్రజ్వలనం ఏదో ఒక్కసారి అణువులన్నీ విచ్చిన్నమయి అటం బాంబులా ప్రజ్వరిల్లి వాయుగోళం బ్రద్దలైపోవడం కాదు. కానీ కొన్ని అణువులు సులభంగా విచ్చిన్నం కావు. ఉదా|| 1 గ్రాము ఉదజని + 1 గ్రాము లిథియం మిశ్రమం తీసుకుంటే దానిని పూర్తిగా అణుశక్తిగా మార్చి వేస్తే 2.2I1018 ఎర్గుల అణుశక్తి వస్తుంది. కానీ అనేక వేల డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా ఈ మిశ్రమం పూర్తిగా అణుశక్తిగా మారాలంటే కొన్ని బిలియన్ల సంవత్సరాలు తీసుకుంటుంది. అంత మెల్లగా అణుశక్తి ఆ మిశ్రమంలోనించి తయారవు తుందన్న మాట. ఆ లెక్క ప్రకారం అదే ఒక టన్ను మిశ్రమం, ఒక శతాబ్దకాలానికి ఒకటి రెండు ఎర్గుల శక్తిని మాత్రమే ఇవ్వగలదు. ఈ మాత్రం శక్తి ఒక గుండు సూదిని నాలుగడుగులు పైకెత్తడానికి కూడా చాలదు.

గుంటూరు శేషేంద్రశర్మ

గుంటూరు శేషేంద్రశర్మ ఇతర పుస్తకాల వివరాలకు :

Saatyaki S/o Seshendra Sharma , saatyaki@gmail.com ,

9441070985 , 7702964402

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *