సృష్టితత్వం… విశ్వదృష్టి…

సృష్టితత్వం… విశ్వదృష్టి…

సృష్టితత్వం, ఆధునిక విజ్ఞానశాస్త్రం చెప్పే విశ్వదృష్టితో పోలి ఉంటుందా? ఔననే అంటున్నారు అమెరికన్‌ భౌతికశాస్త్రవేత్త ఫ్రిట్జఫ్‌ కాప్రా. ఆయన 1966లో వియన్నా విశ్వవిద్యాలయం నుండి భౌతికశాస్త్రంలో పిహెచ్‌.డి. పట్టా పొందారు. ఈ భౌతిక శాస్త్రవేత్త అనేక విశ్వవిద్యాలయాలలో నేటికీ పరిశోధనలు చేస్తున్నారు. కాప్రా తూర్పు దేశాల అధ్యాత్మిక గ్రంథాలను పరిశీలించారు. అవి నిర్వచించిన సృష్టితత్వం, ఆధునిక సైన్స్‌ చెబుతున్న విశ్వదృష్టితో సంపూర్ణంగా పోలి ఉందని గుర్తించారు. ఆధునిక సైన్స్‌, ప్రాచీన ఆధ్యాత్మికతల మధ్య ఉన్న సమన్వయాన్ని తెలియజేయడం కోసం ‘ది తావో ఆఫ్‌ ఫిజిక్స్‌’ అనే ప్రముఖ గ్రంథాన్ని కాప్రా రచించారు. ఈ గ్రంథంలో కాప్రా ఆధ్యాత్మిక విద్యకు, ఆధునిక శాస్త్రీయ విద్యకు గల పోలికల గురించి తర్కించారు. ఎక్కిరాల భరద్వాజ రాసిన ‘విజ్ఞాన వీచికలు ‘ గ్రంథంలో కాప్రా భావనలను పరిచయం చేశారు.

కాప్రా దృష్టిలో నేటి భౌతికశాస్త్రం తన సాంకేతిక స్థాయిని అధిగమించి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించే సాధనంగా రూపొందుతోంది. సైన్స్‌, అధ్యాత్మికతల మధ్య గల సమన్వయం విషయంలో మనకు సహజంగా వచ్చే అనేక సందేహాలకు కాప్రా ‘ది తావో ఆఫ్‌ ఫిజిక్స్‌’లో సమాధానాలు ఇచ్చారు.

1972లో కాప్రా ఒక పత్రికకు రాసిన వ్యాసంలో మొదటిసారి ఉప పరమాణు కణాల శక్తి తాండవా లను శివతాండవంతో పోల్చారు. దానినే తన ‘ది తావో ఆఫ్‌ ఫిజిక్స్‌’ గ్రంథంలో మరింత వివరించారు.

జూన్‌ 18, 2004 వ తేదీన జెనీవాలోని ‘సెర్న్‌’ (యూరోపియన్‌ సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ పార్టికల్‌ ఫిజిక్స్‌) పరిశోధనాలయం వద్ద రెండు మీటర్ల ఎత్తైన నటరాజ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ పరిశోధన కేంద్రంతో ఉన్న అనుబంధం దృష్ట్యా భారత ప్రభుత్వం ఈ విగ్రహాన్ని ‘సెర్న్‌’కు బహుకరించింది.

ఆ నటరాజ విగ్రహం క్రింద ఫలకం మీద కాప్రా మాటలను ఉల్లేఖించారు.

‘వందల సంవత్సరాల క్రితమే భారతీయ కళాకారులు నాట్యం చేస్తున్న శివుని కంచు విగ్రహాలను తయారు చేశారు. మన కాలంలో భౌతిక శాస్త్రవేత్తలు ‘కాస్మిక్‌ డ్యాన్స్‌’ని వర్ణించడానికి అత్యాధు నిక సాంకేతికతను వాడారు. ఈ ‘కాస్మిక్‌ నృత్యం’ అనే రూపకాలంకారం ప్రాచీన పురాణాలను, మత పరమైన కళారూపాలను ఆధునిక భౌతికశాస్త్రంతో సమన్వయం చేస్తోంది. ఆధునిక భౌతికశాస్త్రం ప్రకారం జనన మరణాలు జీవులకే కాక, జీవం లేని వాటికి కూడా ఉంటాయి. కాబట్టి, ఆధునిక భౌతిక శాస్త్రవేత్తలకు శివతాండవమంటే ఉప పరమాణు కణాల తాండవమే.’

శివతాండవం అంటే ఏమిటో తెలియచేయా లంటే అది అనుభవించినవాడే చెప్పగలడు. అట్టి అనుభవానికి జాతి, కుల, మత, దేశ కాల నియమాలు లేవని ఫ్రిట్జఫ్‌ కాప్రా అనుభవం తెలియజేస్తోంది.

డా. కాప్రా వయోవృద్ధుడే కాదు. అభివృద్ధుడు, జ్ఞానవృద్ధుడు కూడా. చైతన్యానుభవానికి దేశ కాలాలు అడ్డుకావని చెప్పడానికి ఒక సజీవ ఉదాహరణ డా.కాప్రా. అతడు తన ‘తావో ఆఫ్‌ ఫిజిక్స్‌’ అనే గ్రంథం ఉపోద్ఘాతంలో పొందుపరిచిన అనుభవం ఇది:

‘ఐదు సంవత్సరాల క్రితం కలిగిన అద్భుతమైన అనుభవం నన్ను ఒక కొత్త మార్గంలో నడిపించి, ఈనాడు ఈ గ్రంథ రచనకు ప్రేరణగా నిలిచింది.

‘ఒకనాటి ఎండాకాలం సాయంకాలం సముద్రపు ఒడ్డున వచ్చి పోయే అలలను చూస్తూ, నా శ్వాసనిశ్వాసల లయబద్ధతను గమనిస్తూ కూర్చొని ఉన్నాను. ఉన్నట్టుండి నా అంతరంగానికి ఈ చుట్టూ ఉన్న వాతావరణమంతా ఒక గొప్ప నృత్యంలో భాగంగా నాట్యం చేస్తున్నట్టు గోచరించసాగింది.

‘ఒక శాస్త్రవేత్తగా ఈ ఇసుక, రాళ్ళు, నీరు, గాలి – అన్నీ కదుల్తున్న అణు, పరమాణువుల చేత నిర్మితమైనవని తెలుసు. అలాగే భూ వాతావరణ మంతా పదార్థ రాశి నిర్మించడానికి అణుపరమాణు వుల మధ్య జరిగే నిరంతర సంగ్రామాన్ని ఒక భౌతిక శాస్త్రవేత్తగా గ్రాఫ్లు, బొమ్మలు, సూత్రాల ద్వారా మాత్రమే ఎరిగి ఉన్నాను.

‘కానీ ఈనాడు చల్లని ఈ సాయం సంధ్య నా పుస్తక జ్ఞానికి ప్రాణం పోసింది.

‘శక్తి తరంగాలు ఆకాశం నుండి దిగిరావడం నేను చూశాను.

‘లయబద్ధంగా ఆ శక్తి తరంగాలు పదార్థ రాశిగా మారడం, తిరిగి శక్తిగా లయించిపోవడం నేను చూశాను.

‘పదార్థంలోని పరమాణువులను నేను దర్శించగలిగాను.

‘నా శరీరంతో సహా సర్వంలోనూ ఉన్న ఆ అణుపరమాణువులు ఒక మహా శక్తి తరంగ నత్యంలో భాగాలుగా నర్తించటం చూశాను.

‘ఆ లయను నేను గుర్తించాను.

‘ఆ శబ్దాన్ని నేను విన్నాను.

‘ఆ క్షణంలో నేను అనుభూతి చెందింది హిందువులు నటరాజుగా పూజించే ‘పరమశివుని తాండవం’గా తెలుసుకొని పరవశంతో నన్ను నేను మరచిపోయాను.

‘సజల నయనాలతో కాలం తెలియని అలౌకిక స్థితికి తీసుకెళ్లిన ఆ అనుభూతిని, కాదు అనుభవాన్ని ఏమని వర్ణించగలను?!!

‘ఈ అనుభవమే నా గమ్యాన్ని, గమనాన్ని మార్చే దిక్సూచి అయింది. నా అడుగులు తూర్పు దేశాలలోని అద్భుత విద్య వైపు కదిలేలా చేసింది. ఎందరో మహనీయులను దర్శించే అవకాశం కలిగించింది’.

పరమాణువులలో సూక్ష్మ స్థాయిలో జరిగే మార్పులు కూర్పు, లయ, తాళాలతో ఉండడం వల్ల ఆధునిక శాస్త్రవేత్తలు వాటిని తాండవంతో పోల్చారు. విశ్వమంతా శక్తి తాండవమే. ఇలా అనుక్షణమూ తాండవిస్తూ ఉండే పరమాణువుల సమూహాలే వస్తువులన్నీ. ఆధునిక భౌతికశాస్త్రం ప్రకారం ఉప పరమాణు కణాలు అనుక్షణమూ ఉత్పన్నమవుతూ, నశిస్తూ ఉంటాయి. అంటే అనుక్షణమూ ఇవి సృష్టిలయాలను తాండవం చేస్తూ ఉంటాయి.

ఫ్రిట్జఫ్‌ కాప్రా ఇలా లోతుగా మరో సంగతి చెబుతారు: ‘పరమాణువులోని ప్రతి కణము శక్తి నృత్యం చేయడమే కాదు. దానికదే ఒక శక్తి నృత్యం కూడా. అది అంతు లేకుండా సాగే సృష్టి, నాశనాల క్రమాన్ని సూచిస్తుంది. ఆధునిక భౌతికశాస్త్రవేత్తలకు శివతాండవమంటే ఉపపరమాణు కణాల తాండవమే.’ శబ్దమే (ఓంకారం) బ్రహ్మమని, అదే సృష్టి, స్థితి, లయాలకు కారణమని హిందూ మత గ్రంథాలు చెప్పిన దానికి నేటి భౌతికశాస్త్రం చెబుతున్న అంశాలు చాలా దగ్గరలో ఉన్నాయి.

ఫ్రిట్జఫ్‌ కాప్రా ‘తావో ఆఫ్‌ ఫిజిక్స్‌’లో సైన్స్‌ను, ఆధ్యాత్మికతను సమన్వయం చేస్తూ చెప్పిన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం :

1. సైన్స్‌ ప్రయోగాలు ఎక్కడైనా, ఎప్పుడైనా ఒకే ఫలితాలను ఇస్తాయి. ఆ ప్రయోగాలను తిరిగి తిరిగి నిర్వహించినా ఫలితాలలో మార్పు రాదు. కానీ ఆధ్యాత్మిక అనుభవాలు అందరికీ కలగవు. వాటిని ఎవరు పడితే వారు, ఎక్కడపడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు పొందడం సాధ్యం కాదు. కాబట్టి ఈ రెండిటి మధ్య వైరుధ్యం ఉందని తలుస్తాం. కానీ బాగా లోతుగా పరిశీలిస్తే అది నిజం కాదని తెలుస్తుంది.

సైన్స్‌లో ఒక ప్రయోగం చేయాలంటే ఆ ప్రయోగం చేయగల వ్యక్తి అనేక సంవత్సరాలు శాస్త్రీయ శిక్షణ పొందవలసి ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలని అనుకునే వ్యక్తి సద్గురువు వద్ద శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఆ శిక్షణను పూర్తి చేసుకునన్న తర్వాతనే వీరిద్దరూ వారి వారి ప్రయోగాల ద్వారా ఫలితాలను పొందుతారు. అలాగే సాధకుల చరమ ఆధ్యాత్మిక అనుభవాలు కూడా స్థల కాలాలకు అతీతంగా ఒకేలా ఉంటాయని వారి అనుభవాలు తెలుపుతున్నాయి. కాబట్టి ఈ విషయంలో ఈ రెండు శాస్త్రాల మధ్య వైరుధ్యం లేదు.

2. ఆధ్యాత్మికత సంక్లిష్టమైనదనీ, అది సామాన్యులకు అర్థం కాదనీ మనం భావిస్తాం. నిజానికి నేటి భౌతికశాస్త్ర గ్రంథంలోని పేజీలను తిరగ వేస్తే అది పామరులకు ఎంత అర్థమవుతుందో, ఆధ్యాత్మిక గ్రంథం కూడా అంతే అర్థమవుతుంది. ఈ రెండురకాల గ్రంథాలు నిజానికి సృష్టితత్వాన్ని నిర్వచించేవే.వాటిని అర్థం చేసుకోవాలంటే తగిన పరిజ్ఞానం, పరిణితి ఉండాలి.

3. నేటి శాస్త్రీయ విద్య ఏ విధంగానైతే మన యోచన పద్ధతినీ, పరిశీలన దృక్పథాన్నీ ప్రభావితం చేస్తుందో, ఆధ్యాత్మిక విద్య కూడా మన చైతన్యాన్ని అలాగే ప్రభావితం చేస్తుంది.

4. నేటి సైన్స్‌ మనకు నిర్దిష్టమైన, నిశ్చయమైన జ్ఞానాన్ని ఇస్తుందనీ, ఆధ్యాత్మికత అలా ఇవ్వదనీ భావిస్తాం. నిజానికి నేటి శాస్త్రీయ విజ్ఞానంలోనూ అనిశ్చితి ఉంది. ఉదాహరణకు న్యూటన్‌ రూపొం దించిన యాంత్రిక జగద్భావ సిద్ధాంతం అసంపూర్ణమని నేటి శాస్త్రం నిరూపించింది. అదే విధంగా క్వాంటం సిద్ధాంతం పరమాణు స్థాయిలో, సాపేక్ష సిద్ధాంతం అత్యంత వేగంతో పయనించే వస్తువులకు మాత్రమే ఉపయోగ పడతాయి.

5. ప్రాచీన తత్వవేత్తలు ఆధ్యాత్మిక సత్యం, భాష తర్కానికీ అందనిదని చెప్పారు. అందువల్ల దానిని ఎలా నమ్మగలం? అని హేతు వాదులు ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ నేటి భౌతికశాస్త్ర వేత్తలు కూడా ఉప పరమాణు స్థాయిలో ‘వాస్తవికత అనేది మిథ్య’ అని చెబుతున్నారు. ‘పరమాణువుల గురించి సామాన్యమైన భాషలో చెప్పడం సాధ్యం కాదు’ అంటారు హైసెన్‌ బర్గ్‌. ఆధ్యాత్మిక సత్యాలను గురించి చెప్పేటప్పుడు మన ప్రాచీనులు పరస్పర విరుద్ధమైన పదాలను ఉపయోగించారు. నేటి శాస్త్రవేత్తలు కూడా అలాగే చేస్తున్నారు. విద్యుదయస్కాంత ధార్మిక శక్తి అయిన కాంతి ఒక వంక తరంగాలుగా, మరో వంక కణాలుగా కూడా ప్రవర్తిస్తుంది. మామూలు భాషలోనూ, తార్కిక యోచనలోనూ ఒకే వస్తువు పరస్పర విరుద్ధమైన రెండు తత్వాలను కలిగి ఉండటం సాధ్యం కాదు.

కాబట్టి మన భాషకూ, తర్కానికీ అందని సత్యాలు ప్రకృతిలో ఉన్నాయి అంటే ప్రకృతి తత్త్వమే అట్టిదని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి హేతువాదులు, నాస్తికులు ఆధ్యాత్మికత గురించి చేసే విమర్శ సరైంది కాదు.

6. ఆధ్యాత్మిక సత్యం ఇంద్రియాలకు గోచరం కాదు కాబట్టి అది అసత్యమని కొందరు అంటారు. కానీ నేటి సైన్స్‌ చెబుతున్న పరమాణువులు, ఎలక్ట్రాన్లు మొదలైన బౌతికాంశాలు ఇంద్రియాలకు అతీతమే కదా! వాటి తత్వం తర్కానికీ, భాషకు అందనిది కనుక అది మనసుకు అతీతం. సత్యం కూడా అలాంటిదే అని ఆధ్యాత్మికత చెబుతుంది. కనుక ప్రాచీన, ఆధునిక దృక్పథాలు ఏకీభవిస్తున్నాయి.

7. అప్రధానమైన ఆచారాలను తొలగించి చూస్తే అన్ని దేశాలలోనూ, కాలాల్లోనూ ఆధ్యాత్మిక తత్వాన్ని ఒకేలా నిర్వచించుకున్నారని తెలుస్తుంది.

సృష్టిలోని వస్తువులు, ప్రక్రియలు ఒకే మూలతత్త్వ రూపాలని, అవి పరస్పర సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాయని ఆధ్యాత్మిక తత్వం తెలుపుతుంది. నేటి క్వాంటమ్‌ ఫిజిక్స్‌ కూడా ఇదే విషయాన్ని చెబుతోంది.

డేవిడ్‌ బోమ్‌ అనే శాస్త్రవేత్త ఇలా చెబుతారు : ‘ప్రపంచం వివిధ భాగాలతో నిర్మితమై ఉన్నది అనే సాంప్రదాయిక భావాన్ని తోసిపుచ్చి నేటి భౌతికశాస్త్రం అది వాస్తవానికి ఆవిభేద్యమైన ఏకత్వమని అంగీకరిస్తోంది.’

ఆధ్యాత్మ విద్యకు, ఆధునిక శాస్త్రానికి గల పోలిక లను గ్రహించడానికి ఈ రెండు సాంప్రదాయాల నుండి సేకరించబడిన ఈ క్రింది వాక్యాలను కాప్రా పోలుస్తారు–

‘వస్తువులు వాటికి గల పరస్పర సంబంధాల వల్లనే ఆయా ధర్మాలతో గోచరిస్తాయి గాని నిజానికి వాటికి వస్తువులనబడు ప్రత్యేక ధర్మాలేవీ లేవు.’ -అన్నాడు సిద్ధ నాగార్జునుడు.

‘ప్రాధమిక కణమన్నది విశ్లేషించడానికి వీలు లేనిదీ, స్వతంత్రమైన ఉనికి గలదీ కాదు. తత్వత: అది తక్కిన వస్తువులతో గల సంబంధాల వలయం మాత్రమే.’ – అంటాడు హెచ్‌. పి. స్టాప్‌ అనే శాస్త్రవేత్త.

‘ఈ ప్రపంచం అనేక సంఘటనల క్లిష్టమైన నేత అని (భౌతిక శాస్త్ర విజ్ఞానం వలన) రుజువవుతోంది. ఇలాంటి అనేక సంబంధాలు ఒకదానితో ఒకటి కూడి ఈ సంపూర్ణ జగత్తు తత్త్వాన్ని ఈ రీతిగా అనుభవమ య్యేలా చేస్తాయి.’ — అని హైసెన్‌ బెర్గ్‌ అనే శాస్త్రవేత్త అంటారు.

ఈ విషయాన్నే ముండకోపనిషత్తు (2.2.5) ఇలా చెబుతుంది. ”ఎవనినాధారంగా ఈ ఆకాశము, భూమి, వాతావరణము, వాయువు, ప్రాణాలు అల్లబడి ఉన్నాయో అట్టి బ్రహ్మమే ఆత్మ అని ఎరుగవలసినది.”

బౌద్ధమతంలో ”అవతంసక సూత్రం” కూడా సృష్టిని ఇలాగే వర్ణిస్తుంది.

సంప్రదించిన గ్రంథాలు

1. విజ్ఞాన వీచికలు-ఎక్కిరాల భరద్వాజ,

2.The Tao of Physics –
Fritjof Capra.

– మణికుమార్‌ వేమూరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *