ఇంద్రియాలు-మానవ విజ్ఞానము

ఇంద్రియాలు-మానవ విజ్ఞానము

ఇక్కడి నుంచీ సృష్టిమార్గమే మారింది. సృష్టిలో ఒక నూతన ఆధ్యాయం ప్రారంభించింది. పశుపక్ష్యాది జీవరాసులు సృష్టిని మార్చే ప్రయత్నం చేయలేదు. సృష్టిలో లభించినవాటితో జీవించేవి. కాని మానవుడు వచ్చిన తర్వాత సృష్టినే మార్చడానికి పూనుకున్నాడు. అరణ్యాలు తీసివేసి నగరాలు నిర్మించాడు; భూమిని చీల్చి పైర్లు, ఫలవృక్షాలు పెంచాడు. యంత్రాలు నిర్మించి కాలదూరాలు నిర్జించాడు. పరిసరాలకు అనుకూలంగా మారడమే మానవ పూర్వ ప్రాణి వర్గాల జీవన మార్గమయితే, తనకనుకూలంగా పరిసరాలు మార్చుకోవడం మానవ జీవనమార్గం అయింది. అది సృష్టిలో మానవావతరణంతో భౌతికంగా వచ్చిన మార్పు.

ఇక ఆధ్యాత్మికంగా చూస్తే ఈ నూతన అధ్యాయంలో సృష్టికి ఆత్మావలోకనం ప్రారంభ మయింది. (అంటే మానవుడు సృష్టివిచారం చేయడం.) సృష్టి తననుగూర్చి తానే తలపోసుకోవడం మానవ పూర్వ ప్రాణి వర్గాలన్నీ త్వక్చక్ష్వాది బుద్ధీంద్రియాల మీదనే ఆధారపడ్డాయి. అందుచేత వాటికి సృష్టిలో కనుపించినంతవరకే అర్థమయ్యేది, కానీ సృష్టిలో మనస్సు పరిణత దశను పొందిన తర్వాత ప్రాణి విజ్ఞానార్జనకు మనస్సు మీదనే ఆధారపడడం మొదలయింది. విజ్ఞానార్జనకు మనస్సు మీద ఆధారపడిన ప్రముఖ ప్రాణి మానవుడే. ఇంత సమగ్రంగా ఇంత సంపూర్ణంగా మనస్సును విజ్ఞాన సాధనంగా వాడుకున్న ప్రాణి మరొకటి లేదు. మన కన్ను ముక్కు మొదలైన బుద్ధీంద్రియాలు ఉండడం తెలుసుకోటానికేగదా? కంటితో చూసి, చర్మంతో స్పృశించి, చెవితో విని, నాలుకతో రుచి చూచి ప్రాణులు విశ్వంలో వస్తుధర్మాలు తెలుసు కుంటున్నాయి. అందుచేత వాటి విజ్ఞానం చాలా పరిమితం. మనస్సుమీద ఆధారపడిన మానవుడు కూడా తన మనస్సు విజ్ఞానం కోసం ఇంద్రియాల మీద ఆధారపడినంత వరకూ సమగ్ర విజ్ఞానాన్ని సాధించలేక పోతున్నాడు. ఎందుచేతనంటే ఇంద్రియాలు అసమర్థత వాటి ద్వారా పొందిన విజ్ఞానానికి అసమగ్రతను ఆపాదిస్తూ ఉంది. మానవుడు ఇంద్రియాలను నిర్జించి మానసిక జీవి అయినప్పుడు మానవ విజ్ఞానం సమగ్ర స్థాయినందుకుంటుంది. అంతవరకూ దోష భూయిష్టంగా ఉంటుంది. కానీ సృష్టి పరిణామ ధోరణి ఎలా ఉందంటే క్రమంగా మనస్సు మీద ఆధార పడడం అధికమవుతూ ఉంది. ఇంద్రియాలన్నీ కూడా తెలుసుకోడానికే వివిధ సాధనాలుగా ఉన్నాయి. తెలుసుకోవడం అనేది వాటి సహాయం లేకుండానే సాధ్యమయినప్పుడు అవి అనవసరం. క్రమంగా మనస్సు వాటి స్థానాన్నే ఆక్రమించి వాటి పనులను ఇంకా చక్కగా నిర్వహిస్తూ ఉంది. మహామేధావి అయిన ఐన్‌స్టీన్‌ పండితుడు తన సుప్రసిద్ధ సిద్ధాంతాలనన్నింటినీ కాగితం సహాయంతోనే సాధించాడు. పెద్ద పరిశోధనాలయాలు గానీ విస్తార పరికర సామాగ్రి కానీ ఏవీ లేవు. శక్తి, పదార్థము రెండూ ఒకటే అనీ అందుచేత కాంతి కూడా అయస్కాంత సీమలో పదార్థంలాగే ప్రవర్తిస్తుందని ఐన్‌స్టీన్‌ చెప్పినప్పుడు ఆయనకున్న పరికరాలన్నీ కలమూ, కాగితాలూ మాత్రమే. ఆ సిద్ధాంతాన్ని పరీక్షించ డానికి శాస్త్రజ్ఞులు అనేక పరికరాలతో భూగోళ మంతటా చేరి మే 29, 1919 రోజున సూర్య గ్రహణ కాలంలో నక్షత్రకాంతి సూర్యుడి ఆయస్కాంతసీమలో 1.64 సెకన్లు వంగినట్లుగా కనుగొన్నారు. ఐన్‌స్టీన్‌ ఆ వంపు 1.75 సెకన్లు అన్నాడు. ఎంతో తేడా లేదుగదా; ఐన్‌స్టీన్‌ బుద్ధిబలంతో చెప్పినమాటకు శాస్త్రజ్ఞలోకమంతా భౌతిక పరికరాలతో ఇంద్రియాలతో సాధించి అర్థం చేసుకున్నారు. అంత ఉత్కృష్టమైన బుద్ధిబలమే దివ్యదృష్టి లేక జ్ఞానదృష్టి. ఈ సందర్భంలోనే మరొక ప్రధానమైన విషయాన్ని చర్చించాలి. మన విజ్ఞానులందరూ కొన్ని సందర్భాల్లో తమ విజ్ఞానాన్ని తామే శంకించారు. ఈ విజ్ఞానమంతా నిర్దుష్టమేనా, సత్యస్వరూపమేనా అని ప్రశ్నవస్తూంది. ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం చాలా కష్టము.

ఇంద్రియాలు చాలా అసమర్థమయినవనీ వాటిమీద ఆధారపడి సాధించి విజ్ఞానంలో చాలా మటుకు సందేహాస్పదమనీ ముందే మనవి చేశాను. నిజంగా సామాన్య, మానవుడు ఇంద్రియబద్ధుడు. పంజరంలో చిలుకలా ఉన్నాడు. పాశ్చాత్య దేశాల్లోగానీ మన దేశాల్లోగానీ తత్త్వవేత్తలందరూ ఇంద్రియబద్ధుడైన మానవుడికి గోచరించే విశ్వం సత్యమా లేక భ్రమా అని ప్రశ్నించారు.

ఎందుచేతనంటే-మన కళ్ళతో చూచి చెట్లు పచ్చగా ఉన్నాయంటున్నాము. మన నాలుకతో రుచిచూచి పంచదార తీపిగా ఉందటున్నాము. ఈ విధంగానే విశ్వాన్నంతా మన ఇంద్రియాల ద్వారా అర్థం చేసుకుంటున్నాము. అంటే మన విజ్ఞాన సౌధమంతా ఇంద్రియాల మీద ఆధారపడి ఉందన్నమాట. ఇంద్రియాలు మోసం చేశాయని తెలిస్తే మన విజ్ఞానసౌధం అంతా అమాంతం కూలిపోతుంది. మనం విశ్వాన్ని గురించి నిర్మించిన సిద్ధాంతాలన్నీ కలలైపోతాయి.

అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే మన కళ్ళకు పచ్చగా కనుపించే చెట్లు, గేదెలు కుక్కలు మొదలైన జంతువులకు కూడా పచ్చగా కనుపిస్తాయా? అసలు చెట్ల్లకే చెట్లు పచ్చగా కనిపిస్తాయో లేదో, చెట్లకు నయనేంద్రియం ఉందోలేదో: తర్వాత మన నాలుకకు చేదుగా ఉన్న వేపాకు ఇతర ప్రాణులకు కూడా చేదుగానే ఉంటుందా? గొర్రెలు మేకలు వేపాకు భుజిస్తున్నాయంటే వాటి నాలుకకు వేపాకు మరొక రుచినిస్తూ ఉందేమో! మనకంటికి రంగుతో మరొక కంటికి మరొక రంగుతో మన నాల్కకు చేదుగా మరొక నాల్కకు మరొక రుచిగా ఒకే వస్తువు ఎలా భాసిస్తుంది? ఒకే వస్తువు రెండు విధాలుగా ఉండగలదా? వాస్తకవిత అనేది ఒకటే గదా? ఒక వస్తువు బహువిధాలుగా ఉంటే అది వాస్తవికత ఎట్లా అవుతుంది? అంటే ఆ వస్తువులను గురించి మనకు కలిగిన అనుభవం వాస్తవికత కాదనీ అది పొరపాటనీ అనుకోవాలి గదా? ఇతర ప్రాణులకే కాదు. మనకు కూడా ఒక్కోసారి చెట్లు పచ్చగాను పంచదార తీపుగాను తోచక పోవచ్చును, మన శరీర స్థితిని బట్టి. అందుచేత మన ఇంద్రియాలు వస్తువుల యొక్క వాస్తవికతను మనకు తెలియజేయడం లేదు అని తెలుసుకోవాలి. కనక మన ఇంద్రియజ్ఞానం భ్రాంతి కావచ్చును గదా!

మరో విశేషం-మనం పగలు కాంతిని సంపూర్ణంగా చూడటం లేదు. సూర్య కాంతి తెల్లగా ఉందనుకుంటాము. మనకు కనిపించే ఆ తెల్లటి కాంతిలో ఏడురంగుల కిరణాలు కలిసి ఉన్నాయి. ఒక సూర్యకిరణం ప్రిజం అనే గాజుముక్కలో నించి ప్రసారం అయి అవతల ఒక

తెల్లటి తెర మీద పడితే ప్రిజంలో ప్రవేశించక పూర్వం ఉన్న తెల్లకాంతి ప్రిజంలో ప్రవేశించిన తర్వాత విభిన్నమయి ఇంద్రధనుర్వర్ణ కాంతులుగా గోచరిస్తుంది. ఈ కిరణాల్లో మొదటిది ఊదారంగు కిరణము, చివరది ఎర్రకిరణము. ఈ ఏడు కిరణాలే

మనకు కనిపించేవి. అంటే ఈ ఏడు కిరణాలను గ్రహించే శక్తిమాత్రమే మనకళ్లకున్నది. కానీ సూర్యకాంతిలో ఈ ఏడువర్ణముల కిరణాలు బహుస్వల్ప భాగము. ఇంద్రధనుర్వర్ణకిరణ సమూహానికి ఇటు 7 కిరణాలు (అల్ట్రావైలెట్‌ మొదలు కాస్మిక్‌ కిరణాల వరకూ) అటు 8 కిరణాలు (ఇన్‌ఫ్రారెడ్‌ కిరణాల మొదలు దీర్ఘ రేడియో తరంగాల వరకూ) ఉన్నాయి. అయితే ఆ పదిహేను కిరణాలూ మనకు కనిపించవు. కాంతి కిరణాలు తరంగాలుగా ప్రవర్తిస్తాయని శాస్త్రము. ఒక్కొక్కరంగు కిరణానికి తరంగపు పొడవు ఒక్కొక్క విధంగా ఉంటుంది. తరంగపు పొడవును బట్టి వాటి రంగు నిర్ణయం అవుతుంది. రంగు నిజంగా వాటికిలేదు. శక్తికి రంగేమిటి? ఆ కాంతి కిరణాలు మన నయ నేంద్రియం మీద పడినప్పుడు వాటివాటి తరంగపు పొడవును బట్టి కంటి రెటీనా మీద కలిగే పరిస్పందన వికారమే రంగు అని మనం భావిస్తూంటాము. కంటి పరిస్పందన కిరణ తరంగపు పొడవును బట్టి ఉంటుంది. ఉదా|| ఎర్రకాంతి కిరణపు తరంగ పొడవు 0.00007 సెంటీ మీటర్లు; ఊదా కాంతికిరణపు తరంగపొడవు 0.00004 సెంటిమీటర్లు. ఈ రెంటికి అవతల ఉన్న కిరణాలు మనకు కనిపించవు. అంటే 0.00003 సెంటీమీటర్ల భేదంలో ఉందన్నమాట. కనిపించడం కనిపించక పోవడం నయనేంద్రియ శక్తి అంతస్వల్పం అన్నమాట. మనకంటికి ఇతర కిరణాలనుకూడా చూచే శక్తి ఉండి ఉన్నట్లయితే మనకు విశ్వచిత్రం ఏ విధంగా గోచరించేదో? ఉదా|| ఎక్స్‌రే కిరణాలు కనిపించేట్లయితే గోడ అవతల ఉన్న వస్తువులు కూడా కనపడేవి. అలాగే తలలో మెదడు దాని కార్యక్రమం కూడా మనకు కనపడుతూ ఉండి ఉంటే మన జ్ఞానమూ మన నిత్యజీవితమూ ఏవిధంగా ఉండేవో? విశ్వంలో పరిమాణాలూ, రంగులూ, రూపాలూ అన్నీ తారుమారయ్యేవి. అలాగే మన నీతులు, మన సౌందర్యానుభూతులూ, మన కవిత్వాలు మొదలైనవి కూడా మారేవి.

ఆల్బర్టు ఐన్‌స్టీన్‌ ఈ విషయాన్నే పరిశోధించి సాపేక్షక సిద్ధాంతాన్ని (Theory of relativity) ప్రతిపాదించాడు. బర్కెలే మొదలైన పాశ్చాత్య పండితులు ”విశ్వంలేదు. కేవలం అది భ్రాంతి మాత్రమే” అన్నప్పటికీ వారి కారణాలు వేరు, ఆధునిక శాస్త్రసిద్ధాంతానికి కారణాలు వేరు. మనకు కనిపించేదేదీ సత్యంకాదనీ, అసలు వస్తువు ఏదో అది మన ఇంద్రియాలకు అగోచరమని కాంటు కూడా తన ”Critique of the pure Reason” గ్రంథంలో చర్చించాడు.

ఇంద్రియాతీతమైన సత్యరూపమేది అనే పరమార్థ విచారం మన దేశంలో అతి ప్రాచీన కాలాన కొనసాగింది. ”గుణా గుణేషు జాయంతే తత్రెవ నివిశంతిచ” అని భారతం (శాంతి 305-23) గుణములందే గుణములు పుడుతున్నాయి, అందులో అవి లయిస్తున్నాయి అనటంలో సృష్టియొక్క మిథ్యాత్వ వివేచన కనిపిస్తుంది. అవ్యక్తమైన ఒక మూల ద్రవ్యం నుంచి ఈ వ్యక్తమయిన సృష్టి వివిధ రూపాలతో ఆవిర్భవించింది. నామ రూపాత్మకమైన ఈ సృష్టి వివిధ రూపాలతో ఆవిర్భవించింది. నామ రూపాత్మకమైన ఈ సృష్టి సాపేక్షకము, అందుచేత ఇది అసత్యము అని భారతీయ తత్త్వశాస్త్ర సారాం శము. ”మాయాహ్యేషా మయాసృష్ట్యా యన్మాం పశ్యసి నారద! సర్వ భూత గుణెర్యుక్తం నైవత్వం జ్ఞాతు మర్హషి,” (భారతం శాంతి 339-44) నీవు చూచుచున్న నా రూపమంతయు నాచే నిర్మితమైన మాయ. ”యస్ససర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి” సర్వపదార్థములు నాశనమొందినను ఏ పదార్థము లేకపోవునదికాదో అది అక్షరబ్రహ్మము (గీత-8-20) ఇట్లాంటి సూక్తుల్లో నామరూపాత్మక మయిన ఈ జగత్తు మిథ్య అని వివక్షతమయింది. ఇంకా ఈ క్రిందివి చూడచ్చును:

విశ్వసృష్టికి పూర్వమున్న కేవలద్రవ్యమున్నూ (తత్‌) నీవున్నూ (త్వమ్‌) అనగా నీ ఆత్మయున్నూ ఒకటే అని తత్త్వమసి అనే వేదాంత వాక్యం చెబుతుంది.

నీవు నీ ఆత్మ నెరిగితివేని నీకు సర్వజగత్తునకు మూలకారణము బోధపడును, అనే అర్థము బ్రహ్మసూత్రాల్లోనూ ఛాందోగ్యాది ఉపనిషత్తుల్లోనూ (6,8,16) ఉద్ఘోషింపబడింది. మరొకటి ”యత్రహిద్వైత మివ భవతి తదితర ఇతరం పశ్యతి… జిఘతి… శ్రుణోతి… విజానాతి… యవ్రత్య స్యసర్వ మాత్మైవాభూత్‌ ఏతా వదరే: ఖల్వమతత్వమితి” చూచువాడును, చూడబడు పదార్థము అనే ద్వైత మెంతవరకు ఉండునో, అంతవరకు ఒకడితరుని చూచుచున్నాడు, వాసన చూచుచున్నాడు. వినుచు న్నాడు, తెలుసుకొనుచున్నాడు. కానీ ఇవి అన్నియు ఆత్మమయమైనప్పుడు ఎవరు ఎవరిని చూచును, దేనిని వాసన చూచును, దేనిని వినును, దేనిని తెలుసుకొనును; ఓరీ: ఏది తానే జ్ఞాతయో దానిని తెలసుకొను మరియొక పదార్థము నెచ్చటి నుండి తీసికొని రాగలవు. అని బృహదారణ్యకంలో యాజ్ఞ వల్క్యుడు ప్రశ్నించుచున్నాడు. (బ్బ.4,5,15,27).

మిథ్య అయిన సృష్టిలో ఉత్పన్నమయిన మానవుడు సృష్టియొక్క సదసద్వివేచన చేయడం అద్భుతమేగదా: తనలోని ఆత్మ ఎట్లా సృష్టి పరిణామంలో రూపొందిందో ఆత్మ సృష్టికి ఎట్లా మూలద్రవ్యమో, విశ్వసృష్టి కీలకం తనలో ఎట్లా గర్ఛితమై ఉందో అది గుర్తించే పరమార్థస్థితికి చేరడమే జ్ఞానము. ”బ్రహ్మా భవతి య ఏవంవేద” ఎవడు బ్రహ్మమును తెలుసుకొనునో వాడు బ్రహ్మమే అగుచున్నాడు, అని ముండకోపనిషత్తు.

సృష్ట్యాదిలోఉన్న ద్రవ్యమూ, మానవుడి ఆత్మ, ఒకే గుణము కలిగి, జ్ఞాన సంపన్నమయిన ఆత్మ, సృష్టిలో మహోత్కృష్టమైనది. ‘బ్రహ్మసత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవనాపరః,’ బ్రహ్మసత్యము జగత్తు మిథ్య, ఆత్మమూ బ్రహ్మమూ మూలమును ఒకటిగానే ఉన్నవి.

ఈ రీతిగా మన ప్రాచీనులచేతా నేటి పాశ్చాత్యుల చేతా మిథ్యగా సిద్ధాంతీకరింపబడిన ఈ దృశ్య మానమగు విశ్వము మిథ్యయే అని ఆధునిక శాస్త్రజ్ఞానము ఈనాడు పునరుద్ఘాటన చేస్తోంది. ఐన్‌స్టీన్‌ సాపేక్షక సిద్దాంతము, కాలము, దూరమూ, అనంతము, పదార్థము, కాంతి, మొదలైనవి కూడా మిథ్యయే అనీ, అవి సాపేక్షకము అనీ, ఋజువు చేసింది. ఈ సిద్ధాంతమే ఈ నాటి శాస్త్రజ్ఞాన సర్వస్వానికి పరాకాష్ఠ.

ఇట్లా భ్రాంతులని ప్రతిపాదించబడిన ఈ నక్షత్రాలేమిటి? ఈ విశ్వమేమిటి? మానవుడేమిటి? మానవుడిలో చైతన్యరూపంగా ఉన్న ‘నేను’ ఏమిటి? ఈ ‘నేను’ మానవ పూర్వం సృష్టిలో ఉందా? అనే ప్రశ్నలు క్రమంగా విచారిస్తాను.

seshendra Pustakalu itara vivaralaku : Saatyaki S/o Seshendra Sharma , saatyaki@gmail.com, 9441070985, 7702964402

– గుంటూరు శేషేంద్రశర్మ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *