సమాచారం – ప్రసారం

సమాచారం – ప్రసారం

పూర్వం కాశీయాత్రకు వెళ్లినవాడు కాటికి వెళ్లినవాడితో సమానం అనేవారు. అలాగే మక్కా యాత్రకు వెళ్లినవాడు తిరిగి వచ్చిన దాఖలాల్లేనట్లే చెప్పుకుంటారు. మనిషి తన తెలివితేటల ద్వారా నేటి సమాచార సాధనాలను సృష్టించాడు. మరి ప్రకృతిలో ఈ సమాచార ప్రసారం ఎలా జరుగుతుంది? కొంచెం ఉత్సాహాన్ని కలుగజేసే ప్రశ్న ఇది. మీరు చిన్నప్పుడు పంచతంత్ర కథలను వినే ఉంటారు. వినే ఉంటారు అని ఎందుకంటున్నానంటే కథలు వినటానికి బాగుంటాయి చదవటం కన్నా. వాటిలో ఒకటి చీమ, పావురం, వేటగాళ్ల కథ.

నీళ్లలో మునిగిపోతున్న చీమను పావురం కాపాడుతుంది. కృతజ్ఞతగా పావురాన్ని చంపబోతున్న వేటగాణ్ణి కుట్టి, చీమ పావురాన్ని కాపాడుతుంది. ఈ కథ ఆధారంగా సమాచార ప్రసారం ఎలా జరుగుతుందో పరిశీలిద్దాం.

సమాచార ప్రసారాన్ని జంతువులకు సంబంధించి రెండు భాగాలుగా అధ్యయనం చేయవచ్చు. 1. శరీర అంతర్గత సమాచార ప్రసారం అంటే శరీరంలోపల జరిగే విషయాల ప్రసారం. 2. బాహ్య విషయాల సమాచార ప్రసారం. సమాచారం ఒక స్థలం నుండి మరొక స్థలానికి ప్రయాణించటానికి వ్యవస్థ కావాలి. ఈ విషయాన్ని కథ ఆధారంగా విపులంగా పరిశీలిద్దాం.

చీమ మునిగి పోవటం పావురం చూసింది. అంటే దృశ్యరూప సమాచారం పావురం మెదడుకు చేరింది. మెదడు ప్రేరేపించడం వలన ముక్కుతో ఆకును తుంచి చీమ సమీపానికి వదిలింది. ఇక్కడ మెదడు నుండి ఆజ్ఞ కళ్లకూ కండరాలకు వెళ్లింది. అలాగే చీమ వేటగాడిని చూడటం, కుట్టడం, బాధకు బాణం గురి తప్పడం. ఈ మొత్తం ప్రక్రియ బాహ్య, అంతర్గత సమాచార వ్యవస్థలు సమన్వయంతో పనిచేయటం వలన సాధ్యమౌతుంది.

ముందుగా అంతర్గత వ్యవస్థను గూర్చి స్థూలంగా పరిశీలిద్దాం. ఒకే కణం ఉండే అమీబా వంటి జీవులలో జీవపదార్థం ద్వారా సమాచార ప్రసారం జరుగుతుంది. బహుకణజీవులలో ప్రత్యేకంగా నాడీ వ్యవస్థ ఏర్పడింది. మొదట్లో ఈ నాడీ వ్యవస్థ అత్యంత సరళంగా ఉన్నప్పటికీ, తర్వాత మెదడు ఏర్పడింది. కాంతి, స్పర్శ, రుచి మొదలైన గ్రాహకాలు సమాచారాన్ని సేకరించి నాడుల ద్వారా మెదడుకు అందిస్తాయి. మెదడు ఈ సమాచారాన్ని విశ్లేషించి అవయవాలకు తగు ఆదేశాలను ఇస్తుంది. అంటే అంతర్గత సమాచార వ్యవస్థకు మూలం నాడులు, మెదడు. ఈ అంతర్గత సమాచార వ్యవస్థ లేకపోతే ఏమౌతుంది? మనం ఎక్కువ సేపు కదలకుండా కూర్చుంటే కాళ్లు తిమ్మిరెక్కుతాయి. లేచి నిలబడలేం, నడుస్తున్నా అడుగు ఎక్కడ పడుతుందో తెలియదు. అసలు కాలు ఉందో లేదో కూడా తెలీదు. వాస్తవానికి ఇక్కడ ఏం జరిగింది కాలు నుండి సమాచారం ప్రధాన నాడీ వ్యవస్థకు చేరలేదన్నమాట. అయితే ఈ తిమ్మిరెక్కటం తాత్కాలికమైంది. సమాచార ప్రసారలోపం వలన ఆ అవయవం పనిచేయకుండా పోతుంది. నాడీ వ్యవస్థ లేని సృంజికల వంటి జీవులలో సమాచారం ప్రసారం జరగదు. అందుచేత వాటిని కత్తిరించినా బాధను ప్రదర్శించవు.

మన శరీరంలోని కణాలు ఒక దానితో ఒకటి సంభాషించుకుంటాయని శాస్త్రజ్ఞులు విశ్వసిస్తున్నారు. అయితే అది రసాయన భాష. దాన్ని అర్థం చేసుకో గలిగితే వ్యాధులను తేలిగ్గా నయం చేయవచ్చని శాస్త్రజ్ఞుల భావన. ఇప్పుడు బాహ్య విషయాల సమాచారం గురించి పరిశీలిద్దాం. బాహ్య విషయాల సమాచారం రెండు రకాలు. ఒకటి జాత్యంతర సమాచారం. అంటే ఒకే జాతి జంతువుల మధ్య ఇచ్చిపుచ్చుకొనే సమాచారం. రెండు విజాతి సమాచారం. అంటే రెండు వేర్వేరు జాతులకు చెందిన జీవుల మధ్య సమాచార ప్రసారం. ముందుగా ఒకే జాతి జీవుల మధ్య సమాచార ప్రసారం ఎలా ఉంటుందో పరిశీలిద్దాం. ఒకే జాతికి చెందిన జీవుల మధ్య వాసన ద్వారా, ధ్వని ద్వారా, కదలికల ద్వారా, అనువంశిక లక్షణాల ద్వారా సమాచార ప్రసారం జరుగుతుంది.

ఏమిటి సంగతి? పాప ఏడ్చింది. ఎందుకేడ్చింది? ఏడుపు ద్వారా పిల్లలకు పెద్దలకు సమాచారం తెలుపుతున్నారు. పిల్లల అన్నిరకాల ఏడుపులూ ఒకేవిధంగా ఉండవు. ఆకలి వేసినప్పుడు ఏడుపు ఒకరకమైతే, పక్క తడుపుకొని ఏడ్వటం మరోరకం గానూ, భయపడ్డపుడు ఇంకోరకంగానూ, మారాం చేసే ఏడుపు మరో రకంగానూ ఉంటుంది. ఇన్ని ఏడుపుల మధ్య తేడాను తల్లి గుర్తించగలదు. సరిగ్గా ఇలాగే ఇతర జంతువులు కూడా తమ పిల్లల నుండి సమాచారాన్ని గ్రహిస్తాయి. అలాగే పిల్లలూనూ.

పిల్లల కోడిని గమనించారా? ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు తల్లి కోడి ప్రత్యేకమైన శబ్దం చేస్తుంది. అంతే పిల్లలన్నీ క్షణంలో తల్లి రెక్కల కింద చేరిపోతాయి. ప్రతి తల్లి పక్షి ప్రత్యేకమైన శబ్దాన్ని చేస్తుంది. ఆ శబ్దానికి మాత్రమే పిల్లలు ప్రతిచర్య చూపుతాయి. ఇంకెవరూ ఆ శబ్దాన్ని అనుకరించలేరు. కుక్కలు మొదలైన జంతువులలో ధ్వని, వాసనలే కాక ప్రవర్తన కూడా ముఖ్యమైన సమాచార ప్రసార సాధనం. నాలుగైదు వారాల వయసున్న కుక్క పిల్లలు, తల్లినోటి వద్ద ఎగురుతూ మారాం చేస్తుంటాయి. ఈ ప్రవర్తనను విశ్లేషిద్దాం. సాధారణంగా కుక్క జాతి జీవులు ఆహారం ఎక్కువగా దొరికినప్పుడు వీలయినంత ఎక్కువగా తింటాయి. పిల్లల వద్దకు వచ్చి ఆ ఆహారాన్ని కక్కుతాయి. పిల్లలు ఆ ఆహారాన్ని తింటాయి. ఆహారం ఇంకో జీవికి అందకుండా పిల్లలకు తేవటానికి వాటికి ఉన్న వెసులుబాటు ఇదొక్కటే. అందుకే కుక్క పిల్లలు తల్లి దగ్గర చేరి ఆహారాన్ని వాంతి చేయమని మారాం చేస్తాయి. దీనితో ఎంత వరకు సంబంధం ఉందో తెలీదుకాని, ‘క్కిన కూటికి ఆశపడే వాడు’ అంటూ వ్యక్తుల మనస్తత్వాన్ని విశ్లేషిస్తుంటారు.

కుక్కలలో తోక, చెవులు ప్రధానమైన సమాచార ప్రసార సాధనాలు, కుక్క చెవులు వెనక్కి వంచి తోకాడిస్తుంటే మనతో లేదా మరో కుక్కతో స్నేహ పూర్వకంగా ఉండాలనుకుంటుందన్న మాట. తోక నిటారుగా ఉంటే తన స్థానం గురించి నిర్భయంగా ఉన్నదని, నేలకు సమాంతరంగా ఉంటే తన స్థానంపై సందేహం ఉన్నదని, తోక కాళ్ల మధ్యకు ముడిస్తే తన స్థానాన్ని వదులుకొన్నట్లు అని జంతు ప్రవర్తనా విశ్లేషకులు భావిస్తారు. తోక ముడిచిన కుక్కపై ఇతర కుక్కలు దాడి చేయవు మనుష్యులు తప్ప. ఇలాగే పెంపుడు జంతువులు ఒక్కొక్కటి ఒక్కోరకంగా సమాచారాన్ని నిరంతరం మనకు అందిస్తూనే ఉంటాయి. ఆ సమాచారాన్ని మనం అందుకోలేక మనం, పాముబారి నుండి పిల్లవాణ్ణి కాపాడిన ముంగిసను చంపిన ఇల్లాలిలాగా – పెంపుడు జంతువులను బాధిస్తూనే ఉంటాం.

ఒంటరి జీవితం గడిపే జీవులు రుతుసమయంలో తప్ప మిగిలిన సమయంలో స్వజాతి జీవులతో సంబంధాలు పెట్టుకోవు. అదే సాంఘిక జీవనం గడిపే జీవులలో జాత్యంతర సమాచారం ప్రసారం నిరంతరం సాగుతుంటుంది. అందుకే ఈ జీవుల నిత్యవ్యవహారానికి భాష అవసరం. మన దృష్టిలో అది సరళమైన సంకేత భాషే కావచ్చు. వాటి అవసరాలకు అది సరిపోతుంది. ఆదిమానవుడు సంకేత భాష వాడే వాడు. మనం కూడా ఈనాటికీ సంకేతాలు లేకుండా వాక్యాన్ని అర్థవంతంగా పూర్తి చేయలేం.

సంఘ జీవులలో చీమలు మొదలైనవి స్పర్శ ద్వారా, వాసన ద్వారా సమాచారాన్ని తెలుపు కుంటాయి. తేనెటీగలు వీనితోపాటుగా ప్రత్యేకమైన నృత్యం ద్వారా సమాచారాన్ని ఒకదానికొకటి అందించుకుంటాయి. తేనెపట్టుకు దగ్గరలో పూలతోట ఉన్నట్లయితే, ఆ విషయాన్ని కనుగొన్న తేనెటీగ తేనెపట్టు వద్ద వృత్తాకారపు వలయాలలో తిరుగుతుంది. దీన్ని (Round Dance) అంటారు. అదే ఆహారం దూరంగా ఉన్నట్లయితే తేనె టీగ ఎనిమిది ఆకారంలో తిరుగుతుంది. దీన్ని వాగల్‌ డాన్స్‌ అంటారు. మిగిలిన తేనెటీగలు, నృత్యం చేసే తేనె టీగ శరీరం నుండి వచ్చే వాసనను బట్టి ఆహారం ఎక్కడ ఉందో వెతకటానికి వెళతాయి. ఈ వ్యవహారాన్నంతా కార్ల్‌వాన్‌ఫ్రిచ్‌ అనే జర్మనీ దేశపు జంతు ప్రవర్తన శాస్త్రవేత్త కనుగొన్నాడు.

పక్షులు జతకట్టే సమయంలో మగపక్షి, ఆడపక్షిని ఆకర్షించడానికి రకరకాల విన్యాసాలు చేస్తుంది. అలాంటిదే మయూర నృత్యం. నెమలి నాట్యం అంటూ స్త్రీలు నాట్యం చేస్తారు. వాస్తవానికి నృత్యం చేసేది మగనెమలి మాత్రమే. అలాగే కోయిలలు కమ్మటి గొంతుతో గానం చేస్తాయి. ఈ కోయిల కూత కూడా స్త్రీ జీవిని ఆకిర్షచండానికే. అవి జతకట్టే సమయం వసంత కాలం కాబట్టి మావిచిగురూ, కొయిల పాటా వగైరాలు కవుల కవిత్వానికి సామాగ్రి అయ్యాయి. ఇలాంటిదే వర్షాకాలంలో కప్పల బెకబెక ధ్వనులూ, చిమ్మెటలు, కీచురాళ్లు చేసే ధ్వనులూ. మనకు వినిపించే ధ్వనులన్నీ శ్రావ్యంగా లేకపోయినా, ఆ ధ్వని సమాచార ప్రసారంలో ఎవరో ఒకరికి తోడ్పడుతుందని గ్రహించాలి.

మరి శబ్దం చేయలేని, వాయుగత శబ్దాలను గ్రహించలేని జీవులేం చేస్తాయి? కీటకాలల్లో స్త్రీ జీవులు మనం పసికట్ట లేని వాసనను వెలువరిస్తాయి. వీటిని ఫెరమాన్లు అంటారు. ఒక కిలోమీటరు దూరం వరకూ ఈ వాసన వ్యాపించి, మగ కీటకాలను ఆకర్షిస్తుంది. ఈ విషయాన్ని పరిశోధించిన శాస్త్రవేత్తలు పంటలకు హాని కలిగించే కీటకాల ఫెరమాన్లు కృత్రి మంగా తయారు చేశారు. వీటిని (ఇకసెక్టట్రాప్‌)లలో ఉంచడం వలన మగ జీవులను పట్టి చంపేస్తారు. ఫలితంగా గ్రుడ్లు ఫలదీకరణం ఆగిపోయి పంటలు రక్షింప బడతాయి. వాయుగత శబ్దాలను గ్రహించలేని పాముల వంటి జీవులు కూడా స్త్రీ జీవి శరీరం నుండి వెలువడే వాసనను గ్రహించి దగ్గరకు వస్తాయి.

కుటుంబ జీవితం, సంఘ జీవితం గడిపే జీవులలో చాలా వరకు విషయాలు తల్లిదండ్రుల నుండి పిల్లలకు తెలుస్తాయి. వేటాడటం, శత్రువుల బారి నుండి తప్పించుకోవటం, ఇతర సహచరులతో కలిసి తిరగటం మొదలైనవన్నీ సాంఘిక జీవితంలోనే జీవులు నేర్చుకుంటాయి. కుక్క పిల్లలు ఒక దానిని ఒకటి వెంటబడి తరమటం, కొరుక్కోవటం, ఆట మాత్రమే కాదు అవసరమైన సమాచారాన్ని పోగుచేసుకోవడం. సంఘజీవితం సాగించటానికి దూరమైన జీవులు ఎలా ప్రవర్తిస్తాయి? ఆ మధ్య బీజింగ్‌ జూలో మూడు ఆడ చింపాంజీలు పిల్లలను కన్నాయి. కాని అవి పిల్లలను దగ్గరకు తీసుకోవటం కాని, పాలివ్వటం కాని చేయలేదు. దీనిపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు, సహజ పరిసరాలలో చింపాంజీలు ఎలా ప్రవర్తిస్తాయో తెలిపే వీడియో సినిమాలను వాటికి చూపించారట. తర్వాతనే అవి తమ పిల్లలను ముద్దు చేయనారంభించాయట.

పుట్టగానే ప్రతి జీవిలోనూ కొంత సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. ఇది క్రోమోజోములలో ఉండే డి.ఎన్‌.ఎ.లో ఉండి, ఒక తరాన్నుండి మరొక తరానికి అందించబడుతుంది. అప్పుడు గ్రుడ్డు నుండి వెలువడిన పిల్ల వెంటనే ఆహారం కోసం వెతుకు తుంది. శత్రువుల బారి నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. దీనికి కారణం సహజ సిద్ధంగా దానిలో ఉండే సమాచారమే. దీన్నే మనం ‘ఇన్‌స్టింక్ట్‌’ అంటాం. మనం ఎన్ని విషయాలు నేర్చుకున్నా, ఈ సహజ స్వభావం మనలను వదలదు. అందుకే ‘స్వభావోదురతి క్రమః’ అన్నారు. ఈ సహజ స్వభావాన్ని గుర్తించటానికి ఓ ప్రయోగం చేశారు.

బాతులను కొన్ని తరాల పాటు నీరు తెలియ కుండా కోళ్లతో పాటుగా పెంచారు. ఒకసారి కోళ్లనూ బాతులనూ నీటి మడుగు వద్దకు తీసికెళితే బాతులు నీటిలోకి దిగి ఈదుతూ వెళ్లిపోతాయి. కోళ్లు నీటి ఒడ్డున ఆగిపోయాయి. ఈదటం అన్న సహజ గుణం బాతుల జన్యువుల్లో ఉండి అవకాశం వచ్చినప్పుడు బయటకు వచ్చింది తన శక్తి తనకు తెలియని ఆంజనేయుడి లాగా. అలాగే పదహారు, పదిహేడు రోజుల వయస్సున్న కోడిగ్రుడ్ల వద్ద, తల్లికోడి చేసే హెచ్చరిక ధ్వని వినిపించారు. వెంటనే గ్రుడ్డులోని పిల్లలు కదలటం గమనించారు. అంటే తరతరాలుగా దేనికి ఏ జాగ్రత్త తీసుకోవాలి అన్న సమాచారం జన్యువుల్లో నిక్షిప్తమౌతుందన్నమాట. ఇది వింటుంటే తల్లి గర్భంలో నుండి అభిమన్యుడు యుద్ధవ్యూహాలు నేర్చుకోవటం కథ గుర్తొస్తుంది కదూ! శాస్త్రవేత్తలు ఈ విషయం ప్రయోగాత్మకంగా నిరూపించారు. మనం తల్లి గర్భంలో ఉండగానే వివిధ రకాల శబ్దాలను, తండ్రి, ఇతర కుటుంబ సభ్యుల గొంతు గుర్తించగలమట. అంటే సమాచార ప్రసారం ఒక తరం నుండి మరొక తరానికి అవిచ్ఛిన్నంగా అందుతుందన్నమాట.

రోడ్ల మీద ఆవులూ, మేకలూ విశ్రాంతిగా నెమరు వేయటం చూస్తూనే ఉంటాం. ఈ సారి జాగ్రత్తగా వాటిని గమనించండి. రెండు జంతు వులు ఉంటే ఒక దాని వీపు మరొక దానికి ఆనించి పడుకుంటాయి నాలుగు ఉంటే నాలుగు దిక్కులకూ తలలు వంచి పడుకుంటాయి. అరణ్యాలలో ప్రమాదం ఎటునుంచి వస్తుందో తెలియదు అందుచేత ఆ విధంగా పడుకుంటాయి. ఇది సహజ సిద్ధంగా వచ్చే లక్షణం. పట్టణంలో ప్రమాదాలేవీ లేకపోయినా సహజ ప్రవర్తనను అవి కోల్పోవు.

శత్రువులను బెదిరించటానికి జంతువులు తమ ఆయుధాలను ప్రదర్శిస్తాయి. ఆవులు మేకల వంటి జీవులు కొమ్మలు ప్రదర్శిస్తే, కుక్కలు, కోతులు వంటివి కోరలను ప్రదర్శిస్తాయి. అంతేకాక తమ శరీరం ఉన్న దానికన్నా పెద్దదిగా చూపే ప్రయత్నం చేస్తాయి. ఇవేవీ ఫలించకపోతే పారిపోతాయి. ఇదంతా నా దగ్గరకు వస్తే ప్రమాదం జాగ్రత్త అన్న సమాచారం శత్రువుకు అందించేయత్నమే. జాగ్రత్తగా పరిశీలిస్తే – ప్రకృతిలో ప్రతి శబ్దానికీ ఓ అర్థం ఉంది. ప్రతి వాసనకూ ఓ వ్యాఖ్యానం ఉంది. ప్రతి స్పర్శలోనూ వినబడని వాక్యం ఉంది. కొంచెం ఓపిక చేసుకుంటే అన్ని జంతువుల భాషలనూ మనం మాట్లాడవచ్చు మంత్రతంత్రాల సహాయం లేకుండానే.

– వింజనంపాటి రాఘవరావు

(మూడోకన్ను పుస్తకం నుండి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *