భేదం దృష్టిలోనే… సృష్టిలో కాదు

భేదం దృష్టిలోనే… సృష్టిలో కాదు

మన దృష్టిని బట్టి తేడాలు కనిపిస్తాయి. అంతేతప్ప సృష్టిలో ఎటువంటి భేదాలు లేవు అని చెపుతూ దానికి సహదేవుడు వివిధమైన వాళ్లకి వివిధ రకాలుగా కనబడిన రీతి, ఆ రీతిని చెప్పటానికి తిక్కన అనుసరించిన పద్య శైలి ఈ వ్యాసంలో కనబడుతుంది. అంతేగాక ఒక వ్యక్తి పెద్దల వద్ద, ఇతర సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలనేదీ తెలుస్తుంది.

క్రీ.శ.11వ శతాబ్దంలో ప్రారంభమైన ఆంధ్ర మహాభారత రచన ఆ తరువాత రెండు వందల ఏండ్లు ఆగిపోవడం ఆశ్చర్యకరమే కాదు, ఆందోళన కారకం కూడాను.

‘రెండు శతాబ్దముల్‌ హరిహరీ! మృదులాక్షర మొండు వ్రాయలే

కుండిన దాంధ్రజాతి; మనమున్నది ఉన్నటులొప్పుకో వలెన్‌

పండిన పంట భారతము పట్టదుగా కవి వీరు లేరికిన్‌

గుండెలు తీయు బంట్లు మత కూటములన్‌ ఘటియించి నందునన్‌’

(సాగర ఘోష – గరికిపాటి)

ఒకపక్క వీరశైవులు, మరోపక్క వీర వైష్ణవులు పోగై శివకేశవులకి ఎంత ఆప్రతిష్ఠ తేగలరో అంతా తెచ్చారు. అటు శివపారమ్యాన్నో, ఇటు విష్ణు పారమ్యాన్నో బోధిస్తూ కవిత్వం రాయాల్సిందే తప్ప, ఈ ఇద్దరు సమానమని ఎవడైనా అంటే ఇరువర్గాల వారు సమానంగా వచ్చి ఆ కవిని చితకగొట్టేసే పరిస్థితులవి.

‘చక్కనిమాట చెప్పగల సాహసి లే డొకవేళ చెప్పుచో

దక్కదు జీవితమ్ము; సరదాకయినన్‌ మత సామరస్యమన్‌

వాక్కు వినంబడంగ కరవాలము లాలము చేయు; నట్టిచో

తిక్కన పుట్టినాడు ఋషి తీర్థము పంచినవాడు జాతికిన్‌’

(సాగర ఘోష – గరికిపాటి)

ఆయన మంచి ఋషి తీర్థమే హరిహరాద్వైతం. నిజానికి ఆయన సిద్ధాంతం శివకేశవుల మధ్య అద్వైతం మాత్రమే కాదు. సమస్త సృష్టిలోనున్న అద్వైతాన్ని దర్శించడమే. మన దృష్టిలో భేదం ఉంది కానీ సృష్టిలో భేదం లేదన్న విషయాన్ని అనేక సందర్భాల్లో తన పద్యాల ద్వారా నిరూపించాడు.

విరాట పర్వంలో కీచకుడు తనను ఘోరంగా అవమానించిన తరువాత ద్రౌపది రాత్రికి రాత్రి నర్తనశాలలో భీముణ్ణి కలుసుకొంటుంది. తన బాధలు ఏకరువు పెట్టేముందు పాండవుల ఔన్నత్యాన్ని ప్రశంసిస్తూ మాట్లాడుతుంది. ‘ఎటువంటి వాళ్లు ఎలా బ్రతుకుతున్నారు’ అన్నట్లుగా ఉంటుందా ఓదార్పు. ఆ మాటల్లో మాటగా అంతకుముందెప్పుడో పన్నెండేళ్ల క్రితం అరణ్యవాసానికి బయలుదేరే టప్పుడు కుంతి సహదేవుణ్ణి గురించి తనతో చెప్పిన మాటను గుర్తు చేస్తుంది.

‘కడు బసిబిడ్డ వీడొకటి గాదవునా నెరుగండు ముందరె

య్యెడ నొక పాటెరుంగ, డెద యెంతయు గోమల మెప్పుడైన నే

గుడువగ బిల్తు గాని తనకుంగల యాకటి ప్రొద్దెరుంగ డీ

కొడుకిటు వోకకున్‌ మనము గుందెడు నిన్‌గని యూరడిల్లెడున్‌’

(విరాట 2-213)

ఇవి ఒక తల్లి అందరిలోకి చిన్నవాడైన కొడుకుని విడిచిపెట్టి ఉండలేక అంటున్న మాటలు. అందుకే పద్యం అంతా కరుణరసమయంగా నడిచింది. అన్నీ అచ్చ తెలుగు మాటలే. ‘కోమలం’ అనే ఒకేమాట తత్సమం. అదీ మృదువైన మాటే. ఎక్కడా సంస్కృత పదాలే లేవు. ఇదీ తల్లి ప్రేమను వ్యక్తం చెయ్యాలంటే ఏ కవియైనా వాడవలసిన భాష. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అంటారు. అందుకే పెద్దవాడై పెళ్లయి కాపురం చేస్తున్న కొడుకును కూడా చాలా అమాయకుడనీ, ఏదైనా అడిగితే అవును, కాదు అనడం కూడా తెలియదనీ, ఇంతకు ముందెప్పుడూ ఎటువంటి కష్టమూ ఎరగడనీ, తాను పిలిచి పెట్టే వరకు కనీసం ‘అన్నం పెట్టమ్మా’ అని అడగడం కూడా చేతకాని వాడనీ విచిత్రంగా మాట్లాడుతోంది. అంతలోనే కోడలితో మాట్లాడుతున్నాననే విషయం గుర్తుకు వచ్చిందేమో! అందుకే ‘ఇటువంటి పసివాడు అడవులు పట్టుకొని పోతూ ఉంటే మనస్సు అతలా కుతలమైపోతోంది. అయినా నువ్వున్నావు కాబట్టి కొంత నిశ్చింతగా ఉంది’ అని ద్రౌపది పట్ల అఖండ మైన విశ్వాసం ప్రకటించింది. ఇదీ సంభాషణా నైపుణ్యం.

అదే సహదేవుణ్ణి గురించి అదే సందర్భంలో ద్రౌపది తన సొంత అభిప్రాయాలు చెబుతుంది. పై పద్యానికి నాలుగు పద్యాల వెనుకనే ఆ పద్యం కూడా ఉంది.

‘ఆ రూపం బవికార, మాభుజబలం బత్యంత నిర్గర్వ, మా

శూరత్వంబు దయారసానుగత, మా శుంభత్క్రియాజ్ఞాన మా

ర్యారంభ ప్రతికూల వాదరహితం, బాయీగి సమ్మాన వి

స్తారోదాత్తము మాద్రి పిన్నకొడు కేతన్మాత్రుడే చూడగన్‌’

(విరాట 2-209)

ఈ పద్యాన్ని కుంతి పలికిన పద్యంతో పోల్చి చూడండి. పూర్తిగా భిన్నంగా ఉంటుంది. భావాలు, భాష కూడా చాలా తేడాగా ఉన్నాయి. ఎందుకంటే అది కుమారుని గురించి తల్లి భావన. ఇది భర్త గురించి భార్య భావన. ఏ భార్యయైనా తన భర్తని అమాయకుడని, వెర్రిబాగులవాడని అంటే ఒప్పుకోదు. అలా ఉండాలని కోరుకోదు. భార్యకు కావలసింది భర్త రూపం. అందుకే ‘ఆ రూపం బవికారము’ అని సహదేవుని రూపం బాగుంటుందని చెప్పింది. తల్లికి రూపంతో నిమిత్తం లేదు. అందుకే అక్కడ ‘కడు పసిబిడ్డ’. భార్య భర్తలో గొప్ప నాయకత్వ లక్షణాలన్నీ ఉండాలని కోరుకొంటుంది. అందుకే అతని భుజబలం గురించి ప్రశంసించింది. బలం ఉంటే మంచిదే కానీ గర్వం ఉండకూడదని భార్య కోరుకొంటుంది. ఉంటే తనకీ ప్రమాదమే. అందుకే సహదేవుని నిర్గర్వాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పింది. భర్త శూరుడు కావాలని కోరుకొనే భార్య కూడా మరీ రౌడీలా ఉంటే సహించలేదు. అందుకే అతడు శూరుడే కానీ దయారసానుగతుడని చెప్పింది. తన భర్త పదిమందీ మెచ్చుకొనేలా అన్ని పనులు నిర్వహించగలగాలని (Managing Ability) కోరుకొంటుంది. అంతేకానీ ‘మా ఆయనకి ఔను, కాదు అనడం కూడా తెలియదు, బొత్తిగా నోట్లో వేలు పెడితే కొరకలేడు’ అని ఏ భార్యా చెప్పదు. అలా చెబితే ‘వెర్రాడి పెళ్లాం వాడకెల్లా వదిన’ అన్నట్లుగా చుట్టుప్రక్కల వాళ్లకి ఆమె లోకువై పోతుంది. అందుకే సహదేవుని క్రియాజ్ఞానం (Working Knowledge) గొప్పదని చెప్పింది. మొత్తం మీద సహదేవుడు అసాధారణ ప్రజ్ఞాశాలి అని తేల్చింది. తల్లి మాటలకీ, భార్య మాటలకీ ఎంత తేడా ఉందో చూడండి. ఆ తేడా ఆ స్థానాల్లో ఉన్న స్త్రీల మనోభావాలను బట్టే ఏర్పడుతుంది. ఈ భేదాన్ని భావంలోనే కాదు, భాషలో కూడా చూపించడం తిక్కన గొప్పదనం. పద్యం మొత్తం సంస్కృత సమాస భూయిష్ఠంగా నడిచింది. ‘ఈగి, పిన్నకొడుకు, చూడగన్‌’ వంటి మాటలు తప్ప మిగిలిన పద్యమంతా సంస్కృత సమాస బంధురమై గంభీరమైన శైలిలో నడిచింది. ఈ శైలి భార్య భర్తను గురించి వ్యక్తం చేసే ఉదాత్త గంభీర భావాలకు సరిగ్గా తగినది. సందర్భాన్ని బట్టి భాషలో ఈ భేదాన్ని అడుగడుగునా చూపించి సంస్కృత ప్రేమికులైన కవి పండితులను, ఆంధ్రాభి మానులైన రసజ్ఞులను ఇద్దరినీ మెప్పించబట్టే తిక్కనను ఉభయకవి మిత్రుడన్నారని పెద్దలు పేర్కొన్నారు.

ఈ ఉభయ భాషా ప్రావీణ్యం ఇంతటితో ఆగలేదు. రెండు భాషల పదాలు సమానంగా కలిసిన మిశ్రశైలిలో కూడా ఈయన సహదేవుని గుణగణాలు చెప్పించాడు. అలా చెప్పడానికి తగిన పాత్రగా అన్నగారైన ధర్మరాజును ఎంచుకున్నాడు. విరాట పర్వంలోనే ఈ పద్యం కూడా ఉండటం విశేషం. అజ్ఞాతవాసానికి ముందు చిన్నవాడైన సహదేవుడు ఇతరుల దగ్గర సేవకునిగా ఎలా బ్రతకగలుగుతా డోనని ధర్మరాజు చింతిస్తూ పలికిన సందర్భం అది.

‘అకుటిలుడార్య సమ్మతుడహంకృతి దూరుడు నీతినిర్మలా

త్మకు డనవద్య శీలుడు సధర్ముడు దాంతుడు గొంతి పెద్దసే

యు కొడుకు, మేనులేత, దనయుల్లము మెత్తన యిట్టి యీతడె

ట్లొకొ యొరు నాశ్రయించు విధి యోపదే యెవ్వరి నెట్లు సేయగన్‌’

(విరాట 1-98)

ఈ పద్యంలో ఒక అన్నగారు తమ్ముడి నుండి ఏ లక్షణాలు ఆశిస్తాడో అవన్నీ ఉన్నాయి. తమ్ముడి బుద్ధి మంచిదై ఉండాలి. అందుకే ‘అకుటిలుడు’ అనే మాట. తమ్ముడు పదిమందిలో ఔననిపించుకోవాలి. అందుకే ‘ఆర్య సమ్మతుడు’ అనే మాట. ఏ మనిషయినా ఇంట్లో ‘భార్యసమ్మతు’డవడం ఎంత ముఖ్యమో బయట ఆర్య సమ్మతుడవడం అంత ముఖ్యం. తమ్ముడు ఎంత గొప్పవాడయినా గర్వం ఉండకూడదనీ, అన్న గారుగా తనను గుర్తించి గౌరవిస్తూనే ఉండాలని ప్రతి అన్న కోరు కొంటాడు. మనం మన అన్నగారి కంటే ధనవంతులం కావచ్చు. అందమైన వాళ్లం కావచ్చు. పండితులం కావచ్చు. పదవుల్లో ఉండవచ్చు. కాని వయస్సులో ఆయన్ని మించలేము. అది అసాధ్యం. అందుకే సందర్భం వస్తే మనమే అన్నగారి కాళ్లకి నమస్కారం చెయ్యాలి కానీ ఆయన మనకు నమస్కారం చెయ్యకూడదు కదా! (అది ఆయుక్షీణం కూడాను!) ఇందుకోసమే ధర్మరాజు ‘అహంకతి దూరుడు’ అని ప్రయో గించాడు. ఇలాంటివే ‘నీతి నిర్మలాత్మకుడు, అనవద్య శీలుడు, సధర్ముడు, దాంతుడు మొదలైనవన్నీ. ఇంతవరకు పదాలు ఉపయోగించిన తిక్కన ఒక్కసారిగా అచ్చ తెలుగులోకి దిగి ‘గొంతి పెద్ద సేయు కొడుకు, మేను లేత, తన యుల్లము మెత్తన’ అంటూ సతిమెత్తగా మాట్లాడాడు. వాళ్ల అమ్మకు సహదేవుడి మీదే ఎక్కువ ప్రేమ అని ప్రత్యేకంగా చెప్పాడు. ఇంక ‘మా వాడి శరీరమూ మెత్తనే, మనస్సు మెత్తనే’ అనడం ‘మనసః శిఖరాణాంచ సదృశీ తేే సమున్నతిః’ అనే కుమార సంభవ ప్రయోగం లాంటిది.

ఈ పద్యంలో గంభీరభావ వ్యక్తీకరణకు తత్సమపదాలు వాడి సుకుమార భావాలు చెప్పడానికి అచ్చ తెలుగు పదాలు వాడటం కూడా ఆయన లోని ఉభయ కవితా ప్రౌఢినే సూచిస్తుంది. సరిగ్గా పద్యంలో రెండు పాదాలు ఒక శైలిలో, రెండు పాదాలు మరో శైలిలో నడపడం దృష్టి భేదానికి తగినట్లుగా కవితా సృష్టి భేదాన్ని చూపించడమే.

ఒకే సహదేవుడు ముగ్గురికి మూడు విధాలుగా ఎందుకు కనిపించాడు? ఈ విషయం కాస్త లోతుగా ఆలోచిస్తే భారతంలో తిక్కన దర్శింపజేసిన అద్వైతం అర్థమవుతుంది. వ్యక్తి ఒక్కడే. అతన్ని చూసినవాళ్లు మాత్రం ముగ్గురు. ముగ్గురికీ మూడు విధాలుగా ఎందుకు కనబడ్డాడు? అది వాళ్ల దృష్టిలో భేదం. అసలు అతనిలో వీళ్ల ముగ్గురూ చెప్పిన లక్షణాలు అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. పరస్పర వ్యతిరేక మైన లక్షణాలు కూడా ఉన్నాయి. అతడు ఔను, కాదు అని చెప్పలేనంత అమాయకంగానూ ఉండేవాడు. పెద్దలందరు భేష్‌ అనేంత కార్యజ్ఞానమూ కలిగి ఉండేవాడు. కాకపోతే ఎవరి దగ్గర ఏ లక్షణం ఏ మోతాదులో ప్రదర్శించేవాడో అంతే ప్రదర్శించే వాడు. అందుకే అందరికీ ప్రేమపాత్రుడయ్యాడు. ఇదే యోగి లక్షణం. ఏ లక్షణాన్ని అతిగా ప్రదర్శించ కుండా (ఓవర్‌ యాక్షన్‌) నిగ్రహంగా ఉంటే జీవితంలో నెగ్గుకు రాగలుగుతాం. ఆత్మ సాక్షాత్కారం కూడా పొందగలుగుతాం. మొత్తం మీద కుంతి, ద్రౌపది, ధర్మరాజులు ఏ దృష్టితో సహదేవుణ్ణి చూశారో ఆ రకమైన అభిప్రాయాలే చెప్పారు. ఈ దృష్టితో చూస్తే ప్రపంచంలోని ప్రతి వస్తువు మన దృష్టి భేదం వల్లనే వేర్వేరుగా కనిపిస్తోందని అర్థమవుతుంది. ఇంకొకరికి మంచిగా కనిపించినవాడు మనకి చెడ్డగా కనిపిస్తున్నా డంటే మన దృష్టిలోనైనా భేదం ఉండాలి. అతడు మనపట్ల భిన్నంగానైనా ప్రవర్తిస్తూ ఉండాలి. అంటే అతని దృష్టిలోనైనా భేదం ఉండి ఉండాలి. మొత్తం మీద మన దృష్టి భేదం వల్లనే ఇంత సృష్టి ఇన్ని రకాలుగా కనబడుతోందనీ, నిజానికది ఒక్కటే అనీ తెలియజేయడమే మన మహాకవుల ఆశయం.

–  మహా సహస్రావధాని డా.గరికిపాటి నరసింహారావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *